వైఎస్ఆర్ జిల్లా
| ?వైఎస్ఆర్ ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 15,359 కి.మీ² (5,930 చ.మై) |
| ముఖ్య పట్టణము | కడప |
| ప్రాంతం | రాయలసీమ |
| జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
28,84,524 (2011) • 188/కి.మీ² (487/చ.మై) • 1454136 • 1430388 • 67.88 • 78.41 • 57.26 |
| వెబ్‌సైటు: kadapa.ap.nic.in | |
వైఎస్ఆర్ జిల్లా (పాత పేరు కడపజిల్లా)[1] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ ప్రాంతమునకు చెందిన జిల్లా. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు మరియు సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, తెలుగు జాతీయ కవి వేమన, తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల, మహోన్నతమైన యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, అయ్యలరాజు రామభద్రుడు ఈ జిల్లాకు చెందినవారే. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం 1885లో వైఎస్ఆర్ జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. వైఎస్ఆర్ జిల్లా బెరైటీస్(ముగ్గురాయి) గనులు మరియు కడప బండలకు ప్రసిద్ధి చెందినది. వైఎస్ఆర్ జిల్లాకు తూర్పున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమాన అనంతపురం మరియు దక్షిణాన చిత్తూరు జిల్లాలు కలవు. కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలు ఉత్తరాన సరిహద్దులు. పూర్వము ఈ జిల్లాకు హిరణ్యదేశమని పేరు కలదు. ఈ ప్రదేశము పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గండికోట పెమ్మసాని నాయకులు, నిజాము నవాబులు, సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు, మరియు కడప నవాబులచే పరిపాలించ బడినది.
విషయ సూచిక |
[మార్చు] జిల్లా చరిత్ర
వైఎస్ఆర్ జిల్లా చరిత్ర చాలా ప్రాచీనమైనది. వైఎస్ఆర్ జిల్లాను గతంలో హిర్యణ రాజ్యం అని వ్యవహరించేవారు. క్రీ.పూ. 274-236 ప్రాంతంలో అశోక చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు.ఆ తరువాత శాతవాహనులు పాలించారు. శాతవాహనుల నాణేలు పెద్దముడియం, దానవులపాడు గ్రామాల్లో దొరికాయి. క్రీ.శ. 250-450 ప్రాంతంలో పల్లవరాజులు పాలించారు. ఇంకా రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, వైదుంబులు, కాకతీయులు మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. క్రీ.శ. 1336-1565 కాలంలో విలసిల్లిన విజయనగర సామ్రాజ్యంలో వైఎస్ఆర్ జిల్లా ఒక భాగం. గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులుపొందారు. నంద్యాల రాజులు, మట్లి రాజులు కూడ ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. విజయనగర పతనం తర్వాత గోల్కొండ నవాబులు, బీజాపూరు సుల్తానులు, ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు. క్రీ.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. నవాబుల తర్వాత పాళెగాళ్ళు విజృంభించారు.
ఆ తరువాత ఈస్టిండియా కంపెనీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్ థామస్ మన్రో కడప జిల్లా కలెక్టరు గా పని చేశాడు. పాలెగాళ్ళను అణచాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ ప్రాంతపు అభివృద్ధికి తెల్లదొరలు కొంతవరకు కృషి చేశారు. మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. సి.పి.బ్రౌన్ తెలుగుభాషను సముద్ధరించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక కల్నల్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫీయతుల పేరుతో భద్రపరిచాడు. 2010 జూలై 8 నుండి ఈ జిల్లా పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వై.ఎస్.ఆర్ జిల్లాగా[2] మార్చింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు మరియు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నడిబొడ్డైన కడపలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి.
[మార్చు] భౌగోళికము స్వరూపం
తూర్పున నెల్లురు జిల్లా, పశ్చిమాన అనంతపురం జిల్లా, దక్షిణాన చిత్తూరు జిల్లా, ఉత్తరాన కర్నూలు జిల్లా,ప్రకాశం జిల్లాలు సరిహద్దులుగా వున్నాయి.కొండప్రాంతం, నైసర్గికంగా పీఠభూమి, నల్లనేల భాగాలుగా చెప్పుకోవచ్చు. శేషాచలం కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని పాలకొండలని, నల్లమల కొండలని, వెలికొండలని, ఎర్రమల కొండలని పిలుస్తారు. జిల్లాలో నల్లరేగడి, ఎర్రరేగడి, ఇసకపొర నేలలు వున్నాయి.
- వాతావరణం
ఉష్ణోగ్రతలు వేసవికాలము లో 30°సె. - 44°సె, చలికాలంలో 21°సె. - 30°సె గా వుంటాయి. సగటు వర్షపాతము: 695 మి.మీ
- నదులు
పెన్న, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు మరియు చెయ్యేరు జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు.
