లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్

వికీపీడియా నుండి
భారత రత్న లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్
అక్టోబర్ 11, 1902అక్టోబర్ 8, 1979
జన్మస్థలం: సితాబ్దియారా, బల్లియా, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
ఉద్యమము: స్వాతంత్ర్య సంగ్రామం, సర్వోదయా, ఎమర్జెంసీ
ప్రధాన సంస్థలు: భారత జాతీయ కాంగ్రేసు, జనతా పార్టీ

జె.పి.గా సుప్రసిద్దులైన జయప్రకాశ్ నారాయణ్(జననం:అక్టోబర్ 11, 1902 — మరణం:అక్టోబర్ 8, 1979) భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు లోక్ నాయక్ అని సగౌరవంగా పిలుచుకుంటారు.

విషయ సూచిక

[మార్చు] ప్రారంభ జీవితం

జయప్రకాశ్ నారాయణ్ ఉత్తర ప్రదేశ్ లోని బలియా జిల్లాకు, బీహార్లోని సారన్ జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించాడు. హైస్కూలు విద్యను, కళాశాల విద్యను పాట్నా లో అభ్యసించాడు. అటుపిమ్మట అమెరికాలో 8 సం.లు ఉన్నత విద్యనభ్యసించి 1929లో భారతదేశం తిరిగి వచ్చాడు. అమెరికా లో ఉన్న సమయంలో మార్క్స్ సిద్దాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే యం.యన్.రాయ్ రచనల ప్రభావానికి లోనయ్యాడు.

1920లో జయప్రకాశ్ నారాయణ్ స్వాతంత్ర్య సమరయోధురాలు, కస్తూరిబా గాంధీ అనుచరురాలు అయిన ప్రభావతీ దేవిని వివాహమాడారు.

[మార్చు] స్వాతంత్ర్య సమరయోధుడిగా

అమెరికానుండి వచ్చిన వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి త్వరలోనే మహాత్మా గాంధీ కి ప్రియ శిష్యుడుగా మారాడు.

1932లో శాసనోల్లంఘనోద్యమం లో పాల్గొని జైలు శిక్ష ననుభవించాడు. విడుదలైన తరువాత కాంగ్రెస్ లో అంతర్భాగంగా వామపక్ష భావాలతో స్థాపించబడిన కాంగ్రెస్ సోషలిష్టు పార్టీ కి జెనరల్ సెక్రటరీ గా నియమించబడ్డాడు.

1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సీనియర్ కాంగ్రెస్ నేతలంతా అరెష్టు చేయబడిన సమయంలో జయప్రకాశ్ నారాయణ్ రాం మనోహర్ లోహియా, బాసవన్ సింగ్ వంటివారితో కలసి ఉద్యమాన్ని ముందుండి నడిపాడు.

స్వాతంత్ర్యానంతరం జె.పి. ఆచార్య నరేంద్ర దేవ్, బాసవన్ సింగ్ మొదలైన వారితో కలసి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి తమ సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అనంతరం ఈ సోషలిస్టు పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీ గా మారి బీహార్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించినది.

[మార్చు] సర్వోదయ

1954లో జె.పి. రాజకీయాలనుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబా భావే యొక్క సర్వోదయ ఉద్యమానికి మరియు దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమా నికి అంకితం చేశాడు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారిభాగ్‌లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు. జె.పి. త్వరలోనే భారతదేశం లో మహాత్మా గాంధీ భావాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడలలో నడుస్తున్న సర్వోదయా ఉద్యమకారులలో కెల్లా ప్రముఖునిగా రూపొందాడు.

[మార్చు] సంపూర్ణ క్రాంతి

1960 వ దశకం చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తిరిగి బీహార్ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనారంభించాడు. 1974 లో బీహార్లో జె.పి. నాయకత్వం వహించిన ఒక విద్యార్థి ఉద్యమం త్వరలో బీహార్ ఉద్యమం గా ప్రసిద్ది పొందిన ఒక ప్రజా ఉద్యమంగా మారినది. ఈ ఉద్యమ సమయంలోనే శాంతియుతమైన సంపూర్ణ విప్లవా నికి జె.పి. పిలుపునిచ్చాడు.

[మార్చు] ఎమర్జెన్సీ

ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ని దోషిగా పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి,మిలిటరీకి మరియు పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించాడు.ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే ఇందిరాగాంధీ జూన్ 25,1975 అర్థరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెనీ)ని విధించారు. జె.పి.ని మరియు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెష్టు చేసినది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ లోనే యంగ్ టర్క్‌ లు గా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు.

జె.పి. ఛండీఘడ్ లో డిటెన్యూ గా ఉంచబడ్డాడు. బీహార్ వరదల సమయంలో అచటి పునరావాస కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు పెరోల్ పై విడుదల కోరినా కూడా ప్రభుత్వం తిరస్కరించినది. ఆఖరికి జె.పి. ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేయబడ్డాడు.

చివరికి ఇందిరా గాంధీ జనవరి 18, 1977న ఎమర్జెన్సీ ని తొలగించి ఎన్నికలను ప్రకటించడంతో ఆమెను ఎదుర్కోవటానికి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జె.పి.మార్గదర్శకత్వంలో జనతా పార్టీ రూపుదిద్దుకున్నది. చివరికి జనతా పార్టీ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించి, ఇందిర ను గద్దె దింపి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన మొట్ట మొదటి కాంగ్రేసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించినది.

[మార్చు] భారత రత్న

భారత దేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అక్టోబర్ 8,1979 లో మరణించాడు. మరణానంతరం 1998 లో భారత ప్రభుత్వం ఇతనికి దేశంలో అత్యున్నత పురస్కారమైన భారత రత్న ను ప్రకటించినది. ఇదిగాక జె.పి. చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా 1965 లో మెగసెసే అవార్డు ప్రకటించబడినది.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు