హై హై నాయకా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హై హై నాయకా
దర్శకత్వంజంధ్యాల
కథఆదివిష్ణు
నిర్మాతఎం. గుణశేఖర్, ఎన్. గోవర్ధన్
తారాగణంనరేష్, శ్రీ భారతి
కూర్పుగౌతంరాజు
సంగీతంమాధవపెద్ది సురేష్
నిర్మాణ
సంస్థ
సినిమా నిడివి
122 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

హై హై నాయకా 1989 లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం.[1] ఇందులో నరేష్, శ్రీభారతి ప్రధాన పాత్రలు పోషించగా సూర్యకాంతం, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, బ్రహ్మానందం తదితరులు సహాయ పాత్రలు పోషించారు. మాధవపెద్ది సురేష్ ఈ చిత్రానికి సంగీతాన్నించాడు. సంగీత దర్శకుడిగా ఆయనకిది తొలి సినిమా.[1]

చిన్నా పెద్దా తేడా లేకుండా బూతులు మాట్లాడే చిన్నపిల్లవాడిని ఒక తెలుగు పంతులు ఎలా మార్చాడన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం. అంతర్లీనంగా ఓ ప్రేమ కథ ఉంటుంది.

కథ[మార్చు]

రామకృష్ణ (నరేష్) సూర్యకాంతమ్మ (సూర్యకాంతం) మనవడు. రాజమండ్రిలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉంటాడు. కొద్ది రోజులకు అతని ఉద్యోగం పోతుంది. కానీ సూర్య కాంతమ్మ మాత్రం అతనింకా ఉద్యోగం చేస్తున్నాడని ఊళ్ళో వాళ్ళందరికీ చెబుతూ ఉంటుంది. అతనికి పెళ్ళి సంబంధాలు వస్తాయి కానీ తెలుగు పంతులు అనే చిన్నచూపుతో అన్నీ తప్పిపోతూ ఉంటాయి. మరో వైపు రామకృష్ణ ఉద్యోగం దొరక్క పొట్ట నింపుకోవడానికి నానా రకాల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. అవి ఏదో ఒక రకంగా బెడిసి కొడుతుంటాయి. కొద్ది రోజులు ఒక కిరాణా దుకాణంలో, పెట్రోలు బంకులో ఉద్యోగాలు ప్రయత్నిస్తాడు, అక్కడికి వచ్చిన వినియోగ దారులకు కూడా సరైన తెలుగు నేర్పిస్తుండటంతో యజమానులు అక్కడి నుంచి తీసేస్తారు.

సూర్యకాంతమ్మకు తన మనవడంటే వల్లమాలిన ప్రేమ. అతను ఆ ప్రేమను తట్టుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఒకనాడు తరగతి గదిలో ఉండగా పొట్టి బట్టలు తెచ్చి వేసుకోమని బలవంతం చేస్తుంది. అవి వేసుకుని వస్తే అందరూ నవ్వుతారు. సహ విద్యార్థి రాధారాణి అతన్ని చూసినప్పుడుల్లా అలాగే నవ్వుతుంటుంది. నెమ్మదిగా వారిరువురూ ప్రేమలో పడతారు. కానీ ఒకానొక సందర్భంలో రాధారాణి పుట్టినరోజుకు హాజరైన రామకృష్ణ ఆమెకు ముద్దు ఇస్తాడు. ఆమె అప్పటి నుంచి అతనితో మాట్లాడ్డం మానేస్తుంది.

ఒకసారి సూర్యకాంతమ్మ పట్నంలో ఉన్న మనవణ్ణి చూడ్డానికి వస్తుంది. బస్సు దిగగానే అక్కడ లగేజీ మోసే వాడిగా ఉన్న తన మనవణ్ణి చూసి జాలిపడుతుంది. వెంటనే తన ఊరు వెళ్ళి తనకు తెలిసిన వారితో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. కానీ వాటన్నింటికీ పెళ్ళితో ముడిపెడుతుంది. రామకృష్ణ రాధారాణినే ప్రేమిస్తుండటంతో అందుకు అంగీకరించడు.

ఒక పల్లెటూర్లో పెద్ద రాయుడు (కోట శ్రీనివాసరావు) కొడుకు గోపి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి మీదా బూతుల వర్షం కురిపిస్తుంటాడు. పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా అతని ప్రవర్తనతో విసిగిపోయి ఉంటారు. కానీ ఆ బడి పెద్దరాయుడి ఆధ్వర్యంలో నడుస్తుండటంతో అతన్ని ఏమీ అనలేకుండా ఉంటారు. పెద్దరాయుడు వచ్చి తన కొడుకు గురించి అడిగినప్పుడల్లా అతను బాగా చదువుకుంటున్నాడని అబద్ధం చెబుతుంటారు. ఒకసారి ఆ బడికి డి.ఈ.ఓ (జిల్లా విద్యాశాఖాదికారి) పర్యవేక్షణ కోసం వస్తాడు. అప్పుడు అందరి ఎదురుగా ఆ పిల్లవాడు బూతుల పురాణం విప్పుతాడు. దాంతో ఆయన పిచ్చెక్కి పారిపోతాడు. పెదరాయుడికి పెద్ద అవమానం జరుగుతుంది. దాంతో పంతుళ్ళందరినీ పిలిచి ఆరు నెలలలోగా తన కుమారుడికి సరైన విద్యాబుద్ధులు నేర్పించకపోతే వారి ఉద్యోగాలు పీకేస్తాననీ, వారందరూ తన మిల్లులో కూలీలుగా పని చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు.

బడిలో ఉన్నవారంతా అతనికి చదువు చెప్పడానికి భయపడుతుండటంతో ఎవరైనా కొత్త పంతులు కోసం వెతుకుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సూర్యకాంతమ్మ తన మనవడిని అక్కడికి పంపిస్తుంది. వారు రామకృష్ణను చాలా సులువైన ప్రశ్నలు అడిగి ఆ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఆ ఊర్లో ఉండటానికి అతి తక్కువ ఖర్చులో ఇల్లు, పనివాళ్ళను కూడా ఏర్పాటు చేస్తారు. రామకృష్ణ వచ్చి పిల్లలకు చక్కగా చదువు చెప్పటం మొదలు పెడతాడు. కానీ గోపీ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయి అతన్ని చెడామడా వాయించేస్తాడు. దాంతో మిగతా పంతుళ్ళంతా పెద్దరాయుడు తమను ఏం చేసేస్తాడోనని భయపడిపోతారు. రామకృష్ణకు ఆ విషయం తెలిసి తను కూడా ఇల్లువదిలి పారిపోబోతాడు. కానీ అప్పటికే కొంతమంది మనుషులు వచ్చి అతన్ని రాయుడి దగ్గరకు తీసుకువెళతారు.

అక్కడ అతనికి రాధారాణి కనిపిస్తుంది. అప్పటికీ ఆమె రామకృష్ణను ద్వేషిస్తూనే ఉంటుంది. రాయుడు తన కుమారుడిని కొట్టినందుకు గాను రామకృష్ణపై బూతుల వర్షం కురిపిస్తాడు. చివరకు కొరడాతో కొట్టబోతుంటే అతన్ని ఆపి నిజానికి ఆ పిల్లవాడికంటే ఆ శిక్ష రాయుడుకే వేయాలంటాడు. ఆ పిల్లవాడి ప్రవర్తన అంతా తన తండ్రిని చూసే నేర్చుకున్నాడనీ, కాబట్టి గోపి చెడిపోవడానికి తనే కారణమనీ చెబుతాడు. దాంతో రాయుడు తన తప్పు తెలుసుకుని తన కొడుకును దారిలో పెట్టే రామకృష్ణకు అప్పజెపుతాడు. రామకృష్ణ నెమ్మదిగా తన వినూత్నమైన బోధనా విధానం ద్వారా గోపీకి చదువువచ్చేటట్లు చేస్తాడు. రాయుడు కూడా అందుకు చాలా సంతోషిస్తాడు. ఒకసారి రాధారాణి రామకృష్ణను తిరస్కరించడం చూసిన ఉపాధ్యాయులు ఆమెకు అతను గురించి అన్నీ మంచిగా చెబుతారు. దాంతో ఆమె మనసు మార్చుకుని అతనిని పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. చివర్లో తన మనవణ్ణి అనుమానించినందుకు సూర్యకాంతమ్మ రాయుడిని, రాధారాణిని ఒక ఆట ఆడించాలని బడిలో ఉపాధ్యాయులతో కలిసి రామకృష్ణను దాచి పెడతారు. కానీ గోపీ సాయంతో రామకృష్ణ తప్పించుకుని రాధారాణిని పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

నటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • గురువంటే గుండ్రాయి కాదు , గానం. శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  • ఇది సరిగమలెరుగని రాగం , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • అచ్చులు పదహారు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
  • ముద్దొచ్చే పాప, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 పులగం, చిన్నారాయణ (2005). జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం. హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి. p. 83.