శ్రీవేంకటాచల మాహాత్మ్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ

శ్రీవేంకటాచల మాహాత్మ్యము పరవస్తు వేంకటరామానుజస్వామి వచనానువాదము చేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణ.

"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ నమోదేవో న భూతో న భవిష్యతి."

శౌనకాది మహర్షులు శ్రీ మహావిష్ణువు యొక్క స్వయం వ్యక్త స్థలాలన్నింటిలో దేనియందు శ్రీహరికి ప్రీతి అధికమో, ఎక్కడ అన్ని కోరికలు నెరవేరుతాయో, ఎక్కడ నివసించే జనులకు హరి ప్రత్యక్ష మవుతాడో అలాంటి వైష్ణవ క్షేత్రాన్ని గురించి మాకు తెల్పమని సూతుణ్ణి అడుగుతారు. అందుకు సమాధానంగా నారాయణుని వివిధ చరిత్రలతో కూడినదీ, సమస్త సిద్ధులొసగునదీ, సర్వైశ్వర్యాలను కలుగజేసేదీ, సర్వమంగళప్రథమూ, ఆయుష్కరమూ, పావనమూ అయిన క్షేత్రాన్ని గురించి చెపుతానని ప్పక్రమించి వేంకటాచల మాహాత్మ్యాన్ని వారికి వివరిస్తాడు. ఈ విషయాలన్నీ వరాహ, భవిష్యోత్తర పురాణాల్లో 'వేంకటాచల మాహాత్మ్యం' అనే పేరుతో వివరించబడ్డాయి. దానిని వచన రూపంలో శ్రీ పరవస్తు వేంకట రామానుజ స్వామి రచించారు.


వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాశైలమే వేంకటాద్రి. అది పుడమికి చేరిన విధమూ, స్వామి పుష్కరిణీ, జాబాలి, తుంబురు, పాపవినాశనాది బహు తీర్థాల ప్రభావము ఈ గ్రంధంలో చక్కగా చెప్పబడ్డాయి. అంతేగాక శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని విడిచి వేంకటాద్రి చేరడం, ఆకాశరాజు తన కుమార్తె పద్మావతిని శ్రీనివాసునికిచ్చి పెండ్లి చేయడం, ఆకాశరాజు తమ్ముడు తొండమాను చక్రవర్తి స్వామికి దివ్యాలయం నిర్మించడం, బ్రహ్మదేవుడు శ్రీ వేంకటేశ్వరునికి ఉత్సవ క్రమాలు నిర్వహించడం, కలియుగంలో వేంకటేశుని లీలలు, భక్తుల చరిత్రలు మున్నగు గాథలు కూడ ఈ పుస్తకములో సమకూర్చబడ్డాయి.


ఈ పుస్తకం 1976 నాటికి ఎనిమిది సార్లు ముద్రితమైనది.


మూలాలు[మార్చు]

  • శ్రీవేంకటాచల మాహాత్మ్యము (వచనరూపము), వచనానువాదము: శ్రీ పరవస్తు వేంకటరామానుజస్వామి, ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1995.