విష్ణుకుండినులు
శాలంకాయనుల తరువాత వేంగీదేశమును పాలించినవారు విష్ణుకుండినులు. సాతవాహనుల అనంతరము ఆంధ్రదేశమున అత్యధికప్రాంతము పాలించిన రాజవంశమిదియే. విష్ణుకుండినుల వంశావళిని విశేషముగా శోధించిన శంకరనారాయణ ప్రకారము క్రీ. శ. 375 నుండి వంశస్థాపకుడు ఇంద్రవర్మ 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత క్రమముగ మొదటి మాధవవర్మ, (క్రీ. శ.400-422), మొదటి గోవిందవర్మ (క్రీ. శ.422-462), రెండవ మాధవవర్మ (క్రీ. శ.462-502), మొదటి విక్రమేంద్రవర్మ (క్రీ. శ.502-527), ఇంద్రభట్టారకవర్మ (క్రీ. శ.527-555), రెండవ విక్రమేంద్రభట్టారక (555-572) పాలించారు. చివరగా మొదటి విక్రమేంద్రవర్మ రెండవ పుత్రుడగు నాలుగవ మాధవవర్మ క్రీ. శ. 613 వరకు పాలించాడు[1].
విష్ణుకుండినులలో పదునొకండు అశ్వమేధములను, క్రతుసహస్రములను, ఇతర యాగములనెన్నింటినో ఆచరించిన రెండవ మాధవవర్మ చాల గొప్పవాడు. ఇతడు వాకాటకుల తో సంబంధ బాంధవ్యములు నెరిపి రాజ్యాన్ని దృఢపర్చుకున్నాడు. ఈతనిని త్రికూట మలయాధిపతి అంటారు. గుంటూరు జిల్లాలోని కోటప్ప కొండయే త్రికూట మలయం. ఇంద్రవర్మ పూర్వదేశాధిపతులతో పెక్కు యుద్ధాలు చేసి దక్షిణ కళింగాన్ని నిలుపుకున్నాడు.
విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుగ పడమట గుంటూరు వరకును, నైరుతిన గోలకొండ వరకు విస్తరించిఉన్నది. విష్ణుకుండినులు శ్రీపర్వతస్వామి భక్తులు. వీరు బహువిధములైన క్రతువులు ఆచరించారు. సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేదవిద్యలు పోషించారు. 'ఘటిక' అను విద్యాస్థానాలు స్థాపించారు. విష్ణుకుండినులు మతసహనము గలవారు. ప్రజలలో అప్పటికి ఆదరణపొందుచుండిన బౌద్ధమతాన్ని ఆదరించారు. బౌద్ధవిహారాలు నిర్మించి వాటికి దానాలు చేశారు. గుహాలయములు నిర్మించి గుహాలయ వాస్తువుకు ప్రోత్సాహమిచ్చారు. మొగల్రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే. ఈ గుహాలయ స్థంభముల మీద పంజా ఎత్తిపెట్టిన సింహప్రతిమ ఉండుటచేత వీరు సింహలాంఛనులని పరిశోధకుల అభిప్రాయము. పలు శాసముల ప్రకారము వీరి రాజధాని శక్రాభిధానపురి నల్లగొండ మండలము తుమ్మలగూడెం వద్ద శిధిలముల రూపమున నుండి, స్థానికులచే ఇంద్రపాలగుట్ట అని పేర్కొనబడునదే శక్రాభిధానపురి అని చెప్పవచ్చును.
విష్ణుకుండినులు రాగిమలాము చేసిన ఇనుప నాణెములు వాడారు. నాణెముల మీద సూర్యగోళపు మధ్యనున్న ఏకతల దేవాయతన రూపం ముద్రించారు. భారతదేశములో ఇట్టి నాణెములు తొలుతగ ప్రవేశబెట్టినవారు విష్ణుకుండినులు.
[మార్చు] మూలాలు
- ↑ విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి (దేశము-చరిత్ర), మొదటి సంపుటము, 1990, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు