వికీపీడియా:వివాద పరిష్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా ఓ సముదాయం. ఈ విజ్ఞాన సర్వస్వం రాయడంలో అందరూ కలిసి పనిచెయ్యాలి. వ్యాసాల్లో ఏకకాలంలో ఒకరి కంటే ఎక్కువ మంది పని చేస్తూ ఉంటారు. అందుచేత, వ్యాసం ఎలా రాయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తవచ్చు. అలాంటపుడు సంధి పాటించి, విషయం పరిష్కారమయ్యేంతవరకు దిద్దుబాట్లు ఆపండి. దిద్దుబాటు యుద్ధాల్లోకి దిగకండి; దీని వలన సమస్య పరిష్కారం కాదు సరిగదా, వికీపీడియా మెరుగుదలకు లేశమాత్రమూ ఉపయోగపడదు. దాని బదులు, కింద చూపిన మార్గాల్లో సమస్య పరిష్కారానికి కృషి చెయ్యండి.

గమనిక: ఇక్కడ వివరించిన పద్ధతులు రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల (వాడుకరులు) లేదా సభ్యుల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారాల కోసం రూపొందించబడ్డాయి. దుశ్చర్య, వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలను పదేపదే అతిక్రమించిన సందర్భాల్లో సభ్యుని నిరోధించడం లేదా నిషేధించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. చాలా సందర్భాల్లో వ్యక్తుల దుష్ప్రవర్తనను కింద చూపిన మార్గాల ద్వారా పరిష్కరించవచ్చు. దుష్ప్రవర్తనను ఎత్తిచూపేవారు వివాదంలో భాగంగా ఉండనవసరం లేదు.

వ్యాస పాఠ్యంపై వివాదాలు[మార్చు]

వివాదం రాకుండా చూడండి[మార్చు]

వివాద పరిష్కారానికి ఉత్తమ మార్గం, అసలు వివాదం తలెత్తకుండా చూడడమే. ఇతరులను, వారి అభిప్రాయాలను గౌరవించండి. అంటే, ముఖ్యంగా వివాదంలో ఉన్న పేజీలో మార్పుచేర్పులను వెనక్కు తీసుకెళ్ళకండి. ఏదైనా దిద్దుబాటు పక్షపాతంగానో, అనుచితంగానో ఉందని మీకు అనిపిస్తే, దాన్ని మెరుగు పరచండి; వెనక్కి తీసుకుపోవద్దు. ఇతర సభ్యులు అభ్యంతరం చెబుతారనుకున్న దిద్దుబాట్లకు సముచితమైన దిద్దుబాటు సారాంశాన్ని రాయండి. వెంటవెంటనే మూడు కంటే ఎక్కువ సార్లు వెనక్కి తీసుకుపోరాదనే నియమాన్ని పాటించండి. దీన్నే 3RR నియమం అనిఅంటారు. అనుచితమైన ప్రవర్తనను గమనించినపుడు మీరూ అదే పద్ధతిలో స్పందించకండి.

3RR నియమం: 24 గంటల్లో ఒకే పేజీలో మూడు కంటే ఎక్కువ సార్లు దిద్దుబాట్లను వెనక్కి తీసుకుపోరాదు. వెనక్కి తీసుకుపోవడమంటే, ఇతర సభ్యులు చేసిన దిద్దుబాట్లను రద్దు చెయ్యడం. ప్రతీ సారీ రద్దు చేసినది వ్యాసంలోని అదే భాగం కానక్కరలేదు.

మరిన్ని వివరాల కోసం చూడండి: వికీపీడియా:3RR నియమం

వివాదంలోని ఇతర పార్టీలతో మాట్లాడండి[మార్చు]

పరిష్కార మార్గంలో మొదటి ప్రయత్నంగా, వివాదాస్పద విషయం గురించి ఏదైనా చర్చాపేజీ లో చర్చించండి. అవతలి పార్టీ యొక్క చర్చాపేజీలోగానీ, వివాదాస్పదమైన వ్యాసపు చర్చాపేజీలో గానీ చర్చించవచ్చు. వ్యాసం పేజీలో మాత్రం వివాదాన్ని కొనసాగించకండి. చర్చలో ప్రశాంతంగా ఉండండి, వ్యక్తిగత నిందలు చెయ్యకండి. అవతలి వ్యక్తి ఆలోచనలను కూడా పరిగణించి ఓ అంగీకారానికి రండి. అవతలి వ్యక్తి కూడా నిజాయితీగా ఉన్నారని భావించండి; తద్విరుద్ధంగా బలమైన ఋజువులుంటే తప్ప.

