రెండవ ప్రపంచ యుద్ధం - పూర్వరంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెండవ ప్రపంచ యుద్ధంలో యుద్ధ కార్యాలయం (అధికారిక సేకరణ)

ప్రధాన వ్యాసం: రెండవ ప్రపంచ యుద్ధం

మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆ యుద్ధంలో ఓటమిపాలైన జెర్మనీ వెర్సైల్స్ ఒప్పందంపై సంతకం చేసింది. దీని ప్రకారం జెర్మనీ సైనికంగా, భౌగోళికంగా వృద్ధి చెందటానికి వీలు లేదు. గెలిచిన దేశాలకు పెద్ద మొత్తంలో నష్ట పరిహారాన్ని కూడా జెర్మనీ చెల్లించాల్సి వచ్చింది. రష్యాలో తలెత్తిన అంతర్యుద్ధం జార్ చక్రవర్తుల పాలనకు చరమగీతం పాడి కమ్యూనిస్టు పాలిత వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలో సోవియెట్ యూనియన్ ఆవిర్భావానికి దారి తీసింది. లెనిన్ అనంతరం సోవియెట్ యూనియన్ జోసెఫ్ స్టాలిన్ అధీనంలోకొచ్చింది. ఇటలీలో, జాత్యహంకార జాతీయ ఫాసిస్టు పార్టీ నేత బెనిటో ముస్సోలినీ నూతన రోమన్ సామ్రాజ్య స్థాపన వాగ్ధానంతో అధికారంలోకొచ్చాడు. చైనాలో, అధికార పార్టీ ఒకప్పటి మిత్ర పక్షాలైన కమ్యూనిస్టులతో ఒక వంక, తిరుగుబాటు బావుటా ఎగరేసిన భూస్వామ్య వర్గాలపైన మరో వంక పోరాడుతూ అంతర్యుద్ధ పరిస్థితులలో చిక్కుకుని ఉంది. చైనా భూభాగాలపై అధిపత్యంకోసం వేచి చూస్తున్న జపాన్ ఇదే అదనుగా 1931లో ముక్దెన్ సంఘటన సాకుతో చైనా అధీనంలోని మంచూరియాపై దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పటి నుండి 1933లో టాంగ్-కు సంధి కుదిరేవరకూ ఈ రెండు దేశాలు సరిహద్దుల్లో పలుమార్లు చిన్నపాటి ఘర్షణలకు దిగాయి.

1934లో జెర్మనీలో మరో జాత్యహంకార నాజీ పార్టీ అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో అధికారంలోకొచ్చింది. హిట్లర్ అధికారంలోకొచ్చిన వెంటనే జెర్మనీ నైన్యాన్ని బలోపేతం చేయటం మొదలుపెట్టాడు. ఇది ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలను ఆందోళనపరచింది. ఈ మూడు దేశాలు మొదటి ప్రపంచ యుద్ధంలో కలసి పోరాడాయి; ఆ యుద్ధంలో బాగా నష్టపోయి ఉన్నాయి. జెర్మనీ చర్యలు తమ ఆధిపత్యాన్ని సవాలు చేసేవిగా ఈ దేశాలు భావించాయి. అప్పటికే ఇటలీ ఆఫ్రికా ఖండంలోని ఇధియోపియాపై కన్నేసి ఉంది. తమ కూటమి చెదిరిపోకుండా ఉంచే ఉద్దేశంతో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లు ఇటలీ ఉద్దేశ్యాలను వ్యతిరేకించకుండా ఊరుకున్నాయి.

1935లో జెర్మనీ సార్ లాండ్ ని విలీనం చేసుకుంది. అదే ఏడాది హిట్లర్ వెర్సైల్స్ ఒప్పందానికి తిలోదకాలిచ్చి జెర్మనీ సైన్యాన్ని అసంఖ్యాకంగా పెంచటం మొదలుపెట్టాడు. జెర్మనీ దూకుడు ఆపే ఉద్దేశ్యంతో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మరోవంక, తూర్పు ఐరోపాలో జెర్మనీ కదలికలపై కలత చెందిన సోవియెట్ యూనియన్ కూడా ఫ్రాన్స్ తో పరస్పర సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

అయితే, ఈ ఒప్పందాలేవీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఫ్రాన్స్-సోవియెట్ ఒప్పందాం నానాజాతి సమితి అంగీకారం కోసం నిరీక్షిస్తుండగానే, 1935 జూన్ లో ఇంగ్లాండ్ అంతకు ముందు జెర్మనీపై విధించిన ఆంక్షలు సడలిస్తూ ఒక నౌకా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆసియా, ఐరోపాలలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తున్న అమెరికా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆ ఏడాది అక్టోబరులో ఇటలీ ఇథియోపియాను ఆక్రమించుకుంది. ఈ చర్య ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లకు ఆగ్రహం కలిగించగా, ఆశ్చర్యకరంగా జెర్మనీ నుండి ఇటలీకి మద్దతు లభించింది. దానికి ప్రత్యుపకారంగా ఆస్ట్రియాని ఆక్రమించటానికి జెర్మనీ చేస్తున్న ప్రయత్నాలపై తమకుగల అభ్యంతరాలను ఇటలీ ఉపసంహరించుకుంది. ఆవిధంగా ఐరోపాలో కూటముల రూపురేఖలు మారటం మొదలయింది.

1936 మార్చి నెలలో హిట్లర్ జెర్మనీ సైనికీకరణని మరింత వేగవంతం చేశాడు. దీనికి ఐరోపా దేశాలనుండి పెద్దగా అభ్యంతరం వ్యక్తంకాలేదు. అదే ఏడాది జులైలో స్పెయిన్లో అంతర్యుద్ధం మొదలయింది. అక్కడ, సోవియెట్ యూనియన్ మద్దతున్న అధికార కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న జాత్యహంకార ఫాలాంగే పార్టీ నాయకుడు ఫ్రాన్సిస్కో ఫ్రాంకోకి హిట్లర్, ముస్సోలినీ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇరువర్గాలూ (సోవియెట్, ఇటలీ-జెర్మనీ) తమ ఆయుధ పాటవాన్ని, యుద్ధ వ్యూహాలను పరీక్షించుకోవటానికి స్పెయిన్ ను ఒక ప్రయోగశాలగా వాడుకున్నాయి.

ఆ ఏడాది అక్టోబర్లో జెర్మనీ-ఇటలలీ లు అధికారికంగా అక్ష రాజ్య కూటమిగా ఏర్పడ్డాయి. నవంబర్లో కమ్యూనిస్టు సోవియెట్ యూనియన్ కు వ్యతిరేకంగా జపాన్-జెర్మనీలు ఒక సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి (మరుసటి ఏడాది ఈ ఒప్పందంలో ఇటలీకూడా చేరింది). చైనాలో, ప్రభుత్వం తిరుగుబాటు చేస్తున్న కమ్యూనిస్టులతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు పక్షాలూ కలసి ఉమ్మడిగా జపాన్ కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించాయి.

తరువాత: ఆరంభం