విశ్వనాథ సత్యనారాయణ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విశ్వనాథ సత్యనారాయణ
Kavisamrat Viswanadha Satyanarayana.jpg
జననం విశ్వనాథ సత్యనారాయణ
1895,సెప్టెంబర్ 10
కృష్ణా జిల్లా నందమూరు గ్రామం
మరణం 1976,అక్టోబరు 18
గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్
మరణ కారణము హృద్రోగం
నివాస ప్రాంతం విజయవాడ
ఇతర పేర్లు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
వృత్తి ఎస్.ఆర్.ఆర్ & సీవీఆర్ కళాశాల, విజయవాడలో తెలుగు ప్రధానోధ్యాపకుడు
ఎస్.ఆర్.ఆర్. కళాశాల,కరీంనగరంలో ప్రాచార్యుడు (ప్రిన్సిపాల్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ రాష్ట్ర ఆస్థానకవి
సుపరిచితుడు "కవి సమ్రాట్" ,తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.
సాధించిన విజయాలు కవిసమ్రాట్
కళాప్రపూర్ణ
పద్మ భూషణ్
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
డాక్టర్
మతం హిందూ
భార్య / భర్త వరలక్ష్మమ్మ
పిల్లలు విశ్వనాధ అచ్యుత దేవరాయలు
విశ్వనాధ పావని శాస్త్రి
Website
http://www.viswanadhasatyanarayana.com

విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును [1].

విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం - ఈ వ్యక్తిత్వం."[2]


జీవిత విశేషాలు[మార్చు]

విశ్వనాథ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర బాధ్రపద బహుళ షష్ఠి)[3] ) కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించారు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లి, మరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులు బందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం. బి.ఎ. తరువాత విశ్వనాథ బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరారు. ఉద్యోగం చేస్తుండగా మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించారు. తరువాత మహాత్మా గాంధీ నడుపుతున్న సహాయ నిరాకరణోద్యమం లో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారు.


తరువాతి కాలంలో ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించారు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1938 వరకు), విజయవాడ లో ఎస్.ఆర్.ఆర్.&‍ సి.వి.ఆర్. కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల గా మార్పు చెందింది), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన వివిధ హోదాల్లో పని చేసారు. 1957 లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగానూ, 1958లో విధానమండలి కి నామినేటెడ్ సభ్యులుగానూ విధులు నిర్వర్తించారు.


1976 అక్టోబరు 18 న (నల నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి) విశ్వనాథ పరమపదించాడు. జీవితంలో చాలా కాలం విజయవాడ నగరంలోనే గడచింది. 21 అక్టోబర్,1996న ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడలో ఆయన విగ్రహాన్ని ఆప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆవిష్కరించారు.

సాహితీ ప్రస్థానం[మార్చు]

1916 లో "విశ్వేశ్వర శతకము" తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆసమయంలోనే "ఆంధ్రపౌరుషము" రచించాడు. 1920 నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు - ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించారు. 1961 లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించారు.

ప్రముఖ బెంగాలీకవి రవీంద్రనాధ టాగూరు వలె తన రచనలను కొన్నింటినైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే, ఆయన అంతర్జాతీయ ఖ్యాతినార్జించి ఉండేవాడని ఆయన అభిమానులు అంటుంటారు. అయితే విశ్వనాథ రచనలను విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యం కాని విషయం [1]

పాత్ర చిత్రణ[మార్చు]

విన్నూత్న, విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాథ పెట్టింది పేరు. ఆయా సందర్భాన్నిబట్టి, సన్నివేశాన్ని బట్టి పాత్రల మనస్త్వత్తాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వక్తిత్వంగల పాత్రలుగానూ, స్వయం ప్రకాశవంతమయిన పాత్రలుగానూ, మహత్తరమయిన, రమణీయమయిన శిల్పాలుగాను తీర్చి దిద్దారు. అందునా వారి స్త్రీ పాత్ర చిత్రణ అద్భుతం!

ముఖ్య రచనలు[మార్చు]

విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి - ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. విశ్వనాథ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి.


తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు. ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నాడు. తమిళనాడులోని మదురై ప్రాంతం నేపధ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు మళయాళంలోనికి, అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు. వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించాడు. భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశాడు. విశ్వనాథ నవలలలో పురాణవైర గ్రంథమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతతో నిండిన కథ, అనితరమైన ఆయన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.