ఏదో చర్చించామన్న పేరు కోసమన్నట్లు చర్చించకండి. నిబద్ధతతో చెయ్యని చర్చ, వివాద పరిష్కారం కోసం కాక, వివాదాన్ని ఇంకా పెంచేందుకు చేసినట్లుగా కనిపిస్తుంది. అలా చేస్తే, వివాదం తరువాతి స్థాయికి వెళ్ళినపుడు పరిష్కర్తలు మీ వాదన పట్ల అంత సానుభూతితో ఉండకపోవచ్చు. నిజాయితీతో కూడిన చర్చ, వెంటనే ఫలితాన్ని ఇవ్వకున్నా, పరిష్కారం కనుగొనడం పట్ల మీ నిబద్ధతను తెలియజేస్తుంది. ఇది వికీపీడియా విధానానికి అనుగుణమైనది.

పాఠ్యం పైనే దృష్టి పెట్టండి[మార్చు]

చర్చల్లో వ్యాస పాఠ్యంపైనే దృష్టి పెట్టండి, వాడుకరి ప్రవర్తనపై కాదు; పాఠ్యంపై వ్యాఖ్యానించండి, పాఠ్యం రాసిన వాడుకరిపై కాదు. వికీపీడియా ఒక సాముదాయిక కృషి, ఇక్కడ రాసేవారంతా సద్భావనాతోనే రాసారని భావించడం కీలకం. పాఠ్యంపై జరిగే చర్చలోకి ప్రవర్తనను తీసుకువస్తే చర్చ దారితప్పి, పరిస్థితి విషమించవచ్చు.

అవతలి వ్యక్తులు మొండిగాను, అమర్యాదగాను ఉంటే, మీరు పాఠ్యంపైనే చర్చను కేంద్రీకరించడం కష్టం కావచ్చు. కానీ మీరు శాంతంగా ఉండండి. వాళ్ళ లాగే స్పందిస్తే అది మీకెంతమాత్రమూ మేలు చెయ్యదు. వికీపీడియా మిగతా అంతర్జాలం లాంటిది కాదు, ఇక్కడ వాడుకరులు ఎల్లవేళలా మర్యాదగా ఉండాల్సి ఉంటుంది.

తప్పుకోండి[మార్చు]

వికీపీడియాలో ఏదీ అర్జెంటు కాదు. ఇప్పటికిప్పుడు రాసేసెయ్యాల్సినంత తక్షణావసరం సాధారణంగా ఉండదు. వివాదం కొనసాగుతూ ఉండగా, కొద్ది కాలం పాటు తప్పుకొనే అవకాశం కోసం చూడండి. తప్పుకుని మనసు కొంత శాంతించాక, తిరిగి రండి. అప్పటికి అవతలి వ్యక్తులు కూడా ఆ వివాదాన్ని దాటేసి ముందుకు పోయి ఉంటారు. కొత్త వాడుకరులు కూడా వ్యాసంలో రాస్తూ ఉండవచ్చు. వివాదం కొత్తవారితో ఐనపుడు ఇలా తప్పుకోవడం బాగా ఉపయోగపడుతుంది. ఈ వ్యవధి వారు వికీ నియమాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

పాఠ్యంపై తలెత్తిన వివాదాల పరిష్కారం కోసం బయటి సాయం[మార్చు]

చర్చలు విఫలమైన పక్షంలో కింది నాలుగు పద్ధతులను వాడి వివాద పరిష్కారానికి ప్రయత్నించాలి. ఏ పద్ధతిని పాటిస్తారు, ఏ వరుసలో పాటిస్తారు అనేది వివాదంలో ఇరుక్కున్న పక్షాల ఇష్టం.

