రామరాజభూషణుడు

వికీపీడియా నుండి

రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దము కు చెందిన తెలుగు కవి మరియు సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానమునకు ఆభరణము వలె ఉండటము వలన ఈయనకు 'రామరాజభూషణుడు' అని పేరు వచ్చినది.


నెల్లూరు ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్రము, హరిశ్చంద్ర, నలోపాఖ్యనము మరియు నరసభూపాలీయము అని కావ్యములను రచించినాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము. ఆ తరువాత కాలములో వచ్చిన చేమకూరి వెంకటకవి భట్టుమూర్తి శైలిని అనుకరించాడు.

ఇతనిని గూర్చి పింగళి లక్ష్మీకాంతం ఇలా వ్రాసాడు - "ఈ కవి గాయకుడు. సంగీత కళానిధి. సంగీతమునకు, కవిత్వమునకు గల పొత్తును ఇతనివలె మరి యే కవియు గ్రహించలేదు. ఇతని పద్యములన్నియు లయ గమకములు గలవి. కీర్తనలవలె పాడదగినవి. అంతే గాక ఈ కవి గొప్ప విద్వాంసుడు. నానాశాస్త్ర నిష్ణాతుడైన బుద్ధిశాలి. పద్య రామణీయకత, ప్రౌఢ సాహిత్యము, విజ్ఞాన పటిమ ఇతని రచనలలో గోచరించును. .... ఇతనికే శ్లేష సహజము. రామరాజభూషణునివలె పద్యము వ్రాయగలవారు లేరు. .. కవులలోనింతటి లాక్షణికుడు లేడు.[1]


విషయ సూచిక

[మార్చు] కావ్యాలంకారసంగ్రహము

భట్టుమూర్తి రచించిన మొదటి గ్రంధము కావ్యాలంకార సంగ్రహము. ఇది 5 ఆశ్వాసాల అలంకార శాస్త్రము. నరసభూపాలీయమని దీనికి మరో పేరు. ఇది సంస్కృతంలో విద్యానాధుడు రచించిన ప్రతాపరుద్రయశోభూషణమును అనుసరించి వ్రాయబడిన గ్రంధము. కావ్య ధ్వని రసాలంకారములను గురించి , నాయికానాయకులను గురించి, గుణ దోషములను గురించి ఇందులో వివరించబడినది. నాలుక కదలనక్కరలేని అక్షరములతో రచించిన అలజిహ్వము_

భోగాంబువాహ వాహ విభాగేహాభావుకాంగభావభావమహా
భాగ మహీభాగమహాభోగావహబాహుభోగిపుంగవభోగా

అన్న పద్యంలో నాలుక కదపనక్కరలేని అక్షరాలున్నాయి. గర్భ కవిత్వము, బంధ కవిత్వము మొదలుగునవి కూడా నరసభూపాలీయములో భట్టుమూర్తి ప్రదర్శించినాడు.

[మార్చు] వసు చరిత్రము

ఇది భారతములోని ఉపరిచర వసువు కథ,ఇది కవిత్రయము రాసిన మహ భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామ రాజ భూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంధంగా మలిచారు, తిరుమల నాయుని కి ఈ కృతి అంకితమివ్వబడినది.

ఉపరిచర వసువు , మహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడూ, అధిష్ఠాన పురం రాజధాని గా చేసుకుని పరిపాలిస్తాడు. కోలాహలం అనే పర్వతము, సూక్తిమతి అనే నది ప్రేమలో పదడతారు. కోలహలానికి, సూక్తి మతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు. గిరిక ను వసు మహారాజు చూసి తనను గాంధర్వ విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు.

ఇది మూడు రోజుల్లో జరిగే కథ.

  • 1.ప్రథమాశ్వసము: కృతి భర్త వంశ చరిత్ర, కోలాహలం సూక్తిమతి నదికి అడ్డంపడటం.
  • 2.ద్వితీయాశ్వాసము: కోలాహలం సూక్తిమతుల ప్రేమ.
  • 3. తృతీయాశ్వాసము:గిరిక, వసుపదుల పుట్టుక???
  • 4. చతుర్థాశ్వాసము:
  • 5. పంచమాశ్వాసము:
  • 6. షష్ఠమాశ్వాసము:

[మార్చు] హరిశ్చంద్రనలోపాఖ్యానము

ఇది ఒక ద్వద్ది కావ్యము అంటే ఒకే పద్యములో రెండు అర్థాలు వస్తాయి, ఒకటీ నలుని పరంగా ఒకటీ హరిశ్చంద్రుడి పరంగా అన్వయించుకొని చదవాలి.

[మార్చు] ఉదాహరణ పద్యాలు

మ. హరిదం భోరుహ లోచనల్ గగన రంగాభోగ రంగత్తమో
         భర నేపధ్యము నొయ్య నొయ్య సడలింపన్ రాత్రి శైలూషికిన్
         వరుసన్మౌక్తిక పట్టమున్ నిటలమున్ వక్త్రంబునున్ దోఁచె నా
         హరిణాం కాకృతి వొల్చె రేకయి సగంబై బింబమై తూర్పునన్

గగన రంగాభోగం వేదిక. ఆభోగం అంటే విశాలమైనది. తమోనేపథ్యం అంటే చీకటి యవనిక. రాత్రి అనే శైలూషి(అంటే నటి). దిక్కులు అనే స్త్రీలు - హరిదంభోరుహ లోచనల్, హరిత్తులు అంటే దిక్కులు - ఆ చీకటి తెరనూ కొంచెం కొంచెం దించుతున్నారు. ముందు నిశాశైలూషి మౌక్తిక పట్టం కనిపించింది. తరువాత నొసరు కనిపించింది. ఆపైన ముఖం పూర్తిగా కనిపించింది. అలా క్రమక్రమంగా చంద్రబింబపు ఆకారం, ముందు రేఖలాగా, తర్వాత అర్ధచంద్రుని లాగా, ఆ తర్వాత పూర్ణ బింబంగా తూర్పు దిక్కున కనిపించింది. నటీమణులు నొసటిపైన ముత్యాల పట్టీ ధరించడం ప్రసిద్ధం. స్త్రీ నొసరు చంద్రరేఖలా ఉండడం, స్త్రీ వదనం పూర్ణ చంద్రునిలా ఉండడం కూడా ప్రసిద్ధ కవి సమయాలే. తాను నాటకాల్లో చూసిన నటీమణి రంగప్రవేశాన్ని మనసుకు తెచ్చుకొని, కవిత్వంలో దానికి అందంగా చంద్రోదయంతో పోలిక సంధించాడు, రామరాజ భూషణకవి. చాలా సహజంగా ఉంది కదా, పోలిక! జానపదుల నిత్యానుభవ దృశ్యాలు ప్రతిబింబించిన కవిత్వం ఎంత నిసర్గంగా ఉంటుందో ఈ పద్యం చెప్పకనే చెపుతున్నది. [2]

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర
  2. ఈ మాట - అంతర్జాల పత్రిక - మార్చి 2009 - "నాకు నచ్చిన పద్యం" - చీమలమర్రి బృందావనరావు

[మార్చు] బయటి లింకులు


అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు