సిద్దేంద్ర యోగి

వికీపీడియా నుండి

(సిద్ధేంద్ర యోగి నుండి దారిమార్పు చెందింది)
సిద్దేంద్ర యోగి
సిద్దేంద్ర యోగి

సిద్ధేంద్ర యోగి (1672 - 1685) ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు. ఇతడు ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామానికి చెందినవాడు.

ఈయన గురించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. సిద్ధేంద్ర కాశీ లో చదువుకుంటున్నప్పుడు, భార్య గర్భాదానానికి సిద్ధమైనది అని కబురు వస్తుంది. యువ రక్తంలోని సహజ సిద్దమైన తొందరతో, ఆతురతతో, వేగంగా,ఉత్సాహంగా భార్య కడకు బయలుదేరి వస్తాడు, కాని, కూచిపూడి దగ్గరకు రాగానే కృష్ణానది పొంగి పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. అలలమీద అయినా నదిని దాటుదామని సిద్ధేంద్ర నదిలోకి దూకుతాడు. కాని దురదృష్టవశాత్తూ నది మధ్యలోకి రాగానే,నదిలో మునిగిపోవడం మొదలెడతాడు. 'ఇక ఎలాగైనా చావు తప్పదు' అని అనుకొని "కనీసం పుణ్యమైనా దక్కుతుందని" అక్కడికక్కడే తనకుతానే మంత్రం చెప్పుకొని సన్యాసం స్వీకరిస్తాడు. సంసారసాగరాన్ని దాటించగల ఆ కృష్ణ భగవానుడు, సిద్ధేంద్రను కృష్ణా నది కూడా దాటిస్తాడు.

ఇక ఇంటికి వెళ్ళి, భార్యను పీటలపై కూర్చోమంటే , భార్య సిద్ధేంద్రను"ఇతనెవరో గడ్డాలు, మీసాలు ఉన్న సన్యాసి, నా మొగుడు కాదు అని అంటుంది. అప్పుడు జరిగిన కథ చెప్పి, భార్యకి కృతజ్ఞతలు చెప్పి, మరలా పెద్దలందరి అనుమతితో సన్యాసం తీసుకుంటాడు. తరువాత కూచిపూడి నృత్యానికి ఆద్యుడై సిద్ధేంద్ర యోగి భామా కలాపం రచించాడు. ఇందులో కృష్ణుడు, సత్యభామ, రుక్మిణి ప్రధాన పాత్రలు. తన ఊరిలోని మగవారితోనే ఆడవేషాలు వేయించి ఆడించాడు. సిద్ధేంద్ర యోగి యక్షగానాలకు మెరుగులు దిద్ది, భరతుని నాట్యశాస్త్ర రీతులను తన కూచిపూడి నాట్యంలో ప్రవేశపెట్టాడు. శాస్త్రీయ నాట్యరీతుల్ని జానపదకళా నృత్యాలతో మేళవించాడు. తనను కృష్ణానదిలో మునిగి పోకుండా కాపాడిన ఆ కృష్ణుని స్తుతిస్తూ, సిద్ధేంద్ర యోగి పారిజాతాపహరణం నృత్యనాటికను వ్రాశాడనీ, అది కూచిపూడి నృత్యనాటకాలలో అతి పురాతనమైనదనీ చెబుతారు. ప్రస్తుత కూచిపూడి నాట్యరీతి, సిద్ధేంద్ర యోగి స్థాపించిన నృత్యనాటక సంప్రదాయం, భాగవత మేళనాటకం నుండి ఆవిర్భవించింది.


[మార్చు] రచనలు

  1. భామా కలాపం
  2. గొల్ల కలాపం


హంసలదీవి దీవి సుబ్బారావు గారు రచించిన కవితల పుస్తకం నుండి


చెప్పబోయేది

సుమారు మూడు వందల యేబది యేళ్ళ క్రితం సంగతి


చదువు కోసం కాశీ వెళ్ళి

కూచిపూడి నుండి ఓ అబ్బాయి

అక్కడే వున్నాడు పదిపన్నెండేళ్ళు


అక్కడుండగా వచ్చింది కబురు

ఇంటి దగ్గర భార్య ఈడేరిందనీ

గర్భాదానానికి ముహూర్తం కూడా కుదిరిందనీ


ఇంకేం బయలుదేరాడు సంతోషంగా

ఉరుకులు పరుగులు దారంతా


ఊరు దగ్గర పడుతుండగా

కృష్ణ కనిపించింది వురవళ్ళు పరవళ్ళుగా

యువకుడు గదా

దిగాడు ధైర్యం చేసి

తెలిసింది గాదు వరద వుధృతం దిగాక గాని

సగం దూరం పనికి వచ్చింది వచ్చిన ఈత


ఇక ఖాయమనుకొన్నాడు మునక

సన్యాసం పుచ్చుకొన్నాడు అక్కడికక్కడ

తనకు తానే మంత్రం చెప్పుకొని

పోయే ముందు పుణ్యమన్నా దక్కుతుందని



ఒకే సారి జరిగాయి

అట్లా ఆయన చేతులెత్తేయటం

ఇట్లా ఒక పెద్ద కెరటం వచ్చి ఒడ్డుకు తోసెయ్యటం

ఇంటికొచ్చి పడ్డాడు

బ్రతుకు జీవుడా అంటూ


పీటల మీదకొచ్చి కూర్చోవాల్సిన భార్య

ససేమిరా రానన్నది

అనుకొన్న ముహూర్తానికి

ఈయన ఎవరో గడ్డాలూ మీసాలూ ఉన్న సన్యాసిగాని

నా భర్తకాదు పొమ్మన్నది


అంతా తలో మాటా అన్నారు

చిన్నపిల్ల మంకుపట్టు పట్టిందని కొందరు

గాలో ధూళో సోకిందని ఇంకొందరు

ఆ పిల్లదొక్కటే పాట

ఎవరెన్ని అన్న

ఈయనెవరో సన్యాసి

నా భర్త కానే కాదు అని



అప్పుడు

పీటల మీద కూర్చొన్న యువకుడు

పంచె వుత్తరీయం తీసి పక్కన పెట్టాడు


వట్టి గోచీతో లేచి నుంచొన్నాడు

అక్కడున్న పెద్దలందరికీ నమస్కారాలు చెప్పాడు

వరదతో వున్న కృష్ణను

దాటలేక పోయిన వైనమూ


ఆఖరు క్షణంలో

ఆతుర సన్యాసం తీసుకొన్న తీరూ

దాచకుండా చెప్పాడు


ఇంకా


శ్రీ కృష్ణ భగవానుడే తనను

సంసారం నుండి రక్షించి ఒడ్డున పడేశాడనీ

తన భార్యే తనను

అధోగతి పాల్గోకుండా రక్షించిందనీ

చెప్పాడు

అట్లా చెప్పి అన్ని విషయాలు

సన్యాసం స్వీకరించాడు యథావిధిగా

అందరి అంగీకారంతో మరలా


అతడే యోగి సిద్దేంద్రుడు

జగన్నాటకంలో నిమిత్తమాత్రుడు

యౌవనంలో శృంగార వాంఛ పూర్తిగా పోక

అది పోయేటందుకుగా

శృంగార రసప్రధానంగా

సత్యభామా శ్రీ కృష్ణులు నాయికా నాయకులుగా

పారిజాతాపహరణం యక్షగానం కూర్చాడనీ

అదే భామాకలాపమనీ

ఆ వూరి మగవాళ్ళతోనే వేషం కటించి ఆడింపజేస్తూ వచ్చాడనీ

చెబుతారు విజ్ఞులు

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు