సప్తర్షులు

వికీపీడియా నుండి

హిందూ సంప్రదాయములోను, పురాణ గ్రంధాలలోను ఏడుగురు దివ్యశక్తి గల తపస్సంపన్నులను సప్తర్షులు అని ప్రస్తావించారు.

భారత సాంప్రదాయిక ఖగోళ విజ్ఞానంలో ఏడు నక్షత్రాలను కూడా సప్తర్షులు అంటారు. ఈ నక్షత్రాలను ఆంగ్లంలో (ఖగోళశాస్త్రంలో) "Big Dipper" లేదా "Ursa Major" అంటారు.

విషయ సూచిక

[మార్చు] సప్తర్షులు ఎవరు

హిందూ సంప్రదాయం ప్రకారం పైన చెప్పబడిన ఏడుగురు ఋషులే ఏడు నక్షత్రాలుగా ఆకాశంలో వెలుగుతున్నారు. ఆ సప్తర్షులు...

  1. మరీచి
  2. అత్రి
  3. అంగిరసు
  4. పులస్త్యుడు
  5. పులహుడు
  6. క్రతువు
  7. వశిష్ఠుడు

ఇందుకు మహాభారతంలోని ప్రామాణిక శ్లోకం (శాంతిపర్వం 340-69,70)

మరీచిరంగిరాస్చాత్రిః పులస్త్యః పులహః క్రతుః
వశిష్ఠ ఇతి సప్తైతే మానసా నిర్మితాహి తే
ఏతే వేదవిదో ముఖ్యా వేదాచార్యాశ్చ కల్పితాః
ప్రవృత్తి ధర్మణశ్చైవ ప్రాజాపత్యే చ కల్పితాః

సప్తర్షుల పేర్లు వివిధ గ్రంధాలలో స్వల్పమార్పులతో కనుపిస్తాయి. "శతపధ బ్రాహ్మణము", "బృహదారణ్యకోపనిషత్తు"(2.2.4)లలో అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు సప్తర్షులని చెప్పబడినది. కృష్ణ యజుర్వేదం (సంధ్యావందన మంత్రం)లో అంగీరసుడు, అత్రి, భృగువు, గౌతముడు, కశ్యపుడు, కుత్సుడు, వశిష్ఠుడు సప్తర్షులని చెప్పబడినది.

[మార్చు] సప్తర్షుల లక్షణాలు

సప్తర్షుల లక్షణాలు వాయు పురాణము (16-13,14)లో ఇలా చెప్పబడినవి - దీర్ఘాయువులు, వేద మంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్యదృష్టి గలవారు, సద్గుణ సముపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వ ధర్మ మర్మజ్ఞులు, ధర్మ స్వరూపులు, గోత్ర ప్రవర్తకులు ఈ ఏడు గుణములు గల మహర్షులు "సప్తర్షులు"గా ప్రసిద్ధి వహించిరి. వీరినుండియే వంశములు వృద్ధి చెందినవి, ధర్మ వ్యవస్థ సుప్రతిష్ఠమై సాగుచున్నది.


వీరి జీవన విధానము, భావములను వాయుపురాణంలో (61/95-97) ఇలా చెప్పారు.- అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞములు చేయుట, యజ్ఞములు చేయించుట, దానములను ఇచ్చుట, దానములు తీసికొనుట అనే ఈ ఆరు కర్మలను నిత్యము ఆచరించేవారు, విద్యాబోధనకు గురుకులములు నడిపేవారు, సంతాన ప్రాప్తికే గృహస్థాశ్రమమును స్వీకరించిన వారు, అగ్నికార్యములు నిర్వహించేవారు, వర్ణాశ్రమ ధర్మాలననుసరించి వ్యవహారములను నడిపేవారు, స్వయముగా సంపాదించుకొనిన అనింద్య భోగ్య వస్తువులనే అనుభవించేవారు, సంతానము గలిగి గోధనాది సంపదలచే ఒప్పువారు, ప్రాపంచిక విషయాలపట్ల నిరాసక్తులు.

[మార్చు] మరీచి

ఇతడు భగవంతుని అంశావతారము అంటాఱు. ఇతనికి అనేకమంది భార్యలున్నారు. వారిలో "సంభూతి" అనే ఆమె ముఖ్యురాలు. ఆమె దక్ష ప్రజాపతికి అతని భార్య ధర్మవ్రత యందు జన్మించింది. మరీచి మహర్షి అధిక సంతానవంతుడు. కశ్యప మహర్షి ఈయన కుమారుడే.

[మార్చు] అంగిరసుడు

ఇతడు అసాధారణ ఆధ్యాత్మిక తేజో సంపన్నుడు. ఇతనికి పెక్కురు భార్యలున్నారు. వారిలో ముఖ్యులు సురూప (మరీచి కుమార్తె), స్వరాట్టు (కర్దముని కూతురు), పథ్య (మను పుత్రిక). సురూపకు బృహస్పతి (కొన్ని చోట్ల శుభ అనే భార్యయందు అని ఉంది), స్వరాట్టుకు గౌతముడు, వామదేవుడు మొదలగు ఐదుగురు పుత్రులు, పథ్యకు విష్ణు మొదలగు మువ్వురు పుత్రులు జన్మించారు. అగ్ని పుత్రిక యైన ఆత్రేయ యందు అంగిరసులు జన్మించారు.


[మార్చు] అత్రి

ఇతను దక్షిణ దిశకు చెందినవాడు. మహాపతివ్రతయైన అనసూయ (కర్దమ, దేవహూతుల కూతురు, కపిలుని చెల్లెలు)ఇతని ధర్మపత్ని. సీతారాములు తమ వనవాస కాలంలో అనసూయ, అత్రిల ఆతిథ్యం స్వీకరించారు. ఈ దంపతులకు త్రిమూర్తుల అంశతో ముగ్గురు పుత్రులు - దత్తాత్రేయుడు, చంద్రుడు, దుర్వాసుడు - జన్మించారు.

[మార్చు] పులస్త్యుడు

ఇతడు మహాధర్మపరుడు, తపస్వి, తేజస్వి, యోగశాస్త్ర నిష్ణాతుడు. ఒకమాఱు పులస్త్యుని అభ్యర్ధన మేరకు పరాశరుడు రాక్షస సంహారార్ధం చేసే యాగం ఆపేశాడు. అందుకు ప్రసన్నుడై పులస్త్యుడు పరాశరుని సకల శాస్త్రప్రవీణునిగా చేశాడు. పులస్త్యుని భార్యలు సంధ్య, ప్రతీచి, ప్రీతి, హవిర్భువు. దత్తోలి, నిదాఘుడు, విశ్రవసువు మొదలగువారు పులస్త్యుని కుమారులు. దత్తోలి అగస్త్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనువారు అగస్త్యుని కుమారులు.

[మార్చు] పులహుడు

ఇతడు మహా ప్రభావశాలి, జ్ఞాని. సనందన మహర్షి వద్ద దివ్యజ్ఞానము పొది, దానిని గౌతమునికి అందించెను. దక్ష ప్రజాపి కుమార్తె క్షమ, కర్దముని కుమార్తె గతి అనవారు పులహుని భార్యలు.

[మార్చు] క్రతువు

ఇతడు గొప్ప ఆధ్యాత్మిక తేజస్సంపన్నుడు. కర్దముని పుత్తిక క్రియ, దక్షుని పుత్రిక సన్నతి ఇతని భార్యలు. ఇతనివలన వాలఖిల్యులు అని పేరు పొందిన 60 వేల మంది ఋషులు జన్మించారు. వీరు సూర్యుని రధమునకు అభిముఖంగా నడచుచుందురు.

[మార్చు] వసిష్ఠుడు

ఇతడు సూర్యవంశ ప్రభువుల పురోహితుడు. అష్టసిద్ధులు గలవాడు. సనాతన ధర్మమునెరిగినవారిలో ముఖ్యుడు. మహాసాధ్వి అరుంధతి ఇతని ధర్మపత్ని. వసిష్ఠుడు శ్రీరామునకు బోధించిన తత్వజ్ఞాననము యోగవాసిష్ఠము అని ప్రసిద్ధి పొందినది.

[మార్చు] ఖగోళ నక్షత్ర సముదాయం

ఖగోళ పరిభాషలో Big Dipper (Ursa Major) నక్షత్రసముదాయంలో చెప్పడే తారల పేర్లు:

భారతీయ
నామం
Bayer
Desig
పాశ్చాత్య
నామం
  క్రతు   α UMa   Dubhe
  పులహ   β UMa   Merak
  పౌలస్త్య   γ UMa   Phecda
  అత్రి   δ UMa   Megrez
  అంగీరస   ε UMa   Alioth
  వశిష్ఠ   ζ UMa   Mizar
  మరీచి   η UMa   Alkaid

"వశిష్ఠ" నక్షత్రానికి ప్రక్కన తక్కువ కాంతితోకనిపించే జంటనక్షత్రం పేరు "అరుంధతి" (Alcor/80 Ursa Majoris).


[మార్చు] వనరులు

  • "గీతా తత్వవివేచనీ వ్యాఖ్య" - రచన:జయదయాల్ గోయంగ్‌కా; అనువాదం:డా.ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వెంకటరామయ్య; ప్రచురణ: గీతాప్రెస్, గోరఖ్‌పూర్


"http://te.wikipedia.org/w/index.php?title=సప్తర్షులు&oldid=681252" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు