సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా

సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా గోల్కొండను పరిపాలించిన కుతుబ్‌షాహీ వంశమునకు చెందిన ఆరవ చక్రవర్తి. ఈయన 1612 నుండి 1626 వరకు పరిపాలించాడు. ఈయన తనకు ముందు పరిపాలించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా సోదరుడైన మీర్జా మహమ్మద్ అమీన్ కుమారుడు[1]. ఈయన తండ్రి 25 సంవత్సరాల వయసులోనే మరణించాడు. తల్లి ఖానుమ్ ఆఘా, మా సాహెబా చెరువును కట్టించినది.

కులీ కుతుబ్ షాకు మగ సంతానము లేనందున తన కూతురు హయాత్ బక్షీ బేగం ను మహమ్మద్ కుతుబ్ షాకు ఇచ్చి వివాహము చేసి తన వారసునిగా ప్రకటించాడు. మహమ్మద్ కుతుబ్ షాకు ముగ్గురు కుమారులు, కుమార్తెలు. వీరిలో ఏడవ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా కూడా ఒకడు.

హైదరాబాదులోని మక్కా మసీదు యొక్క నిర్మాణము 1617లో ఈయన హయాములోనే దరోగా మీర్ ఫైజుల్లా బేగ్, చౌధరీ రంగయ్య నేతృత్వములో ప్రారంభమైనది. సుల్తాను మసీదు నిర్మాణ శంకుస్థాపనకు నగరములో అందరు మత పెద్దలను పిలిపించి ఎన్నడూ వేళ తప్పకుండా ప్రార్ధించిన వ్యక్తిచే మసీదు నిర్మాణము ప్రారంభింపచేయాలని తలచాడు. కానీ ఎవరూ ముందుకు రాకపోయేసరికి 12వ యేట నుండి ఎన్నడూ వేళ తప్పకుండా రోజుకు ఐదు సార్లు ప్రార్ధించిన తనే స్వయంగా నిర్మాణము ప్రారంభించాడని చెప్పుకుంటారు.

మహమ్మద్ కుతుబ్ షా జనవరి 31, 1626న మరణించాడు. ఈయన సమాధి కుతుబ్‌షాహీ సమాధులలో ఒకటి. అది ఈయనకు ముందు సుల్తానుల సమాధుల కంటే ఉన్నతమైనది. ఈ సమాధి మందిరములో ఈయన సమాధితో పాటు ఈయన కుమార్తెలు, కుమారుల సమాధులు కూడా ఉన్నాయి. ఈయన తర్వాత ఈయన కుమారుడు అబ్దుల్లా కుతుబ్ షా గోల్కొండ చక్రవర్తి అయ్యాడు.

మూలములు[మార్చు]

  1. ^ ఆంధ్రుల చరిత్ర - బి.యస్.యల్.హనుమంతరావు (పేజీ.430)


ఇంతకు ముందు ఉన్నవారు:
మహమ్మద్ కులీ కుతుబ్ షా
గోల్కొండ సుల్తానులు
1612—1626
తరువాత వచ్చినవారు:
అబ్దుల్లా కుతుబ్ షా