రాధికా సాంత్వనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాధికా సాంత్వనం తంజావూరు రాజుల కాలంలో ముద్దుపళని రాసిన శృంగార కావ్యం. దీనికే ఇళాదేవీయం అనే పేరు కూడా ఉంది. ఇది రాధాకృష్ణుల శృంగారాన్ని వర్ణించే పద్య కావ్యం.

కవయిత్రి ముద్దుపళని[మార్చు]

1739 నుంచి 1763 వరకు తంజావూరును పాలించిన ప్రతాపసింహుడు ఆస్థానంలో కొలువు చేసిన రాజనర్తకి ముద్దుపళని. గొప్ప సంగీత, సాహిత్య వేత్త. ఈమె విశిష్టమైన శృంగార కావ్యాన్ని రాయాలనే తలంపుతో రాధికా సాంత్వనం రచనను చేపట్టారు.మహిళ రచనగా, అంతకంటే హీనంగా వేశ్య రచనగా దీనిని అప్పటి పండితులు విలువనీయకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు. బెంగుళూరుకు చెందిన నాగరత్నమ్మ గారు దీనియొక్క మూల తాటాకుల ప్రతి సంపాదించి పాఠాన్ని పరిష్కరించారు. ఎందరు వద్దన్నా వినకుండా వావిళ్ల ప్రచురణలు ధైర్యంగా 1910లో కావ్యాన్ని ప్రచురించారు. కాని భారతీయ సాహిత్యం అంటే ఇష్టం లేని బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా ప్రతులను కూడా తగులబెట్టించినది. స్వంతంత్ర అనంతరం1947లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం ఈ కావ్యంపై నిషేధం ఎత్తేయించారు. అయినా అంతకుముందు కూడా రహస్యంగా ఈ కావ్యాన్ని ప్రజలంతా చదివేవారు.

తర్వాత ఎమెస్కో సంప్రదాయ సాహితి పేరిట మళ్లీ పాత కావ్యాలను ప్రచురించినప్పుడు రాధికా సాంత్వనాన్ని ఆరుద్రతో ప్రవేశిక రాయించింది. ఆ పుస్తకమే ప్రస్తుతం మనకు దొరుకుతోంది. మరో మాట - ఇదే ఆరుద్ర రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో మచ్చుకైనా ముద్దుపళని ప్రస్తావన లేదు. ముద్దుపళని గురించి మరిన్ని వివరాలు కావాలంటే సుసీ థారు, కే.లలితల సంపాదకత్వంలో వెలువడిన విమన్ రైటింగ్ ఇన్ ఇండియా సామాన్యశకం. 600 నుండి ఇప్పటివరకు) గ్రంథంలో చదవచ్చు.

శైలి[మార్చు]

ఈ పద్యకావ్యంలో 178 పద్యాలు ఉన్నాయి. ఈ కథనంలో నాలుగు ఆశ్వాసాలలో ఉన్నాయి. తంజావూరు రాజు కొలువులో ఉండిన ముద్దుపళని సంస్కృతం, తెలుగు, తమిళ సాహిత్యాలలో అద్భుతమైన పరిచయం ఉండడంతో భాష-భావాలపై బిగువైన పట్టుతో కథ నడిపించడం విశేషం.

బాల్యవివాహాలు ముద్దుపళని కాలానికి సహజమైన విషయం. పాపం అదే తీరులో గోపాలుడికీ ఇళా ఈడేరక మునుపే భార్య కావడంతో మేనత్త వరసైన రాధ ఇంటిలో ఇళాతో మకాం పెడతాడు కృష్ణుడు. ఇళ సంసారానికి సిద్ధమయ్యేలోగా అందులోని మెళకువలన్నీ కృష్ణుడికి కంఠతా వచ్చేస్తాయి. రాధ వాటిని నేర్పిందో, కృష్ణుడే వాటిని నేర్చుకున్నాడో ముద్దుపళని మనకెక్కడా చెప్పరు. కాని, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమ. కామం. ఇళాను రాధే పెంచుతుంది. వయసొచ్చిన ఇళాతో కృష్ణుడికి శోభనం ఏర్పాట్లు చేయాలి. చేయడమే కాదు ఇద్దరికీ విడివిడిగా ఎన్నో జాగ్రత్తలు, మెళకువలు చెప్తుంది. ఇళా కృష్ణులను ఒకటి చేస్తుంది గాని, రాధ మనసు మనసులో లేదు. ఇంకా తెల్లవారకముందే వారి గదిని చేరుకుని ఇళాను పక్కకు పంపించి కృష్ణుడి చెంత వాలిపోతుంది. తనతో కూడా కూడాక తొలిరాత్రి ముచ్చట్లు అడుగుతుంది. కృష్ణుడు అత్యంత సరసుడు కదా- గడుసుగా లేలేత మొగ్గ, చిన్న పిల్ల ఇళా దగ్గర అంత సుఖమేం ఉంటుందని, రాధకు ఇళాకు పోలికే లేదని రాధను మెప్పించబోతాడు. విననట్టే నటించిన చిన్నారి, గడసు ఇళా అన్నీ వినేసిందని ముద్దుపళని ఒక్క వాక్యంలో రెండో ఆశ్వాసపు తొలి పద్యంలో చెప్తారు. అదికూడా ఇలా-

