రుక్సానా
కాశ్మీర్ తీవ్రవాదుల గుండెల్లో బుల్లెట్లు దింపిన మహిళ రుక్సానా (19). కాశ్మీర్లో తీవ్రవాదుల దుశ్చర్యలు, కల్లోలం, రాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడటం, ఆకస్మిక దాడులకు తెగబడటం, అమ్మాయిల అపహరణలు, లైంగిక వేధింపులు నరకయాతనే. అలాంటి తీవ్రవాదులపై గొడ్డలితో విరుచుకుపడి, ఒకరిని చంపి, మిగిలిన వారిని పరుగులు తీయించింది రుక్సానా. అరుదైన సాహసం. ఆమె హతమార్చింది ఒక కమాండర్ స్థాయి తీవ్రవాదిని. రుక్సానా బాగా చదువుకున్న అమ్మాయి కాదు. తండ్రి వ్యవసాయదారుడు. వ్యవసాయ పనులు లేనప్పుడు రోజుకూలీగా పని చేసేవాడు.సరిహద్దు జిల్లా రాజౌరీ. ఎనిమిదేళ్ల క్రితం ఓసారి రుక్సానా కుటుంబం తీవ్రవాదుల దాడికి గురయింది. తండ్రి గాయాలపాలయ్యాడు. ప్రస్తుత సంఘటనలోనూ ఇస్లామిక్ తీవ్రవాదులు ఇంట్లోకి చొరబడి ఆమె తండ్రిని, సోదరుడిని జీహాద్ కోసం రమ్మని పిలిచారు. కాదన్నందుకు వారిని తీవ్రంగా కొట్టారు. వారు పడిపోవడం గమనించిన రుక్సానా తట్టుకోలేకపోయింది. తీవ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొంది.'నేను పెరిగిన వాతావరణం, ఆ క్షణంలో ఉన్న పరిస్థితి, టీవీల్లో తుపాకీ పేల్చడం చూసిన సందర్భాలు నాకు తెలియకుండానే స్పందించేలా చేశాయి. కళ్లు మూసి తెరిచేలోపు బుల్లెట్లు బయటికొచ్చాయి' అందామె.తీవ్రవాదులు తమ కుటుంబంపై ప్రతీకార దాడి చేస్తారని ఆందోళన చెందుతున్న రుక్సానా భవిష్యత్తు లక్ష్యం పోలీసు శాఖలో చేరడం. యువతకు తుపాకీ శిక్షణ ఇవ్వాలన్న వాదనకూ ఆమె మద్దతు పలుకుతుంది. ఆమె తమ్ముడు ధ్యేయమూ రాబోయే రోజుల్లో భారత సైన్యంలో చేరడమే. రుక్సానా సాహసం దేశంలోని మహిళలకు ఎనలేని ప్రేరణనిచ్చింది. 'ప్రాణ, మానాలకు హాని ఎదురైనప్పుడు అపర కాళిక లా మారి అంతు చూడాలన్న రుక్సానా తీరుని మేం అనుసరిస్తాం అంటున్నారు.