అంటు వ్యాధులను నివారించు మార్గములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to searchఅంటు వ్యాధులను నివారించు మార్గములు:[మార్చు]

అంటు వ్వాదులు ఒక ఇంట ప్రవేశించిన తరువాత ఒక్కొక్క రోగికి చికిత్స చేసికొనుట కంటే ఆ వ్యాధులను తమ ఇల్లు చేరకుండ జేసికొనుట యుక్తము. మన గ్రామమునందొక యంటు వ్యాధిని వ్యాపింప కుండ జేయ వలయుననిన ఆ వ్వాధి సంబంధమైన సూక్ష్మ జీవులు ఆ గ్రామములో ప్రవేశింప కుండ మొదట చేయవలెను. ఒక వేళ ప్రవేశించినను పుట్టిన వానిని పుట్టిన చోటనే నశింప జేయవలెను. వ్యాధి గ్రస్తుల యింటి నుండి ఇతరుల ఇండ్లకా సూక్ష్మ జీవులు ఏవిధమునను ప్రయాయము చేయకుండ కాపాడవలెను. అంటు వ్యాధులున్న చోట నుండి పోవు జనులు తమతో కూడా ఆ వాధిని ఇతర స్థలములకు తీసికొని పోకుండ జేయ వలయును. అనగా ఎక్కడి సూక్ష్మ జీవుల నక్కడనే నశింప జేయవలయుననుట. ఇందుకొరకై రోగులుండు ఇంటి లోని నేల మీదను గోడల మీదను సామానుల మీదను దూలముల మీదను ఇంటి పై కప్పులోపలి వైపునను గోడలలో నుండు పగుళ్ళ యందును గల దుమ్ముతో కలిసి పడియుండు సూక్ష్మ జీవులను, తివాసులు, చాపలు, తెరలు, జముకాణాలు, అలంకారములు, పటములు, మొదలగు వాని మీద నుండు దుమ్ముతో కలిసి పడియుండు సూక్ష్మ జీవులను, ఇంటి లోని వారు ఉపయోగించు బట్టలు పాత్ర సామానులు మొదలగు వాని నంటి యుండు సూక్ష్మ జీవులను, రోగి యొక్క మలము మూత్రము ఉమ్మి వాంతులు కళ్ళ (గళ్ళ, కపము) మొదలగు వానిలోనుండు సూక్ష్మ జీవులను మనమెక్కడ కనిపెట్టగలమో అక్కడనే చంప గలిగిన లెడల ఒక యంటు వ్వాధి యొక్క వ్వాపకమును మనము నివారించిన వారమగుదుము.

ఇట్టిది మనకు సాధ్యమగునా? ఎంత వరకు సాధ్యమగునను విషయము గమనింప వలెను. ఇంగ్లాండు దేశములోని ప్రజలు సామాన్యముగ విద్యాధికులును శాస్త్ర జ్ఞానము కల వారును అగుట చేత కొంత వరకీ విషయమున జయము పొంది యున్నారని చెప్ప వచ్చును. వారి దేశమున కుష్ఠు వ్వాధి గాని ప్లేగు వ్వాధి గాని, కలరా గాని, చలి జ్వరము కాని చూచుట అరుదు. వారి దేశానికి చుట్టునున్న సరిహద్దు ప్రదేశములలో అన్ని ఓడ రేవుల యందును తగిన ద్వారపాలకులను కాపులాయుంచుదురు. వీరు క్రొత్తగ దేశానికి రాబోవు ప్రతి మానవుని యొక్క సామగ్రిని శ్రద్ధగా పరిశోధించి వారు పైని చెప్పిన వ్వాధుల సూక్ష్మజీవులను దేశము లోనికి దిగుమతి చేయ కుండ కాపాడు చుందురు. ఇందు చేత తరతరముల కొలది వేల కొలది జనులు వచ్చుచు, పోవు చున్నను వ్వాధులు మాత్రము దేశములో ప్రవేశింప నేరవు. ఇట్లే నాగరకత జెందిన అన్ని దేశముల వారును తమ దేశము లోనికి క్రొత్త వ్వాధులెవ్వియును ప్రవేశింప కుండ నిరంతరం ఫారాయుంచి తమ దేశమును కాపాడు కొను చున్నారు. మన సంగతి ఎట్లున్నదన క్రొత్తవ్వాధులు వచ్చునవి వచ్చు చుండగా నిదివరకే మనదేశము నాశ్రయించి యున్న చలి జ్వరము, కలరా, ప్లేగు, క్షయ కుష్టము మొదలగు వ్వాధులు ఒక్కొక్క సంవత్సరమునకును హెచ్చుచున్నవి. వీనిని నివారించుటకు ముఖ్యమైన పద్ధతులు మూడు గలవు.

1. ప్రకటన చేయుట (Notification), అనగా అంటు వ్వాధి గ్రామములో ప్రవేశించిన తోడనే దానిం దాచి పెట్టక తక్షణమే సర్కారు ఉద్యోగస్తులకును, తరువాత సర్వ జనులకును బహిరంగ పరచ వలెను.

2. ప్రత్యేక పరుచుట (Isolation) అనగా రోగి నుండి యితరుల కా వ్వాధి అంట కుండ రోగిని ప్రత్యేక స్థలమందుంచుట. అనుమానాస్పదమగు ప్రదేశములయందుండి వచ్చు ప్రయాణికులను బలవంతపు మకాములలో (Quarantine) నుంచుటయు నిందిలో జేరును.

3, సూక్ష్మ జీవుల సంహరించుట (Attaacking micorbes).

1. ప్రకటన చేయుట.[మార్చు]

సాధారణముగ మన దేశములో కలరా వచ్చిన రోగి తనకా వ్వాధి అంకురించిన తరువాత కొంత సేపటివరకు ఎవ్వరికిని చెప్పనే చెప్పాడు. భార్యకు కలరా వచ్చిన సంగతి భర్తకు తెలియదు. ఇతరులను తనకొరకు ఎందుకు కష్టపెట్ట వలెనని యొక యుద్దేశ్యము. చెప్పిన యెడల ఇతరులు భయపడురురేమోయని మరియొక ఉద్దేశము. కాని యిట్లు దాచి పెట్టుట ఎంత వరకు సాగును? కొంత సేపు గడచు వరకు కాళ్ళు చేతులు లాగుకొని వచ్చి తిరుగులాడుటకు శక్తి లేక పడి పోవునప్పటికి ఇంటి లోని వారు వచ్చి చూసి ఏమి సమాచార మనగా అప్పుడు రహస్యము బయట పడును. అంటు వ్వాధుల విషయములో ఇట్లు దాచి పెట్టుట మిక్కిలి గొప్ప తప్పు. వ్యాధి తగిలిన తోడనే బహిరంగ పరచ వలెను. బంధువులు స్నేహితు లందరును రోగికి సహాయము చేయ వచ్చును కాని ఏయే వ్వాధి ఏ మార్గమున వ్వాప్తిని జెందునో తెలిసి కొని వ్యాధి రోగి నుండి ఇతరులకు వ్వాపింపకుండ తగు జాగ్రత్తను పుచ్చు కొనుచుండ వలెను. అంటు వ్యాధి సోకిన తోడనే యే మార్గమున వ్వాధి తమ ఇంటికి వచ్చెనో తెలిసి కొనుటకు ప్రత్నింప వలెను. వ్వాధి సోకిన సమాచారము ఇంటి లోని పూచీ దారులెవరో తత్ క్షణము గ్రామాధి కారులకు తెలియ పరచ వలెను. అందుచే వారలు రోగికి తగిన సహాయము చేయుటయే గాక వ్యాధిట్లు వ్వాపించు చున్నదో శోధించి కనిపెట్టి దాని నివారణకు తగిన మార్గములను యోచింతురు. ఆయా గ్రామములో సర్కారు వైద్యుడు లేని యెడల వెంటనే సమీపమున నున్న వైద్యుని పంపుదురు. పట్టణములలో నిప్పుడే ఇంటి యందైనను అంటు వ్యాధి శోకిన తోడనే యింటి యజమాని సర్కారు వారికి సమాచారము తెలుపని యెడల వానికిని రోగిని వైద్యము చేయు వైద్యుడు అట్టి సమాచారము తెలియ పర్చని యెడల వైద్ద్యునకు శిక్ష విధింతురు. ఇప్పటి కంటే ఈ విధి నింకను కఠినముగ నుపయోగించిన యెడల ప్రజల కింకను మేలు కలుగును.

2. ప్రత్యేక పరచుట:[మార్చు]

రోగిని అందరును తాకి వాని నుండి మైల నింటి నిండ కలప కూడదు. రోగి సామాన్య సంసారి యయిన యెడల అతనిని ఆసుపత్రికి పంపుట మేలు. మన ఇండ్లలో నిట్టి రోగుల కుపచారము చేసికొనలేము. సరే కదా ఆపేక్షను విడువ జాలక బంధువు స్నేహితులందరు రోగి చుట్టును చేరి వాని వద్ద ఉండి వ్యాధి నీటింటికి వ్యాపింప జేయుదురు. ఆసుపత్రిలో నిట్టి వ్వాధులకు చికిత్స చేయుటకు ప్రత్యేకముగ నేర్చిన పరిచారికలు ఎల్లప్పుడు సిద్ధముగ నుందురు. రోగి యొక్క సౌఖ్యము ఆలోచింతుమా ఆసుపత్రిలోనే సుఖము. మనము ఒక్కరు చేయు పనిని అక్కడ పది మంది చేయుదురు. అది గాక యక్కడి వారలకు దినదిన మలవాటయి యుండుట చేత ప్రతి చికిత్సయు చక్కగ యధావిధిగ జరుగును. ఇంతి లోని ఇతర బంధువుల సౌక్యం ఆలోచించితిమా రోగిని ఆసుపత్రికి పంపుటయే వుచితము. తమ కా వాధి యంటుట కవకాశము తగ్గియుండును. రోగి యందలి ప్రీతిచే రోగిని చూడ వలయుననిన ఆసుపత్రికి పోయి దినదినము చూచు చుండవచ్చును. ఇట్లు చేయుట చేత వారు తమ కుపకారము చేసికొను చుండుట యే కాక వ్వాధి యొక్క వ్యాపకమును తగ్గించి దేశానికి కూడా ఉపకారులగు చున్నారు. రోగిని తమ యింటి యందే ప్రత్యేకముగ నొక చోట నుంచి తగిన వైద్యుని పరిచారికలను పిలిపించి వలసినంత ద్రవ్యము ఖర్చు చేసి వైద్యము చేయించు కొనుటకు శక్తి గల వారట్లు చేసిన చేయవచ్చును. అట్లు చేయ వలెననిన రోగి యొక్క సంరక్షకులు చక్కగ చదువుకొనిన వారై ఈ క్రింది సూక్ష్మములను శ్రద్ధతో గమనించు వారుగ నుండ వలెను.

1.రోగిని ప్రత్యేకముగ నొక గదిలో నుంచ వలెను. ఈ గది లోనికి చక్కగ గాలి వచ్చు నట్లు కిటికీలు వుండవలెను. ఈ గదిలోని యవసరమైన సామానులు అనగా పెట్టెలను తివాసులను, బట్టలను ముందుగా తీసి వేయవలెను.

2. ఈ గదిలోనికి పరిచారకులను తప్ప ఇతరులను పోనివ్వ కూడదు. చీమలను ఈగలను కూడా ఈ గదిలోనికి పోనివ్వకూడదు. ఒకచో మనల నివి దాటి పోయిన ఎడల వీనిని గదిలోనే పట్టి చంపి వేయవలెను. వీనిని పట్టుటకు జిగురు కాగితము లమ్మునని ఇదివరులో చెప్పియున్నాము. ఎవ్వరైనను గదిలోని వారలతో గాని రోగితో గాని మాటలాడ వలెననిన ఎడల వెలుపలనే నిలుచుండి కిటికీల గుండ మాటలాడవలెను.

3. కిటికీలను సాధ్యమైనంత వరకు తెరచి యుంచ వలెను.

4. రోగికి ఉపచారము చేయుటకు ప్రత్యేకముగ నొకరినిద్దరిని తగు వారి నేర్పరచ వలెను. మశూచికపు రోగుల కుప చారము చేయుటకు సాధారణముగ నిదివరకొకసారి ఈ వ్వధి వచ్చిన వారైన యెడలమంచిది. వీరు మాటి మాటికి బయటికి వచ్చి ఇతరులను తాక కూడదు. వీరు దుస్తులు ఉతికి ఆర వేసి కొనుటకు తగినవిగా నుండవలెను. బూర్నీసులు, శాలువలు మొదలగునవి సాధ్యమయినంవరకు కూడదు. వీరు పని తీరిన తోడనే మయిల బట్టలను విడిచి వేడి నీల్లలో నుడక వేసి స్నానము చేసి శుభ్రమైన బట్టలను కట్టుకొనిన పిమ్మటనే భోజనము చేయ వలెను. రోగిని తాకిన చేతులను మిక్కిలి శుభ్రముగ నయిదు నిముషముల వరకైనను తక్కువ కాకుండ మందు నీళ్ళలో ముంచి యుంచవలెను. గోళ్లలోని మట్టి సహితము మిక్కిలి శుభ్రముగా కడుగు కొనవలెను.

