సభ్యులు:అబ్రకదబ్ర
వికీపీడియా నుండి
మరీ నేపాళ మాంత్రికుడి పేరులా ఉందా? అసలు పేరు వేరే. దాన్నవతల పెట్టి ఇప్పటికిలాగే కానిచ్చేద్దాం.
నా కలం పేరు గురించో ఉపోద్ఘాతం: ఇంద్రజాలికులు విరివిగా వాడే పదమది - నేను విడిగా చెప్పక్కర్లేదు. నేనా పేరు పెట్టుకోటానిక్కారణం మాత్రం, చిన్నప్పుడెప్పుడో చదివిన యండమూరి తులసి దళం లోని ఓ పాత్ర. ఎనిమిదేళ్లు నాకప్పుడు. నేను చదివిన మొదటి నవలది. ఎందుకోగానీ ఆ పేరు, ఆ పాత్ర తెగ నచ్చాయి. పైగా, నా అసలు పేరు పొడక్షరాల్లో ఎ.కె.డి. అబ్ర-క-దబ్ర కూడా పొడిగా రాస్తే అంతే! అయ్యా, అదీ సంగతి.
తెలుగంటే నాకు పిచ్చ పిచ్చి. ఇంటర్మీడియెట్ లోను, డిగ్రీలోనూ అందరూ తేలిగ్గా మార్కులొస్తాయని రెండో భాషగా హిందియో, సంస్కృతమో తీసుకుంటుంటే నేను మాత్రం ఆవేశంగా మాతృభాష మీద వాళ్లకో లెక్చరు దంచి మరీ తెలుగు తీసుకున్నాను. ఏమండీ, మనభాషే సరిగా రాకపోతే వేరే భాషలెలా వంటబడతాయి?
మద్రాసు లయోలా కాలేజీ లో పి.జి. చేసే రోజుల్లో నా తెలుగు భాషాభిమానం మరింత పెరిగింది. బహుశా చుట్టూ ఉన్న తమిళ తంబిలనీ, వాళ్ల భాషపై వాళ్లకున్న వాత్సల్యాన్నీ చూసి కాబోలు. ఎక్కువమంది తమిళుల భాషాభిమానాన్ని గర్వంగా భావించినా, నాకు మాత్రం వాళ్లు మాతృ భాషపై చూపే మమకారం చాలా గొప్పదనిపించింది.
చదువయిపోయాక భాగ్యనగరం, బెంగళూరుల్లో కొన్నాళ్ల పాటు పురుషలక్షణంగావించాం. తర్వాత పొలోమంటూ ఎగురుతూ వచ్చి బే ఏరియా లో వాలి దశాబ్దంగా కంప్యూటర్లతో కుస్తీలు పడుతున్నాం. పన్లో పనిగా డజన్ల కొద్దీ కొత్త భాషలు - కంప్యూటర్లకు మాత్రమే అర్ధమయ్యేవి - నేర్చుకున్నాం. ఇన్నాళ్లకు వెనుదిరిగి చూస్తే, తెలుగుకి నేనేం చేశాను అనిపించింది.
అప్పటినుండీ తెలుగు కోసం ఏదో చేసేయాలన్న తపన (కొన్ని ప్రాంతాల్లో దీన్నే దురద అని కూడా అంటారు). మొన్నామధ్య ఈనాడు ఆదివారం సంచికలో తెలుగు వికీపీడియా గురించి, అందులో మనవాళ్లు చేస్తున్న హడావిడి గురించీ వివరంగా రాశారు. వెంటనే వచ్చి తెవికీ లో చేరిపోయాను.
ప్రస్తుతానికి తెవికీ లో తెలుగులోకి అనువదించవలసిన వ్యాసాలు చాలా ఉన్నట్లున్నాయి. వాటిలో కొన్నిటిని ఎంచుకుని అనువదించటం మొదలు పెట్టాను. ప్రస్తుతం కమల్ హసన్ మరియు రష్యా లను అనువదిస్తున్నాను. ఇవి నా మొదటి అనువాదాలు. మీ విలువైన సలహాలను ఆనందంగా స్వీకరిస్తాను.
పై అనువాదాలు కాకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, శ్రీ కృష్ణ దేవ రాయలు, అలెక్జాండరు మరియు రెండవ ప్రపంచ యుద్ధం నేను పని చేస్తున్న, చేయబోతున్న వ్యాసాలు.

