వెల్చేరు నారాయణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెల్చేరు నారాయణరావు
వెల్చేరు నారాయణరావు
జననంఫిబ్రవరి 1,1933
వృత్తియూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌
మతంహిందూ

వెల్చేరు నారాయణరావు ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు. బ్రిటీష్ యుగంలో భారతీయ సాహిత్యం, ముఖ్యంగా తెలుగు సాహిత్యం పాశ్చాత్య సాహిత్య పరిశోధన వల్ల ఎలాంటి ప్రథలకు లోనైందో పరిశోధించి సమగ్రమైన అధ్యయనంతో ఆ లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్న విశిష్ట పరిశోధకుడు.

వృత్తి, వ్యక్తిగత జీవితం[మార్చు]

ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.ఎ., ఆంధ్రవిశ్వకళా పరిషత్తులో ఎం.ఎ. పూర్తిచేసిన అనంతరం వెల్చేరు నారాయణరావు 1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లింగ్విస్టిక్స్ లో డిప్లొమా అందుకున్నాడు. అనంతరం 1971లో అమెరికాలోని విస్కామన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ లో ఉపన్యాసకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. 1974లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అంశంపై చేసిన పరిశోధనకు గాను పి.హెచ్.డి. పట్టా అందుకున్నాకా విస్కామన్సిన్ విశ్వవిద్యాలయంలోనే 1975లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, 1981లో అసోసియేట్ ప్రొఫెసర్ గా అనంతరం 1987లో ఆచార్యునిగా పదోన్నతి పొందాడు. 2009-10 నాటికి యూనివర్శిటీ ఆఫ్ చికాగో, ఎమోర్య్ విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

సాహిత్య విమర్శ, పరిశోధన[మార్చు]

వెల్చేరు నారాయణరావు విశిష్టమైన అవగాహనతో, లోతైన పరిశోధనతో, విస్తృతమైన అధ్యయనంతో తెలుగు విమర్శారంగంలో తనదైన స్థానాన్ని పొందాడు.ఆయన తొలి విమర్శా గ్రంథమైన "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం"లో కవిత్వంలోని విప్లవాల గురించి వివరించాడు. విప్లవాత్మక కవితల రూపం, విషయం, వ్యక్తీకరణ – ఈ పార్శ్వాలన్నీ ఆ కవిత పుట్టిన సందర్భాన్ని ప్రతిబింబిస్తాయని ఈ సిద్ధాంతసారం. దీన్నుంచి కొన్ని విప్లవాత్మకమైన ఉపలక్ష్యాలు కూడా వస్తాయి. (అ) కవులు విప్లవాలను తీసుకురారు, (ఆ) తామున్న సమాజ సందర్భాన్ని అర్థం చేసుకున్న కవులు ఆ సందర్భానికి అనుగుణంగా కవిత్వం రాస్తాడు, (ఇ) అలాటి వారిలో సమర్థులైన వారు ఆ కవితావిప్లవానికి నాయకులుగా గుర్తింపబడతారు, (ఈ) సమర్థులైనా సందర్భాన్ని అర్థం చేసుకోలేని వారూ, లేదా ఆ సందర్భాన్ని తాము మార్చగలమనుకునే వారూ రాసే కవిత్వం నిలబడటానికి, వారి సమర్థత పాలు సందర్భానికి అనుగుణంగా రాసే వారి కన్నా ఉన్నతమైనదై వుండాలి అనేవి ఈ గ్రంథంలోని అంశాలకు స్థూలమైన సారాంశం. ఈ గ్రంథంలోని విషయ విస్తరణ 20వ శతాబ్దిలోని కవిత్వ విప్లవాలపై ఎక్కువ ఆధారపడిందన్న ప్రముఖ విమర్శకులు కె.వి.ఎస్.రామారావు తదనంతర పరిశోధనల్లో ఆ లోపం పూరిస్తూ పూర్వసాహిత్యాన్ని నారాయణరావు కొత్త కోణంలో పరామర్శించాడు అన్నాడు. ఈ కోణంలో నారాయణరావు గ్రంథాలను విశ్లేషిస్తూ కె.వి.ఎస్.రామారావు శ్రీనాథుడి గురించిన పరిశోధన, పురాణ దశ నుంచి ప్రబంధ దశకి జరిగిన పరిణామక్రమంలో, ఒక ముఖ్యమైన మజిలీగా గుర్తించటం. చాటుపద్యాల గురించిన పరిశీలనలు, ప్రబంధ దశకి పట్టుగొమ్మలైన పండితబృందాలు కవిత్వాస్వాదనని ఒక అద్భుతమైన వ్యవస్థగా ఎలా తీర్చిదిద్దాయో, ప్రబంధ కవితా విప్లవాన్ని ఎలా నిలబెట్టాయో చూపిస్తాయి. కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం మీద జరిగిన పరిశోధనలు బహుశా ప్రబంధ విప్లవానికి ఒక ముఖ్య కారణం అప్పటి సమాజంలో ఊపిరిపోసుకుంటున్న “ఆధునికతా” భావనలు కావొచ్చునని ప్రతిపాదిస్తాయి. నాయకరాజుల కాలంనాటి కవిత్వం గురించిన శోధనలు ప్రబంధ సాహిత్యం అంతా ఒకే మూస లోది కాదని, దానిలోనూ అనేక “చిరువిప్లవాలు” ఉండొచ్చునని చూపే ప్రయత్నంగా చూడొచ్చు. ఇలా, స్థూల వర్గీకరణతో ప్రారంభమైన నారా సుదీర్ఘ ప్రయాణం ఒక్కో స్థూలాంశాన్ని దాని సూక్ష్మ విభాగాలుగా విడదీసి ఒక్కో సూక్ష్మాంశానికున్న ప్రత్యేకతల్ని గుర్తిస్తూ, అది దాని స్థూల మాతృకలోని ఇతర సూక్ష్మాంశాలతో ఎలా సంబంధితమైందో వివరించే నిరంతరాయ ప్రయత్నాల సముదాయంగా నారాయణరావు సాహిత్యాన్ని అభివర్ణిస్తాడు. ప్రతీ రచనకు నిర్దుష్టమైన రచయిత, ఒకే శుద్ధమైన పాఠం ఉంటుందని భావిస్తూ చేస్తున్న పరిశోధనల మూలాలను నారాయణరావు ప్రశ్నిస్తాడు. అటువంటి పరిశోధనలు, వాటికి మూలమైన అవగాహన వలసవాద భావజాలంలో భాగమే తప్ప నిజానికి అవి భారతీయ సాహిత్య క్రమానికి ఉపయోగపడవని ఆయన సిద్ధాంతీకరించాడు. ఈ క్రమంలో వలసవాద భావజాల ప్రభావిత విమర్శకులకు కొరుకుడు పడని చాటువులను ఎంచుకుని ప్రామాణిక పరిశోధన వ్యాసాలు, పుస్తకాలు రచించాడు. ముఖ్యంగా "పొయెం ఎట్ ద రైట్ మూముంట్" గ్రంథంలో చాటు సాహిత్యంలోని వివిధ అంశాలను సవివరంగా చర్చించాడు.

ఆసక్తికరమైన కొన్ని పరిశోధనాంశాలు[మార్చు]

  • నాయకరాజుల కాలాన్ని ఆనాటి శృంగార కావ్యాల కారణంగా తెలుగు సాహిత్య విమర్శకులు "క్షీణయుగం"గా ముద్రవేశాడు. బ్రిటీష్ కాలంలో ఆనాటి కావ్యాలపై నిషేధం కూడా విధించాడు. ఈ నేపథ్యంలో నారాయణరావు "సింబల్స్ ఆఫ్ సబ్స్టెన్స్" గ్రంథంలో అటువంటి కాలాన్ని ఎంచుకుని చేసిన పరిశోధనల్లో ఆనాటి సాహిత్యం భూ కేంద్రక వ్యవస్థ నుంచి ధన కేంద్రక వ్యవస్థగా మారుతున్న క్రమంలో తయారైన కొత్త విలువల ఫలితంగా నిరూపిస్తాడు.[1]
  • గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని ప్రధానస్రవంతిలోని సాహిత్య విమర్శకులు కుళ్లిపోయిన సమాజాన్ని, సమాజాన్ని బాగుజేయడానికి వచ్చిన సంస్కరణల్నీ చిత్రించినట్టుగా విశ్లేషించాడు. నారాయణరావు ఈ ధోరణికి పూర్తి భిన్నంగా నారాయణ రావు గారి విశ్లేషణ ప్రకారం అప్పారావు గారి దృష్టి భిన్నమైంది. ఆయన ఈ నాటకంలో చిత్రించిన సమాజం కుళ్లిపోయింది కాదు, చక్కగా హాయిగా వున్నది. అంతేకాదు, ‘ఆధునిక’మైంది కూడ. ఈ ఆధునికత వలససంస్కృతి వల్ల కలిగిన ఆధునికత కాదు, అంతకుముందు ఎప్పటినుంచో వస్తూ వున్న ఆధునికత. ఇందులో మనుషులు సంప్రదాయాల భారంతో కుంగిపోతున్నవారు కారు, మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా, తమకు ఏం కావాలో దాన్ని ఎలా సాధించుకోవాలో స్పష్టంగా తెలుసుకుని ఆచరిస్తున్న వాళ్లు. అప్పారావు గారు చిత్రించిన ‘కన్యాశుల్కం’లో ఈ రెండురకాల ఆధునికతల మధ్య సంఘర్షణని చూస్తాం. వలససంస్కృతి ఆధునికతకి ప్రతినిథిగా సౌజన్యారావు పంతులు నిలబడితే, పరిణామ ఆధునికతని మధురవాణిలో స్పష్టంగా చూస్తాం. అవసరాన్ని బట్టి అటూ ఇటూ దూకే గోడమీది పిల్లిగా గిరీశం నిలబడతాడు. దాదాపుగా మిగిలిన అన్ని పాత్రలు కూడ ఆ సంధికాలానికి అనుగుణంగా పరిణమిస్తున్నవే, జీవనప్రయాణం చేస్తున్నవే. వలససంస్కృతి మీద ఇలాటి ఎదురుదాడి చేసిన రచయితలు ఆ కాలంలో అప్పారావు గారు తప్ప మరొకరు లేరు. భారతదేశంలోనే కాదు, ప్రపంచసాహిత్యంలో ఎక్కడా ఇలా జరగలేదని నారాయణ రావు గారి సిద్ధాంతం.[2][3]
  • పింగళి సూరన సొంతంగా అల్లి, కావ్యజగత్తుకూ వాస్తవ జగత్తుకూ అద్భుతమైన సంబంధాన్ని ప్రతిపాదించిన కావ్యం "కళాపూర్ణోదయం". నారాయణరావు "ద సౌండ్ ఆఫ్ ద కిస్"గా కళాపూర్ణోదయం అనువదించి మిగిలిన రచనలమల్లేనే దీన్లో కూడ లోతైన విశ్లేషణలతో, అనిదంపూర్వమైన ఆలోచనల్తో కూడిన ఒక పరిశోధనా వ్యాసాన్ని జతచేశాడు. కూలంకషంగా పరిశోధించిన నారాయణ రావు, షుల్మన్ గార్లు కళాపూర్ణోదయాన్ని దక్షిణాసియాలో వచ్చిన తొలి నవలగా నిరూపిస్తారీ The sound of the kiss అన్న గ్రంథంలో. ఒక నవలకుండవలసిన లక్షణాలు స్పష్టంగా ఇందులో ఉన్నట్టు చూపిస్తాడు.[4]

అనువాదకునిగా[మార్చు]

రచనలు[మార్చు]

వెల్చేరు నారాయణ రావు తెలుగులో, ఆంగ్లంలో పలు గ్రంథరచన, ఎన్నో ప్రామాణిక పత్రికల్లో వ్యాసరచన, పరిశోధనాత్మక గ్రంథాల్లో వ్యాసరచన ద్వారా భాగస్వామ్యం చేశాడు. అంతేకాక తెలుగు కావ్య, నాటక, నవల, కథలను ఆంగ్లంలోకి అనువదించి వాటి విశిష్టత తులనాత్మకంగా అధ్యయనం చేసి ముందుమాటలుగా రాశాడు. ఈ అనువాదాలు అంతర్జాతీయ స్థాయి ప్రామాణిక పత్రికల్లో ప్రచురించి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ప్రచురణలుగా వెలువరించడం వల్ల వాటికి ప్రామాణికత కట్టబెట్టి ప్రపంచ స్థాయిలో తెలుగు సాహిత్యానికి గుర్తింపు దక్కడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. ఆయన ముఖ్యమైన రచనల జాబితా ఇలా ఉంది:[5]

తెలుగు[మార్చు]

  • నారాయణ రావు కథలు: 1965, చిన్న కథలు, గీతా బుక్ హౌస్, ఏలూరు.
  • తెలుగులో కవితా విప్లవాల స్వరూపం : పి.హెచ్.డి. పరిశోధన గ్రంథానికి పొడిగింపు. 1978లో విశాలాంధ్ర ప్రచురణ సంస్థ, విజయవాడ ద్వారా తొలి ప్రచురణ.

ఆంగ్లం[మార్చు]

  • ఫర్ ది లార్డ్ ఆఫ్ యానిమల్స్ : పోయెమ్స్ ఫ్రం ది తెలుగు కాళహస్తీశ్వర శతకము ఆఫ్ ధూర్జటి : సహరచయిత : హెచ్.హెచ్.బెర్కెలే, 1987లో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్.
  • శివాస్ వారియర్స్ : బసవ పురాణా ఆఫ్ పాల్కురికి సోమనాథా : సహాయం : జి.రోగైర్, 1990లో ప్రిన్స్ టన్ యూనివర్శిటీ ప్రెస్.
  • వెన్ గాడ్ ఈజ్ ఎ కస్టమర్: తెలుగు కోర్టేజియన్ సాంగ్స్ బై క్షేత్రయ్య అండ్ అదర్స్ : సహరచయితలు : ఎ.కె.రామానుజన్, డేవిడ్ షుల్మన్. 1994లో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్.
  • ఎ పోయెం ఎట్ ద రైట్ మూమెంట్ : రిమెంబర్డ్ వెర్సెస్ ఫ్రం ప్రీ మోడరన్ సౌత్ ఇండియా : సహరచయితలు : డేవిడ్ షుల్మన్, బెర్కెలే. 1998లో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్.
  • క్లాసికల్ తెలుగు పోయెట్రీ : యాన్ ఆంథాలజీ : సహరచయిత : డేవుడ్ షుల్మన్. 2001లో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్(న్యూడిల్లీ), 2002లో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్.
  • 20త్ సెంచురీ తెలుగు పోయెట్రీ : 2001లో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ (న్యూడిల్లీ)
  • లవర్స్ గైడ్ టు వరంగల్ : వల్లభరాయాస్ క్రీడాభిరామము : సహరచయిత : డేవిడ్ షుల్మన్, 2002లో పర్మనెంట్ బ్లాక్(న్యూడిల్లీ).
  • టెక్స్చర్స్ ఆఫ్ టైం : రైటింగ్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా : సహరచయితలు : డేవిడ్ షుల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యం, 2002లో పర్మినెంట్ బ్లాక్(న్యూఢిల్లీ) ప్రచురణ.
  • హైబిస్కస్ ఆన్ లేక్ : ట్వంటీత్ సెంచరీ తెలుగు పోయెట్రీ ఫ్రం ఇండియా : 2003లో యూనివర్శిటీ ఆఫ్ విస్కిన్సిన్ ప్రెస్ ప్రచురణ.
  • సౌండ్ ఆఫ్ కిస్ ఆర్ స్టోరీ దట్ మస్ట్ నెవర్ బి టోల్డ్ (పింగళి కళాపూర్ణోదయము అనువాదం) : సహరాచయిత : డేవిడ్ షుల్మన్, 2003లో కొలంబియా యూనివర్శిటీ ప్రెస్ ప్రచురణ.
  • గాడ్ ఆఫ్ హిల్ : టెంపుల్ సాంగ్స్ ఫ్రం తిరుపతి(అన్నమయ్య పదకవితల ఆంగ్లానువాదం) : సహరచయిత : డేవిడ్ షుల్మన్, 2005లో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురణ.
  • డెమోన్స్ డాటర్ : ఎ లవ్ స్టోరీ, ట్రాన్స్లేషన్ ఆఫ్ పింగళి సూరన నావెల్ : సహరచయిత : డేవిడ్ షుల్మన్, 2006లో స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ ప్రెస్ ప్రచురణ.
  • గర్ల్స్ ఫర్ సేల్:కన్యాశుల్కం. ఎ ప్లే ఫ్రం కొలోనియల్ ఇండియా : 2007లో ఇండియానా యూనివర్శిటీ ప్రెస్ ప్రచురణ.
  • హౌ ఊర్వశీ వస్ వొన్:ట్రాన్స్లేషన్ ఆఫ్ కాళిదాస్ విక్రమోర్వశీయం : సహరచయిత:డేవిడ్ షుల్మన్, 2009లో క్లే సంస్కృత లైబ్రరీ ప్రచురణ.

పత్రికల్లో, ఇతరుల పుస్తకాల్లో[మార్చు]

వెల్చేరు నారాయణరావు రాసిన పలు పరిశోధక వ్యాసాలు, ఆంగ్లానువాదాలు వివిధ ప్రామాణిక పత్రికల్లో ప్రచురణ పొందాయి. ఆయన కొన్ని ప్రఖ్యాత పరిశోధన గ్రంథాల్లో వ్యాసాలు రాసి వాటిని మరింత సుసంపన్నం చేశాడు.

పత్రికల్లో[మార్చు]

ఇండియన్ లిటరేచర్, జర్నల్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, జర్నల్ ఆఫ్ లిటరరీ ట్రాన్స్ లేషన్, జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్ తదితర ప్రామాణిక చారిత్రిక, సాంస్కృతిక, సాహిత్య పత్రికల్లో ఆయన రచనలు ప్రచురణ పొందాయి.

అనువాదాలు[మార్చు]

ప్రామాణిక పత్రికల్లో తెలుగు సాహిత్యాన్ని వెల్చేరు నారాయణరావు చేసిన ఆంగ్లానువాదాలు ఇలా ఉన్నాయి.

  • విశ్వనాథ సత్యనారాయణ నవల "హాహాహూహూ"ను అదే పేరుతో ఆంగ్లానువాదం.
  • విశ్వనాథ సత్యనారాయణ నవల "వీరవల్లడు"ను "వల్లడు ద హీరో" పేరిట ఆంగ్లానువాదం.
  • నగ్నముని కొయ్యగుర్రం కవిత్వాన్ని "వుడెన్ హార్స్" పేరిట ఆంగ్లానువాదం.
  • స్త్రీల పాటయిన "ఊర్మిళాదేవి నిద్ర"ను "ఊర్మిళా స్లీప్స్" పేరిట ఆంగ్లానువాదం.
  • జానపద గీతాలు సీతగడియను "సీతా లాక్డ్ అవుట్"గా, లక్ష్మణదేవర నవ్వును "లక్ష్మణా లాఫ్స్"గా ఆంగ్లానువాదం.
  • "ఎ సెలక్షన్ ఆఫ్ మోడ్రన్ తెలుగు పొయెట్రీ"గా తెలుగులో ఎంచిన కొన్ని కవితల ఆంగ్లానువాదం.

పరిశోధన వ్యాసాలు[మార్చు]

పలు పత్రికల్లో తెలుగు సాహిత్యాన్ని గురించి, సాహితీరూపాల గురించి నారాయణరావు రాసిన ఆంగ్ల విమర్శ, పరిశోధక వ్యాసాలు ప్రచురణ పొందాయి.

  • విశ్వనాథ సత్యనారాయణ రచించిన హాహా హూహూ నవల గురించి "ఎ హార్స్ హెడెడ్ గాడ్స్ అండ్ వైట్ స్కిన్డ్ మెన్ : ఎ సెకండ్ లుక్ ఎట్ విశ్వనాథ సత్యనారాయణాస్ "హాహా హూహూ"" పేరిట వ్యాసం.
  • విశ్వనాథ సత్యనారాయణ రచించిన "వీరవల్లడు" నవల శిల్పాన్ని గురించి "ఆఫ్టర్ వర్డ్: ఎ స్ట్రక్చరల్ వ్యూ ఎట్ వీరవల్లడు" పేరిట వ్యాసం.
  • "ద స్కిన్ లెస్ మేన్" వ్యాసం.
  • నాయకరాజుల కాలంలో వివిధ సాహితీప్రక్రియల గురించిన వ్యాసం "హిస్టరీ, బయోగ్రఫీ అండ్ పొయెట్రీ ఎట్ తంజావూరు నాయక కోర్ట్"
  • ఇంకా మరెన్నో వ్యాసాలు రచించాడు.

పరిశోధక, ప్రామాణిక గ్రంథాల్లో భాగస్వామ్యం[మార్చు]

నారాయణరావు పలు పరిశోధక గ్రంథాలు, ప్రామాణిక అధ్యయనాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని అందజేసి ఆయా రచనలు సుసంపన్నం చేశాడు. తెలుగు సాహిత్యంలోని వివిధ అంశాలకు చరిత్ర, ఆంత్రోపాలజీ తదితర రంగాల అంశాలతో ముడిపెట్టి తులనాత్మక అధ్యయనం చేసి వెలువరించిన ఆయన వ్యాసాలు ఆ గ్రంథాలకు, అధ్యయనాలకు విలువను పెంచాయి. ఆయన భాగస్వామ్యాన్ని విస్తరించిన గ్రంథాలు జాబితా:

  • పాలిటిక్స్ అండ్ నావెల్ ఇన్ ఇండియా
  • ఇండియన్ ఎకనామిక్స్ అండ్ సోషల్ హిస్టారికల్ రివ్యూ
  • ద మొఘల్ స్టేట్
  • ఎడింగ్టన్ హిస్టరీ ఆఫ్ లివింగ్ రెలిజియన్స్
  • ఇండియన్ ఫోక్ లోర్ I
  • సౌత్ ఏషియన్ ఇంటలెక్చువల్స్ అండ్ సోషల్ ఛేంజ్
  • అనదర్ హార్మనీ : న్యూ ఎస్సేస్ ఆన్ ది ఫోక్ లోర్ ఆఫ్ ఇండియా
  • ఫోక్ టేల్స్ ఆఫ్ ఇండియా
  • లా, పాలిటిక్స్ అండ్ ది సొసైటీ ఇన్ ఇండియా
  • క్రిమినల్ గాడ్స్ అండ్ డెమోన్ డివోటీస్ : ఎస్సేస్ ఆన్ ది గార్డియన్స్ ఆఫ్ ది పాపులర్ హిందూయిజం
  • మెనీ రామాయణాస్ : ద డైవర్సిటీ ఆఫ్ ఎ నరేటివ్ ట్రెడిషన్ ఇన్ సౌత్ ఏషియా
  • ద సేక్రెడ్ సెంటర్ యాజ్ ది ఫోకస్ ఆఫ్ పొలిటికల్ ఇంటరెస్ట్
  • అన్ టైయింగ్ ది నాట్ : ఆన్ రిడిల్స్ అండ్ అదర్ ఎనిగ్మాటిక్ మోడ్స్
  • ఇండియాస్ వరల్డ్ అండ్ యు.ఎస్. స్కాలర్స్
  • క్వశ్చనింగ్ రామాయణాస్
  • లిటరరీ కల్చర్స్ ఇన్ హిస్టరీ : రీ కన్స్ట్రక్షన్ ఫ్రం సౌత్ ఏషియా
  • ఇండియాస్ లిటరరీ హిస్టరీ : ఎస్సేస్ ఆన్ ది నైన్టీన్ సెంచరీ
  • తదితర గ్రంథాల్లో వ్యాసాలు

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

నారాయణరావు చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు, గౌరవాలు ఆయనను వరించాయి. ఆయనను జెరూసలేంలోని హిబ్రూ విశ్వవిద్యాలయం యొక్క ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ (1987), మేడిసన్ విశ్వవిద్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ హ్యుమానిటీస్ (1999), విన్స్ ఛాఫ్ట్ కళాశాల, బెర్లిన్ (2000-01) ఫెలోగా, మేడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ ఇన్ హ్యుమానిటీస్ (2005)లో సీనియర్ ఫెలోగా నియమించి గౌరవించాయి. 2004లో డేవిడ్ షుల్మన్ తో సంయుక్తంగా అసోసియేషన్ ఫర్ ఏషియన్ స్టడీస్ నుంచి "ఎ.కె.రామానుజన్ అనువాద బహుమతి" అందుకున్నాడు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం 2004-05 సంవత్సరానికి గాను రాధాకృష్ణన్ స్మారకోపన్యాసానికి గాను ఎంపిక చేసి గౌరవించింది. 2005లో ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ఆహ్వానంపై 3సార్లు ఉపన్యసించాడు. పలు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో, అనేక విశిష్ట వేదికల మీద ఆహ్వానాల మేరకు ఉపన్యసించాడు. అంతర్జాతీయ స్థాయిలో పలు సదస్సుల్లో ప్రసంగించాడు.

మూలాలు[మార్చు]

  1. Symbols of Substance: Court and State in Nayaka Period Tamilnadu శీర్షికన ఆ పుస్తకం గురించి కె.వి.ఎస్.రామారావు సమీక్ష
  2. Girls for Sale: Kanyasulkam, a Play from Colonial India పుస్తకం గురించి కె.వి.ఎస్.రామారావు సమీక్ష
  3. Girls for Sale: Kanyasulkam, a Play from Colonial India పుస్తకం గురించి "కన్యాశుల్కం మళ్లీ ఎందుకు చదవాలంటే" శీర్షికన వేలూరి వెంకటేశ్వరరావు సమీక్ష
  4. The Sound of the Kiss, or The Story That Must Never Be Told పుస్తకం గురించి కె.వి.ఎస్.రామారావు సమీక్ష
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-05-14. Retrieved 2013-12-21.

ఇవి కూడా చూడండి[మార్చు]