5.రోగి యొక్క సంపర్కము గల పిల్లను బడికి పోనీయ కూడదు.

6. రోగి నుండి వెలువడు విరేచనములను, మూత్రమును, గళ్ళను, వాంతులను వేనిని కూడా ముందు చెప్పబోవు ప్రకారము మందు నీళ్లతో కలుప కుండ గదిలో నుండి బయటికి పోనియ్య కూడదు. రోగి విడిచిన ఆహారాదులను కూడా మందు నీళ్లతో కలుపకుండ బయటికి పోనీయ రాదు. ఇట్టి వానిని మందు నీళ్లతో కలిపి పూడ్చి వేయవలెను. లేదా ఊకతో కలిపి కాల్చి వేయ వలెను.

7.రోగి యొక్క బట్టలను, గుడ్డలను, మందు నీళ్లలో తగినంత కాలము బాగుగ నాననిచ్చి యుడకబెట్టి ఎండలో ఆరవేయవలెను. తడుపుటకు వీలు లేని వేవయిన యున్న యెడల వానిని రెండు మూడు దినములు బాగుగ నెండలో వేయవలెను. లేదా ఈ బట్టలింటిలో నితరులు ఉపయోగ పరచిన యడల వ్యాధి వారల కంటు కొనుట సులభము.

8. రోగికి నెమ్మదించిన తరువాత మందు నీళ్లతో నతని శరీరమంతయు చక్కగ తుడిచి స్నానము చేయించ వలెను.

9. రోగి గదిని విడిచిన తరువాత దాని గోడలను, నేలను, చక్కగ మందు నీళ్లతో కడుగ వలేను. గోడలను కడుగుటకు వెదురు పిచ్చి కారీలనుగాని బొంబాయి పంపును గాని ఉపయోగించ వలెను. లేదా నెరబీట్లలోని సూక్ష్మ జీవులట్లనే దాగి యుండి గదిలోనికి ముందు రాబోవు వారికి ఆ వ్వాధి నంటింప వచ్చును.

10. రోగి చనిపోయిన యెడల నాతని శరీరమును మందు నీళ్లతో తడిపిన బట్టలతో కప్పి యుంచి తగినంత త్వరలో దహనదాదులు చేయ వలెను.

పైని చెప్పినవన్నియు సన్ని పాత జ్వరము, కలరా, మశూచి, మొదలగు అనేక యంటు వ్యాధులకుపయోగ పడును. కాని కొన్ని వ్వాధులలో వ్వాధి గ్రస్తునలు ప్రత్యేక పరుచుటకు వేరు వేరు పద్ధతులు గలవు. చలి జ్వరపు రోగి నుండి వ్యాధి ఇతరులకు రాకుండ జేయవలెననిన రోగిని దోమ తెర గల మంచము మీద పరుండ బెట్టి వాని నుండి చలి జ్వరపు విత్తనములను దోమలు తీసికొని పోయి ఇతరులకు జార వేయ కుండ చూచు కొనవలెను. ఇట్టి నిబంధనలను ఆయా వ్యాధిని గూర్చి చర్చించు నపుడు వ్రాసెదము.

బలవంతపు మకాములు.[మార్చు]

ఇంత వరకు వ్యాధి గ్రస్తులను మాత్రము ప్రత్యేక పరచుటను కూర్చి చెప్పి యున్నాము. ఒకానొకప్పుడు అంటు వ్వాధి గలదను అను మానము గల వారిని వారితో సంపర్కము గల యితరులను కూడా ప్రత్యేకముగ నొకచో నిర్బంద పరచి యుంచ వలసి వచ్చును. ఒక యూరిలో కలరా యున్నదను కొనుడు. ఆయూరి మనుష్యు లెవ్వరును సమీపపు గ్రామములకు పోకుండ చేయ గలిగితిమా ఆయూరి వ్వాధి ఇతర గ్రామములకు పోకుండ చేయ వచ్చును . ఇట్లే యొక ప్రదేశమునందొక యంటు వ్వాధి యున్నప్పుడు ఆ ప్రదేశము నుండి రైలు మార్గమున గాని, పడవ మార్గమున గాని, కాలి నడకను గాని ఇతర ప్రదేశములకు పోవు ప్రజలనందరిని వ్వాధిగల ప్రదేశము దాటగానె

బొమ్మ

గోడలపై మందు నీళ్లు చల్లు గొట్టము

1.గోడలమీద మందు నీళ్ళను చల్లుటకు ఉపయోగించు చిమ్మెడు గొట్టము.

