లక్ష్మి
వికీపీడియా నుండి
| శ్రీ లక్ష్మి | |
| సిరుల తల్లి | |
| దేవనాగరి: | लक्ष्मी |
| తెలుగు: | శ్రీ లక్ష్మి |
| నివాసం: | వైకుంఠం |
| పతి / పత్ని: | శ్రీమహావిష్ణువు |
| వాహనం: | గుడ్లగూబ |
| “ | హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి, తా మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్ ! |
” |
లక్ష్మి (Lakshmi) లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి అధిదేవత. త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువునకు ఇల్లాలు. క్షీర సాగర మధనం సమయంలో అవతరించింది.
విషయ సూచిక |
[మార్చు] హిందూ సంప్రదాయంలో స్థానం
హిందూమతంలో వైదికకాలంనుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నదనడానికి ఆధారాలున్నాయి. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా, సంప్త్పదాయినులుగా ఆరాధించారు. అధర్వణ వేదం "సినీవాలి" అనే దేవతను "విష్ణుపత్ని"గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు.[1]
[మార్చు] ప్రధాన గాధలు
లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె 'నిత్యానపాయిని' (ఎన్నడూ విడివడనిది), లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.
సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువునుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు. కనుక లక్ష్మిని 'భార్గవి' అని కూడా అంటారు.
తరువాత ఒకమారు దూర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగాచేసె చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మిదేవి అవతరించింది. పాలసముద్రలో నుండి జనించింది కనుక ఆమె 'సముద్రరాజ తనయ' అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాధి దేవత ఐయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు పత్నిగా స్వీకరిచాడు.[2][3]
విష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది.[4] ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.
విష్ణువు అవతారాలతోబాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడు అలమేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది.
[మార్చు] వివిధ నామాలు
చాలా మంది దేవతలకు వలెనే లక్ష్మికి ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని - లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.
[మార్చు] లక్ష్మి రూప చిత్రణ
అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.
వాఙ్మయాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాతా).
యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మీ అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు - "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలెను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాలా కంకణధారియై యండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలు ఉంచాలి. పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగాడుచున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ-చక్ర-గదా-పద్మ-ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై యుండును. స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతిగురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు.[1]
- అష్ట లక్ష్ములు
- ప్రధాన వ్యాసం: అష్టలక్ష్ములు
లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
[మార్చు] ఇతర మతాలు, సంప్రదాయాలు
జైన, బౌద్ద కళలలో కూడా లక్ష్మీదేవి రూపకల్పన కొన్నిచోట్ల గమనించవచ్చును. గ్రీకు పురాణ దేవత ఆఫ్రొడైట్ మరియు రోమన్ పురాణ దేవత వీనస్ ల స్వరూప, కధాంశాలలోను లక్ష్మి స్వరూప కధాంశాలలోను కొంత సారూప్యత కనిపిస్తుంది.
బౌద్ధమతం సాహిత్యంలో మిళింద, పన్హ, సిరికాలకణ్ణి జాతక కధము, ధమ్మపధ అట్టకధలు శ్రీమాతను "సిరిమా" దేవతగా పేర్కొన్నాయి. ఆ కధల ప్రకారం ఆమె సౌందర్య, అదృష్ట, ప్రజ్ఞా శక్తులు ప్రసాదించే కరుణాంతరంగ. జైనమతం కల్పసూత్రం ప్రకారం వర్ధమాన మహావీరుడు జన్మించడానికి ముందు అతని తల్లికి కలిగిన స్వప్నాలలో శ్రీమాత కూడా ఉంది. సింధులోయ నాగరికతకు సంబంధించి లభించిన ప్రతిమలలో ఆభరణ భూషితలైన మాతృదేవతల ప్రతిమలున్నాయి. మౌర్యుల కాలానికి చెందిన కొన్ని శిల్పాలలో కూడా అలాంటి మాతృదేవతామూర్తులున్నాయి. ఈ మూర్తులే లక్ష్మీదేవి రూపానికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చును. [1]
[మార్చు] పూజలు, ఆచారాలు
[మార్చు] ప్రార్ధనలు
లక్ష్మిని స్తుతించేందుకు పురాతనమైనవి, ఆధునికమైనవి అనేక ప్రార్ధనలు, గానాలు, పద్యాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని:
- మహాలక్ష్మ్యష్టకం
- లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
- లక్ష్మీ సహస్రనామ స్తోత్రం
- శ్రీసూక్తం
- కనకధారా స్తోత్రం
- అష్టలక్ష్మీ స్తోత్రం
[మార్చు] దేవాలయాలు
- కొల్హాపూర్
- అలమేలు మంగాపురం
- అష్టలక్ష్మీ మందిరం, చెన్నై
- మహాలక్ష్మి మందిరం, ముంబై
- అష్టలక్ష్మీ మందిరం, హైదరాబాదు
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 1.2 "శ్రీలక్ష్మి తొలి వాగ్రూప చిత్తరువులు" - రచన: దిట్టకవి కన్నబాబు - సప్తగిరి మాసపత్రిక - జనవరి 2008 - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ
- ↑ Pattanaik, Devdutt. Lakshmi: The Goddess of Wealth and Fortune-An Introduction. Vakils Feffer & Simons Ltd, 2003 (ISBN 8187111585)
- ↑ Pattanaik, Devdutt. Lakshmi: Or how my Kaamwali came to be named so?. Vakils Feffer & Simons Ltd, 2005 (ISBN 8187134385)
- ↑ Sankaranarayanan, S., Glory of the Divine Mother (Devī Māhātmyam), Nesma Books, India, 2001. (ISBN 81-87936-00-2), P 148.
[మార్చు] బయటి లింకులు
- The Online mandir of Mahalakshmi - Visit Mandir Daily & Get blessing & Prosper.
- Know about Goddess Sri Lakshmi - Know about Sri Lakshmi and Her other Forms.
- Devotional hymns and eulogies on Lakshmi
- Lakshmi Puran in Oriya Language - Lakshmi Puran in Oriya Language (Laxhmi Puran in Odia Language) available here.