వ్యక్తిత్వం[మార్చు]

విశ్వనాథ వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడ్డది. భారతీయత మీద, తెలుగుదనంమీద అభిమానం కలిగింది. తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవాడు. ఇందువల్ల విశ్వనాథను వ్యతిరేకించినవారు చాలామంది ఉన్నారు. ఛాందసుడు అనీ, "గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్" అనేవాడు అనీ (శ్రీశ్రీ విమర్శ) విమర్శించారు. విశ్వనాథకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకొంటారు. కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు. షేక్స్‌పియర్, మిల్టన్, షెల్లీ వంటి కవుల రచనలను ఆసాంతం పరిశీలించాడు.

గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథకు తన ప్రతిభ పైన అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు. తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని, చెళ్ళపిళ్ళవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నాడు విశ్వనాథ.

అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్


జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి, ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరం అని విశ్వనాథ అనేవాడు. శిల్పం గాని, సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనేవాడు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత, సాంప్రదాయాలను కాపాడుకోవాలనుకొనేవాడు.[1]

విశ్వనాథ వ్యక్తిత్వాన్ని చతుర్వేదుల లక్ష్మీనరసింహం ఇలా ప్రశంసించాడు: - "ఆహారపుష్టి గల మనిషి. ఉప్పూ కారం, ప్రత్యేకంగా పాలు ఎక్కువ ఇష్టం. కాఫీలో గాని, తాంబూలంలో గాని ఎక్కువగా పంచదార వాడేవారు. ఆజానుబాహువు. బ్రహ్మతేజస్సు ముఖాన, సరస్వతీ సంపద వాక్కున, హృదయ స్థానాన లక్ష్మీకటాక్ష చిహ్నంగా బంగారుతో మలచిన తులసీమాల. మనస్సు నవ్య నవనీతం. వాక్కు దారుణాఖండల శస్త్రతుల్యం. చదివేవి ఎక్కువ ఆంగ్ల గ్రంథాలు. వ్రాసేవి ఆంధ్ర సంస్కృత గ్రంథాలు. చిన్నలలో చిన్న, పెద్దలలో పెద్దగా ఒదిగి పోయే స్వభావం. శారీరకంగా వ్యాయామం, యోగాభ్యాసం అయన నిత్యం అభ్యసించేవి. విమర్శలూ, స్తోత్రాలూ, తిట్లూ, దీవెనలూ, దారిద్ర్యం, ఐశ్వర్యం - ఇలాంటి ద్వంద్వాలకు అతీతుడు. ఒకమాటలో ఆయన అపూర్వమైన 'దినుసు'"[2]

పురస్కారాలు[మార్చు]

విశ్వనాథకు గుడివాడలో జరిగిన గజారోహణ సన్మానం
 • ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను "కవి సమ్రాట్" బిరుదుతో సత్కరించింది.
 • 1964లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ "కళాప్రపూర్ణ" తో సన్మానించింది.
 • 1942 సంక్రాంతి కి ఆయనకు గుడివాడ లో "గజారోహణం" సన్మానం జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలు కూడా గుడివాడలో ఘనంగా జరిగాయి.
 • శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
 • 1962 లో "విశ్వనాథ మధ్యాక్కఱలు" రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
 • 1970 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
 • 1970 లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం తో గౌరవించింది.
 • జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన "రామాయణ కల్పవృక్షము"నకు, జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించినపుడు, సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది
As a Poet of classic vision and virility, as a novelist and play wright of deep insight and impact, as an essayist and literary critic of force and felicity, and as a stylist of rare "range" Mr. Satyanarayana has carved for himself a place of eminence amongst the immortals of Telugu Literature. His ceaseless creativity and versatility have kept him in the forefront of contemporary Telugu Literary Scene.

చిత్రమాలిక[మార్చు]

రచనల జాబితా[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ రచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

నవలా సాహిత్యం[మార్చు]

పద్య కావ్యాలు[మార్చు]

 • ఝాన్సీరాణి
 • ప్రద్యుమ్నోదయము
 • రురుచరిత్రము
 • మాస్వామి
 • వరలక్ష్మీ త్రిశతి
 • దేవీ త్రిశతి (సంస్కృతం)
 • విశ్వనాథ పంచశతి
 • వేణీభంగము
 • శశిదూతము
 • శృంగారవీధి
 • శ్రీకృష్ణ సంగీతము
 • నా రాముడు
 • శివార్పణము
 • ధర్మపత్ని
 • భ్రష్టయోగి (ఖండకావ్యము)
 • కేదారగౌళ (ఖండకావ్యము)
 • గోలోకవాసి
 • దమయంతీస్వయంవరం

నాటకములు[మార్చు]