- అటవీ సంపద
అడవుల విస్తీర్ణం 4,96,672 హెక్టార్లు, జిల్లా విస్తీర్ణంలో 32.3 శాతం అన్నమాట.పులివెందుల మండలంలో తప్ప నల్లచేవ, ఎర్రచేవ,ఎపి మొదలైన కలప జాతులు , విదేశీమారకము తెచ్చిపెట్టే ఎర్రచందనము లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న కలివికోడి ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి.
- జలవనరులు
తుంగభద్ర నది మీద సుంకేశుల ఆనకట్ట వద్ద మొదలై కడప-కర్నూలు కాలువ కడప మరియు కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ 4000 నాలుగు వేలు హెక్టేర్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తున్నది. సాగునీటి పారుదల కొరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మరియు పులివెందల కాలువ నిర్మాణములో ఉన్నవి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామము వద్ద పుల్లల మడుగు జలాశ్రయము నిర్మించబడినది. గాలేరు-నగరి సుజల స్రవంతి కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము. మాధవరం చేనేత పరిశ్రమ జిల్లాకు ఆదాయము తెచ్చిపెట్టే ఒక ముఖ్య ఆధారము.
[మార్చు] ఆర్ధిక స్థితిగతులు
[మార్చు] వ్యవసాయం
వరి, సజ్జ, జొన్న, రాగి వంటి ఆహార ధాన్యాలు, మామిడి, చీనీ, బొప్పాయి వంటి పండ్ల తోటలు, చెఱకు, పసుపు వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. చెన్నూరు తమలపాకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మైదుకూరు ప్రాంతంలో పండే కె.పి.ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కృష్ణాపురం గ్రామం పేరు మీదుగా ఆ వంగడానికి ఆ పేరు వచ్చింది.
జిల్లాలో పెన్నానది, కె.సి.కాలువ ప్రధానమైన నీటి వనరులు. జిల్లా మొత్తంలో కాలువల క్రింద 24 వేల హెక్టార్లు, చెరువుల క్రింద 22 వేల హెక్టార్లు, బావుల క్రింద 66 వేల హెక్టార్లు తక్కిన వనరుల క్రింద 11 వేల హెక్టార్లు సాగులో వున్నాయి.
ఊటుకూరులో వ్యవసాయ పరిశోధనా కేంద్రము , కృషి విజ్ఞాన కేంద్రము, అనంత రాజపేటలో పండ్ల పరిశోధన కేంద్రము, మైదుకూరులో జాతీయ ఉద్యనవనాల పరిశోధనాభివృద్ధి సంస్థ కలవు.
[మార్చు] ఖనిజాలు-పరిశ్రమలు
వైఎస్ఆర్ జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత ముగ్గురాయి (బెరైటీస్) మంగంపేట గనుల్లో లభిస్తోంది. [3]పులివెందుల ప్రాంతంలో రాతినార తీస్తున్నారు. నాప రాళ్ళకు కడప పెట్టింది పేరు. పులివెందుల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం నిర్మాణంలో ఉంది. యర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ, విస్తరిస్తోంది. జమ్మలమడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది. ముద్దనూరు దగ్గర ఏర్పాటైన రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు మెగాపవర్ ప్రాజెక్టు అయ్యే దిశగా పురోగమిస్తోంది.
కడప ప్రొద్దుటూరు లో పారిశ్రామిక వాడలున్నాయి. రాయలసీమ అభివృద్ధి పథకం కింద కడపలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ నెలకొల్పడంజరిగింది.
[మార్చు] డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు
మొత్తం 896 గ్రామాలు 644 గ్రామ పంచాయితీల, 51 మండలాల, మూడు రెవిన్యూడివిజన్ల పరిధిలో వున్నాయి. జిల్లాలో కడప నగరపాలకసంస్థ మరియు ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి పురపాలక సంస్థలు.
