సి.వై.చింతామణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి
సి.వై.చితామణి
జననంచిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి
1880, ఏప్రిల్ 10
విజయనగరం
మరణం1941 , జూలై 1
వృత్తిఎడిటర్
ప్రసిద్ధిపత్రికా సంపాదకుడు, రాజకీయనాయకుడు
మతంహిందూ
తండ్రిచిర్రావూరి రామసోమయాజులు

చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి (జ: 1880 - మ: 1941) పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు, ఉదారవాద రాజకీయ నాయకుడు. అలహాబాదు నుండి వెలువడిన లీడర్ అనే ఆంగ్ల పత్రికకు 1909 నుండి 1934 వరకు మూడు దశాబ్దాలపాటు సంపాదకత్వం వహించాడు. ఈయన ఇండియన్ హెరాల్డ్, స్టాండర్డ్ పత్రికలను కూడా వ్యవస్థీకరించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

చింతామణి 1880, ఏప్రిల్ 10న విజయనగరంలో జన్మించాడు. ఈయన తండ్రి చిర్రావూరు రామసోమయాజులు, వేదపండితుడు, విజయనగరం సంస్థానంలో మహారాజా విజయరామ గజపతిరాజుకు రాజగురువు. యజ్ఞేశ్వర చింతామణికి 10 యేటనే వివాహమైనది. చింతామణి అనారోగ్యం వల్ల, మాతృవియోగం వల్ల ఎఫ్.ఏ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోవడంతో ఈయనను చికిత్సకై విశాఖపట్నానికి పంపించారు. అక్కడైనా తన పద్ధతులు మార్చుకుంటాడని బంధువులు ఆశించారు. కానీ, అది జరగలేదు. సురేంద్రనాథ్ బెనర్జీ వంటి వారు ఆదర్శప్రాయులైన చింతామణి విశాఖలో స్థానిక రాజకీయ వ్యక్తులతో తిరగటం ప్రారంభించాడు. ఇతడు విశ్వవిద్యాలయాలనుండి పట్టాలు పొందలేక పోయాడు గానీ అసమానమైన ఆంగ్లభాషా పాండిత్యాన్ని సంపాదించాడు. ఆ వైదుష్యం అంతా స్వయంకృషి వల్ల లభించిందే. ఉపన్యాస శక్తిని పెంపొందించుకోదలచి అనేక సభలకు పోయి ఉపన్యాసాలను ఇచ్చేవాడు. ఇతని ఉపన్యాసాలు విని శ్రోతలు ముగ్ధులయ్యేవారు.

పత్రికారంగం[మార్చు]

ఇతనికి పత్రికా రచనపై ఎక్కువ ఆసక్తి ఉండేది. ప్రారంభ దశలో ఇతడు "తెలుగు హార్స్" అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. ఈయన వ్రాసే వ్యాసాలు వైజాగ్ స్పెక్టేటర్ పత్రికలో అచ్చు అవటం ప్రారంభమైంది. ఆ తర్వాత కొంతకాలానికే 18 యేళ్ల వయసులోనే వైజాగ్ స్పేక్టేటర్ పత్రికకు సంపాదకత్వం వహించే అవకాశం లభించింది. దీనికి గానూ అప్పట్లో పెద్దమొత్తమైన 30 రూపాయలు జీతం ఇచ్చారు. ఆ తరువాత చింతామణి ఆ పత్రికను 300 రూపాయలకు కొని, తనతో పాటు వైజాగ్ స్పెక్టేటర్ పత్రికను విజయనగరానికి తీసుకొనివచ్చాడు. విజయనగరం నుండి వెలువడటం ప్రారంభించిన తర్వాత ఆ వారపత్రికకు "ఇండియన్ హెరాల్డ్" అని నామకరణం చేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ చింతామణీ "నేను కేవలం సంపాదకుడినే కాదు, ఫోర్మెన్, ప్రూఫ్ రీడర్, విలేఖరి, ఉపసంపాదకుడు, యజమాని అన్నీ నేనే" అని వివరించాడు. పత్రిక బాగా ప్రాచుర్యం పొందినా ఆర్థిక ఇబ్బందుల వల్ల రెండు సంవత్సరాలలో దాన్ని మూసివేయవలసి వచ్చింది. ఇలాంటి కష్టసమయంలోనే చింతామణి భార్యను కూడా కోల్పోయాడు. తన దురదృష్టాన్ని, అనారోగ్యాన్ని లెక్కచేయకుండా మద్రాసుకు మకాం మార్చి,కొంతకాలం యునైటెడ్ ఇండియా అనే వారపత్రికలోను, ఆ తర్వాత జి. సుబ్రమణ్యం అయ్యర్ సంపాదకత్వంలో వెలువడుతున్న "మద్రాస్ స్టాండర్డ్" దినపత్రికలో ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. 1903లో నాగేంద్రనాథ్ గుప్తా ప్రారంభించిన "ఇండియన్ పీపుల్" పత్రికకు సంపాదకత్వం వహించడానికి అలహాబాదు చేరుకున్నాడు. 1909 అక్టోబరులో మదన్ మోహన్ మాలవ్యా, తేజ్ బహద్దర్ సప్రూ వంటి మితవాద కాంగ్రెస్ నాయకులు "లీడర్" అనే ఆంగ్ల దినపత్రికను ప్రారంభించారు. "ఇండియన్ పీపుల్" పత్రిక "లీడర్" పత్రికలో కలిసిపోయింది. ఇతడు లీడర్ పత్రిక సంపాదకత్వ బాధ్యతను స్వీకరించాడు. ఇతని సంపాదకత్వంలో లీడర్ పత్రిక దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ పత్రిక లిబరల్ పార్టీ పత్రిక అయినా అన్ని రాజకీయ పక్షాలవారు ఈ పత్రికకోసం ఎదురు చూసేవారు. చింతామణి నిష్పక్షపాతమైన విమర్శకుడిగా పేరు గడించాడు. ఈ పత్రికలోని సంపాదకీయాలు ఇతడికి మంచి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెట్టాయి. ఇతడు 1916 వరకు లీడర్ పత్రికా సంపాదకుడిగా ఉన్నాడు. 1927నుండి మళ్లీ ఇతడు లీడర్ పత్రికకు సంపాదకునిగా వ్యవహరించినాడు.

రాజకీయాలు[మార్చు]

ఇతనికి పత్రికా రంగంతో పాటు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉంది. 1900 సంవత్సరం చివరలో లాహోరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ప్రయాణ ఖర్చులకు డబ్బు లేకపోతే అప్పు చేసి మరీ హాజరయ్యాడు. అప్పుడు అతని వయసు 20 సంవత్సరాలు కూడా నిండలేదు. ఈ సమావేశాలలో ఇతడు అనేక విషయాలపై గంభీరమైన ఉపన్యాసాలు చేశాడు. సురేంద్రనాథ్ బెనర్జీ, భూపేంద్రనాథ్ బోస్ వంటి కాంగ్రెస్ నాయకులు ఎందరో ఇతడిని శ్లాఘించారు. "హిందూ" పత్రిక ఇతని ఉపన్యాసాలను ప్రశంసించింది. 1916లోనూ తిరిగి 1927లోనూ ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనమండలి సభ్యులుగా ఎన్నికైనాడు. 1921-23 మధ్య అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ (నేటి ఉత్తర ప్రదేశ్) కు విద్య, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశాడు. 1930-31లో లండన్‌లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంనకు ప్రతినిధిగా హాజరైనాడు.

పురస్కారాలు[మార్చు]

బ్రిటీషు ప్రభుత్వం ఈయనకు 1939లో సర్ బిరుదునిచ్చి సత్కరించింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు (ఎల్.ఎల్.డి)ప్రదానం చేసింది. అలహాబాద్ విశ్వవిద్యాలయం డి.లిట్. గౌరవ పట్టాను ఇచ్చింది.

మరణం[మార్చు]

ఆంధ్రుల ప్రతిభను, రాజకీయ పరిజ్ఞానాన్ని భారతదేశమంతటా చాటిన చింతామణి 1941, జూలై 1 న తన 62వ యేట మరణించాడు.

మూలాలు[మార్చు]