శాంతి పర్వము తృతీయాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తృతీయాశ్వాసం[మార్చు]

వైశంపాయనుడు జనమే జయునకు భారత కథ చెప్తూ " జనమే మహారాజా ! ఈ విధంగా భీష్ముడు ధర్మరాజు సందేహాలకు సమాధానాలు ఇస్తున్న తరుణంలో ధర్మరాజు భీష్ముని " పితామహా ! యుద్ధం చేయడానికి తగు సమయం, యుద్ధానికి చేయ వలసిన సన్నాహాలు తెలియ చేయండి " అని ఆడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! వానాకాలం శీతాకాలంలో యుద్ధం చేయరాదు. ఎండా కాలం వచ్చే ముందే యుద్ధముకు వెడలుట మంచిది. ఈ సమయంలో పంటలు చేతికి వస్తాయి. ధాన్యపు నిలువలు పుష్కలంగా ఉంటాయి. ఎన్ని రోజులు యుద్ధం చేసినా ఆహారపు కొరత ఉండదు. శత్రురాజు మీదకు యుద్ధానికి వెళ్ళే సమయంలో పచ్చిక బయళ్ళు, నీరు సమృద్ధిగా ఉండే త్రోవలో వెళ్ళడం మంచిది. ఎత్తైన జండాలు, కత్తులు, డాళ్ళు, కవచములు, రథములు, లెక్కకు మించినవి తీసుకు వెళ్ళాలి. శంఖములు భేరీ మృదంగ వాద్యములు దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగించాలి. ఆ శబ్ధానికే శత్రు రాజుల గుండెలు అదిరిపోవాలి. సైన్యం విడిది చేయడానికి చదునైన ప్రదేశం ఎన్నుకోవాలి. ముందుగా శత్రు రాజులకు వర్తమానం పంపి వారి ఎత్తుగడలను ముందే ఊహించాలి. శత్రు రాజులు దుర్గమ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు కాని, వారు ఆదమరచి నిద్రిస్తున్నప్పుడు కానీ హటాత్తుగా వారి మీద పడి చంపాలి. కాల్బలం ప్రయాణించడానికి చెట్లు పుట్టలు ఉన్న గుట్టలు ఉన్న దారిని, అశ్వదళం నీళ్ళు బురద లేని సమతల ప్రదేశం, నేల గట్టిగా ఉండి చక్రములు దిగబడని మార్గమున రథములు నడపాలి. చెట్లు గుట్టలు ఉండే ప్రదేశంలో గజబలం ఉండాలి.

సేనలను నడిపేపద్ధతి[మార్చు]

ధర్మనందనా ! సేనలను నడిపించే పద్ధతి. ముందు కత్తి, డాలు ధరించిన పదాతిదళం యుద్ధానికి వెళ్ళాలి. వారి వెనుక ధనుర్ధారులు నిలవాలి. వారి వెనుక అశ్వికదళం నిలవాలి. అశ్విక దళం వెనుక గజదళం వారి వెనుక రథికులు నిలవాలి. గాంధారం, సింధూర, సౌవీర దేశముల వీరులు కత్తితిప్పడంలో నేర్పరులు. ఔశీనర దేశస్థులు అన్ని రకముల ఆయుధాలను విసరడంలో నేర్పరులు. ప్రాచ్యదేశం వారు గజబలం నడపడంలో, కపటయుద్ధంలో నేర్పరులు. యవనులు, కాంభోజులు, మధుర చుట్టు పక్కల వాళ్ళు అశ్వముల నెక్కి యుద్ధం చేయడంలో ఆరితేరిన వారు. ఘూర్జర దేశస్థులు విలువిద్యలో నైపుణ్యం సంపాదించిన వారు. మాళవదేశస్థులు రథములను ఎక్కి యుద్ధం చేయడంలో నేర్పరులు. ఇంకా యుద్ధంలో ప్రావీణ్యం కలిగిన వారు వివిధ దేశాలలో ఉన్నారు. వారి వారి ప్రావీణ్యముకు తగ్గటుగా వారిని వినియోగించు కోవాలి " అని భీష్ముడు చెప్పాడు.

యుద్ధమందు విజయం[మార్చు]

ధర్మరాజు " పితామహా ! యుద్ధమందు విజయం సాధించాలంటే మన సేనకు ఎలాంటి లక్షణాలు ఉండాలి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఎల్లప్పుడూ ధైర్యంగా ఉత్సాహంగా ఉండే సైనికులు, సకిలించేగుర్రాలు, ఘీంకరించే ఏనుగులు ఉన్న సైన్యము విజయం సాధిస్తుంది. యుద్ధానికి ముందు పక్షులు అటూ ఇటూ తిరుగాడుతుంటే అతి మంచిశకునము. అగ్నిజ్వాలలు కుడి వైపుగా తిరుగుతుండడం మంచి శకునము. కాని ధర్మనందనా ! ఎలాంటి కవ్వింపుచర్యలు లేకుండా యుద్ధానికి కాలుదువ్వే రాజుకు పాపం చుట్టుకుంటుంది. యుద్ధంలో పారిపోయే సైనికులను చంపడం మహాపాపం. మనసైన్యం తక్కువైనా ధైర్యోత్సాహంతో ముందుకు ఉరికిన శత్రుసైన్యం అతి పెద్దది అయినా పారిపోతుంది. రాజుకు ఓర్పు ఉండాలి కాని అది హద్దులు మీరి అతిఓర్పు కాకూడదు. అది అనర్ధదాయకం. శత్రురాజు పొగరు బోతుదనాన్ని అణచడం రాజుకు ఉత్తమ ధర్మం " అని భీష్ముడు చెప్పాడు.

శత్రువు పట్ల ప్రవర్తించ వలసిన తీరు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! రాజు తన శత్రువుపట్ల ఎలానడచుకోవాలి ? " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! అదను చూసి శత్రువును తుద ముట్టించాలి గానీ ఎప్పుడూ తూలనాడ కూడదు. శత్రువును మచ్చిక చేసుకుని అదను చూసి తుదముట్టించాలి కాని శత్రువుపట్ల అప్రమత్తత వహించ రాదు. సంధికుదిరే అవకాశం ఉంటే యుద్ధానికి తలపడ రాదు. తనకు కాలంకలిసి రానప్పుడు శత్రువుకు కాలం కలిసి వస్తున్నప్పుడు సంధి కుదుర్చుకుని అవకాశం దొరొకినప్పుడు శత్రువును హతమార్చాలి. శత్రువును మెల్ల మెల్లగా నది గట్టునుకోస్తున్నట్లు హతమార్చాలి. అంతే కాని దూకుడు తగదు. శత్రు రాజులందరితో ఏక కాలంలో పగ పెంచుకున్నట్లైతే వాళ్ళంతా ఒక్కటై నిన్ను ఓడించగలరు " అని భీష్ముడు చెప్పాడు.

ఓడిపోయిన రాజు పట్ల ప్రవర్తించ వలసినది[మార్చు]

ధర్మరాజు" పితామహా ! ఓడి పోయిన రాజు ప్రవర్తించవలసిన తీరు వివరించండి " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వం కోసలదేశపు రాజు క్షేమదర్శి విదేహదేశపు రాజు చేతిలో ఓడిపోయి అడవులు పట్టి పోయాడు. అక్కడ అతడు తన వద్ద ఇదివరకు మంత్రిగా ఉన్న కాలకవృక్షీయుడిని కలుసుకున్నాడు. కాలకవృక్షీయుడు క్షేమదర్శితో ఇలా చెప్పాడు " రాజా ! సిరిసంపదలు ఉన్నప్పుడు అవి తనవి కాదను కుంటే సిరిసంపదలు ఉన్నా లేకున్నా ఒకే మాదిరి ఉంటారు. మన కళ్ళ ముందే చనిపోతున్న బంధు మిత్రులను మనం కాపాడు లేక పోతున్నప్పుడు మన వద్ద ఉన్న సిరిసంపదలు పోతున్నప్పుడు మాత్రం ఎలా ఎదుర్కొనగలం. పోయిన బంధువులను చింతించినంత మాత్రాన ఎలా పొందలేమో అలాగే పోగొట్టుకున్న సిరిసంపదలను పొందలేమన్న సత్యం గ్రహించి అంతా దైవఘటన అనుకుంటే అంతా సిరిసంపదలు తామంతట తామే మనను వరిస్తాయి లేకున్న ఎంతటి సిరికూడా నిలువదు. కనుక సిరిసంపదలు శాశ్వితం కాదని గ్రహించి సంయమనంతో మెలగాలి. కాలం కలిసి రానప్పుడు శత్రువు తోనైనా మంచిగా మెలగాలి. కాలం కలిసి వచ్చినప్పుడు సైన్యం సమకూర్చుకుని శత్రువును గెలవాలి " అని చెప్పాడు. తరువాత కాలకవృక్షీయుడు విదేహరాజును కలుసుకుని క్షేమర్తితో సంధి చేసుకొమ్మని కోరి ఒప్పించాడు. కోసలరాజు విదేహరాజు వియ్యంతో సంధి చేసుకున్నారు. కనుక ధర్మనందనా ! క్షత్రియుడికి గెలుపు ఓటమి సర్వసాధారణం. కనుక ఓటమికి చింతపడక తరుణోపాయం ఆలోచించాలి " అని చెప్పాడు.

పరిజనాలు, గణజనాలను చూడవలసిన తీరు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! రాజు అంతఃపురంలోని పరిజనాలను కార్యస్థానంలోని గణజనాలను ఎలాపాలించాలో చెప్పండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ధనాగారంలో పని చేసే వారిని, మంత్రాంగం చేసే మంత్రులు, ఆయుధాగారంలో పనిచేసే సైనికులు మొదలైన వారిని గణజనం అంటారు. మిగిలిన వారిని పరిజనం అంటారు. గణజనం అందరూ వివిధకులముల వారు అయినందున వారు కులములవారీగా విడిపోయే అవకాశం ఎక్కువ. వారిలోవారికి మాత్సర్యం కలిగి కలహించుకుంటారు కనుక రాజు అందరినీ సమంగా చూస్తూ కలతలు రాకుండా చూడాలి. లేకున్న అలాంటి వారి వలన రాజ్యానికే చేటు వస్తుంది. గణజనం అందరూ ఐకమత్యంగా ఉంటేనే రాజ్యంలో సుఖశాంతులు ఉంటాయి " అని భీష్ముడు చెప్పాడు.

ధర్మమార్గాలు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ధర్మము నాలుగు విధములు కదా ! అందులో ఏది శ్రేష్టమైనదో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! తల్లి, తండ్రి, గురువు పూజనీయులు. వారిని భక్తితో కొలవవాలి. వారు చెప్పినది ఆచరించండం పరమధర్మం. తల్లి, తండ్రి, గురువు మూడు అగ్నులు, త్రిమూర్తులు, మూడు వేదముల వంటి వారు. వీరందరిలో తల్లి పూజనీయురాలు. సత్యము పలకడం అన్నిటికంటే ఉత్తమధర్మం. అసత్యంపలకడం అధర్మం. కాని ప్రాణరక్షణ కొరకు, ధనరక్షణకు, ప్రజా హితమైనది, ప్రజలకు మేలుచేసేది, ఇతరుల రక్షణచేసేది మొదలైన సమయంలో చెప్పే అసత్యం ధర్మమే ఔతుంది. అలాగే ప్రజలకు కీడుచేసే సత్యం పలుకుట అధర్మమే.

పాప నివృత్తి[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ఎటువంటి వారు తాము చేసిన పాపములను నివృత్తి చేసుకోగలరు " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా పాటించే వారు, విషయాసక్తి లేని వారు, పరాక్రమం ఉండి తమమీద పడిననిందను ఓర్పుతో భరించే వారు, అతిధులను పూజించే వాళ్ళు, వేదాధ్యయనం చేసేవారు, నిత్యాగ్నిహోత్రులు, యుద్ధంలో వెన్ను చూపని వాళ్ళు, నిత్య సత్యవ్రతులు, సాధుజన పోషకులు, అందరు దేవుళ్ళను దేవతలను సమంగా పూజించు వారు చేసిన పాపమును సులువుగా నివృత్తి చేసుకోగలరు. అలాంటి వారిని ఆ మహావిష్ణువు సదా కాపాడుతుంటాడు. సాక్షాత్తు ఆ మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో నీ చెంత ఉన్నాడు కనుక నీకు ఏ పాపము చెంతచేరదు. ఆ పరమాత్మను భక్తితో కొలిచే వారికి ఏలాంటి పాపం అంటదు " అన్నాడు భీష్ముడు.

మానవుల భిన్న ప్రవర్తన[మార్చు]

ధర్మరాజు ! " పితామహా ! చాలామంది లోపల సౌమ్యంగా ఉండి పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. మరి కొందరు లోపల దుర్మార్గంగా ఉండి పైకి చాలా సౌమ్యులుగా కనిపిస్తుంటారు. మరి వారిని గుర్తించడం ఎలాగో వివరించండి " అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు " ధర్మనందనా ! నీవు అడిగిన దానికి నేను ఒక పులి నక్క కథ చెప్తాను. పురిక అనే పురమును పౌరికుడు అనే రాజు పాలించే వాడు. ఆ రాజు చాలాక్రూరుడు. అతడు మరణించిన అనంతరం ఒక నక్కగా పుట్టాడు. పూర్వ జన్మజ్ఞానం కలిగిన ఆ నక్క కనీసం ఈ జన్మలో బాగా బ్రతుకుదామన్న కోరికతో అహింసావ్రతం ఆచరించి ఆకులు అలములు తింటూ చిక్కిశల్యమైంది. అది చూసిన తోటి నక్కలు " ఇదేమి వ్రతం మాంసాహారులం అయిన మనం ఇలా శాకములు తిన వచ్చా ? " అని అడిగారు. అందుకు నక్క బదులు చెప్పలేదు. ఈ విషయం తెలిసిన ఒక పులి నక్క వద్దకు వచ్చి " నక్కా ! నీవు చాలా సౌమ్యుడివి అని విన్నాను. నువ్వు నాతో స్నేహం చెయ్యి లోకం అంతా నన్ను క్రూరుడు అంటున్నది. నీవు నా పక్కన ఉంటే ఆ పేరు సమసి పోతుంది " అని చెప్పింది. " పులిరాజా ! నాకు ఈ లోకంలో ఆశలు లేవు కనుక నా మాటలు నీకు ఇంపుగా ఉండవు అయినా నేను నీ వెంట ఉంటే నీకు నాకు తోచిన మంచి మాటలు చెప్తుంటాను. నాతో నీ స్నేహం నీ వారికి అసూయ రగిల్చి నీ మీద కోపం పెంచుకుంటారు. నీవు అది లక్ష్యం చెయ్యనని నాకు మాటిస్తే నేను నీతో స్నేహం చెయ్యగలను " అన్నది. పులి అందుకు అంగీకరించి నక్కతో స్నేహం చేసింది. అది ఇష్టపడని మిగిలిన పులులు వారిరువురి మధ్య భేదం కల్పించాలని ఒక నాడు పులి తినవలసిన మాంసమును నక్క గుహలో పెట్టాయి. పులి వద్దకు వెళ్ళి నీ మాంసమును నక్క దాచింది కనుక నీవు నక్కను చంపు" అని చెప్పాయి. పులి ఆమాటలను నమ్మి నక్కను చంపమని దేశించింది. కాని పులితల్లి ఆ మాటలు నమ్మక " కుమారా ! నీవు చెప్పుడుమాటలు విని తప్పు చేస్తున్నావు. నక్కను గురించి తెలియక నీవు దాని మీద నింద వేస్తున్నావు. కాని నక్క నీ వారి మీద ఇలాంటి మాటలు చెప్పిందా ! నీ సేవకులు పుట్టుకతోనే మోసగాళ్ళు వారి మాటలకు వినవద్దు. బుద్ధి మంతులను చూసి బుద్ధిహీనులు, అందగాళ్ళను చూసి అందహీనులు, అధికులను చూసి హీనులు అసూయ చెందడం సహజం. రాజువైన నీవు తొందర పడకూడదు. కుమారా ! ఒక్కోసారి ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. తెలివి కలవాడు వాటి తారతమ్యం ఎరిగి నడవాలి. నక్క గురించి నీకు బాగా తెలుసు. ఆ నక్క కేవలం మాంసం కొరకు నన్ను వంచిస్తుందా. నీ సేవకుల మాటలు నమ్మి నక్కను చంపమని చెప్పడం భావ్యమా ! రాజైన వాడు కూలంకుషంగా విచారించి నిర్ణయించాలి కాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు " అని తల్లిపులి బోధించింది. ఆ తరువాత అక్కడకు వచ్చిన నక్క జరిగినది తెలుసుకుని " పులిరాజా ! నన్ను ముందు అందరి ఎదుట మంచి వాడని మెచ్చుకున్నావు. నాతో స్నేహం చేసే ముందు నీ వారి చెప్పుడు మాటలు వినను అని చెప్పి ఇప్పుడు వారి మాట విని నన్ను చెడ్డ వాడని నమ్మావు. నీవు మాట తప్పావు కనుక నేను ఇక్కడ ఉండడం భావ్యం కాదు నేను ఇక వెడతాను " అని చెప్పి నక్క అక్కడ నుండి వెళ్ళి నిరాహార దీక్షచేసి ప్రాణత్యాగం చేసి పుణ్య లోకాలకు వెళ్ళింది. కనుక ధర్మరాజా ! రాజు చెప్పుడు మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకొన రాదు. చక్కగా విచారించి నిర్ణయాలు తీసుకోవాలి " అని చెప్పాడు.

రాజు ప్రవర్తన[మార్చు]

ధర్మరాజు " పితామహా ! రాజైన వాడు ఎలా ప్రవర్తిస్తే సుఖపడతాడు ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! రాజు ఏపని ఆలస్యం చేయకూడదు. ఈ కార్యం నేను చెయ్య లేనని నీరస పడకూడదు. ఈ రెండు లక్షణములు లేని రాజు సుఖపడతాడు. పూర్వం ఒక ఒంటె బ్రహ్మదేవుడిని గురించి తపమాచరించి బ్రహ్మదేవుడిని అడిగి తన మెడ నూరు యోజనముల దూరం సాగాలని వరంపొందింది. అప్పటి నుండి ఆ ఒంటె ఉన్న చోటున ఉండి మెడచాచి ఆహారం తింటూ సుఖంగా ఉండ సాగింది. అలా ఆహారం తింటుండగా ఒక రోజు వానవచ్చింది ఆ ఒంటె తన తలను ఒక గుహలో దూర్చింది. అంతలో బాగా ఆకలిగా ఉన్న ఒక నక్క దాని భార్యా అక్కడకు వచ్చి అక్కడ కనిపించిన ఒంటె తలను చూసి దాని మెడ పట్టి కొరికితిని ఆకలి తీర్చుకున్నాయి. కనుక ఏ పైనిలోనైనా అలసత్వం పనికి రాదు ధర్మనందనా !" అన్నాడు.

శత్రు రాజు బలం[మార్చు]

ధర్మరాజు " పితామహా! శత్రురాజు బలం అధికంగా ఉంటే కొద్దిగా సైన్యం ఉన్న రాజు అతడితో ఎలా యుద్ధం చెయ్యగలడు? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఒక సారి సముద్రుడు నదులతో ఇలా అన్నాడు. ఓ నదులారా ! మీరు ఒక్కో సారి ఉధృతంగా గట్లను ఒరుసుకుని ప్రవహించే సమయంలో మహావృక్షాలు సైతం కూకటి వేళ్ళతో పెళ్ళగించుకుని పడి పోతుంటాయి. కాని గట్టున ఉన్న గడ్డి దుబ్బులు అలాగే ఉంటాయి ఏమి కారణం ? " అని ఆడిగాయి. దానికి నదులు " సాగరోత్తమా ! గట్టున ఉన్న వృక్షాలు నిటారుగా పొగరుగా నిలబడతాయి కనుక అవి సమూలంగా కొట్టుకు పోతాయి. కాని గడ్డి దుబ్బులు మాత్రం ప్రవాహానికి అనుకూలంగా తల వంచి ప్రవాహం తగ్గగానే తల ఎత్తుతాయి కనుక అవి సురక్షితంగా ఉంటాయి " అని చెప్పాయి. కనుక ధర్మనందనా ! బలహీనుడైన రాజు తనబలం శత్రువుబలం ముందుగా అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి కాని మూర్ఖంగా యుద్ధానికి దిగకూడదు " అని చెప్పాడు.

ఉన్నత పదవులు[మార్చు]

ధర్మరాజు ! " పితామహా ! నా రాజ్యంలో ఉన్నత పదవులలో నియమించుటకు తగిన జనం లభించని ఎడల నేను ఏమి చేయాలి ? " అని ఆడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు ఒక కథ చెప్తాను. పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. అతడి ఆశ్రమంలో సాధు జంతువులు క్రూరజంతువులు సఖ్యతగా ఉండసాగాయి. ఆ మునితో ఎప్పుడూ ఒక కుక్క ఉండేది. అది చూసి సహించలేని ఒక పులి దాని మీద పంజా విసరబోయింది. ఆ కుక్క ముని వెనుక దాగింది. అది చూసి ముని ఆ కుక్కను పులిగా మార్చాడు. అది చూసి అసలు పులి పారిపోయింది. ఇంకొక సారి ఒక ఏనుగు దాని మీద దాడి చేసింది. ముని కుక్కను ఏనుగుగా మార్చి కాపాడాడు. ఇలా ఏ జంతువు దాడి చేస్తే ఆ జంతువుగా మార్చి దానిని రక్షించసాగాడు. అది చూసిన కుక్క " నా మీద జాలితో ఈ ముని ఈ విధంగా నన్ను మార్చుతున్నాడు కదా ! ఇలా ఇంకొక జంతువు మీద జాలి పడి దానిని మార్చి నా మీద వదిలితే నా గతి ఏమి కావాలి ? కనుక ఎలాగైనా ఈ మునిని చంపాలి " అని అనుకుంది. అది తన దివ్యచక్షువులతో గమనించిన ముని ఎంతైనా ఈ కుక్క తన నీచప్రవర్తన వదలలేదు అనుకుని దానిని మామూలు కుక్కగా మార్చాడు. అది వివిధ జంతువులుగా మారే శక్తినికోల్పోయింది. కనుక ధర్మనందనా ! దుష్టులకు ఉన్నత పదవులు ఇవ్వరాదు. వారి వారి యోగ్యతను బట్టి ఉన్నత, మధ్య, హీన పదవులను ఇచ్చి గౌరవించాలి. శౌర్యమూ, పరాక్రమమూ, సత్యమూ, భక్తి, సత్కార్యములు చేయు బుద్ధి, గంభీర్యము కల వాడు హీన కులజుడైనా ఉన్నత పదవులకు అర్హుడు. అతడికి కులంతో పనిలేదు. సింహం ఎప్పుడూ తోటి సింహాలతో చేరి పని చేస్తుంది కాని కుక్కలతో చేరి పని చెయ్యదు. పరిజనమునకు కులమూ నేర్పరితనం రెండూ ఉండాలి. నేర్పు, భక్తి కలిగిన సేవకులున్న రాజు ఏ కార్యమైనా సాధించగలడు. రాజు కూడా పరాక్రమం కలిగి ఉండాలి కాని పిరికితనం పనికి రాదు. రాజు తన పరిజనంతో కలిసి గూఢచర్యం నడిపాలి. అంతఃపురంలో చారులను నియమించి ఎప్పటికప్పుడు అంతఃపుర రహస్యములను తెలుసుకోవాలి " అని చెప్పాడు.

దండనీతి[మార్చు]

ధర్మరాజుతో భీష్ముడు దండనీతిని గురించి ఇలా చెప్పసాగాడు. ధర్మనందనా ! ఈ దండనీతి గురించి చెప్తాను విను. ఈ దండనీతిని సజ్జనులను రక్షించుటకు దుర్జనులను శిక్షించుటకు ఉద్దేశించబడింది. సాక్షాత్తు విష్ణుమూర్తి దండనీతి రూపంలో ఉంటాడు. దండనీతిలో విష్ణువు ఉన్నప్పుడు ధర్మపాలుడనీ, ధర్ముడనీ, విజయుడనీ, రక్షించేవాడని, శిక్షించేవాడనీ రకరకాల పేర్లతో పిలుస్తారు. దండనీతిని సక్రమంగా పాటించకపోతే అధర్మము, అవినీతి, పిరికితనం, దుఃఖం, నష్టము కలుగుతాయి. దండనీతిని సక్రమంగా పాటిస్తే ధర్మం, సుఖం, నీతి, లాభములు, బలము, రక్షణ కలుగుతాయి.

దండ నీతి ఉత్పన్నం[మార్చు]

ధర్మనందనా ! దండనీతి ఉద్భవించిన తీరు వివరిస్తాను విను. పూర్వం అంగదేశరాజు వసుహోముడు భార్యాసమేతంగా హిమాలయ పర్వతానికి వెళ్ళి అక్కడ మునిజనాలను సేవిస్తూ కాలం గడుపుతున్నాడు. ఒక రోజు మంధా అనే మహారాజు అతడి వద్దకు వచ్చి తనకు దండనీతిని గురించి చెప్పమని అడిగాడు. వసుహోముడు " ఒక సారి బ్రహ్మదేవుడు యాగం చెయ్య తలపెట్టాడు. అందు కొరకు ఒక మంచి ఋత్విక్కు కొరకు వెతికి ఎక్కడా దొరకక తన తుమ్ము నుండి ఒక ఋత్విక్కును పుట్టించాడు. అతడి పేరు క్షతుడు, క్షతుడిని ఋత్విక్కుగా పెట్టుకుని బ్రహ్మదేవుడు యజ్ఞం చెయ్యసాగాడు. తరువాత బ్రహ్మ విష్ణువును తీసుకుని ఈశ్వరుడి వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఈశ్వరుడు దండనీతిని సృష్టించి దానిని ముందు తానే అధ్యయనం చేసాడు. నాలుగు వేదములు, ఆరు వేదాంగములు, పురాణములు, ధర్మశాస్త్రములు, న్యాయశాస్త్రము, మీమాంస, వైద్యము, ధనుర్వేదము, గాంధర్వము, అర్ధశాస్త్రము అను పద్దెనిమిది విద్యలను లోక ప్రయోజనం కొరకు సృజించి వాట్ని విష్ణుమూర్తికి అప్పగించాడు. వాటిని బ్రహ్మ తుమ్ము నుండి పుట్టిన క్షతుడి ద్వారా ప్రపంచంలో వ్యాప్తి చేసాడు. తరువాత విష్ణువు తన ఆధీనములో ఉన్న దండ నీతిని అంగీరసుడికి, అంగీరసుడు ఇంద్రుడికి, ఇంద్రుడు మరీచికి, మరీచి భృగువుకు, భృగువుఅనేక మంది మునులకు చెప్పి అధ్యయనం చేయించాడు. దండనీతి ఆ విధంగా లోకంలో విస్తరిఉంచింది. దండనీతిని సమర్ధవంతమైన పనులు చేసిన రాజు ఇహపర సుఖములను పొందుతాడు " అని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు.

ధర్మం కామం అర్ధం[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ధర్మము, అర్ధము, కామము గురించి వివరించండి. భీష్ముడు " ధర్మరాజా ! ఇది వరకు కామందుడు అనే ముని ఆంగరిష్ఠుడను రాజుకు చెప్పిన విషయములు నీకు చెప్తాను విను. ఎల్లపుడూ కామము కొరకు దాని వలన వచ్చు సుఖముల కొరకు పాకులాడే వాడికి ధర్మము, అర్ధము ఆచరణ సాధ్యములు కావు. అలాంటి వాడు కష్టముల పాలు ఔతాడు. అతడి వద్దకు స్నేహితులు చేరరు. చివరకు మృత్యువు కబళిస్తుంది. ధర్మాచరణకు అర్ధము అవసరం కాని రాజు ధనసంపాదనలో ధర్మం తప్పరాదు. కామ సంబంధిత కోరికలు విడిచి తక్కిన కోరికలు అనుభవించు రాజు మహోన్నతుడౌతాడు. కనుక ధర్మరాజా ! ధర్మము అర్ధము గొప్పవి " అని భీష్ముడు చెప్పాడు.

శీలం[మార్చు]

ధర్మరాజు " పితామహా ! మనిషికి శీలం ముఖ్యం కదా ! శీలం గురించి దానిస్వరూప స్వభావాలను వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నువ్వు నీ తమ్ములు ఇంద్రప్రస్థంలో సుఖంగా ఉన్న రోజులలో సుయోధనుడు అసూయతో రగిలి పోయాడు. నీవు చేసిన రాజసూయ యాగమును, నీకున్న మయ సభను చూసి ఓర్వ లేక పోయాడు. నీకు పట్టిన అదృష్టముకు అసూయపడి తన తండ్రి దృతరాష్ట్రుడి వద్ద చెప్పుకుని దుఃఖించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సుయోధనుడితో " కుమారా ! నీకున్న ఐశ్వర్యంలో ధర్మరాజుకు ఉన్న ఐశ్వర్యం తక్కువే. కాని ధర్మరాజుకు మంచి శీలం ఉంది. నీకు అది లేనిది. ధర్మరాజు ధర్మసంపన్నుడు కనుక నీకు సంపన్నుడిలా కనపడు తున్నాడు. నీవు మంచిప్రవర్తన అలవరచు కుంటే నీకున్న సంపద గుర్తించగలవు. నీ పూర్వీకులైన మాంధాత, నా భాగుడు మొదలైన చక్రవర్తులు తమ శీలసంపద చేత గౌరవాభిమానాలు పొందారు.

ప్రహ్లాదుని శీలం[మార్చు]

భీష్ముడు శీలం గురించి చెప్తూ " ధర్మనందనా ! పూర్వం ప్రహ్లాదుడు తన శీలసంపదతో ఇంద్రుడిని జయించాడు. ముల్లోకాలను ధర్మబద్ధంగా స్వాధీనపరచు కున్నాడు. అప్పుడు ఇంద్రుడు బృహస్పతి వద్దకు పోయి తిరిగి తన రాజ్యమును తిరిగి తన రాజ్యమును సంపాదించుకునే ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు బృహస్పతి ఇంద్రుడిని శుక్రాచార్యుడి వద్దకు పంపాడు. ఇంద్రుడు శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి తనకు మేలు కలిగే ఉపాయం చెప్పమని వేడుకున్నాడు. శుక్రాచార్యుడు ఇంద్రుడిని ప్రహ్లాదుడి వద్దకు పంపాడు. ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో ప్రహ్లాదుడి వద్దకు వెళ్ళి శిష్యరికం చేయసాగాడు. అతడి భక్తిశ్రద్ధలకు మెచ్చి ప్రహ్లాదుడు ఏమి కావాలని అడిగాడు. ఇంద్రుడు " ప్రహ్లాదా నీవు ఇంద్రుడిని ఎలా గెలిచావు " అని అడిగాడు. ప్రహ్లాదుడు విప్రోత్తమా ! నేను రాజును అనే గర్వంతో ఎవరిని అగౌరవపరచ పరచను. అందరికీ దాన ధర్మములు చేస్తుంటాను. బ్రాహ్మణులను ఆదరిస్తుంటాను. నా శీలమే నన్ను గొప్ప వాడిని చేసి నాకు విజయము చేకూర్చింది " అని చెప్పాడు. ఇంద్రుడు " ప్రహ్లాదా ! నాకు నీ శీలం దానంగా ప్రసాదించు " అని అడిగాడు. ప్రహ్లాదుడు కాదనక తన శీలమును ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు. ఇంద్రుడు శీల సంపన్నుడై వెళ్ళి పోయాడు. అప్పుడు ప్రహ్లాదుడి నుండి ఒక తేజో రూపము బయటకు వచ్చింది. అది ప్రహ్లాదుడి ప్రశ్నకు బదులిస్తూ " నేను నీ శీలాన్ని నిన్ను నన్ను నీవు ఇంద్రుడికి దానంగా ఇచ్చావు కనుక నేను నిన్ను విడిచి అతడి వెంట పోతున్నాను " అని బదులిచ్చింది. అతడి వెంట ధర్మము, సత్యము, మంచి ప్రవర్తన, బలము మొదలైన మంచి లక్షణములు తేజో రూపములతో ప్రహ్లాదుడిని విడిచి ఇంద్రుడి వెంట వెళ్ళారు. చివరకు ఒక స్త్రీ ఆకారం బయటకు వచ్చింది ఆమెను చూసి ప్రహ్లాదుడు నీవు ఎవరని అడిగాడు. అందుకు ఆమె " నేను సిరిని బలము ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను " అని చెప్పి వెళ్ళసాగింది. ప్రహ్లాదుడు " అమ్మా ! కొంచెం ఆగు నా వద్ద నాశీలం దానంగా స్వీకరించింది ఎవరు " అని అడిగాడు. ఆమె " ప్రహ్లాదా ! ఇంద్రుడే నీవద్ద పోగొట్టుకున్న స్వర్గాధిపత్యం తిరిగి సంపాదించే నిమిత్తం నీ వద్ద శిష్యరికం చేసి నీ శీలాన్ని దానంగా పొందాడు. ప్రహ్లాదా ! మనిషికి శీలం ప్రదానమైంది. శీలం వలన ధర్మం, ధర్మం వలన సత్యము, సత్యము వలన, మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన వలన బలం వర్ధిల్లుతాయి. కనుక సమస్త సంపదలకు శీలం మూలము " అని చెప్పి సిరి ఇంద్రుడి వద్దకు పోయింది. ఇది విన్న సుయోధనుడు " అసలు శీలం అంటే ఏమిటి ? " అని తండ్రిని అడిగాడు. ధృతరాష్ట్రుడు " త్రికరణ శుద్ధిగా పరుల ఎడ ద్రోహచింతన లేకుండుట, సమస్త భూతములను సమానంగా చూచుట, సిగ్గుపడవలసిన పనులు చేయకుండుట, పరులకు హాని చేయకుండుట, జనులకు ప్రియమైన కార్యములనే చేయుట ఇటువంటి నడవడిని శీలం అంటారు. శీలం ఉన్న వాడికి అపజయం ఉండదు " అని చెప్పాడు. ధర్మనందనా ! నీకు శీలం జన్మతః వచ్చింది. నేను శీలం గురించి చెప్పినది విన్నావు కనుక సచ్ఛీలవంతుడవై మెలగుము " అన్నాడు.

ఆశ దుఃఖం[మార్చు]

ధర్మరాజు " ఔను పితామహా ! ఆశకు అంతులేదు అది అనంతము. ఆశపడినది అందక పోయిన అమిత దుఃఖంకలుగుతుంది. సుయోధనుడితో సఖ్యతగా ఉండాలని ఎంతో ప్రయత్నించాను. అతడు నా మాట వినక నన్ను యుద్ధం చేయవలసిన పరిస్థితిలో పడవేసాడు. అందుకు నేను చాలా బాధపడు తున్నాను. ఆశలు అణుచుకోవడం అరుదు కదా ! " అన్నాడు ధర్మరాజు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో ఒక కథ చెప్తాను. హైహయ దేశపు రాజు సుమిత్రుడు ఒక రోజు వేటకు వెళ్ళి ఒక మృగమును కొట్టాడు. దెబ్బ తిన్న ఆ మృగం పారి పోయింది. సుమిత్రుడు మృగం వెంట పరిగెత్తి అలిసి పోయి ఒక ముని ఆశ్రమం చేరుకున్నాడు. ముని కుమారుడు అతడికి త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు. రాజు సేద తీరగానే ఆముని " రాజా ! ఏపని మీద వచ్చావు ? ఎందుకు దిగులుగా ఉన్నావు ? " అని అడిగాడు. రాజు " మునీశ్వరా ! నేను వేట నిమిత్తమై ఈ అడవికి వచ్చి ఒక జింకను వేటాడాను అది తప్పించుకు పారి పోయింది. దానిని తరుముతూ వచ్చి చిక్కక నిరాశతో అలసటతో ఇక్కడకు వచ్చాను " అని చెప్పాడు. ఆముని " రాజా ! నేను ఒక సారి తీర్ధయాత్రల నిమిత్తం బదరికాశ్రమం వెళ్ళాను. నేను అక్కడ కృశించిన శరీరం కలిగిన తనుడు అనే మునిని చూశాను. భక్తితో నమస్కరించిన నాకు అతడు అతిథిసత్కారాలు చేసాడు. అంతలో అక్కడకు ఒక రాజు వచ్చాడు. ఆ ముని, రాజు రాకకు కారణం అడుగగా అతడు " నాకు ఒక గుణవంతుడైన కుమారుడు ఉన్నాడు. అతడు ఒక సారి వేటకువెళ్ళి తిరిగి రాలేదు. అతడిని వెతుక్కుంటూ ఆశగా ఇక్కడకు వచ్చాను. నా ఆశతీరేలా లేదు నా మనసు ఎలా తట్టుకోగలదు మునీంద్రా " అన్నాడు. ముని " రాజా స్థిరచిత్తంతో చేసే కార్యము విజయవంతం ఔతుంది. ధనం కొరకు యాచించిన అవమానం ఎదుర్కొన కుండా పొంద లేరు. ఆశ పడడంలో తప్పు లేదు కానీ అది నెరవేరక పోతే దుఃఖించ కూడదు. కర్తవ్యం చేయాలి కానీ ఫలితం గురించి దుఃఖించ కూడదు. నీ కుమారుడిని నేను ఇస్తానని లోపలకు వెళ్ళి తన తపోమహిమతో రాజ కుమారుడిని తెచ్చి ఇచ్చాడు " అని చెప్పి " రాజా ! వేటకువెళ్ళడం తప్పుకాదు కాని దాని వెంట పరుగెత్తి నిరాశపడి దుఃఖించడం సరికాదు. కనుక మదిలోమృగాన్ని వదిలి రాజధానికి వెళ్ళు ఇక అనవసరంగా వేటకు వెళ్ళకు " అని చెప్పాడు. కనుక ధర్మనందనా ! ఆశ పడటం తప్పు కాదు కానీ ఆశ నెరవేరక పోయిన నిరాశతో అక్రమాలు చేయకూడదు. మనిషికి రాజుకు ధనం అవసరమే కానీ అది ధర్మబద్ధంగా సంపాదించినప్పుడే శాంతి లభిస్తుంది. ధన సంపాదనకు అకృత్యాలు చేయక ప్రజల నుండి సానుకూలంగా ధనం రాబట్టాలి. రాజు తాను అందరి కంటే ధనవంతుడు కావాలని తన శక్తికి మించి ధనార్జన చేస్తే అది అనర్ధాలకు దారి తీస్తుంది. అది అసలుకు ముప్పు తెచ్చి ప్రాణాలను హరించగలదు. అలాగని ధనం ఆర్జించక ఊరకున్న లోకులు గౌరవించరు. దొంగలను దోపిడీదారులను సైన్యంలోకి తీసుకుంటే అవస్థలు రావడమే కాకుండా అధర్మపరులున్న రాజు విజయాన్ని సాధించ లేడు.

వేటగాడి ధర్మం[మార్చు]

పూర్వము పారియాత్ర పర్వతము మీద ఒక వేటగాడు ఉండేవాడు. అతడి పేరు కాపవ్యుడు. అతడి వృత్తి వేటాడటమే అయినా న్యాయాన్ని, ధర్మాన్ని చక్కగా ఆచరించే వాడు. తల్లి తండ్రులను పూజించే వాడు. మున్యాశ్రమాలలోని మునులకు కంద మూలాలను సమర్పించే వాడు. అక్కడ ఉన్న వేటగాళ్ళందరూ అతడిని తన నాయకుడిగా ఎన్ను కోవాలనుకొని " నీవు అత్యంత బలవంతుడివి, ధర్మాత్ముడివి కనుక నీవు మా అందరికి నాయకుడివిగా ఉండాలి. మేము నీ ఆజ్ఞాను వర్తులం కావాలని అనుకుంటున్నాము " అని అడిగారు. అందుకు కాప్యుడు " నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. స్త్రీలను, పిల్లలను చంపకూడదు, వారికి హాని చేయకూడదు. ఆడ జంతువులను వేటాడకూడదు. గోబ్రాహ్మణులను రక్షించాలే కాని వారికి హాని చేయ కూడదు. పంట పొలాలను నాశనం చేయ కూడదు. ప్రజలను బాధించి మనం బాగు పడకూడదు. మీరు ఇలా నడుచుకుంటానని నాకు మాట ఇస్తే నేను మీ నాయకుడిగా ఉంటాను " అని చెప్పాడు. అందుకు వారు సంతోషించారు అలాగే మాట ఇచ్చి అతడిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అలా కాపవ్యుడు దొంగతనంతో వేటతో జీవిస్తున్న వారిని సజ్జనులను చేసాడు.

మూడు చేపల కథ[మార్చు]

భీష్ముడు ధర్మరాజుకు తరువాత మూడు చేపల కథ చెప్పాడు " ధర్మనందనా ! ఒక మడుగులో మూడు చేపలు ఉన్నాయి. వాటి పేర్లు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘ సూత్రుడు. ఇంతలో వేసవి కాలం వచ్చింది. ఎండకు ఆ చెరువులో నీళ్ళు ఇంకి పోసాగాయి. అది చూసిన దీర్ఘదర్శి " మిత్రులారా ! మనం ఉన్న చెరువులో నీళ్ళు ఇంకి పోతున్నాయి. ఇప్పుడే నీరు బాగా సమృద్ధిగా ఉన్న వేరు చెరువులోకి పోదాము " అని చెప్పింది. అందుకు ప్రాప్త కాలజ్ఞుడు " నీతో నేను ఏకభవించను. చెరువు ఎండి పోయినప్పుడు ఆలోచించాలి కాని ఇప్పటి నుం, డే ఎందుకు దిగులు పడాలి. దీర్ఘ సూత్రుడు " చెరువులో నీళ్ళు సమృద్ధిగా ఉన్నప్పుడే ఇలాంటి ఆలోచన ఎందుకు. ఎండి పోయినప్పుడు చూడచ్చులే " అన్నది. దీర్ఘ దర్శి తన ప్రయత్నం తాను చేసుకుని వేరు చెరువుకు పోయింది. వేసవి తీవ్రమై ఎండ తీవ్రతకు చెరువులోని నీరు పూర్తిగా ఎండి పోయాయి. జాలర్లు చేపలు పట్టడానికి చెరువుకు వచ్చారు. అప్పుడు ప్రాప్త కాలజ్ఞుడు ఆలోచించి ఒక జాలరి వలలో చచ్చిన చేపలా పడి ఉన్నాడు. ఆ జాలరి ఆ చేపలను గట్టు మీద పెట్టాడు. ప్రాప్తకాలజ్ఞుడు ఎగిరి పక్కనే ఉన్న బురద గుంటలోకి గెంతి దాక్కున్నాడు. దీర్ఘ సూత్రి మాత్రం ఏ ఉపాయం లేకుండా జాలరి వలలో పడి చనిపోయాడు. రాబోయే ఆపదను ముందుగా పసి కట్టి తప్పించుకున్నాడు నీతి మంతుడైన దీర్ఘదర్శి తప్పించుకున్నాడు. అప్పటికప్పుడు ఉపాయం ఆలోచించి సందేహ ప్రాణి అయిన ప్రాప్తకాలజ్ఞుడు తప్పించుకున్నాడు. ముందు చూపు కాని ఉపాయం కానీ లేని దీర్ఘసూత్రుడు వలలో చిక్కి ప్రాణాలు వదిలాడు " అని చెప్పాడు భీష్ముడు.

పలితుడు రోజశుల స్నేహం[మార్చు]

ధర్మరాజు భీష్ముడితో " పితామహా ! తన శత్రువుల చేతిలో చిక్కి బలం కోల్పోయిన రాజు తన కష్టముల నుండి ఎలా గట్టెక్కుతాడో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! ఈ సందర్భంలో ఒక కథ చెప్తాను విను. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది. దాని మొదట్లో ఫలితుడు అనే ఒక ఎలుక నివసిస్తుంది. ఆ చెట్టుమీదే రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తుంది. ఒక బోయ వాడు ప్రతి రోజూ రాత్రి ఆ చెట్టు సమీపంలో ఒక వల పెట్టే వాడు. ఉదయం వచ్చి దానిలో పడిన పక్షులను పట్టుకు పోయే వాడు. ఆ వలలో ఒక రోజు చెట్టు మీది పిల్లి అను కోకుండా చిక్కు కుంది. పిల్లి వలలో పడడంతో ఎలుక నిర్భయంగా బయటకు వచ్చి ఆహారం కొరకు వెదుకుతూ ఉండగా అది ఒక ముంగిసను, గుడ్లగూబను చూసింది. ఎలుకకు పైప్రాణాలు పైనే పోయాయి. వెంటనే ఒక ఉపాయం స్పురించి వలలో ఉన్న పిల్లిని సమీపించి దాని పక్కనే కూర్చుని " ఓ మార్జాలమా ! నేను నీ వల కొరికి నిన్ను రక్షిస్తాను నువ్వు నన్ను గుడ్లగూబ, ముంగిసల బారి నుండి రక్షించు. పిల్లి " మూషికమా ! నీకు పరులకు ఉపకారం చేసే గుణం ఉండడం నాకు ఆనందం కలిగిస్తుంది. నేను నిన్ను రక్షిస్తాను నన్ను చూస్తే ముంగిస, గుడ్లగూబ భయ పడతాయి. కనుక నన్ను విడిపించు " అని చెప్పింది. ఎలుక పిల్లి పక్కన చేరింది అది చూసి ముంగిస గుడ్లగూబ పారి పోయాయి. పిల్లి " ఇక తాళ్ళు కొరికి నన్ను విడిపించు " అన్నది. ఎలుక " ఉండు తొందరపడకు " అని వెళ్ళి దూరంగా కూర్చుంది. పిల్లి " మూషికమా ! నీను నీ

ధర్మరాజుకు నమ్మదగినవారి గురించి చెబుతున్న భీష్ముడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

ప్రాణాలు కాపాడాను కదా నీవు ఇలా ఉపేక్షించ తగునా ! " అన్నది. ఎలుక " మార్జాలమా ! రేపు బోయవాడు కనిపించిన తరువాత త్వరగా వల తాళ్ళను కొరికి నిన్ను విడిపిస్తాను. ఇప్పుడు విడిపిస్తే నన్ను నీవు భక్షంచవచ్చు. బలవంతులతో స్నేహం చేసేటప్పుడు తగు జాగర్తలో ఉండడం మంచిది " అన్నది. తెల్లవారిన పిదప బోయవాడిని అల్లంత దూరంలో చూసిన ఎలుక గబగబా వల తాళ్ళను కొరికింది. బోయవాడికి భయపడి పిల్లి చెట్టెక్కింది ఎలిక కలుగులో దూరి తల కొంచెం బయట పెట్టి జరిగేది చూస్తూ ఉంది. బోయ వాడు వల చూసి నిరాశతో వెళ్ళి పోయాడు. పిల్లి కిందకు వచ్చి ఎలుకతో " మిత్రమా ! నేను నిన్ను కాపాడాను కాని నువ్వు నన్ను నమ్మ లేదు. మనమిరువురం స్నేహం చేద్దాము " అన్నది. ఎలుక " మార్జాలమా ! నీవు చెప్పింది నిజమే అయినా మిత్రువు శత్రువుగా మార వచ్చు. శత్రువు అవసరాన్ని బట్టి మిత్రుడవచ్చు. కనుక ఎవరు ఎప్పుడు మిత్రుడౌతాడో ఎప్పుడు శత్రువు ఔతాడో తలుసుకోవడం కష్టం. నువ్వు నాకు చేసిన సాయం నేను నీకు సాయం చేసి తీర్చుకున్నాను. అంతటితో చెల్లి పోయింది. బలంతులతో అవసరార్ధం స్నేహం చేసినా కార్యం ముగిసిన పిదప వదిలి వేయకున్న ఆపదలు ఎదురు ఔతాయి. కనుక మనం ఎవరి దారి వాళ్ళము చూసుకుంటాము. అవసరమైనప్పుడు ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటాము. భగవంతుడు నన్ను నీకు ఆహారంగా సృష్టించాడు కనుక నీవు ఎప్పుడో ఒక సారి నన్ను చంపక మానవు. ఒక వేళ నీవు విడిచినా నీ కుమారులు, బంధువులు నీ మనసు మార్చవచ్చు. రాత్రంతా ఆకలిగా ఉన్న నీ సమక్షానికి వస్తే నీవు నన్ను తినేస్తావు నేను నీ వద్దకు రాలేను " అన్నది. పిల్లి " ఎలుకా నా ప్రాణ రక్షణ చేసిన నిన్ను నేను ఎలా చంపగలను. " అన్నది. ఎలుక " నీవు నన్ను రక్షించావు నేను నిన్ను రక్షించాను అది చాలు నేను నీ దగ్గరకు రాతగదు. మార్జాలమా ! శుక్ర నీతి ఇలా ఉంది. బలవంతుడైన శత్రువుతో అవసరార్ధం చేసే స్నేహాన్ని వెంటనే విడువకున్న ఎప్పటికైనా శత్రువు వలన ఆపద కలుగ వచ్చు కనుక సాయం చేసాడని శత్రువును గుడ్డిగా నమ్మ కూడదు. నమ్మ కూడని వారిని నమ్మక ఉండడమే కాక నమ్మ తగిన వారిని మితంగా నమ్మాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మడం తగదు. ఎంతటి మిత్రులనైనా నమ్మినట్లు నటిస్తూనే నమ్మక ఉండడమే రాజ నీతి " అన్నది. కనుక ధర్మనందనా ! బలవంతుడైన శత్రువును బలహీనుడైన ఇంకొక రాజుతో తాత్కాలిక స్నేహం చేసి ఎదిరించాలి. అంతే కాని శత్రువుతో స్నేహం మాత్రం పొడిగించ రాదు " అని చెప్పాడు.

విశ్వదించతగిన వారు[మార్చు]

యుధిష్టురినికి బ్రహ్మదత్తుడు చిలుక కథను చెపుతున్న భీష్ముడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

ధర్మరాజు " పితామహా ! ఎవరిని నమ్మితే మనశ్శాంతి కలుగుతుంది. ఎవరిని నమ్మితే కష్టాలపాలౌతాము. అందరినీ నమ్మతగునా ! లేక ఎవరినీ నమ్మ తగదా ! " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము బ్రహ్మదత్తుడు అనే రాజు ఒక చిలుకను పెంచి దానితో స్నేహంగా ఉండ సాగాడు. ఆ చిలుకకు ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్లతో రాజ కుమారుడు ఆడుకుంటూ ఉండే వాడు. ఆ చిలుక తన పిల్లతో సమానంగా రాజకుమారుడిని చూడసాగింది. ఒక రోజు చిలుక బయటకు వెళ్ళిన సమయంలో రాజకుమారుడు ఆ చిలుక పిల్లను చంపేసాడు. తిరిగి వచ్చిన చిలుక ఏడుస్తూ " ప్రతి రోజూ పండ్లు ఫలాలు తెచ్చి తన బిడ్డతో సమానంగా చూసినందుకు రాజకుమారుడు నిర్ధాక్షిణ్యంగా చంపేసాడు. రాజ బిడ్డలకు జాలి దయా ఉండవేమో నాకు మాత్రం జాలి ఎందుకు ఉండాలి అని రాజకుమారుడి కళ్ళని తన వాడి అయిన గోళ్ళతో పొడిచి గుడ్డి వాడిను చేసి రాజు ముందు నిలిచి " రాజా నీ బిడ్డ నిర్ధాక్షిణ్యంగా నా బిడ్డను చంపి పాపం చేసి ఫలితం అనుభవిస్తున్నాడు కనుక ఇక నేను ఇక్కడ ఉండడం తగదు కనుక నేను వెళ్ళి పోతున్నాను " అని పలికింది. ఆ రాజు " చిలుకా ! నీవు ఏ పాపం చేయ లేదు కనుక నీకు పాపం అంటదు. నీవు వెళ్ళకు మనం ఎప్పటిలా స్నేహంగా ఉంటాము " అన్నాడు. చిలుక " రాజా నేను నీ కుమారుడి కళ్ళొ పొడిచినందుకు నీకు నా మీద అంతర్లీనంగా కోపం ఉండకపోదు. కనుక నీతో స్నేహం నాకు ఆపత్కరం. కనుక మన స్నేహం అసంభవం " అని చెప్పింది. రాజు " చిలుకా ! నీ పిల్లను నా కొడుకు చంపినందుకు ప్రతిగా నీవు నా కుమారుడి కళ్ళు పొడిచావు కనుక ఆ విషయం అంతటితో తీరింది. నేను నీ వంటి మంచి స్నేహం వదల లేను " అన్నాడు. చిలుక " రాజా ! ఒక సారి స్నేహం చెడి పోయిన తరువాత తీయని మాటలతో ఆ పగ మరచినా చివరకు కీడు రాక మానదు. రాజా ! పగ అయిదు రకాలుగా ఉంటుంది. పరుల భూములు ఆక్రమించుకోవడం వలన కాని దాయాదుల మధ్య ఆస్తి తగాదా వలన కాని, ఆడవాళ్ళు మాటా మాటా అనుకోవడం వలన కాని మరొకరికి తీవ్రమైన ఆపద కలగడం వలన కాని పగ పుడుతుంది. ఒక సారి పుట్టిన పగ నివురు కప్పిన నిప్పులా అలాగే రగులుతూ ఉంటుంది కాని చల్లారదు. పగ కనిపించ లేదని పగవాడిని నమ్మితే వినాశనం తప్పదు. ఒక సారి పగపుట్టిన తరువాత తల్లి తండ్రులైనా, అన్నదమ్ములైనా, కన్నబిడ్డలైనా, ప్రాణ స్నేహితులైనా నమ్మరాదు. కనుక మీ తియ్యటి స్నేహం నమ్మి నేను నీతో స్నేహం కొనసాగించ లేను " అని పలికింది. రాజు " చిలుకా ! కాలవశం వలన మంచి చెడు కలుగుతాయి. వాటిని నియంత్రించ లేము కనుక నీ వంటి స్నేహితుడిని నేను వదల లేను " అన్నది. చిలుక " రాజా ! నువ్వు నాతో ఎంతో సౌమ్యంగా మాట్లాడుతున్నా ఆ మాటల వెనుక నాకు పగద్వేషం కనపడుతున్నాయి. కనుక నేను నీతో స్నేహం చేయ లేను " అని చెప్పి చిలుక ఎగిరిపోయింది. కనుక ధర్మరాజా ! రాజు తన వారిని కాని మిత్రులను కాని ప్రజలను కాని నమ్మ రాదు.

కణిక శత్రుంజయులు[మార్చు]

భీష్ముడు ధర్మనందనా ! ఈ సందర్భంలో కణికుడు శత్రుంజయుడు అనే రాజుకు చెప్పిన విషయం వివరిస్తాను విను. రాజు బయటకు తియ్యగా మాట్లాడుతూనే లోపల కరుగ్గా ఉండాలి. అందరినీ నమ్మినట్లే ఉండాలి కానీ ఎవరినీ నమ్మ రాదు. దాయాదుల సాయంతో రాజ్యాన్ని జయించి తరువాత వారికి తగిన పారితోషికం ఇవ్వాలి. అంతే కాని వారిని నమ్మి దగ్గరగా ఉంచుకోకూడదు. అవసరానికి రాజు శత్రువును తలకెక్కించుకుని అవసరంతీరగానే కుండలా నేలకేసి కొట్టాలి. మద్యపానము, జూదము, వేట, స్త్రీలోలత్వం రాజులకు వినోద సాధనము. కాని మితిమీరక ఉండాలి. రాజు ఒక కార్యం తలపెట్టిన అది పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియనివ్వ రాదు. ఒక వేళ తెలిసినా తెలియనట్లు, చూడనట్లు, విననట్లు ఉండాలి. రాజుకు ఇష్టం లేని పనిని అదుగో చేస్తాను, ఇదుగో చేస్తాను అని కాలయాపన చేయాలి. తరువాత ఎలాగైన చేయక విడువాలి. అత్యంత గర్వంతో విర్రవీగే వాడిని, కార్యా కార్య వచక్షణ లేని వాడిని, మంచీ చెడు తెలియని వాడిని, చెడుమార్గంలో నడిచేవారిని గురువైనా వదలక దండించాలి. తీరని అప్పు, ఆరని నిప్పు, పూర్తిగా తీరని పగ ఎప్పటికైన కీడు చేస్తాయి. మృదుత్వంతో ఏదైనా సాధించ వచ్చు. సామరస్యంతో శత్రువునైనా నాశనం చేయ వచ్చు. కనుక మృధు స్వభావులు ఉత్తములు అది ఉత్తమ గుణం " అన్నాడు.

కరువులో ద్విజులు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! ధర్మభ్రష్టత్వం కలిగినప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి. అప్పుడు ద్విజులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎలా బ్రతకాలి " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! త్రేతాయుగము ద్వాపర యుగసంధిలో పన్నెండు సంవత్సరాల కాలం తీవ్రమైన కరువు సంభవించింది. నదులు, చెరువులు, పచ్చిక బయళ్ళు చివరకు అడవులు ఎండి పోయాయి. ఆహారం దొరకక జంతువులు చచ్చిపోసాగాయి. రాజులు ప్రజల వద్ద ఉన్న ధాన్యాలను పన్నుల రూపంలో దోచుకున్నారు. బలవంతులు బలహీనులను దోచుకోసాగారు. బ్రాహ్మణులు ధర్మం తప్పి ప్రవర్తించ సాగారు. యజ్ఞ యాగాదులు ఆగి పోయాయి. ఆకలికి తాళలేని జనం చనిపోసాగారు. ఆ సమయంలో విశ్వామిత్రుడనే మహర్షి ఆకలికి తట్టుకోలేక ఆహారం కొరకు వెదకుతూ సాయం సమయానికి ఒక పల్లెను చేరుకున్నాడు. విశ్వామిత్రుడు క్షుద్భాధతో సొమ్మసిల్లి పడి పోయాడు. అతడి పక్కన ఒక కుక్క శరీరం పడి ఉంది దాని చర్మం వలిచి మిగిలిన శరీరం అక్కడ ఎండ పెట్టారు. ప్రాణం పోయే సమయంలో కుక్క మాంసభక్షణం చేయడం పాపం కాదని కుక్కమాసం దొంగలించ బోయాడు. అక్కడ ఉన్న ఒక చంఢాలుడు అది చూసి " అయ్యా ! నీ వెవరు ఈ పనికి ఎందుకు పూనుకున్నావు? " అని అడిగాడు. విశ్వామిత్రుడు " అయ్యా ! నా పేరు విశ్వామిత్రుడు. ఆకలితో ఉన్నాను, చాలా రోజులుగా ఆహార పానీయాలు లేకుండా ఉన్నాను. ప్రాణాలు నిలిపు కోవడానికి కుక్క మాంసం తిన్నా తప్పు లేదనుకుని ఈ కుక్క మాంసం తీసుకుంటున్నాను. అగ్ని పవిత్రుడు అయినా సర్వభక్షకుడు కదా అలాగే నేనూ " అని చెప్పాడు. " మహాత్మా ! అన్ని మాంసాలలోకి కుక్క మాంసం నీచమైనది. దానిని మీ వంటి తాపసులు తీసుకోవడం దోషం కాదా ! " అని అడిగాడు. బ్రహ్మ అండగా ఉన్న నాకు ఏ పాపం అంటదు. ముందు ప్రాణాలు నిలుపుకోవడం ముఖ్యం. బ్రతికి ఉంటే యగ్న యాగాదులు చేసి పాపపరిహారం చేయ వచ్చు. నాకు జీవనాధరం అయిన కుక్కమాంసం వదలను " అన్నాడు. " మహాత్మా ! కుక్క మాంసం తినడం అధమాధమం. మీ వంటి తాపసులు అలాంటి పని చేయ వచ్చా ! " అని అడిగాడు. విశ్వామిత్రుడు " అయ్యా ! అగస్త్యమహాముని రాక్షస మాంసం తిన్నా అతడి ప్రతిష్ఠ తగ్గలేదు కదా ! " అని అన్నాడు. చంఢాలుడు " అగస్త్యుడు రాక్షస బారి నుండి మానవాళిని రక్షించడానికి రాక్షస మాంసం మేకమాంస రూపంలో తిన్నాడు. మీరు మీ ఆకలి మాత్రం తీసుకోవడానికి కుక్క మాంసం తినాలని అనుకుంటున్నారు. మీరు అగస్త్యుడు ఒకటి ఎలా ఔతారు " అని అడిగాడు. విశ్వామిత్రుడు " ఓయీ ! బ్రహ్మజ్ఞానానికి ఆలవాలమైన ఈ దేహం కోసం ఏమి చేసినా పాపం కాదు. అడ్డులే " అన్నాడు. చంఢాలుడు " మహాత్మా ! దొరికినఆహారం వదల లేక ఇలా అంటున్నావు కాని దీని వలన మీ తేజసు క్షీణించదా !" అన్నాడు. విశ్వామిత్రుడు " అయ్యా ! నేను బ్రతకాలని అనుకుంటున్నాను. నాకు ఈ మాంసం ఇవ్వు. నేను నిన్ను అడిగి తీసుకుంటున్నాను కనుక నాకు దొంగతనం చేసిన పాపం అంటదు " అని అన్నాడు. చంఢాలుడు " మహానుభావా ! ఎంతో పుణ్యాత్ములైన మీరు అధముడినైన నా వద్ద దానం పుచ్చుకొనుట ధర్మమా ! నేను ఇంతకంటే కాఠిన్యం వహించ లేను. ఇదుగో కుక్క మాంసం మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి " అన్నాడు. విశ్వా మిత్రుడు కుక్క మాంసం తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఆ తరువాత వానలు కురిసాయి చెట్లు చిగురించాయి, పంటలు పండాయి కరువు దూరమైంది. విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్న పాపపరిహారం చేసుకున్నాడు. కనుక ధర్మనందనా ! ఆపత్కాలంలో ఏ తప్పు చేసినా దోషం లేదు " అన్నాడు.

శరణార్ధులు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! శరణు జొచ్చిన వారిని ఆపదలలో ఉన్నవారిని ఆదుకున్న వారికి ఏలాంటి ఫలం దక్కుతుంది. భీష్ముడు " ధర్మనందనా ! ఒక బోయవాడు అడవిలో వేటకు వెళ్ళాడు. కొన్ని పక్షులను చూసాడు. ఇంతలో గాలి వాన ప్రారంభమై భయంకరంగా వాన కురిసింది. అడవి జలమయం అయింది. ఆ బోయవాడు ఒక మర్రి చెట్టు కింద తలదాచు కున్నాడు. ఆ బోయ చలికి గడగడలాడుతూ ఇక మీదట వేటాడనని, జీవహింస చేయనని ఆ చెట్టును వేడుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక పావురం గూడుకట్టుకుని భార్యతో నిచసితుంది. మగపావురం గూటిలో ఉంది. ఆడ పావురం ఆహారం కొరకు వెళ్ళి గూటికి ఇంకా చేర లేదు. మగ పావురం ఆడ పావురం కొరకు ఎదురు చూస్తూ పరితపిస్తూ " అయ్యో ! అయ్యో ఇంత రాత్రయ్యింది నా భార్య గూటికి చేరలేదు. నా భార్య లేని గూడు కళా విహీనంగా ఉంది. నా భార్యకు ఏమైందో తెలియడం లేదు. నా భార్య లేకున్న నా బ్రతుకిక వ్యర్ధం కదా ! " అనుకుని ఏడుస్తూ ఉంది. ఆ ఆడ పావురం బోయ వాడి వలలో ఉంది. అది తన భర్త మాటలు విని " అహా ! నా జన్మ ధన్యమైంది. నా భర్త మాటలను విని నామనసు పులకించి పోయింది. నేను ఎంత పుణ్యాత్మురాలను " అనుకుని నేను ఇక్కడ ఉన్నాను అని కిచకిచ లాడుతూ చెప్పింది అది విన్న మగ పావురం ఆ అరుపులు వినగానే ఆడ పావురం " అయ్యా ! ఈ వేటగాడు మన అతిథి. ఇతడికి అతిధి సత్కారం చెయ్యి " అన్నది. అది విని మగ పావురం బోయవాడి వద్దకు వచ్చి " అయ్యా ! మీరు నా అతిధి నేను మిమ్ము ఎలా సత్కరించగలనో శెలవియ్యండి " అని అడిగింది. బోయవాడు " అయ్యా ! ప్రస్థుతం నాకు చలి బాధ తీరాలి " అన్నాడు. వెంటనే ఆ పావురం చితుకులు ఏరుకుని వచ్చి మంట వేసింది. ఆ మంటలో చలి కాచుకుని బోయ వాడు తనకు ఆకలిగా ఉంది అన్నాడు. మగ పావురం " అయ్యా ! మేము ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తింటాము కాని రేపటికి దాచుకోము. మీరు పావురములు ఆహారంగా తింటారు కనుక నన్ను ఆహారంగా స్వీకరించండి " అని ఆ మంటలలో దూకింది. అది చూసిన బోయవాడికి జ్ఞానోదయం అయి " ఛీ నాదీ ఒక బ్రతుకేనా ! ఈ పావురానికి ఉన్న జ్ఞానం నాకులేదు కదా ! " అనుకుని వలలోఉన్న పక్షులను వదిలేసాడు. బోయవాడి వలలో నుండి బయట పడిన ఆడపక్షి తన భర్తలేని బ్రతుకు తనకెందుకని మంటలోకి దూకి మరణించింది. అప్పటికే దివ్య విమానంలోకి చేరిన మగ పావురం ఆడపావురం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇదంతా కళ్ళారా చూసిన బోయ వాడు తన వలను మిగిలిన సామాను వదిలి విరాగిగా పారి వెళ్ళియాడు. కనుక ధర్మనందనా ! తమ శరణు జొచ్చిన ఆ బోయవాడికి అతిథి సత్కారం చేసిన ఫలితానికి పక్షులకు దివ్యత్వం సిద్ధించింది " అని చెప్పాడు.

పాప పరిహారం[మార్చు]

ధర్మరాజు " పితామహా ! తన బుద్ధిపూర్వకంగా చేయని పాపానికి పరిహారం ఎలా చెయ్యాలి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు. జనమేజయునకు పూర్వజన్మ అందు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. అతడికి శౌనకుడు అనే ముని పశ్చాత్తాపంతో, పరితపించినా ఎంతటి పాపమైనా పరిహారం చేసుకోవచ్చని చెప్పాడు. జనమేజయుడు శౌనకుడి మాట అనుసరించి తీర్ధయాత్రలు చేసి, అశ్వమేధయాగం చేసి తన పాపములను పోగొట్టుకుని రాజ్యపాలన చేసాడు. ధర్మరాజా ! నీకు ఒక కథ చెప్తాను విను. విదిశాపట్టణంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఒక బాలుడు చనిపోయాడు. ఆ బాలుడి శవాన్ని అతడి తండ్రి బంధుమిత్రులతో శ్మశానానికి తీసుకు వెళ్ళాడు. ఆ బాలుడి శవాన్ని శ్మశానంలో పెట్టి తనివి తీరాఏడ్చారు. అక్కడకు వచ్చిన గద్ద వారిని చూసి " అయ్యలారా ! ఎంత సేపు ఏడిస్తే మాత్రం పోయున వాడు వస్తాడా ! చీకటి పడితే భూతప్రేత పిశాచాలు ఈ రుద్రభూమికి వస్తాయి. అవి మిమ్ములను పీక్కు తింటాయి. కనుక మీరి ఇళ్ళకు చేరండి " అని చెప్పింది. పక్కనే ఉన్న నక్క గద్దకు చీకటి పడితే కళ్ళు కనిపించవు. కనుక వాళ్ళను పంపి శవాన్ని ఆరగించాలని గద్ద చూస్తుంది అని నక్కకు అర్ధం అయింది. నక్క వాళ్ళను చీకటి పడేదాకా వాళ్ళను ఆపగలిగితే ఆ శవాన్ని తాను ఒక్కటే తినవచ్చు అనుకుని వాళ్ళ వద్దకు వెళ్ళి " అయ్యో ! ఏమిటీ వెర్రి గద్ద మాటలకు భయపడకండి. అయినా ఇంత అందమైన బాలుడిని వదిలి పోవడానికి మీకు మనసెలా ఒప్పుతుంది. మీ ఏడుపులు ఆలకించి ఏదేవుడైనా మీ పిల్లాడికి ప్రాణదానం చేయ వచ్చు. ఇంకా సూర్యుడు అస్తమించ లేదు కదా ! భయమెందుకు? " అన్నది. అప్పుడు గద్ద " అయ్యా ! ఇంతటి వెర్రి ఎందుకు. ఇప్పటికే ఈ పీనుగ వికృతంగా మారి పోయింది. ఇక ఏం బ్రతుకుతాడు బుద్ది మాలిన ఈ నక్క మాటలు వినకండి. దయా హీనుడైన యముడు ఇతడి ప్రాణములు హరించాడు. త్వరగా ఈ బాలుడికి ఉత్తరక్రియలు చేసి దానధర్మము చేసి ఉత్తమ గతులు కలిగించండి " అని త్వరపెట్టింది. గద్ద మాటలకు వారు తిరిగి వెళ్ళబోయారు. నక్క అడ్డుపడి " గద్ద మనసు క్రూరం. ఈ బిడ్డను చూస్తుంటే నా మనసు కలుక్కుమంటుంది. మీరు గట్టిగా ఏడవండి ఏ దేవతైనా కరుణించ వచ్చు " అన్నది. గద్ద " నేను పుట్టి పదిహేను వందల సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు చచ్చిన వాడు బ్రతికి రావడం నేను చూడ లేదు. చచ్చిన వాడు మరుజన్మ ఎత్తుతాడు కాని బ్రతుకుతాడని నమ్మడం చాదస్తం కాదా ! " అన్నది. గద్ద మాటలకు వెనుతిరిగిన వారితో నక్క " అయ్యలారా ! నా మాట వినండి పూర్వము శ్రీరాముడు ఒక బ్రాహమణుడి కుమారుడిని బ్రతికించి ఇవ్వలేదా ! నారదుడు సృంజయుడి కుమారుడిని బ్రతికించ లేదా ! అలాగే ఏ సిద్ధుడో, రాక్షసుడో దయ తలచి మీ బిడ్డను బ్రతికించ వచ్చు " అన్నది. ఇంతలో సూర్యాస్థమయం అయింది మహాశివుడు శ్మశానవిహారార్ధం అక్కడకు వచ్చి వారిని చూసి " మీ కేమి కావాలి ? " అని అడిగాడు. వారు శివుడిని చూసి సాష్టాంగ పడి బాలుడిని బ్రతికించమని వేడుకున్నారు. వారి ప్రార్థనలను ఆలకించిన శివుడు ఆ బాలుడిని బ్రతికించాడు. అతడిని శతాయువుగా దీవించి గద్దకు నక్కకు ఆకలి లేకుండా వరమిచ్చాడు. కనుక ధర్మరాజా ! ఆర్తుల కన్నీళ్ళు తుడవడం రాజు బాధ్యత. తమ పనులను చక్కబెట్టుకోవడానికి కపటంగా మాట్లాడే వారి మాటల నేర్పు గ్రహించి ప్రవర్తించాలి.

మహావృక్షం[మార్చు]

ధర్మనందనా నీకు మరొక కథ చెప్తాను శ్రద్ధగా ఆలకించు. హిమాలయ పర్వత శ్రేణువులలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. అది చాలా కాలం నుండి ఉంది కనుక శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. ఒక రోజు నారదుడు ఆ వృక్షముతో " వృక్షరాజమా ! ఇంత విశాలంగా విస్తరించి అనేక పక్షులకు ఆశ్రయం ఇస్తున్నావు. నీవు ప్రచంఢగాలులకు తట్టుకుని ఎలా నిలిచావు " అని ఆడిగాడు. ఆ మాటలకు ఆ వృక్షం గర్వపడి " మహాత్మా ! నా కున్న బలంలో పద్దెనిమిదో వంతు కూడా లేని వాయుదేవుడు నన్ను ఏమి చేయగలడు " అన్నది. నారదుడు " వాయు దేవుడి బలానికి పర్వతాలే విరిగిపడతాయి కదా ! ఈ లోకంలో వాయుదేవుడి మీద ఆధారపడని జీవులు ఎవరున్నారు " అన్నాడు. వృక్షం " ఇంతగా విస్తరించిన నన్ను ఎదుర్కొనడం వాయుదేవుడికి సాధ్యం కాని పని " అన్నది బూరుగ చెట్టు. ఈ విషయం నారదుడి ద్వారా విన్న వాయుదేవుడు వృక్షంతో " నా కంటే బలవంతుడివి అన్నావట నిజమేనా ? " అన్నాడు. వృక్షం " నిజమే నేను నీ కంటే బలవంతుడినే " అన్నది. వాయుదేవుడు నవ్వి " ఒక నాడు నీ నీడన బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుని నీకు కృతన్జతలు చెప్పాడని నీవు విర్రవీగు తున్నావు. నా బలం ఏమిటో నీకు రేపు రుచిచూపిస్తాను " అని వెళ్ళాడు. బూరుగు ఆలోచనలోపడి " అనవసరంగా నారదుడితో వివాదపడి చిక్కుల్లో పడ్డాను. వాయుదేవుడి బలం ముందు నేనెంత? " అనుకుని రాత్రికి రాత్రి కొమ్మలను విరుగ కొట్టుకుని మోడులా నిలబడింది. మరునాడు అక్కడకు వచ్చిన వాయుదేవుడు " నేను చేయవలసిన పని నీకు నువ్వే చేసుకున్నావు " అని వెళ్ళి పోయాడు. కనుక ధర్మనందనా తనకంటే బలవంతుడితో పోటీ పడితే బలహీనుడు చెడిపోగలడు " అని భీష్ముడు చెప్పాడు.

ధర్మజుని సందేహాలు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! పాపమునకు మూలం ఏది ? పాపం ఎక్కడ పుడుతుంది ? పాపం ఎలా ఉంటుంది ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మరాజా ! అన్ని పాపములకు మూలము లోభము. లోభానికి మూలం కోరికలు, కామవాంఛలు, కోపం, అసూయ, ద్రోహ చింతన, ప్రస్త్రీ వ్యామోహం, అత్యాశ, సిగ్గు లేమి, ఓర్పు లేమి మొదలైనవి లోభానికి కారణం. కనుక పాపం రాకుండా ఉండాలంటే లోభానికి దూరంగా ఊండాలి " అన్నాడు. ధర్మరాజు " పితామహా ! అన్ని ఆపదలకు, దుర్గతులకు మూలమైన అజ్ఞానం ఎలా ఉంటుంది ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మజా ! లోభం వలన అజ్ఞానం పుడుతుంది. అజ్ఞానం అన్ని ఆపదలకు మూలం కనుక లోభం వదిలితే అజ్ఞానం దానంతట అదే పోతుంది " అని చెప్పాడు. ధర్మరాజు " పితామహా ! ధర్మనందనా ! ధర్మములన్నింటికీ మూలం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహానికి జ్ఞానం తోడైతే ఉత్తమ గతులు లభిస్తాయి. ఇంద్రియ నిగ్రహంతో కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయంచి బ్రహ్మపదం చేరుకుంటాడు. సర్వ ధర్మాలకు తపస్సు మూలం, ఆహారం, నియమ నిబద్ధతతో చేయబడే తపస్సు వలన పాపములు హరించి సత్యము, శుచిత్వం కలిగి సకల కార్యములు సిద్ధిస్తాయి " అని భీష్ముడు చెప్పాడు. పితామహా ! దేవగణములు, పితృగణములు, బ్రాహ్మణులు సత్యవ్రతమును ప్రశంసిస్తుంటారు కదా ! ఆ సత్యవ్రతమును గురించి చెప్పండి? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! అన్ని ప్రాణులయందు సమానత్వం కలిగి ఉండడం ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, ధైర్యము, నిజాయితీ కలిగి ఉండడం, యజ్ఞ యాగములు దాన ధర్మములు చెయ్యడం, పరోపకారం చెయ్యడం, ఈర్ష్య, ద్వేషం లేకపోవడం, అహింస ఇవన్నీ సత్వగుణాలు సత్యరూపాలు సత్యవ్రతాచరణ వలన యోగము, మోక్షము లభిస్తాయి. సత్యవ్రతానికి వేయి అశ్వమేధయాగాలు సాటిరావు " అని చెప్పాడు భీష్ముడు.

అరిషడ్వర్గాలు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అవి ఎలాపుడతాయి వాటిని జయించే మార్గం ఏమిటి శలవివ్వండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! మన మనసులో మెదిలే భావాల నుండి కామం పుడుతుంది. కామస్వరూపం తెలుసుకుంటే కామంనశిస్తుంది. ఇతరులు మనపట్ల ప్రవర్తంచిన తీరుకు ఒక్కోచో కోపం ఉద్భవిస్తుంది. వారి ప్రవర్తన పట్ల ఓర్పువహించి కోపమును జయించాలి. మనకున్నది ఎదీ శాశ్వతంకాదు అని దృఢంగా అనుకుంటే లోభం మాయమౌతుంది. ధర్మప్రవర్తన వలన మోహం నశిస్తుంది, తోటివారంతా సమానమే అనుకుంటే మదంపోతుంది, సత్వగుణం వృద్ధి చేసుకున్న కొద్దీ రజో, తమో గుణాలు నశిస్తాయి. అరిషడ్వర్గాల జోలికి పోని మనుష్యుడికి శుభం కలుగుతుంది. మనుషులలో ధైర్యం లోపించినప్పుడు అరిష్డ్వర్గాలు పట్టి పీడిస్తాయి. వాటిని ధైర్యంగా ఎదిరించినవి దరిచేర లేవు " అన్నాడు. భీష్ముడు తిరిగి " ధర్మనందనా ! ధృతరాష్ట్రుడిపై ఆరు గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే సర్వనాశనం అయ్యారు. నీకు ఆ ఆరుగుణాలు లేనందున్న నీకు విజయం ప్రాప్తంచింది. ఇతరులను హింసించే వాడు పైగుణాలు కలిగిన వారికంటే హీనుడు, నలుగురికి పెట్టి తినేవాడు ఈ లోకం లోను పైలోకం లోను పూజింపబడతాడు. తనకు తన కుటుంబముకు మూడు సంవత్సరాలకు సరిపడా ధనమును సేకరించిన వాడు యజ్ఞములు చేసిన ఫలము పొందుతాడు. ధనధాన్యములు, సిరిసంపదలు కలిగిన వైశ్యుడు యజ్ఞ యాగములు చేయకున్న రాజు ఆ ధనమును గ్రహించి బ్రాహ్మణుల చేత యజ్ఞములు చేయించాలి. తను తినక వేరొకరికి పెట్టక ఉన్న శూద్రుడి సంపదలోని సగ భాగమును పుణ్యకార్యములకు వినియోగించాలి. ఏ రాజ్యములోనైనా బ్రాహ్మణుడు పేద అయిన అది రాజు తప్పే కనుక రాజు బ్రాహ్మణులను కంటికి రెప్పలా కాపాడాలి. ఒక మంచివాడు చెడ్డ వాడితో కొంతదూరం పయనించినా, ఒక చోటకూర్చున్నా, భోజనంచేసినా, పానీయంసేవించినా మంచివాడు కూడా పతితుడు ఔతాడు. అబద్ధం చెప్పడం మహాపాపం అయినా ఆడువారి సమయంలో, వివాహ విషయంలో, పరిహాసంగా, మరణవార్త చెప్పడంలో, ధన, మాన, ప్రాణ రక్షణ కొరకు అబద్ధం చెప్పవలసి వస్తే దోషం ఉండదు. అమాయకుడి మీద నింద వేసిన వాడికి అ నిందకు వచ్చేఫలితం అనుభవించక తప్పదు. అకారణంగా తల్లి తండ్రులను వెడులగొట్టిన వాడు పాపాత్ముడు ఔతాడు " అని చెప్పాడు.

నకులుని సందేహం[మార్చు]

అప్పటికి వరకు అన్ని విషయములు శ్రద్ధగా వింటున్న ఖడ్గవిద్యా విశారదుడైన నకులుడు భీష్ముడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. " పితామహా ! ఆయుధములలో ధనస్సు ఉత్తమం కాని యుద్ధంలో ధనస్సు విరిగినప్పుడు ఖడ్గం ప్రశస్థం అంటారు. ఆ ఖడ్గవిద్యా ప్రశస్థం వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " నకులా !బ్రహ్మదేవుడు సృష్టించిన జీవులు బ్రహ్మదేవుడు నిర్ధేశించిన మార్గంలో జీవించసాగారు. కాని దైత్యులు దేవతలను, సాధువులను హింసించసాగారు. అప్పుడు బ్రహ్మదేవుడు వేయి సంవత్సరాలు తపస్సు చేసి ఆ పైన యాగం చేసాడు. ఆ యాగాగ్ని నుండి ఒక భయంకర భూతం ఆవిర్భవించింది. దేవతలు, మునులు ఆ భూతాన్ని చూసి భయపడు తుండగా ఆ భూతం ఒక భయంకర ఖడ్గంగా మారి పోయింది. బ్రహ్మదేవుడు మనసులో శివుని తలుచుకోగానే ఈశ్వరుడు ప్రత్యక్షం కాగానే బ్రహ్మదేవుడా ఖడ్గాన్ని ఈశ్వరుడికి ఇచ్చాడు. ఈశ్వరుడు ఆ ఖడ్గంతో దైత్యులను సంహరించాడు. ఆ తరువాత ఈశ్వరుడు ఆ ఖడ్గమును, ఖడ్గవిద్యను విష్ణుమూర్తికి ఇచ్చాడు. ఆ ఖడ్గవిద్య అటు తరువాత విష్ణువు నుండి మారీచికి, మారీచి నుండి పరశురాముడికి, పరశురాముడి నుండి మునులకు, మునుల నుండి ఇంద్రుడు, ఇంద్రుడు దిక్పాలకులకు, దిక్పాలకులు మనువుకు ఉపదేశించ బడింది. మనువు నుండి ఆ విద్య వంశాను గతంగా దుష్యంతునకు, దుష్యంతుడి నుండి భరతుడికి వంశాను గతంగా వస్తూ చివరికి ద్రోణుడికి ఉపదేశించ బడింది. ద్రోణుడు మీ అందరికీ సమానంగా నేర్పినా ఆ విద్యలో నువ్వు ప్రావీణ్యం సంపాదించావు " అని చెప్పాడు.

విదురుడు[మార్చు]

అంతలో సూర్యుడు అస్తమించాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజాదులు భీష్ముడి వద్ద శలవు తీసుకుని తమ నివాసములకు వెళ్ళారు. రాజప్రసాదంలో విశ్రాంతిగా ఉన్న సమయంలో " ధర్మ, అర్ధ, కామ, మోక్షములలో ఉత్తమము, మధ్యమము, అయుధములు ఏవి ? నాకు వివరించండి " అని విదురుడిని చూసి అడిగాడు. విదురుడు ఇలా చెప్పసాగాడు. " ధర్మనందనా ! ధర్మంగా ధనం సంపాదించాలి. ఆ ధనంతో కోరికలు తీర్చుకోవాలి కనుక ఉత్తమమైనది ధర్మం. మధ్యము అర్ధము. అధమం కామము " అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు " విదురా ! ధర్మ, కామములకు ధనం అవసరమని చెప్పారు కదా ! సన్యాసులకు కూడా తమ యజ్ఞయాగాది కార్యక్రమాలు నిర్వ హించడానికి అవసరమైన ధనం ఉత్తమమైనది కాదా ? " అని అడిగాడు. ఆ మాటలకు నకుల సహదేవులు " ధనము, ధర్మము ఒక దాని మీద ఒకటి ఆధార పడి ఉన్నాయి కనుక ఏ ఒక్కటి ఉన్నా లాభం లేదు. ధనం లేని వాడికి కామం తీరదు కదా ! " అని అడిగారు. విదురుడు " ధర్మము, అర్ధము వేటికదే సాటి. ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ధనం ధర్మమార్గంలో సంపాదించాలి కనుక ధర్మమే ఉత్తమమైనది. పెరుగులో దాగి ఉన్న వెన్న మాదిరి కామము ధర్మ, అర్ధములలో దాగి ఉంటుంది. సుఖజీవనానికి కామము హేతువు. తుమ్మెద పూవులోని తేనె స్వీకరించిన విధంగా మానవుడు కామం వలన సుఖము పొందుతాడు. కనుక మూడూ ముఖ్యమైనవే అయినా కేవలం కామమును కోరుకునేవాడు అధముడు, అర్ధకామములతో జీవించే వాడు మధ్యముడు. ధర్మంగా ధనం సంపాదించి తద్వారా సుఖం పొందే వాడు ఉత్తముడు " అని చెప్పాడు. తరువాత ధర్మరాజు విదురుడిని, తన తమ్ములను చూసి " పుట్టిన ప్రతి వాడికి వార్ధక్యం తప్పదు. ఈ ధర్మార్ధ కామములు మొదట సంతోషం కలిగించినా తరువాత దుఃఖాన్ని కలిగిస్తాయి. కనుక మనిషి నాలుగవదైన మోక్షాన్ని కోరుకోవడం మంచింది. కాని మోక్షం లభించడం సులువు కాదు. కనుక మానవుడు ధర్మార్ధకామములను ఎక్కువ కాలం మనసున నిలుపక అంటీ ముట్టనట్లుండి మోక్షం కొరకు ప్రయత్నించాలి. సుఖాలతో మదము, దుఃఖత్వంతో దీనత్వం వస్తాయి. మానవుడు వీటికి లోను కాక మోక్షం కొరకు ప్రయత్నించాలి " అని ధర్మరాజు చెప్పాడు. ఆ గోష్ఠి అంతటితో చాలించి మర్నాడు యధా విధిగా భీష్ముని వద్దకు వెళ్ళారు.

రాజుకు కావలసిన వారు[మార్చు]

ధర్మరాజు " పితామహా ! రాజుకు కావలసిన వాళ్ళు ఎవరు అక్కరలేని వాళ్ళు ఎవరు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఓర్పుగలవారు, ధర్మపరులు, సత్యంపలికే వారు, చంచల బుద్ధిలేని వారు, మదము, కోపం, లోభం లేనివారు, చతురతగా మాట్లాడి కార్యమును సాధించే వారు, తమ రాజుకు సకలసంపదలు చేకూర్చుతుంటారు. వీళ్ళంతా రాజుకు కావలసిన వాళ్ళు. క్రూరుడు, లోభి, ఆశపోతు, చాడీలు చెప్పేగుణం కలవాడు, మందబుద్ధులు, చేసినమేలు మరిచేవారు, అబద్ధాలు చెప్పేవారు, ఒకరితో నిందింపబడిన వారు, పిరికివారు, ధైర్యం లేనివారు, అవినీతిపరులు, దురలవాట్లకు బానిస అయినవారు రాజుకు నష్టం కలిగిస్తారు. వీరు అందరిలో చేసినమేలు మరిచేవారు పరమనీచులు. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను. ఒక బ్రాహ్మణుడు తన కులధర్మాన్ని వదిలి ఒక బోయవనితను వివాహం చేసుకున్నాడు. బోయవాళ్ళతో చేరి వేటసాగించి మాంసంతినడం లాంటి భోగములు అనుభవించ సాగాడు. మరింత ధనంసంపాదించవలెనన్న కోరికతో వైశ్యులతోచేరి పయనించసాగాడు. ఇంతలో ఒక ఏనుగు వారిని తరిమింది. వర్తకులంతా పారిపోయారు. ఆ బ్రాహ్మణుడు కూడా పరిగెత్తి ఒక మర్రిచెట్టు కిందకు చేరుకున్నాడు. ఆ చెట్టుకింద నాడీజంఘుడు అనే కొంగ నివసిస్తూ ఉంది. ఆ కొంగ బ్రాహ్మణుడితో " భూసురోత్తమా ! ఎక్కడి నుండి వస్తున్నారు. ఏ పనిమీద పోతున్నారు " అని అడిగాడు. అతడు " నేను గౌతముడి కుమారుడను నేను బ్రాహ్మణోచితమైన వేదాధ్యయనం చెయ్యకుండా వ్యామోహంతో ఒక బోయవనితను వివాహం చేసుకుని జీవిస్తున్నాను. అధికంగా ధనం సంపాదించాలని వర్తకులతో కలిసి పోతున్న సమయంలో ఏనుగు చేత తరమబడి ఈ చెట్టుకింద చేరాను " అని చెప్పాడు. నాడీజంఘుడు " బ్రాహ్మణోత్తమా ! బాధపడకు నేను నీ దారిద్యాన్ని పోగొట్టగలను. ముందు నా ఆతిధ్యం నీవు స్వీకరించు " అని పక్కనే ఉన్న నదిలోనుండి చేపలు పట్టుకు వచ్చి కాల్చి పెట్టింది. బ్రాహ్మణుడికి అలవాటైన ఆహారం కనుక అవితిని తనఆకలి తీర్చుకున్నాడు. అప్పుడు నాడీజంఘుడు " మంచి స్నేహితుడు, వెండి, బంగారం, మంచి బుద్ధి ఈ నాలుగూ దారిద్యమును పోగొడతాయి. ఈ నాలుగింటిలో మంచిమిత్రుడు గొప్ప వాడు. నేను కశ్యపు కుమారుడను. నాతో మైత్రి కావించు నీకు ఐశ్వైర్యం కలుగుతుంది. ఇక్కడకు మూడు యోజనముల దూరంలో మధువ్రజపురం ఉంది. అక్కడ నా మిత్రుడు విరూపాక్షుడు అనే రాక్షస రాజు ఉన్నాడు. అతడి వద్దకు వెళ్ళి నేను పంపానని చెప్పు అతడు నీకు కావలసిన బంగారం, రత్నములు ఇస్తాడు " అని చెప్పింది. ఆ బ్రాహ్మణుడు విరూపాక్షుడి వద్దకు వెళ్ళి తనను నాడీజంఘుడు పంపాడని చెప్పి తనకు ధనసంపద కావాలని అడిగాడు. అతడిని చూడగానే అతడు నీచుడని గ్రహించిన విరూపాక్షుడు " మిత్రమా ! నీవు ఎవరవు నీకుల మేమిటి ? " అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తనను గురించి చెప్పుకున్నాడు. విరూపాక్షుడు మనసులో " ఇతడు ఎలాంటి వాడైతే నా కేమి ఇతడు నాడీజంఘుని మిత్రుడు అదే ఇతడి అర్హత. ఇతడికి కావలసిన ధనం ఇస్తాను. " అని అనుకున్నాడు. ఆ మరునాడు కార్తిక పౌర్ణమి. వేల కొలది బ్రాహ్మణులు విరూపాక్షుడి వద్దకు వచ్చారు. విరూపాక్షుడు వారికి భోజనం పెట్టి బంగారం, వెండి కానుకలు ఇచ్చి పంపాడు. వారితో చేర్చి ఆ బ్రాహ్మణుడికి కూడా భోజనం పెట్టి ఎన్నోకానుకలు ఇచ్చాడు. ఆ కానుకలను మోయ లేక మోస్తూ అతడు నాడీజంఘుడి వద్దకు వచ్చాడు. అతడి మాటలు విని నాడీజంఘుడు తన మాట మన్నించి బ్రాహ్మణుడి దారిద్ర్యాన్ని పోగొట్టిన విరూపాక్షుడిని తలచుకుని సంతోషించాడు. ఆ రాత్రికి బ్రాహ్మణుడు అక్కడే నిదురించాడు. సగంరాత్రిలో బ్రాహ్మణుడు తనలో " నా వద్ద ధనం ఉంది కానీ రేపటికి ఆహారం లేదు " అనుకుని ఒక కర్ర తీసుకుని అక్కడే నిద్రిస్తున్న నాడీజంఘుడి తల పగుల కొట్టి ముక్కలుగా నరికి మూట కట్టాడు. ఇంతలో తెల్లవారింది విపూరాక్షుడి మనసులో కలత రేగింది. ప్రతి రోజూ తన వద్దకు వచ్చే నాడీజంఘుడు ఈ రోజు రాలేదు ఆ నీచుడైన బ్రాహ్మణుడు నాడీజంఘుడికి ఏదైనా అపకారం తలపెట్టాడేమో ? అనుకుని నాడీజంఘుడి వద్దకు భటులను పంపాడు. ఆ భటులు అడవిలో ఉన్న బ్రాహ్మణుడిని అతడి చేతిలోని మాంసపు మూటను చూసారు. వారు ఆ బ్రాహ్మణుడిని పట్టుకుని విరూపాక్షుడి ముందు నిలబెట్టారు. విరూపాక్షుడు మూటలో ఉన్నది నాడీజంఘుడి శరీరానికి చెందినవి అని తెలుసుకుని కోపించి చేసిన మేలు మరచిన ఈ విశ్వాసఘాతకుడిని భక్షించండి " అని ఆజ్ఞాపించాడు. భటులు " అయ్యా ! ఈ పాపాత్ముడిని చంపి తిన్న మాకు పాపం చుట్టు కుంటుంది" అన్నారు. విరూపాక్షుడు " తింటే తినండి లేకున్న లేదు చంపిపారేయండి " అన్నాడు. భటులు ఆ బ్రాహ్మణుడిని కొట్టిచంపి శరీరాన్ని పారవేశారు. అతడి మాంసం ముట్టడానికి కుక్కలు కూడా దగ్గరకు రాలేదు. విరూపాక్షుడు నాడీజంఘుడి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇంతలో అక్కడకు వచ్చిన ఇంద్రుడిని చూచి విరూపాక్షుడు నాడీజంఘుడిని బ్రతికించమని కోరాడు. ఇంద్రుడు " విరూపాక్షా ! నాడీజంఘుడు నీకే కాదు బ్రహ్మదేవుడికి కూడా స్నేహితుడే ! నీవే కాదు బ్రహ్మదేవుడు కూదా అతడి కొరకు విచారిస్తున్నాడు. అటుచూడు నాడీజంఘుడి చితాభస్మం మీద ఒక ఆవు తన దూడకు పాలను ఇస్తుంది. అప్పుడు చిందిన పాలనే అమృతధారలకు నాడీజంఘుడు తిరిగి జీవించాడు చూడు " అన్నాడు. ఇంతలో అక్కడకు వచ్చిన నాడీజంఘుడు చావు బ్రతుకుల్లో ఉన్న బ్రాహ్మణుడిని చూసి అతడిని విడిపించమని విరూపాక్షుడిని కోరాడు. అతడిని విడిచిపెట్టి అతడి బంగారాన్ని కానుకలను అతడికి ఇచ్చి పంపాడు విరూపాక్షుడు. కనుక బ్రహ్మహత్య చేసిన వాడికైనా విముక్తి ఉంటుంది కాని మిత్రుడికి చేసే విశ్వాసఘాతుకానికి నిష్కృతి లేదు. మంచిమిత్రుడు ఈ లోకానికే కాదు పరలోకానికి కూడా సహకరిస్తాడు. ధనము, మిత్రులలో మిత్రుడే గొప్పవాడు. కనుక ఉత్తమ గుణసంపన్నుడు, ఉత్తమకులజుడైన మిత్రుడు అన్ని విధాలా శ్రేష్టుడు " అని చెప్పాడు.

బయటి లింకులు[మార్చు]