రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే
రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే మాతృదేవోభవ (1993) సినిమాలోని విషాద గీతం. దీనిని వేటూరి సుందరరామమూర్తి రచించారు. ఈ గేయాన్ని ఎం.ఎం.కీరవాణి హృద్యంగా గానం చేసి సంగీతం కూడా అందించారు.
విషయ సూచిక |
[మార్చు] నేపధ్యం
శారద (మాధవి), ఒక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి. సంగీత అధ్యాపకురాలిగా పనిచేస్తుంటుంది. సత్యం (నాజర్) లారీ డ్రైవర్ శారదను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. వీరికి నలుగురు పిల్లలు. శారదకు మెదడు క్యాన్సర్ సోకిందనీ, తను ఇక ఎంతో కాలం బ్రతకదనీ డాక్టర్లు చెబుతారు. అప్పారావు పగబట్టి సత్యాన్ని చంపేస్తాడు. శారద తనలాగే తన పిల్లలు కూడా అనాధాశ్రమంలో పెరగడం ఇష్టం లేక వారిని మంచి మనసున్న కుటుంబాలకు దత్తత ఇచ్చి వేస్తుంది. చివరి సారిగా పిల్లలందర్నీ దీపావళికి తన చేతుల్తో ఆదరించాలని కోరుకొంటున్న నేపధ్యంలో ఈ పాటను మాధవి మీద చిత్రీకరించారు.
[మార్చు] పాట
పల్లవి :
రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం ||| రాలిపోయె పువ్వా |||
చరణం 1 :
చెదిరింది నీ గూడు గాలిగా చిలకా గోరింకమ్మ
గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా......
తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగ
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా...
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హరతివై ||| రాలిపోయె పువ్వా |||
చరణం 2 :
అనుబంధమంటేనె అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగల చేమంతులే వాడిపోయే...
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలె కొండెక్కి పొయే...
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగతెగే వీణియవై ||| రాలిపోయె పువ్వా |||
[మార్చు] అవార్డు
- ఈ పాటకు గాను వేటూరి సుందరరామమూర్తి కి జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయితగా అవార్డు లభించినది.