తెలుగు

వికీపీడియా నుండి
(Telugu నుండి దారిమార్పు చెందింది)
తెలుగు
మాట్లాడే దేశాలు: భారతదేశం 
ప్రాంతం: ఆంధ్ర ప్రదేశ్ (అధికార భాష), ఛత్తీస్ గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్
మాట్లాడేవారి సంఖ్య: 9.5కోట్లు (మాతృభాష),10.32కోట్లు మొత్తం (రెండవ భాషగా మాట్లాడే ప్రజలతో సహా) 
ర్యాంకు: 13 (మాతృభాష)
భాషా కుటుంబము: ద్రవిడ
 దక్షిణ-మధ్య
  తెలుగు 
వ్రాసే పద్ధతి: తెలుగు లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష: ఆంధ్ర ప్రదేశ్
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1: te
ISO 639-2: tel
ISO 639-3: tel
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...
తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారము

తెలుగు, భారత దేశము లోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష. తెలుగు, భారత దేశం లో తెలుగు మాట్లాడే 7.4 కోట్ల (2000 సంవత్సరపు లెక్కలు) జనాభాతో [1] ప్రాంతీయ భాషలలో మొదటి స్థానం లోను, ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో జాతీయ భాషయిన హిందీ తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 9.32కోట్లు మందికి పైగా[ఆధారం కోరబడినది] ఈ భాషను మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.

విషయ సూచిక

[మార్చు] తెలుగు -ఒక అవలోకనం

భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించినారు[2]. అనగా తెలుగు హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలగు భాషలు చెందు ఇండో ఆర్య భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, తమిళము, కన్నడము, మళయాళము, తోడ, తుళు, బ్రహుయి మొదలగు భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందును. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, కోయ, కొలమి కూడ ఉన్నాయి[3].


తూర్పున కూరఖ్, మాల్తో భాషలు, వాయవ్యాన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో మాట్లాడే బ్రహూయి భాష, దక్షిణాన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి ఖచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స

శ్రీ కృష్ణదేవ రాయలు

తియ్యని తేనెల తెలుగు పలుకక

ఇంగ్లిష్ మీద మోజు పడుట
ఇంట కమ్మని భోజనముండగా
హోటళ్ళ కెగబ్రాకినట్లు భార్గవ -

చేరువేల భార్గవ శర్మ

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?

వినుకొండ వల్లభరాయడు

సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు?

మిరియాల రామకృష్ణ

తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా అంగీకరిస్తుంది. సంస్కృతము ప్రభావము తెలుగు సాహిత్యముపై చాలా ఎక్కువ. సంస్కృతము చూపించినంత ప్రభావము ఇంక ఏ భాష కూడా తెలుగు భాషపై చూపలేదు. నిజానికి తెలుగు లిపిలో చాలా అక్షరములు, ముఖ్యముగా మహాప్రాణ (aspirated) హల్లులు కేవలం సంస్కృతము కోసమే లిపిలోనికి తీసుకొనబడినాయి. "మంచి సంస్కృత ఉచ్చారణ కోస్తా ప్రాంతములోని పండితుల దగ్గర వినవచ్చు" అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఇక్కడి పండితులను పొరుగు రాష్ట్రాల వారు వైదిక కర్మలను జరపడానికి ప్రత్యేకంగా పిలుచుకొని వెళ్ళేవారు అని ప్రతీతి. తెలుగుకి, సంస్కృతమునకు చాలా దగ్గర సంబంధం ఉండడం వలన వారి ఉఛ్ఛారణ స్వఛ్ఛంగా ఉంటుందనటంలో అతిశయోక్తి ఏమీలేదు. ఇప్పటికీ తెలుగు భాషలో సంస్కృత పదములను మనం గమనించవఛ్ఛు. సంస్కృత భాషా ప్రభావం భారత దేశ భాషలన్నింటి మీద ఉంది. కానీ తెలుగు భాషని గమనిస్తే, తెలుగుకి సంస్కృతం మాతృమూర్తి అనిపిస్తుంది. ఎందుకనగా ఉచ్చారణ, భావం సంస్కృతం ను తలపిస్తాయి.

సంస్కృతము తెలుగు సాహితీ ప్రపంచంలో ఓ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నట్లే, పర్షియను, ఉర్దూ పదాలు కూడా తెలుగు కార్యనిర్వాహక పదబంధములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి. బ్రిటీషు వారి పరిపాలనవల్ల, మరియు సాంకేతిక విప్లవం వల్ల ఈ రోజుల్లో ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కూడా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆంగ్ల పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుకోలేరు అని చెప్పడం సత్యదూరం కాదు. భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (జెనెటిక్) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి జాతీయ భాష కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పడములో ఆశ్చర్యము లేదు.