ఎక్కడైనను ఒక చోట బలవంతముగ ఆపి అనుమానము తీరు వరకు వారలను శోధన లోనుంచి అంటు వ్వాధి ఏదియును లేదని దృఢమయిన పిమ్మట వ్యాధి లేని దేశము లోనికి పోనివ్వవలెను. ప్లేగు వ్యాధికి సాధారణముగ పది దినములును, మశూచికమునకి 12 దినములు నిట్టి శోధనలో నుంచుదురు. అంటు వ్వాధి కలదని అనుమానము గల దేశముల నుండి వచ్చు ఓడలను నియమముల ప్రకారము కొన్ని దినముల వరకు రేవునకు వెలుపలనే కట్టి యుంచి యందలి ప్రయాణికులను దినదినము శోధించి చూతురు. వ్వాధి లేదని స్పష్ట పడిన పిమ్మటనే ఓడలను రేవులోనికి రానిత్తురు.

ఇట్లు రోగము లేని వారిని రోగమున్న వారిని కూడా మధ్యమకాములలో బలవంతముగ నాపుటచే కొంత వరకు లాభమున్నను ఇబ్బందు లనేకములు గలవు.

1. వ్వాధి యున్నదని చెప్పిన ఎక్కడ బలవంతముగా నాపుదురో యను భయము చేత రోగులు వ్వాధిని దాచుదురు. తామొక చోట నుండి వచ్చుచు, మరియొక చోట నుండి వచ్చు చున్నామని అద్ద మాడి తప్పించుకొన ప్రయత్నించుదురు.

2. ఒకానొకప్పుడు మనమొకటి రెండు వారములు ప్రయాణీకుల నొక్క చోట మకాము వేయించిన యెడల, ఈ మకాములలో వ్యాధి గ్రస్తులు, వ్వాధి లేని వారు కలిసి యుండుట చేత నిక్కడ క్రొత్త వారికి వ్యాధి యంకురించి మనకు తెలియకయే వారు ఇతర ప్రదేశముల కా వ్యాధిని గొని పోవచ్చును.

3. బలవంతపు మకాములలో బాట సారులకు భోజనాది సౌకర్యములు కూర్చుట బహు కష్టము. అందుచే బడలియున్న బాటసారుల నీ యంటు వ్వాధులు అధికముగ బాధింప వచ్చును. కావున నిట్టి బలవంతపు మకాములచే ప్రజలను భీతి చెందించుట కంటే ప్రజలకు అంటు వ్యాధి యొక్క వ్యాపకమును వాని నివారణ పద్ధతులను గూర్చి విషయములను బోధించుటకు సులభ శైలిని వ్వాసములు వ్రాసి విరివిగ పంచి పెట్టి ప్రజలకు వాని యందు విశ్వాసము కలుగునట్లు చేయ వలెను. అంటు వ్యాధి గల చోట్ల కితర దేశముల యందలి ప్రజలు పోకుండ వారికి బోధింప వలెను. అంటు వ్యాధి గల ప్రదేశముల నుండి వచ్చు వారల కందరకు రహదారి చీటి (passport) నొకదాని నిచ్చి వారు ప్రతిదినము సర్కారు ఉద్యగస్థుని పరీక్షలో నుండు నట్లు తగు యేర్పాటు చేయవలెను. క్రొత్త ప్రదేశములలో నెక్కడనైన ఈ వ్యాధి వచ్చిన యెడల ఈ రహదారి చీట్ల మూలమున వెంటనే కనిపెట్టవచ్చును. వారిని ప్రత్యేకముగా గ్రామమునకు తగినంత దూరములోనుంచి చికిత్స చేసి వ్యాధి ఊరూరునకు వ్యాపింప కుండ చేయ వచ్చును. ప్లేగు రహదారి చీట్లును బాటసారుల కిచ్చు నుద్దేశమిదియె.

3.సూక్ష్మజీవుల సంహారము.[మార్చు]

ఇంతవరకు అంటు వ్వాధుల సంపర్కము సాధ్యమైనంత వరకు లేకుండ జేసి కొనుటను గూర్చి చెప్పి యున్నాము. ఇంక ఈ అంటు వ్వాధులకు కారణ భూతములగు సూక్ష్మ జీవుల మీదికి దండెత్తవలెను.