” అటు లా రాధిక, గోపీ
విటు నటు రతికేళి నేలి విడువంగ, నిలా
కుటిలాలక జేరి తనదు
కుటిలత్వ మెఱుంగనీక కూరిమి చెలగన్ “

ఆనక ఇళా పుట్టింటికి కృష్ణుడు వెళ్లాల్సివస్తుంది. తన దరిని గోపాలుడు లేకపోవడం రాధది వెలుతురు లేని ప్రపంచం. విరహ వేదన భరించలేక తప్పనిసరి మానసికావస్థలో చిలకను రాయబారంగా పంపుతుంది. అలా వెళ్లిన చిలక మూడు రాత్రులు ముగిసేనాటికి గడసరి ఇళా తన కొంగున కృష్ణుని కట్టేసుకోవడం చూసి అదే రాధకు విన్నవిస్తుంది. అక్కడితో రెండో ఆశ్వాసం ముగుస్తుంది. ఈ రెండో అధ్యాయంలోనే శృంగారం పాలు శృతిమించిందని విమర్శకులు గగ్గోలు పెడతారు. రసవత్తరమైన మూడో ఆశ్వాసంలో టైటిలుకు న్యాయం చేసే అసలు సిసలు కథ జరుగుతుంది. చిలుక చెప్పిన సంగతులు విని రాధ అసూయతో భగ్గున రగిలిపోతుంది. ఇళా కృష్ణుల సఖ్యత విని కలవరపడుతుంది. అన్నింటిని మించి గడసు ఇళా రాధికను పరిత్యజించమని మాధవుని బతిమాలడం చిలక చేరవేస్తుంది. అంతే రాధకు మండుతుంది. అలకపానుపు ఎక్కుతుంది. నాలుగో ఆశ్వాసంలో రేపల్లె చేరిన గోపాలుడు రాధికను ఇదీ అదీ అని చెప్పలేని విధంగా బతిమాలుకుంటాడు. రగిలిపోతున్న రాధ మాధవుని తూలనాడుతుంది. అవేవీ పట్టించుకోని గోపాలుడు తనదైన శైలిలో కాళ్ల బేరానికి వస్తాడు. అనుకోకుండా ఒక్కసారి హఠాత్తుగా కృష్ణుడు రాధ కాళ్ల మీద పడిపోతాడు. కావ్యం చదువుతున్న మనం ఒక్కమారు కలవరపడతాం. భార్యల కోపం పోగొట్టే కొత్త టెక్నిక్ కదా అని సంబరపడతాం, కాని తన ప్రియాతి ప్రియమైన ప్రియుణ్ణి రాధ ఎడమ కాలితో తోసేసరికి ఖంగుతింటాం. కాని ఇంతలోనే తేరుకుని ప్రసన్నమవుతుంది. రాధామాధవులు ఒకటవుతారు. ఏకమైన ప్రియ జంట ఆనందంగా ఉంటారు. ఇదీ వివరంగా కథ.


ఎటు తాళనున్నదో యీ కొమ్మ కెమ్మావి
కై టభారాతి ప ల్గాటునకును?
ఎటు లోర్వ నున్నవో యీ కన్నె చన్నులు
గోపసింహుని గోటి కుమ్ములకును?
ఎటు లాన నున్నవో యీ తన్వి లే.దొడల్
చాణూరహరు మారు సాదనలకు?
ఎటు లాగ నున్నదో యీ నాతి నును మేను
దంతిమర్దను కౌగిలింతలకును

(మొదటి ఆశ్వాసం 65వ పద్యం)

అంటూ బెంగపడిన రాధ ఇళాదేవికి ఎన్నో కామ శాస్త్ర రహస్యాలు చెప్పినపుడు కాస్త పచ్చిగా ముద్దుపళని రాయడం జరిగినదని చెప్తారు. . అలాంటి మరి నాలుగు పద్యాలు .

