వల్లభాచార్యుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

శుద్ధాద్వైతి అయిన వల్లభాచార్యుడు 1473 లో కంకరవ గ్రామంలో లక్ష్మణభట్టు, ఎలమగర దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. వారిది వైష్ణవ పండిత వంశం, వైదిక నిష్ఠా కుటుంబం.

బాల్యం[మార్చు]

వల్లభాచార్యుడి చిత్రపటం

వల్లభుని బాల్యం, విద్యాభ్యాసం కాశీలో గడిచాయి. యుక్తవయసు వచ్చేసరికే వేదవేదాంగాలు, వివిధ శాస్త్రాలు, అష్టాదశ పురాణాలు పఠించాడు.

దేశాటనం[మార్చు]

పెద్దవాడైన తర్వాత వైష్ణవమత వ్యాప్తిని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. దేశమంతా పెక్కుసార్లు తిరిగి, వివిధ ప్రదేశాలలో వివిధ మతస్థులతో వాదోపవాదాలు జరిపి తన మతానికి మళ్ళించాడు. కృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో ఆంధ్రప్రాంతమైన విజయనగరం వచ్చి రాజాస్థానంలోని శైవులను వాదంలో ఓడించాడు. అక్కడినుండి ఉత్తరాభిముఖంగా ప్రయాణించి ఉజ్జయిని, ప్రయాగ, కాశీ, హరిద్వార్, బదరీనాథ్, కేదార్‌నాథ్ మొదలైన పుణ్యస్థలాలను దర్శించి, చివరికి మథురవద్ద బృందావనంలో కొంతకాలం నివసించాడు.

Vallabhacharya discovers Shrinathji, at Mount Govardhan

ఒకనాడు వల్లభునికి శ్రీకృష్ణుడు కలలో కనపడి, సమీపంలోని గోవర్ధనగిరిపై ఒకచోట శ్రీనాథ విగ్రహం కలదని, దాన్ని త్రవ్వితీసి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించి, పూజాదికాలు జరిగేటట్టు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ విధంగానే అక్కడ వల్లభాచార్యుడు 1520లో శ్రీనాథాలయం నిర్మించాడు. అందుకే వల్లభుని మతాన్ని శ్రీనాథ మతం అంటారు. మథురనుంచి తిరిగి కాశీ చేరుకుని అక్కడ స్థిరపడ్డాడు.

రచనలు[మార్చు]

బాదరాయణ బ్రహ్మసూత్రాలకు అనుభాష్యం, జైమిని పూర్వమీమాంసా సూత్రాలకు భాష్యాన్ని రచించాడు. భాగవత దశమ స్కంధానికి సుబోధిని అనే వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించాడు.

  • తెలుగువారికి బాగా పరిచయమున్న మధురాష్టకం ఇతడు రచించినదే.

శుద్ధాద్వైతం[మార్చు]

శంకరాచార్యుని సిద్ధాంతాలతో వల్లభుడు విభేదించాడు. పరబ్రహ్మమును మాయ ఆవరించి మరుగుపరుస్తుందన్న వాదాన్ని తిరస్కరించాడు. ఎందుకంటే ఈ వాదంలో మాయ ద్వితీయతత్త్వం అయింది. కాబట్టి అది అద్వైతానికి విరుద్ధం. మాయావృతం కాని పరబ్రహ్మమే పరమసత్యమని ప్రతిపాదించడు. మాయావాదాన్ని తిరస్కరించడంవలన అతని వాదానికి శుద్ధాద్వైతమనే పేరు వచ్చింది.

తత్త్వచింతన[మార్చు]

పరమాత్మ సచ్చిదానంద స్వరూపం కాగా, జీవుడు సత్‌చిత్ రూపం మాత్రమే. అతడినుంచి ఈశ్వరుడు ఆనందాన్ని మరుగుపరిచాడు. అందుచేతనే జీవుడు అజ్ఞానవశుడై, సంసారబద్ధుడై దుఃఖితుడవుతున్నాడు. ఇక జడ జగత్తు సద్రూపం మాత్రమే. దాని నుంచి ఈశ్వరుడు తన చిత్, ఆనంద లక్షణాలను మరుగుపరిచాడు. అయినప్పటికీ పరమాత్మనుంచి పరణమించినవైనందున జీవాత్మలు, జగత్తు పరమాత్మతో తాదాత్మ్యం కలిగినవే.

నిర్యాణం[మార్చు]

వల్లభాచార్యుడు 1531లో నిర్యాణం చెందాడు.