తెలుగువారికి ఆంగ్లము అంటే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ భాషాశాస్త్రపరంగా, సంస్కృతీపరంగా, వ్యాకరణ పరంగానూ ఈ రెండు భాషలూ చాలా దూరంలో ఉంటాయి. తెలుగులో వాక్యం లో కర్త-కర్మ-క్రియ అవే వరుసలో వస్తాయి, కానీ ఇంగ్లీషు నందు మాత్రము కర్త-క్రియ-కర్మ గా వస్తాయి. ఆంగ్లము మాట్లాడువారికి తెలుగులో పదాల వరుస వ్యతిరేకదిశలో ఉంటాయి.

భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటితోనూ పోటీ పడుతుంది. ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో ఇది ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతిశుద్ధంగానూ ఉంటుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని పిలుచుకున్నారు.

తెలుగు (మరియూ ఇతర భారతదేశ బాషలలోని) భాషలో ఒక ప్రముఖమైన విషయము ఏమిటంటే సంధి. రెండు పదాలు పక్కపక్కన చేర్చి పలికినప్పుడు మనకు క్రొత్త మూడవ పదము వస్తుంది.

[మార్చు] చరిత్ర

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" ," పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"

అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దము లో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది[4].


ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.

ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది)

పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి

ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:

అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.

[మార్చు] తెలుగు, తెనుగు, ఆంధ్రము

ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. [5] [6] క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.


ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకవు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను [7].


క్రీ.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రికులు ఈ దేశమును "తిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.

ధర శ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు" గా పరిణామము పొందినదనీ ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి.

[మార్చు] భాష స్వరూపము

[మార్చు] శబ్దము

తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి.

అం అః
/a/ /ɑː/ /ɪ/ /iː/ /u/ /uː/ /ru/ /ruː/ /lu/ /luː/ /e/ /eː/ /ai/ /o/ /oː/ /au/ /am/ /aha/

తెలుగును సాధారణంగా ఒకపదముతో మరొకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.

[మార్చు] మాండలికాలు

అంకతి, ఆంధ్ర , బుడబుక్కల , డొక్కల , చెంచు , ఎకిడి , గొడారి, బేరాది, దాసరి , దొమ్మర , గోలారి, కమ్మర , కామాటి, కాశికాపిడి , కొడువ, మేదరి , మాలబాస, మాతంగి , నగిలి, పద్మసాలి , జోగుల , పిచ్చుకుంట్ల , పాముల , కొండ రెడ్డి, తెలంగాణా, తెలుగు, సగర, వడగ, వడరి, వాల్మీకి , యానాది , బగట, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, మద్రాసు(వడుగ ), ఒరిస్సా(బడగ )--1961 సెన్సస్, బంజారా[లంబాడి],

[మార్చు] లిపి

ప్రధాన వ్యాసము తెలుగు లిపి

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాషనుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించింది[8].

తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది.

తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా

తెలుగు లిపిలో చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్చరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" ( వొవెల్స్ లేదా స్వర్ ) మరియు "హల్లులు" ( కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్ ) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ , చదవడానికీ, అచ్చు "అ" ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరాబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.

[మార్చు] తెలుగు సంఖ్యామానము

ఒకటి = ౧
రెండు = ౨
మూడు = ౩
నాలుగు = ౪
ఐదు = ౫
ఆరు = ౬
ఏడు = ౭
ఎనిమిది = ౮
తొమ్మిది = ౯
పది = ౧౦
నూరు = ౧౦౦
వేయి = ౧౦౦౦
పది వేలు = ౧౦౦౦౦
లక్ష = ౧౦౦౦౦౦
పది లక్షలు = ౧౦౦౦౦౦౦
కోటి = ౧౦౦౦౦౦౦౦
దశ కోటి = ౧౦౦౦౦౦౦౦౦
శత కోటి = ౧౦౦౦౦౦౦౦౦౦
సహస్ర కోటి ( అర్బుదం ) = ౧౦౦౦౦౦౦౦౦౦౦
న్యర్బుదం = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦
ఖర్వము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా ఖర్వము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
పద్మము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా పద్మము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
క్షోణి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా క్షోణి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
శంకము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా శంకము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
క్షితి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా క్షితి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
క్షోభము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా క్షోభము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
నిధి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా నిధి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
పరతం = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
పరర్థము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
అనంతము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
సాగరము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
అవ్యయం = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
అమృతం = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
అచింత్యం = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
అమేయము = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
భూరి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦
మహా భూరి = ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦

[మార్చు] కంప్యూటర్లో తెలుగు

తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072-3199) ఇవ్వబడినది.

[మార్చు] తెలుగు సాహిత్యం

ప్రధాన వ్యాసం: తెలుగు సాహిత్యము

తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును.

[మార్చు] క్రీ.శ. 1020 వరకు - నన్నయకు ముందు కాలం

11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.