- రెవెన్యూ డివిజన్లు (3): కడప, రాజంపేట, జమ్మలమడుగు
- లోక్‌సభ స్థానాలు (2): కడప , రాజంపేట
- శాసనసభ స్థానాలు (11):కడప ,కమలాపురం, కోడూరు, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేలు , మైదుకూరు,రాజంపేట మరియు రాయచోటి
- రెవిన్యూ మండలాలు(51): [4]
|
2 మైలవరం 5 దువ్వూరు 6 మైదుకూరు 9 కలసపాడు 10 పోరుమామిళ్ల 11 బద్వేలు 12 గోపవరం 13 ఖాజీపేట 14 చాపాడు 15 ప్రొద్దుటూరు 16 జమ్మలమడుగు 17 ముద్దనూరు |
19 లింగాల 20 పులివెందల 21 వేముల 22 తొండూరు 24 యర్రగుంట్ల 25 కమలాపురం 26 వల్లూరు 27 చెన్నూరు 28 అట్లూరు 29 ఒంటిమిట్ట 30 సిద్ధవటం 31 కడప 33 పెండ్లిమర్రి 34 వేంపల్లె |
35 చక్రాయపేట 37 రామాపురం 38 వీరబల్లె 39 రాజంపేట 40 నందలూరు 41 పెనగలూరు 42 చిట్వేలు 43 కోడూరు 45 పుల్లంపేట 47 సంబేపల్లి 48 చిన్నమండెం 49 రాయచోటి 50 గాలివీడు 51 కాశి నాయన |
[మార్చు] రవాణా సౌకర్యాలు
బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. దాన్ని తిరిగి తెరిపించడానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా 1854-1866 మధ్య కాలంలో వేయబడిన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. ముఖ్య వాణిజ్య పట్టణమైన ప్రొద్దుటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం నిర్మాణ దశలో ఉంది. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతి పాదనలు ఉన్నాయి. కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు రాష్ట్ర రహదారులు. నెల్లూరు-బళ్ళారిలను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది.
[మార్చు] జనాభా లెక్కలు
2011 జన గణన ప్రకారం జనాభా 28,84,524 మగవారు 1454136, ఆడవారు 1430388. జనసాంద్రత 188/కి.మీ². 2001 జనగణన ప్రకారం అక్షరాస్యత 67.88% కాగా మగవారిలో 78.41% మరియు ఆడవారిలో 57.26% గా వుంది.
- 1981 నాటి జనాబా లెక్కల ప్రకారం
- ఈ జిల్ల జనాబా..... 19.33 లక్షలు, స్త్రీ పురుషుల నిష్పత్తి: 96:100, అక్షరాస్యత: 30.99
[మార్చు] పశు పక్ష్యాదులు
లంకమల్లేశ్వరము లో శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయము, రాజంపేట లో శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయము కలవు
[మార్చు] విద్యా సంస్థలు
2001 గణాంకాల ప్రకారం అక్షరాస్యత 62.53% కాగా మగవారిలో 71.22% మరియు ఆడవారిలో 53.74% గా వుంది. విద్యశాలలకు సంబంధించిన గణాంకాలు క్రింది పట్టికలో చూడండి. ఇవేకాకబోధనా, సార్వత్రిక విద్య, కంప్యూటర్ విషయాలకు సంబంధించి శిక్షణా సంస్థలు కూడా వున్నాయి.
| విభాగం | మొత్తం విద్యాశాలల సంఖ్య | వ్యాఖ్య |
|---|---|---|
| పాఠశాల విద్య | 4543 | [5],2010నాటికి 3322 ప్రాథమిక పాఠశాలలు, 490 ప్రాథమికోన్నత పాఠశాలలు,725 ఉన్నత పాఠశాలలు |
| పారిశ్రామిక శిక్షణ (ఐటిఐ) | 18 | [6], ప్రభుత్వసంస్థలు 3 |
| ఇంటర్మీడియట్ | 181 | [7], 41వృత్తి ఇంటర్మీడియట్ కళాశాలలు [8] |
| పాలిటెక్నిక్ | 15 | [9] |
| కళాశాల విద్య( వృత్తేతర)(ఉన్నత విద్య) | * | [10] ప్రభుత్వ సంస్థలు: |
| వృత్తివిద్య (ఇంజనీరింగ్) | * | [11] |
| వృత్తి విద్య (ఎమ్బిఎ ) | * | [12] |
| వృత్తి విద్య (ఫార్మసీ) | * | [13] |
| వృత్తి విద్య (ఎమ్సిఎ) | * | [14] |
| వైద్యవిద్య (సాధారణ వైద్యం) | * | |
| వైద్యవిద్య (దంత వైద్యం) | * | |
| వైద్యవిద్య (నర్సు) | * | |
| వైద్యవిద్య (వైద్య అనుబంధ) | * | [15] |
| విశ్వవిద్యాలయాలు లేక సమానస్థితిగలవి | * |
[మార్చు] గ్రంథాలయాలు
కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం, రిమ్స్ (రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్య కళాశాల ముఖ్యమైనవి. ఇవి కాక పులివెందులలో జే.ఎన్.టీ.యూ. (జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం) ఇంజినీరింగ్ కళాశాల ఉంది. ఇక కడపలో సి.పి.బ్రౌన్ నివసించిన బంగళాలో ఆయన పేరిట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధనా కేంద్రంగా పనిచేస్తోంది.
[మార్చు] ఆకర్షణలు
ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా చాంద్ పీరా గుంబద్, గండికోట దుర్గం, గండికోట, సిద్ధవటం కోట, ఓంటిమిట్ట, తాళ్ళపాక వున్నాయి. భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం కడపలో కలదు.
దేవుని కడప,బ్రహ్మంగారిమఠం, పుష్పగిరి, నాగేశులకొండ, సిద్దయ్య స్వామి మఠం, దుంపలగట్టు, ఆస్తాన్-ఎ-మగ్దూమ్ ఇలాహి (పెద్ద దర్గా), ఆస్తాన్-ఎ-షామీరియా (షామీరియా దర్గా), సెయింట్ మేరీ కేథడ్రాల్, తాళ్ళపాక, పుష్పగిరి, గండి క్షేత్రం, శ్రీ కోదండ రామస్వామి దేవాలయము(ఒంటిమిట్ట),, నందలూరు సౌమ్యనాథాలయాలు, అత్తిరాల, వెల్లాల, దానవులపాడు, జ్యోతి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు దేవాలయాలు మరియు కందిమల్లాయపల్లెలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠము చూడదగినపుణ్య క్షేత్రాలు
ఇవే కాక మస్జీద్-ఏ-ఆజమ్, కడప, అత్తిరాల, రాజంపేట, గండి ఆంజనేయస్వామి దేవాలయము, వేంపల్లె, సౌమ్యనాథాలయం, నందలూరు, నామాలగుండు, కనంపల్లెదేవరరాయి, సంబేపల్లి, వీరభద్ర స్వామి దేవాలయము, దేవళాలు (అల్లాడుపల్లె), చాపాడు మండలం, రాచవేటి వీరభద్ర స్వామి దేవాలయము,రాయచోటి,స౦జీవరాయుడు దేవాలయముపొృదుటూరు మొదలగునవి కలవు
ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, చందన వృక్షాలు, వన్యమృగాలు ఈ జిల్లాలో ఉన్నాయి.
[మార్చు] ప్రముఖ వ్యక్తులు
రాజకీయనాయకులలో వై.యస్. రాజశేఖరరెడ్డి వై.ఎస్.వివేకానందరెడ్డి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులలో యాగా వేణుగోపాలరెడ్డి, కార్టూనిస్టులలో జయదేవ్, సాహిత్యంలో దుర్భాక రాజశేఖర శతావధాని ఈ జిల్లా కు చెందినవారే.
[మార్చు] ప్రసార సాధనాలు
1963 జూన్ 16న కడపలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడి నుంచి ప్రసారాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లోని రాయచూరు, బళ్ళారి, బెంగుళూరు, కోలారు, చెన్నై తదితర ప్రాంతాల్లోనే కాక 900 కి.మీ. పరిధిలోని తెలుగు ప్రజలకు అందుతున్నాయి. ఇది కాక కడపలో దూరదర్శన్ రిలే కేంద్రం ఉంది.
[మార్చు] బయటి లింకులు
- వైఎస్ఆర్ జిల్లా (వైఎస్సార్కడప.ఇన్ఫో)
- ఈనాడు వేదికలో కడప
- 1933-34 నాటి గాంధీజీ వైఎస్ఆర్ జిల్లా పర్యటన
[మార్చు] మూలాలు
- ↑ వైఎస్ఆర్ జిల్లా ప్రభుత్వ జాలస్థలం
- ↑ REVENUE (DA) DEPARTMENT G.O.Rt.Dated:05-10-2009
- ↑ Industrial profile Kadapa District, Industries Dept 2001-02
- ↑ ఎపి ఆన్లైన్ లో కడప వివరాలు
- ↑ 2010-11 సావంత్సరిక నివేదిక
- ↑ జాతీయ వృత్తిపర శిక్షణ సమాచార వ్యవస్థ
- ↑ వైఎస్ఆర్లో సాధారణ ఇంటర్మీడియట్ కళాశాల వివరాలు
- ↑ వైఎస్ఆర్లో వృత్తి ఇంటర్మీడియట్ కళాశాల వివరాలు
- ↑ దొడ్ల నారపరెడ్డిw/SbtetinAP.aspx?districtid=5 వైఎస్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలు
- ↑ ఆంధ్రప్రదేశ్ కళాశాలలవివరాలు
- ↑ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాలలు
- ↑ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధిలో ఎమ్బిఎ కళాశాలలు
- ↑ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధిలో ఫార్మసీ కళాశాలలు
- ↑ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధిలో ఎమ్సిఎ కళాశాలలు
- ↑ ఆంధ్రప్రదేశ్ లో పారామెడికల కళాశాలలు
|
||||||||||||||
