సూరి భగవంతం

వికీపీడియా నుండి
సూరి భగవంతం
జననం 1909
మరణం 1989

సూరి భగవంతం (ఆంగ్లం: Suri Bhagavantam) (అక్టోబర్ 14, 1909 - ఫిబ్రవరి 6, 1989) ప్రముఖ శాస్త్రవేత్త.

వీరు కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం హైదరాబాదు నిజాం కళాశాలలో డిగ్రీ (బి.ఎస్సీ) చదువు పూర్తిచేసి, కలకత్తాలో సర్ సి.వి.రామన్ దగ్గర చేరారు. అక్కడే మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్సీ. పట్టాను సంపాదించారు.

వీరు 1932లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో అధ్యాపకులుగా చేరారు. 1938లో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. బోధనా విధానంలో వీరిది చాలా సులభశైలి. స్పష్టమైన వ్యక్తీకరణ, విశేషమైన ఆలోచన, ఖచ్చితమైన అనువర్తన, సమగ్రమైన దృష్టి, అద్భుతమైన ప్రతిభ లన్నీ కలగలిపి వీరి బోధనా విధానాన్ని ఇతర శాఖల అధ్యాపకులు కూడా నేర్చుకునేవారని చెబుతారు.

వీరు 1941లో కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్వాతంత్రోద్యమ సమయంలో తన పరిపాలనా కౌశలం చూపి కళాశాలను విజయవంతంగా నడిపారు. 1948-49 మధ్య లండన్ లోని భారత రాయబారి వి.కె. కృష్ణ మీనన్ కార్యాలయంలో వైజ్ఞానిక సలహాదారుగా పనిచేశారు. వీరు చాలా ఐరోపా దేశాల్లో పర్యటించి వివిధ విజ్ఞాన విషయాల మీద ప్రసంగాలు చేశారు.

1949లో స్వదేశం తిరిగివచ్చి హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భౌతిక శాఖాధిపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీరి కాలంలో పరిశోధనవైపు దృష్టి కేంద్రికరించి 12 మంది డాక్టరేట్ లను తయారుచేశారు. 1952లో విశ్వవిద్యాలయ ఉప కులపతిగా పదవిని చేపట్టారు.

వీరు 1957లో బెంగులూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తుండగా కృష్ణ మీనన్ వత్తిడి మీద 1961లో రక్షణ శాఖ పరిశోధనా సంస్థకు అధిపతిగాను మరియు తనకు వైజ్ఞానిక సలహాదారుగా చేరారు.

1962 చైనా-భారత్ యుద్ధం తర్వాత వై. బి. చవాన్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఇతడు డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఒ.) అధిపతిగా చేరి ఎంతో ప్రగతి సాధించారు. భారతదేశమంతా ఇరవైకి పైగా ప్రయోగశాలలను ప్రారంభించి యుద్ధ రంగానికి అవసరమైన క్షిపణులు, విమానాలు, ట్యాంకులు, రాడార్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన అనేక విషయాలలో విజయం సాధించారు. 1969లో పదవీ విరమణ చేశారు.

వీరు 300 పైగా పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. ఇవి కాక గ్రూపు థియరీ, రామన్ ఎఫెక్ట్ మరియు క్రిస్టల్ సిమెట్రీ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనే మూడు గ్రంథాలు రచించారు.

మూలాలు[మార్చు]

  • సైన్స్ పరిశోధన నుంచి సత్యశోధన దాకా... డాక్టర్ సూరి భగవంతం : ఎందరో సైన్స్ మహానుభావులు, నాగసూరి వేణుగోపాల్, ఆంధ్ర ప్రదేశ్ డిసెంబర్ 2009 ప్రచురించిన వ్యాసం పేజీలు 43-4.