మూడో పక్షంతో చర్చించండి[మార్చు]

  • వికీపీడియా విస్తృతాభిప్రాయాన్ని నెలకొల్పడం ద్వారా పనిచేస్తుంది. విస్తృతాభిప్రాయాన్ని రూపొందించేందుకు మరింత మంది ప్రేక్షకులు రంగంలోకి రావాలి.

వివాదం ఏదైనా వ్యాసం విషయంలో నైతే, ఇప్పటికే మీరు సంధికి అంగీకరించి ఉండకపోతే ఇప్పుడు అంగీకరించాలి. దాని వలన వ్యాసంలో దిద్దుబాట్లు ఆగిపోయి, పరిష్కర్తలకు విషయాన్ని పరిశీలించడానికి వీలు కలుగుతుంది. దిద్దుబాటు యుద్ధం కొనసాగుతూనే ఉంటే ఆ వ్యాసం పేజీని సంరక్షించమని అడగండి.

వికీపీడియా:సంరక్షణ విధానం చూడండి.

సముదాయం అభిప్రాయం అడగండి[మార్చు]

వ్యాస పాఠ్యంపై వివాదం తెగనపుడు, సముదాయం అభిప్రాయాన్ని అడగండి. తెవికీలో సముదాయం పరిమాణం తక్కువ కాబట్టి, సాధారణంగా తెవికీలో చురుగ్గా పాల్గొనే వాడుకరులలో చాలామంది ఈసరికే వివాదంలో జోక్యం చేసుకుని ఉండవచ్చు. అయితే వివాదంలో పాల్గొనని వాడుకరులెవరైనా ఈ పిలుపునందుకుని వివాద పరిష్కారానికి సహకరించవచ్చు.

సలహాదారు కోసం అడగండి[మార్చు]

  • సలహాదారు సాయం ఎప్పుడైనా తీసుకోవచ్చు. వివాదం ముదిరిన తరుణంలో సభ్య సలహాదారు సాయం తీసుకునే విషయం గట్టిగా ఆలోచించండి. సలహాదార్లు ఒక పక్షానికే సలహాలిస్తారు. వివాదపు ఏ స్థాయిలోనైనా సలహాదారు సాయం తీసుకోవచ్చు.

మధ్యవర్తిత్వం[మార్చు]

  • వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం కావాలని అడగండి. వివాద పరిష్కారం కోసం మూడో వ్యక్తి స్వచ్ఛందంగా పాల్గొనడమే మధ్యవర్తిత్వం. మధ్యవర్తి అన్ని పక్షాలతో మాట్లాడి సామరస్యక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు.

వాడుకరి ప్రవర్తనకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడం[మార్చు]

పాఠ్య వివాదం, ప్రవర్తన వివాదాల మధ్య తేడా ఏంటంటే వాడుకరి ఎలా దిద్దుబాట్లు చేస్తున్నారు, సాటి వాడుకరుల పట్ల ఎలా వ్యాఖ్యానిస్తున్నారు అనేది ప్రవర్తన వివాదాల్లో ప్రధాన విషయం. వాడుకరి ప్రవర్తన సరిగ్గా ఉండి ఉంటే, అసలు వివాదమనేది ఉండేదే కాదు అనే పక్షంలో ఆ వివాదం ప్రవర్తన వివాదం అవుతుంది; వ్యాసంలోని పాఠ్యం పట్ల ఇద్దరు వాడుకరులకు ఉన్న పరస్పర అనంగీకారమే మూలమైతే అది పాఠ్య వివాదం.

సమస్య వాడుకరి ప్రవర్తనతోటే అయితే, ముందు చెయ్యాల్సిన పని, ఆ వాడుకరితో వారి వాడుకరి పేజీలోనే, సూటిగా, గౌరవంగా మాట్లాడ్డం. ప్రవర్తనకు సంబంధించిన విషయాలను వ్యాసపు చర్చాపేజీల్లో చర్చించకుండా ఉంటే మంచిది. మీ చర్చను మొదలుపెట్టడం కోసం అవసరమైతే మూసలు ఏమైనా వాడవచ్చు. లేదా మీరే మీ స్వంత వాక్యాల్లో చర్చను మొదలుపెట్టవచ్చు. ఈ చర్చ, సమస్యను పరిష్కరించకపోతే, నిర్వాహకులెవరినైనా సంప్రదించి, ఆ వాడుకరి ప్రవర్తనను మూల్యాంకన చెయ్యమని అడగవచ్చు. నిర్వాహకుల నోటీసు బోర్డులో అడగవచ్చు. వివాదాన్ని పరిష్కరించేందుకు మీరు తగినంత కసరత్తు చేసారా లేదా, ఆ సమయంలో మీ ప్రవర్తన, ఇతర వాడుకరుల ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా అని నిర్వాహకులు, సముదాయం కూడా పరిశీలిస్తారు. సభ్యుల దుష్ప్రవర్తనను ఆపేందుకు, తెవికీకి హాని జరక్కుండా నివారించేందుకూ తగు చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులకు మరిన్ని అనుమతులు ఉంటాయి; ఉదాహరణకు, వ్యక్తిగత దాడులు చేసే వాడుకరి, ఎంత చెప్పినా దాడులు ఆపకపోతే, నిర్వాహకుడు వారిని హెచ్చరించి, అవసరమైతే నిరోధించనూ గలరు. ఒకే వాడుకరి రెండు లేదా ఎక్కువ వేర్వేరు పేర్లతో ఖాతాలను నిర్వహిస్తున్నట్లు గానీ, నిరోధిత/నిషేధిత వాడుకరి వేరే ఖాతా మాటున తిరిగి వచ్చినట్లుగా గానీ అనుమానిస్తే సాక్‌పప్పెట్ దర్యాప్తు చేసి దాని నిగ్గుతేల్చమని అడగవచ్చు.

అన్ని సందర్భాల్లోనూ, తీవ్రమైన దుష్ప్రవర్తన జరిగిన సందర్భాల్లో కూడా, హుందాగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించడానికి ప్రవర్తించండి.

సముదాయం విధించే ఆంక్షలు[మార్చు]

వివాదం ఏర్పడిన విషయంలో పాల్గొన్న వాడుకరులందరిపైనా సముదాయం సాధారణ ఆంక్షలు విధించవచ్చు. సాధారణంగా నిర్వాహకుల నోటీసు బోర్డులో చర్చించాక, సముదాయం ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఆంక్షలను అమలు చేసే నిర్వాహకులు తగిన నోటిఫికేషన్లను జారీ చేసి, ఆంక్షలన్నిటినీ లాగ్ చెయ్యాలి. ఏ విషయం మీదనైతే సాధారణ ఆంక్షలను విధించారో ఆ విషయమ్మీద పాల్గొనే వాడుకరులందరికీ నిర్వాహకులు ఈ ఆంక్షల గురించి తెలియజెయ్యాలి. అలా తెలియజెయ్యని వాడుకరిపై ఆంక్షలు విధించరాదు. ఓ వాడుకరి మరో వాడుకరికి ఈ ఆంక్షల గురించి తెలియజేసి సదరు నోటిఫికేషన్ను లాగ్ చెయ్యవచ్చు. ఈ నోటిఫికేషను సదరు వాడుకరి ప్రవర్తనపై హెచ్చరికగా పరిగణించరాదు. అది కేవలం సమాచారం ఇవ్వడం కోసం పంపే నోటిఫికేషన్ మాత్రమే. సాధారాణ ఆంక్షల అవసరం తీరిపోయినట్లైతే, నిర్వాహకుల నోటీసు బోర్డులో చర్చించి, సదరు ఆంక్షలను ఎత్తివెయ్యవచ్చు. సాముదాయిక ఆంక్షలను అతిక్రమించే సంఘటనలపై రిపోర్టు చెయ్యడం కోసం కూడా నిర్వాహకుల నోటీసు బోర్డును వాడాలి.

చివరి మజిలీ: పంచాయితీ (ఆర్బిట్రేషన్)[మార్చు]

వివాదం వ్యాస విషయానికి, పాఠ్యానికీ సంబంధించింది కానప్పుడు, వివాద పరిష్కారానికి అన్ని చర్యలూ తీసుకున్న తరువాత, పంచాయితీ (ఆర్బిట్రేషన్) కోరవచ్చు. వివాద పరిష్కారం కోసం చెయ్యాల్సిన సకల ప్రయత్నాలనూ చేసినట్లు చూపించేందుకు మీరు సిద్ధమై ఉండాలి. పంచాయితీకి, మధ్యవర్తిత్వానికీ మధ్య తేడా ఏంటంటే, పంచాయితీ వివిధ పక్షాలు ఒక అంగీకారానికి వచ్చేందుకు సాయం చెయ్యడమే కాకుండా, ఒక నిర్ణయాన్ని కూడా వెలువరిస్తుంది. పంచాయితీ ఇచ్చే నిర్ణయం అన్ని పక్షాలకూ శిరోధార్యం. విషయం తీవ్రమైన దుశ్చర్యకు సంబంధించినదైతే, పంచాయితీ కూడా తీవ్రమైన పరిమాణాలకు దారితీయవచ్చు. ఇవి పంచాయితీ విధానం చూపిన ప్రకారం, వాడుకరులను వికీపీడియా నుండి పూర్తిగా నిషేధించే వరకు ఉండవచ్చు. సాధారణంగా వాడుకరి ప్రవర్తనకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి పంచాయితీని, వ్యాస విషయాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్నీ, వినియోగించాలి.

అత్యవసర పరిస్థితుల్లో[మార్చు]

వివాద పరిష్కార పద్ధతులు పరిష్కరించలేనంత అత్యవసరమైన పరిస్థితులు కొన్ని తలెత్తవచ్చు. అలాంటి పరిస్థితులను తగు వేదికలపై లేవనెత్తవచ్చు.

అభ్యర్ధన లేక రిపోర్టు: ఇక్కడకు వెళ్ళాలి:
వ్యక్తిగత సమాచారపు శాశ్వత తొలగింపు వికీపీడియా:ఓవర్‌సైటు అభ్యర్ధన
నిరోధం తొలగింపు (మిమ్మల్ని నిరోధించి ఉంటే) Guide to appealing a block చూడండి
వ్యాసంలో దుశ్చర్య నిర్వాహకుని జోక్యం కోరండి
అనుచితమైన వాడుకరిపేరు నిర్వాహకుని దృష్టికి తీసుకు వెళ్ళండి
సాక్‌పప్పెట్రీ అనుమానం నిర్వాహకుల నోటీసు బోర్డు
వ్యక్తిగత దడులపై వికీ నియమాల ఉల్లంఘన నిర్వాహకుల నోటీసు బోర్డు
దిద్దుబాటు యుద్ధం నిర్వాహకుల నోటీసు బోర్డు
ఇతర అత్యవసర సమస్యలు నిర్వాహకుల నోటీసు బోర్డు

వ్యాస విషయానికి, పాథ్యానికీ సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం నిర్వాహకుల నోటీసు బోర్డు సరైన స్థలం కాదు.

కొన్ని జాగ్రత్తలు[మార్చు]

వివాద పరిష్కారం పద్ధతిని కొందరు వాడుకరులు తమ ఆటల కోసం వాడుకోవచ్చు. అది వాళ్లపైనే ఎదురు తిరిగే అవకాశం ఉంది. వివాద పరిష్కార వ్యవస్థ సాముదాయికంగా కృషి చేసి విజ్ఞానసర్వస్వాన్ని నిర్మించడానికి ఉద్దేశీంచినది అని గుర్తుంచుకోవాలి, వ్యక్తిగత, రాజకీయ యుద్ధాల కోసం కాదు.

సంబంధిత విధానాలు[మార్చు]

సంబంధిత మార్గదర్శకాలు[మార్చు]