 • అమృతశర్మిష్ఠమ్ (సంస్కృతం)
 • గుప్తపాశుపతమ్ (సంస్కృతం)
 • గుప్తపాశుపతము
 • అంతా నాటకమే
 • అనార్కలీ
 • కావ్యవేద హరిశ్చంద్ర
 • తల్లిలేని పిల్ల
 • త్రిశూలము
 • నర్తనశాల
 • ప్రవాహం
 • లోపల - బయట
 • వేనరాజు
 • అశోకవనము
 • శివాజి - రోషనార
 • ధన్యకైలాసము
 • నాటికల సంపుటి (16 నాటికలు)

విమర్శలు[మార్చు]

 • అల్లసానివారి అల్లిక జిగిబిగి
 • ఒకనాడు నాచన సోమన్న
 • కావ్య పరీమళము
 • కావ్యానందము
 • నన్నయగారి ప్రసన్న కథాకలితార్ధయుక్తి
 • విశ్వనాథ సాహిత్యోపన్యాసములు
 • శాకుంతలము యొక్క అభిజ్ఞానత
 • సాహిత్య సురభి
 • నీతిగీత
 • సీతాయాశ్చరితమ్ మహత్
 • కల్పవృక్ష రహస్యములు
 • సాహితీ మీమాంస.

ఇతరములు[మార్చు]

 • చిన్న కథలు
 • ఆత్మ కథ
 • విశ్వనాథ శారద (3 భాగాలు)
 • యతిగీతము
 • What is Ramayana to me

ఉదాహరణలు[మార్చు]

ఆంధ్ర పౌరుషము నుండి
గోదావరీ పావనోదార వాపూర మఖిలభారతము మాదన్న నాడు
తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి గలయునాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెల్గు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పము తొలి పూజ సేయునాడు
అక్షరజ్ఞానమెరుగదో యాంధ్రజాతి
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుకగూండ్లు గట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు


రామాయణ కల్పవృక్షం నుండి 
ఆకృతి రామచంద్ర విరహాకృతి
కన్బొమ తీరు రామ చాపాకృతి
కన్నులన్ ప్రభు కృపాకృతి
కైశిక మందు రామదేహాకృతి
సర్వ దేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాకృతి
కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై.
విశ్వేశ్వర శతకము నుండి
మీ దాతృత్వమొ తండ్రి దాతృతమొ మీమీ మధ్య నున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా!
ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతోనేలా? యొడల్ మండెనా
ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా!
కిన్నెరసాని పాటల నుండి
నడవగా నడవగా నాతి కిన్నెరసాని
తొడిమ యూడిన పూవు పడతిలా తోచింది
కడు సిగ్గు పడు రాచకన్నెలా తోచింది
బెడగు పోయిన రత్నపేటిలా తోచింది.
కోకిలమ్మ పెళ్ళి నుండి
చిలుక తల్లి మహాన్వయంబున
నిలిచినవి సాంస్కృతిక వాక్కులు
కోకిలమ్మా తెలుగు పలుకూ
కూడబెట్టినదీ
మరొకటి
వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ
సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు
అంగనామణి పెండిలియాడి కూడ
ప్రాతచుట్టరికమునె రాపాడుచుండె

విశ్వనాథ గురించి[మార్చు]

తన శిష్యుని గురించి గురువు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ఇలా అన్నాడు

నా మార్గమ్మును కాదు, వీని దరయన్ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; మార్గమదియింకేదో యనంగా వలెన్
సామాన్యుండనరాదు వీని కవితా సమ్రాట్ వవుత మా హేతువై,
యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్

శ్రీశ్రీ ఇలా అన్నాడు

మాట్లాడే వెన్నెముక
పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సామ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

 1. 1.0 1.1 1.2 తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు
 2. 2.0 2.1 తెలుగు సాహిత్య చరిత్ర - రచన: డాక్టర్ ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ: ప్రతిభ పబ్లికేషస్స్, హైదరాబాదు (2004)
 3. "వేయి పడగలు" పుస్తకానికి గ్రంథకర్త కుమారులు పావనిశాస్త్రి పీఠిక
 • రచనల జాబితా మరియు వర్గీకరణ - "వేయి పడగలు" పుస్తకం వెనుక అట్టనుండి తీసుకోబడింది. మరి కొన్ని వివరాలు అదే పుస్తకంలో "విశ్వనాథ పావనిశాస్త్రి" వ్రాసిన "ఒకమాట" పీఠిక నుండి.
 • తెలుగు పద్యం

బయటి లంకెలు, వనరులు[మార్చు]