1. వానికిని వాని సహ కారులకును తినుటకు ఆహారమును, నిలువ నీడయును, లేకుండ వానిని మాడ్చి నశింప చేయవలెను. (Starvation).

2. సూక్ష్మ జీవులు మన చుట్టు నుండినను, అవి మన కంటకుండనెవరి శరీరములను వారు కాపాడు కొన వలయును. (personal precaution)

3. అవి మా శరీరములో ప్రవేశించినను మనకు హాని కలగ కుండ రక్షణ శక్తి కలుగ జేసి కొనవలెను. (Immunity).

4. సూక్ష్మ జీవులను వెదకి వెదకి చంప వలెను. (Disinfection).

1. సూక్ష్మ జీవులకు తగిన నివాస స్థానములును ఆహారము లేకుండ చేయుట.[మార్చు]

సూక్ష్మ జీవుల నివాస స్థానముల గూర్చియు, ఆహార పద్ధతులం గూర్చియు పైని వివరముగ వ్రాసి యున్నాము. ఈగలు దోమలు మొదలగు జంతువులు ఈ సూక్ష్మ జంతువుల కెట్టు సహాయపడునో ఐది కూడా వ్రాసి యున్నాము. వాని నన్నింటిని చక్కగ గమనించుచు మనము వినసించు ప్రదేశములు మిక్కిలి పరిశుభ్రముగ నుంచు కొనిన యెడల అంటు వ్వాధుల వ్వాప్తి మిక్కిలి తగ్గి పోవును. ముఖ్యముగ దోమలను రూపు మాపిన చలి జ్వరము అడుగంటుననియు, ఈగలను రూపు మాపిన అనేక అంటు వాధులు నశించు ననియు నమ్మవలెను. ఆయా వ్యాధుల శీర్షికల క్రింద ఆయాజాతి సూక్ష్మజీవుల నెట్లు నివారింప వచ్చునో తెలియ పరచెదము.

2. మన శరీర బలమును కాపాడుకొని సూక్ష్మజీవులను చేర నీయ కుండ జేసికొనుట రెండవ సాధనము. దేహ దార్డ్యము తక్కువగ నున్నపుడు సూక్ష్మ జీవులు త్వరలో మనలను జయింప గలవని వెనుక వ్రాసి యున్నాము. నిర్మలమైన వాయువు, నీరు, ఆహారము మొదలైన వానిని గూర్చి మనము శ్రద్ధ పుచ్చుకొనుచు సాధ్యమైనంత వరకు మనశరీర బలమును మనము కాపాడు కొన వలెను. సారాయి, నల్లమందు, గంజాయి మొదలగు పదార్థములు శారీర పటుత్వమును తగ్గించును. గావున వానిని విసర్జింప వలెను. పచ్చి కాయలను, మాగిపోయిన కాయలను తిన కూడదు. చెడి పోయిన మాంసము, చేపలు, వీనిని తినకూడదు. వివాహాదులందు జన సంఘములు చేరి మితి మీరి వేళతప్పి భుజింప రాదు. యాత్రా స్థలములలో నీ విషయమై బహు జాగ్రత్తగ నుండవలెను. ఉపవాసముల పేర శరీర దార్డ్యమును పోగొట్టుకొనరాదు. ఆటల కొరకు గాని, విద్యాభ్యాసము కొరకు గాని, రాత్రుల యందదికముగ మేల్కొన రాదు. సగటున ఆరు లేక ఏడు గంటల నిద్ర యుండ వలయును. పిల్లలకు ఎనిమిది గంటల నిద్రకు తగ్గి యుండరాదు. బాల్య వివాహములు కూడదు. మనము బలహీనుల మైనచో మన సంతాన మంతకంటెను బలహీనమగును. బలముగల వారి శరీరములో సూక్ష్మ జీవులు ప్రవేశించినను, సాధారణముగ వ్యాధులను కలుగ జేయవు. మన శరీర బలమే దేశము యొక్క బలమని నమ్మి ఎల్లప్పుడు ఆత్మ బలమును కాపాడు కొన వలయును.

3. రక్షణ శక్తి గలుగ జేసికొనుట (Immunity) ఈ వివరాలు గత వ్యాసములో ఉన్నాయి.

4. సూక్ష్మ జీవులను వెదకి వెదకి చంపుట (Disinfection) దీనిని గూర్చి తరువాతి వ్యాసములో చూడవచ్చును.