[మార్చు] 1020-1400 - పురాణ యుగము

దీనిని నన్నయ్య యుగము అన వచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు.వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే.

నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన(13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.

[మార్చు] 1400-1510 -మధ్య యుగము (శ్రీనాథుని యుగము )

ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.

ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం.

[మార్చు] 1510-1600 - ప్రబంధ యుగము

విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.

[మార్చు] 1600-1820 - దాక్షిణాత్య యుగము

కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసు వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగు నే ఎంచుకొన్నారు.

[మార్చు] 1820 తరువాత - ఆధునిక యుగము

1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

గ్రాంథిక వ్యావహారిక భాషా వాదాలు

నన్నయకు పూర్వమునుండి గ్రాంథిక భాష మరియు వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి. [9]గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూగిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది.

19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యం పెరిగినది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.

[మార్చు] తెలుగు నేర్చుకొనుటకు వనరులు

[మార్చు] ఇంగ్లీషునుండి

[మార్చు] భాషా పరిరక్షణ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తెలుగు అకాడమీ మరియు తెలుగు విశ్వవిద్యాలయం మరియు అధికార భాషా సంఘం నెలకొల్పింది. తెలుగుని ఆధునీకం చేయటానికి పెద్ద బాలశిక్షతో మొదలుకొని ఇటీవలి తెలుగు వికీపీడియా లాంటి విజ్ఞాన సర్వస్వము వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. అయినా ఎన్నో ప్రతికూల ప్రభావాలకు లోనై, తెలుగు భాషవాడుకలో తగ్గిపోతున్నది. తెలుగు భాషా పరిరక్షణ అత్యవసరం.

ప్రముఖ సాహితీవేత్త మాలతీ చందూర్ మాటలలో "తెలుగుభాషకు ఇప్పుడు వచ్చిన ముప్పేమి లేదు అది పాయలను తనలో కలుపుకున్న నదిలా పారుతూనే ఉంటుంది"(స్వాతి)[ఆధారం కోరబడినది].

[మార్చు] ఇతర రాష్ట్రాలలో తెలుగు

తెలుగు దక్షిణ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తమిళనాడు, కర్నాటక లలో కూడా మాట్లాడబడుతుంది.తమిళనాడు లో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. బెంగళూరు జనాభా లొ 30 % ,మంది తెలుగు భాష మాట్లాడువారు నివసించుచున్నారు. తమిళనాడు లోని హొసూరు,కొయంబత్తూరు లొ కూడా తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేలకొలది తమిళప్రాంతము వెళ్ళి స్థిర పడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా,రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజూవారి అవసరాలకు అనుగుణంగా ఆరాష్ట్ర ప్రాంతీయ భాషయిన తమిళము లోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటక లో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు.ఇంకా ఒడిషా, చత్తీస్ ఘడ్,మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రింది ప్రాంతాలలో తెలుగు భాష ఎక్కువ గా మాట్లాడువారు నివసించుచున్నారు 1.ఆంధ్రప్రదెశ్ 2. బెంగళూరు 3. చెన్నై 4. హొసూరు 5.కొయంబత్తూరు 6. మదురై (తమిళనాడు) 7. బళ్ళారి 8. రాయగడ 9. హుబ్లి 10. వారణాసి (కాశి) 11. షిరిడి 12. జగదల్పూర్ 13. బెర్హంపూర్ ఒరిస్సా 14.ఖరగ్ పూర్, పశ్చిమ బెంగాల్ 15. షొలాపూర్ 16. సూరత్ 17. ముంబై -భివాండి 18. ఛత్తిస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలు 19.ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. Abstract of speakers' strength of languages and mother tongues – 2000, Census of India, 2001
  2. తెలుగు-తేనెకన్నాతీయనిది, మైక్రోసాఫ్ట్ భాషాఇండియాలో వ్యాసం
  3. భద్రిరాజు కృష్ణమూర్తి: Krishnamurti, Bhadriraju (2003), The Dravidian Languages Cambridge University Press, Cambridge. ISBN 0-521-77111-0
  4. తెలుగు ప్రాచీనత: http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm
  5. ఆంధ్రుల చరిత్ర - డా. బి.యల్.హనుమంతరావు
  6. తెలుగు సంస్కృతి - మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యాసము]
  7. Ancient India: English translation of Kitab-ul Hind by Al-Biruni, National Book Trust, New Delhi.
  8. The Dravidian Languages, Bhadriraju Krishnamurti, 2003, Cambridge University Press, pp.78-79, ISBN 0-521-77111-0
  9. ఆధునిక యుగం: గ్రాంథిక వ్యావహారిక వాదాలు] - బూదరాజు రాధాకృష్ణ (భద్రిరాజు కృష్ణమూర్తి సారథ్యంలో వెలువడిన తెలుగు భాషా చరిత్ర నుండి)
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు
వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు