అంతరిక్ష అన్వేషణ


అంతరిక్ష అన్వేషణ అనేది మానవరహిత రోబోటిక్ అంతరిక్ష పరిశోధక నౌకల ద్వారా, మానవ అంతరిక్ష యానం ద్వారానూ చేసే బాహ్య అంతరిక్షపు భౌతిక పరిశోధన. ఖగోళ శాస్త్రం అని పిలువబడే అంతరిక్షంలోని వస్తువుల పరిశీలన, నమోదైన చరిత్ర కంటే ముందు నుండే మానవుడు చేస్తున్నప్పటికీ, ఇరవయ్యవ శతాబ్దం మధ్యలో జరిగిన పెద్ద, సాపేక్షంగా సమర్థవంతమైన రాకెట్ల అభివృద్ధి కారణంగా భౌతిక అంతరిక్ష అన్వేషణ అనేది వాస్తవం లోకి వచ్చింది. అంతరిక్షాన్ని అన్వేషించడానికి సాధారణ కారణాలలో శాస్త్రీయ పరిశోధనను ముందుకు తీసుకెళ్లడం, జాతీయ ప్రతిష్ఠ, వివిధ దేశాలను ఏకం చేయడం, మానవాళి భవిష్యత్ మనుగడను నిర్ధారించడం, ఇతర దేశాలకు వ్యతిరేకంగా సైనిక, వ్యూహాత్మక ప్రయోజనాలను అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి.
అంతరిక్ష అన్వేషణ లోని తొలిదశ "అంతరిక్ష పోటీ" ద్వారా నడిచింది, ఇందులో సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ తమ సాంకేతిక ఆధిక్యతను ప్రదర్శించడానికి పోటీపడ్డాయి. ఈ యుగంలోని మైలురాళ్ళుగా, 1957 అక్టోబరు 4న సోవియట్ యూనియన్ స్పుత్నిక్ 1 అనే మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువును భూమి చుట్టూ కక్ష్యలోకి ప్రయోగించడం, 1969 జూలై 20న అమెరికన్ అపోలో 11 మిషన్ ద్వారా చంద్రునిపై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టడం వంటివి ఉన్నాయి. సోవియట్ అంతరిక్ష కార్యక్రమం అనేక తొలి మైలురాళ్ళను సాధించింది. వాటిలో 1957 లో కక్ష్యలోకి మొట్టమొదటి జీవిని పంపడం, 1961లో మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర (వోస్టోక్ 1లో యూరి గగారిన్), 1965 మార్చి 18న మొట్టమొదటి స్పేస్‌వాక్ ( అలెక్సీ లియోనోవ్ ద్వారా), 1966 లో మరొక ఖగోళ వస్తువుపై మొట్టమొదటి ఆటోమేటిక్ ల్యాండింగ్, 1971లో మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం (సాల్యూట్ 1) ప్రయోగం వంటివి ఉన్నాయి.
1970 లలో, ఒకేఒక్కసారి చేసే ప్రయాణాల నుండి మళ్ళీ మళ్ళీ ఉపయోగించగల స్పేస్ షటిల్ కార్యక్రమం వంటి హార్డ్‌వేర్‌కు దృష్టి మారింది. "పోటీ" నుండి "సహకారానికి" మారింది, 1998 - 2011 మధ్య నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) దీనికి ప్రధాన ఉదాహరణ.[1]
2000 వ దశాబ్దంలో చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, భారతదేశాల జాతీయ అంతరిక్ష-అన్వేషణ కార్యక్రమాలలో పురోగతి వచ్చింది. 2010వ దశాబ్దం ప్రైవేట్ ప్రయోగ వాహనాలు, స్పేస్ క్యాప్సూల్స్, ఉపగ్రహ తయారీ అభివృద్ధితో ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. 2020వ దశాబ్దంలో, ప్రాముఖ్యత పొందుతున్న రెండు ప్రాథమిక ప్రపంచ కార్యక్రమాలు చంద్రునిపై దృష్టి సారించాయి: చైనా నేతృత్వంలోని అంతర్జాతీయ చంద్ర పరిశోధనా కేంద్రం, చంద్రునిపై ఆర్టెమిస్ బేస్ క్యాంప్‌ను నిర్మించే ప్రణాళికతో అమెరికా నేతృత్వంలోని ఆర్టెమిస్ కార్యక్రమం. ఈ రెండింటికీ అంతర్జాతీయ భాగస్వాములు ఉన్నారు.[2][3][4]
అన్వేషణ చరిత్ర
[మార్చు]
మొదటి టెలిస్కోపులు
[మార్చు]మొట్టమొదటి టెలిస్కోప్‌ను 1608లో నెదర్లాండ్స్‌లో హన్స్ లిప్పర్‌షే అనే కళ్లద్దాల తయారీదారు కనుగొన్నారని చెబుతారు, కానీ ఖగోళశాస్త్రంలో వాటిని ఉపయోగించినట్లుగా నమోదైన మొదటి ఉదాహరణను 1609లో గెలీలియో గెలీలీ ఉపయోగించాడు.[5] 1668లో ఐజాక్ న్యూటన్ తన సొంత రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్‌ను నిర్మించాడు. ఇది ఈ రకమైన మొట్టమొదటి పూర్తిస్థాయి టెలిస్కోపు. ఇది మునుపటి గెలీలియన్ టెలిస్కోప్ కంటే దాని ఉన్నతమైన లక్షణాల కారణంగా భవిష్యత్ అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలిచింది. [6]
అప్పుడు, ఆ తరువాతి శతాబ్దాలలో సౌర వ్యవస్థలో (దానికి ఆవల) వరుస ఆవిష్కరణలు జరిగాయి: చంద్రునిపై పర్వతాలు, శుక్రుని దశలు, బృహస్పతి, శని గ్రహాల ప్రధాన ఉపగ్రహాలు, శని వలయాలు, అనేక తోకచుక్కలు, గ్రహశకలాలు, యురేనస్, నెప్ట్యూన్ అనే కొత్త గ్రహాలు, మరెన్నో ఉపగ్రహాలు కనుగొన్నారు.
ఆర్బిటింగ్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ 2 1968 లో ప్రయోగించిన మొదటి అంతరిక్ష టెలిస్కోపు.[7] కానీ 1990లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగం [8] అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయిని నెలకొల్పింది. 2022 డిసెంబరు 1 నాటికి, 5,284 ధృవీకరించబడిన ఎక్సోప్లానెట్లను కనుగొన్నారు. పాలపుంతలో 100–400 బిలియన్ల నక్షత్రాలూ [9] 100 బిలియన్లకు పైగా గ్రహాలూ ఉన్నాయని అంచనా.[10] గమనించదగిన విశ్వంలో కనీసం 2 ట్రిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి.[11] HD1 భూమి నుండి తెలిసిన అత్యంత సుదూర వస్తువు, ఇది 33.4 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు నివేదించబడింది.[12][13][14][15]
తొలి అంతరిక్ష యాత్రలు
[మార్చు]

