శౌనక మహర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిలక్ తన కవిత్వం గురించి చెప్పిన విశేషాలు

జననం[మార్చు]

శౌనక మహర్షి తండ్రి శనక మహర్షి.

నైమిశారణ్యము[మార్చు]

శౌనకుడు సకల యజ్ఞ నిర్వహణా సామర్థ్యము, వేదవేదాంగములు, నియమ నిష్టాగరిష్టుడై నేర్చుకొని తల్లిదండ్రుల అనుమతితో నిర్జన ప్రదేశము కొరకు బయలు దేరి, చివరకు నైమిశారణ్యము చేరుకొన్నాడు. ఇంక ముందుకు వెళ్ళలేక, ఇక్కడే స్థిర నివాసము ఏర్పరుచుకొని, అనేక మంది ముని పుంగవులని శిష్యులుగా చేసుకొని, మహాతపోధనుడై, బ్రహ్మజ్ఞానియై, కులపతియై, బ్రహ్మజ్ఞానదాన విరాజితుడై, దయామయుడై, శాంఖ్యాయోగాచార్యుడై వెలుగొందాడు.

సత్రయాగము[మార్చు]

సత్రయాగము వేయి సంవత్సరములు వైదికోక్తములగు సర్వ యజ్ఞకర్మ కలాపములు ప్రతిరోజు నెరవేర్చిన పిదప సమస్త పురాణములు, ఇతిహాసములు చెప్పించుకొనుటకు శౌనక మహర్షి సూత మహర్షిని కోరడం జరిగింది. ఇందులో భాగంగా సూతుల వారు కృష్ణకథాశ్రవణము వారందరికీ వినిపించారు. [1]

ధర్మరాజు సంవాదం[మార్చు]

పాండవులు అరణ్యవాసము నందు గంగానది తీరమున చేరి వటవృక్షము క్రింద ఒక పూట గడిపి ముందుకు వెళ్ళు సమయములో అక్కడనే ఉన్న బ్రాహ్మణులు కూడా వారి అగ్నిహోత్రములు తెచ్చుకొని పాండవులతో పాటుగా వనవాసము చేయుదుమని అన్నారు. ఆందుకు ధర్మరాజు, ఎప్పుడూ బ్రాహ్మణులను ప్రతిరోజు మృష్టాన్నములతో తృపి పరచిన వాడను, ఇప్పుడు తన దగ్గర ద్రవ్యము లేదని మిక్కిలి బాధ పడ్డాడు. అప్పుడు అక్కడకు వచ్చిన శౌనక మహర్షికి ధర్మరాజుకు సుహ్రుద్భావముతో ఇద్దరికీ సంవాదం జరుగుతుంది. [2]

ఋగ్వేదం రక్షణ[మార్చు]

ఋగ్వేదం రక్షణ కొరకు శౌనక మహర్షి (శౌనకుడు) (1) అనువాకానుక్రమణి (2) ఆర్షానుక్రమణి (3) చందోనుక్రమణి (4) దేవతానుక్రమణి (5) పాదానుక్రమణి, (6) సూక్తానుక్రమణి (7) ఋగ్విధానం (8) బృహద్దేవతా (9) ప్రాతిశాఖ్యం (10) శౌనకస్మృతి అనే గ్రంథాలు రచించాడు. ఇందులో మొదటి సూచించినవి ఏడు గ్రంథాలు మాత్రము అనుక్రమణికా వాజ్మయములో చేరతాయి. [3]

ధర్మనేతృత్వము[మార్చు]

జిజ్ఞాసువు శౌనకుడు అంగీరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ముండకోపనిషత్తు అనే ఉపనిషత్తును అంగీరసుడు బోధించాడు.

శౌనక మహర్షి చరణవ్యూహ అను ధర్మశాస్త్రమునకు గ్రంథకర్త.

పద్మపురాణము[మార్చు]

ఒకరోజు మునీశ్వరులు శౌనక మహర్షి వద్దకు జేరి విష్ణుకథా కలాపములు చేయుచుండ, అక్కడకు సూత మహర్షి రావడము జరిగింది. సూతుడు శౌనకాదులకు పద్మ పురాణము అంతయు వినిపించి వారందరినీ అమిత ఆనంద కందళిత హృదయార విందులను చేసి తను కూడ బ్రహ్మానందము పొందాడు.

అనుక్రమణికములు[మార్చు]

శౌనక మహర్షి వ్రాశిన అనుక్రమణికములలో అనువాకానుక్రమణి తప్ప మరొకటి లభించుట లేదు. మిగతావి కేవలం వేదరాశులలో (సధ్గురశిష్య రచనలలో) ఉల్లేఖనాలు రూపాలలో మాత్రమే మనుగడలో ఉన్నాయి.


సూచనలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. మహర్షుల చరిత్రలు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలు
  2. మహాభారతము, వనపర్వము
  3. "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