ఇళా గోపాలురను శోభనం గదిలోకి పంపించి తాను వగచివగచి తలచిన పద్యమిది (1లో 75)


“నాతి యింతకు మున్నె, నా సామి మధు రాధ
రామృతమ్మును జూఱలాడ కున్నె?
యతివ యింతకు మున్నె, హరి విప్పు టురముపై
గుబ్బల కసిదీఱ గ్రుమ్మ కున్నె?
రమణి యింతకు మున్నె, రమణు కౌగిట జేరి
పారావత ధ్వనుల్ పలుక కున్నె?
చాన యితకు మున్నె, శౌరి పై కొన వెను
దియ్యక యెదురొత్తు లియ్య కున్నె? “

పుట్టింటిలో కృష్ణుని భోగం గురించి చిలుక రాధకు వర్ణించి చెప్పే ఘట్టం ఇది: (2 లో 139, 140)

కృష్ణదేవుడు కరి కర క్రీడ సలుప,
జేరి తొడ లేచి పురికొల్పె గీరవాని,
నీలవర్ణిడి పైకొని కేళి నేల,
బాళి నెదురొత్తు లిచ్చె నిళా లతాంగి. (139)
కిలకిల నవ్వులు, గిలిగింతలును, బంధ
భేదపు రవములు, వింత వగలు,
పావురా పలుకులు, వాతెర నొక్కులు,
చిగురు మకారముల్, మరుగు తిట్లు,
దురుసు పైసరములు, తొందర ముద్దులు,
బిగి కౌగిలింతలు, బింకములును,
గొనగోటి మీటులు, గోర్గింపు, లుబుకులు,
కొసరులు, బొమ ముళ్ళు, కురుచ సన్న, (140)
రాధ అలకను తీర్చిన మాధవుడు ఆమెతో కూడినపుడు (4లో 103)
హత్తుకొని, యిన్ని విధముల
దత్తఱపడ ననగి పెనగి, తనివారక యా
బిత్తరి పై కొనె హరిపై,
మత్తేభముమీద నెక్కు మావంతు డనన్.

ప్రభుత్వ నిషేధం[మార్చు]

నాగరత్నమ్మ గారు ఈ పాఠాన్ని పరిష్కరించారు. వావిళ్ల ప్రచురణలు ధైర్యంగా 1910లో కావ్యాన్ని ప్రచురించారు. కాని భారతీయ సాహిత్యం అంటే ఇష్టం లేని బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా ప్రతులను కూడా తగులబెట్టించినది.

కందుకూరి వీరేశలింగం నుండి బ్రిటిష్ ప్రభుత్వం వరకు అందరూ దీన్ని విమర్శించారు. బ్రిటిష్ ప్రభుత్వంఈ గ్రంథాన్ని నిషేధించింది కూడా.

స్వంతంత్ర అనంతరం1947లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం ఈ కావ్యంపై నిషేధం ఎత్తేయించారు. అయినా అంతకుముందు కూడా రహస్యంగా ఈ కావ్యాన్ని ప్రజలంతా చదివేవారు .[1]

ఆరుద్ర చెప్పిన ఒక్క మాట - కావ్యంలోని గుణంకన్నా కవయిత్రి కులానికి ప్రాముఖ్యం ఇవ్వడం తగని పని. మన పూర్వులు ఆ దృష్టితోనే చిన్నచూపు చూశారు. అయితే తిరుపతి వేంకట కవులు, మల్లాది రామకృష్ణ శాస్త్రి తదితరులు మాత్రం రాధికా సాంత్వనానికి ఇవ్వవలసిన స్థానం ఇచ్చారు.

మూలాలు[మార్చు]

  1. శంభు (1 November 2018). "ఎంత హాయిలే ఆ రేయి". ramojifoundation.org. రామోజీ ఫౌండేషన్. Archived from the original on 23 డిసెంబరు 2018.

బయటి లింకులు[మార్చు]