MW 18014 అనేది 1944 జూన్ 20 న జరిగిన ఒక జర్మన్ V-2 రాకెట్ పరీక్షా ప్రయోగం. ఇది పీనెముండేలోని పీనెముండే ఆర్మీ రీసెర్చ్ సెంటర్‌లో జరిగింది. బాహ్య అంతరిక్షాన్ని చేరుకున్న మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువు ఇదే. ఇది 176 కిలోమీటర్ల అపోజీని సాధించింది. ఇది కార్మాన్ రేఖ కంటే చాలా ఎత్తు.[16] ఇది నిట్టనిలువుగా చేసిన పరీక్షా ప్రయోగం. రాకెట్ అంతరిక్షాన్ని చేరుకున్నప్పటికీ, అది కక్ష్య వేగాన్ని అందుకోలేకపోయింది. అందువల్ల వెనక్కి వచ్చి భూమిపై పడిపోయింది. ఇది మొట్టమొదటి ఉప-కక్ష్య (సబ్ ఆర్బిటాల్) అంతరిక్ష యాత్రగా నిలిచింది.[17] 1949లో, బంపర్-WAC 393 kilometres (244 mi) ఎత్తుకు చేరుకుంది. నాసా ప్రకారం, ఇది అంతరిక్షంలోకి ప్రవేశించిన మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువు.[18]
కక్ష్యలో మొదటి వస్తువు
[మార్చు]మొట్టమొదటి విజయవంతమైన కక్ష్య ప్రయోగం 1957 అక్టోబరు 4న సోవియట్ మానవరహిత స్పుత్నిక్ 1 ("ఉపగ్రహం 1") మిషన్ ద్వారా జరిగింది. ఆ ఉపగ్రహం బరువు సుమారు 83 kg (183 lb). భూమి చుట్టూ సుమారు 250 km (160 mi) ఎత్తులో పరిభ్రమించింది. దీనికి రెండు రేడియో ట్రాన్స్‌మిటర్లు (20, 40 MHz) ఉన్నాయి. స్పుత్నిక్ 1 విడుదల చేసిన "బీప్" శబ్దాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియోలకు వినపించింది. అయనోస్పియర్ లోని ఎలక్ట్రాన్ సాంద్రత గురించి సమాచారాన్ని సేకరించడానికి రేడియో సంకేతాల విశ్లేషణను ఉపయోగించారు. అయితే ఉష్ణోగ్రత, పీడన డేటాను రేడియో బీప్‌ల వ్యవధిలో ఎన్‌కోడ్ చేశారు. ఉపగ్రహం ఉల్క వలన దెబ్బతినలేదని ఫలితాలు సూచించాయి. స్పుత్నిక్ 1 ను R-7 రాకెట్ ద్వారా ప్రయోగించారు. 1958 జనవరి 3న స్పుత్నిక్, తిరిగి భూమిలోకి ప్రవేశించి కాలిపోయింది.
మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర
[మార్చు]మొట్టమొదటి విజయవంతమైన మానవ అంతరిక్ష యాత్ర వోస్టోక్ 1 ("తూర్పు 1"). 1961 ఏప్రిల్ 12న 27 ఏళ్ల రష్యన్ వ్యోమగామి యూరి గగారిన్ ఈ యాత్రలో పాల్గొన్నాడు. ఈ అంతరిక్ష నౌక సుమారు 1 గంట 48 నిమిషాల పాటు భూమి చుట్టూ ఒక పరిక్రమణను పూర్తి చేసింది. గగారిన్ యాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది; ఇది ఆధునిక సోవియట్ అంతరిక్ష కార్యక్రమానికి ఒక నిదర్శనంగా నిలిచింది. అంతరిక్ష పరిశోధనలో మానవ అంతరిక్ష యాత్ర అనే ఒక సరికొత్త శకాన్ని ప్రారంభించింది.
మొదటి ఖగోళ వస్తువుల అంతరిక్ష అన్వేషణలు
[మార్చు]మరొక ఖగోళ వస్తువును చేరుకున్న మొదటి కృత్రిమ వస్తువు లూనా 2, ఇది 1959లో చంద్రుడిని చేరుకుంది. [19] మరొక ఖగోళ వస్తువుపై మొట్టమొదటి సాఫ్ట్ ల్యాండింగు, 1966 ఫిబ్రవరి 3 న చంద్రుడిపై లూనా 9 చేసింది.[20] లూనా 10 చంద్రుడిపై దిగిన మొదటి కృత్రిమ ఉపగ్రహం అయ్యింది. ఇది 1966 ఏప్రిల్ 3న చంద్ర కక్ష్యలోకి ప్రవేశించింది. [21]
మరో ఖగోళ వస్తువుపై మొట్టమొదటి మానవసహిత ల్యాండింగ్‌ను 1969 జూలై 20న అపోలో 11 చంద్రునిపై నిర్వహించింది. 1969 నుండి మొదలుకొని 1972 లో చివరి మానవ ల్యాండింగ్ వరకు, మానవులతో కూడిన మొత్తం ఆరు అంతరిక్ష నౌకలు చంద్రునిపై దిగాయి.
మొట్టమొదటి అంతర్ గ్రహ సమీప ప్రయాణం 1961లో వెనెరా 1 ద్వారా శుక్రుని సమీప ప్రయాణం కాగా, 1962లో మారినర్ 2 శుక్రుని సమీప ప్రయాణం నుండి సమాచారాన్ని పంపిన మొట్టమొదటిది (అత్యంత సమీప దూరం 34,773 కిలోమీటర్లు). సూర్యుని చుట్టూ పరిభ్రమించిన మొట్టమొదటి ఉపగ్రహం పయనీర్ 6, దీనిని 1965 డిసెంబరు 16న ప్రయోగించారు. ఇతర గ్రహాలను మొట్టమొదటిసారిగా సమీపించినవి: 1965లో మారినర్ 4 ద్వారా అంగారకుడిని, 1973లో పయనీర్ 10 ద్వారా బృహస్పతిని, 1974లో మారినర్ 10 ద్వారా బుధుడిని, 1979లో పయనీర్ 11 ద్వారా శనిని, 1986లో వాయేజర్ 2 ద్వారా యురేనస్‌ను, 1989లో వాయేజర్ 2 ద్వారా నెప్ట్యూన్‌ను. 2015లో, మరగుజ్జు గ్రహాలైన సెరెస్, ప్లూటోల చుట్టూ డాన్ పరిభ్రమించగా, న్యూ హొరైజన్స్ వాటిని దాటి వెళ్ళింది. ఇది సౌర వ్యవస్థలోని ఎనిమిది గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, సెరెస్, ప్లూటో ( గుర్తించబడిన ఐదు మరగుజ్జు గ్రహాలలో రెండు) సమీప ప్రయాణాలను వివరిస్తుంది.
మరో గ్రహం ఉపరితలం నుంచి కనీస స్థాయి సమాచారాన్నైనా భూమికి పంపిన తొలి అంతర్గ్రహ ఉపరితల యాత్ర, 1970లో జరిగిన వెనెరా 7. అది శుక్రుడి ఉపరితలం నుంచి 23 నిమిషాల పాటు భూమికి సమాచారం పంపింది. 1975లో జరిగిన వెనెరా 9, మరో గ్రహ ఉపరితలం నుంచి చిత్రాలను పంపిన తొలి యాత్రగా నిలిచింది. అది శుక్రుడి ఉపరితలం చిత్రాలను భూమికి పంపించింది. 1971లో జరిగిన మార్స్ 3, అంగారకుడిపై తొలిసారి మెల్లగా దిగింది. అది దాదాపు 20 సెకన్ల పాటు సమాచారం పంపగలిగింది. తర్వాత మరింత దీర్ఘకాలంపాటు చేసిన ఉపరితల యాత్రలు విజయవంతమయ్యాయి. వైకింగ్ 1, 1975 నుంచి 1982 వరకు ఆరు సంవత్సరాలకు పైగా అంగారకుడి ఉపరితలంపై పనిచేసింది. అలాగే, 1982లో జరిగిన వెనెరా 13, వీనస్ ఉపరితలం నుంచి రెండు గంటలకు మించిన సమయం పాటు సంకేతాలను పంపింది. ఇది సోవియట్లు చేసిన గ్రహ ఉపరితల యాత్రల్లో అత్యంత దీర్ఘకాల ప్రసారంగా నిలిచింది. భూమికి బయట, మానవరహిత రోబోటిక్ అంతరిక్ష నౌకల ద్వారా మానవుడు ఉపరితల యాత్రలు నిర్వహించిన గ్రహాలు శుక్రుడు, అంగారకుడు మాత్రమే.
మొదటి అంతరిక్ష కేంద్రం
[మార్చు]సొల్యూత్ 1 అనేది మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం. దీనిని సోవియట్ యూనియన్ 1971 ఏప్రిల్ 19 న భూమికి సమీప కక్ష్యలోకి ప్రయోగించింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో పనిచేస్తున్న రెండు అంతరిక్ష కేంద్రాలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) అతిపెద్దదీ, అత్యంత పురాతనమైనదీ. 2000 సంవత్సరం నుండి నిరంతరంగా ఇందులో మానవులు నివసిస్తూ ఉన్నారు. చైనా నిర్మించిన మరొక అంతరిక్ష కేంద్రమైన టియాంగాంగ్ ఇప్పుడు పూర్తిస్థాయి సిబ్బందితో పనిచేస్తోంది.
నక్షత్ర మండలాల మధ్య మొదటి యాత్ర
[మార్చు]2012 ఆగస్టు 25న వాయేజర్ 1 సౌర వ్యవస్థను విడిచిపెట్టి నక్షత్రమండలాల మధ్య అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువుగా నిలిచింది. ఈ ప్రోబ్ 121 AU వద్ద ఉన్న హీలియోపాజ్‌ను దాటి నక్షత్రమండలాల మధ్య నున్న అంతరిక్షంలోకి ప్రవేశించింది.[22]
భూమికి అత్యంత దూరంలో
[మార్చు]1970లో, అపోలో 13 యాత్ర చంద్రుడి అవతలి వైపు నుంచి, చంద్రుని ఉపరితలం పైన 254 కిలోమీటర్ల (158 మైళ్లు; 137 నాటికల్ మైళ్లు) ఎత్తు వరకు వెళ్ళింది. ఆ సమయంలో అది భూమి నుండి 4,00,171 కిలోమీటర్ల దూరానికి చేరింది. దీంతో, మనుషులు భూమి నుంచి చేసిన అత్యంత దూర ప్రయాణంగా అది నమోదైంది. ఆ రికార్డు 2026 ఏప్రిల్‌లో జరిగిన ఆర్టెమిస్ II ప్రయోగం వరకు నిలిచింది. ఈ యాత్రలో తన అత్యంత దూర బిందువులో అర్టెమిస్, భూమి నుండి 4,06,773 కిలోమీటర్ల దూరానికి చేరింది. ఇది కొత్త రికార్డు
2025 ఫిబ్రవరి 9 నాటికి, వాయేజర్1 భూమి నుంచి 166.4 ఏస్ట్రొనామికల్ యూనిట్ల (AU) — అంటే సుమారు 24.89 బిలియన్ కిలోమీటర్లు — దూరంలో ఉంది.[23] భూమి నుంచి అత్యంత దూరం చేరిన మానవ నిర్మిత వస్తువు ఇదే.[24]
అన్వేషణ లక్ష్యాలు
[మార్చు]20వ శతాబ్దం మధ్యకాలం నుంచి మొదట పరిశోధనా యానాలను, తర్వాత మానవ యాత్రలను భూమి కక్ష్యలోకి పంపించారు. అనంతరం చంద్రుడికి కూడా యాత్రలు జరిగాయి. అలాగే, తెలిసిన సౌర కుటుంబం అంతటా పరిశోధనా యానాలను పంపించడంతో పాటు, కొన్ని యానాలను సూర్యుని కక్ష్యలోకి కూడా ప్రవేశపెట్టారు. 21వ శతాబ్దానికి వచ్చేసరికి, మానవరహిత అంతరిక్ష నౌకలు శని, గురుడు, అంగారకుడు, శుక్రుడు, బుధుడు గ్రహాల కక్ష్యల్లోకి ప్రవేశించాయి. అత్యంత దూరం వరకు వెళ్లిన క్రియాశీల అంతరిక్ష యానాలు వాయేజర్ 1, వాయేజర్ 2; ఇవి భూమి-సూర్యుని దూరానికి వంద రెట్లు మించిన దూరం దాటాయి. వాటి పరికరాల ద్వారా లభించిన సమాచారాన్ని బట్టి, అవి సూర్యుని హీలియోస్ఫియర్‌ను కూడా దాటి వెళ్లాయని భావిస్తున్నారు. హీలియోస్ఫియర్ అనేది సౌర గాలుల వల్ల ఏర్పడిన కణాలతో కూడిన బుడగలాంటిది; అది సూర్యుని చుట్టూ గెలాక్సీలో విస్తరించి ఉంటుంది.
సూర్యుడు
[మార్చు]అంతరిక్ష పరిశోధనల ప్రధాన లక్ష్యాల్లో సూర్యుడు ఒకటి. భూమి వాతావరణం, భూమి అయస్కాంత క్షేత్రం వెలుపల నుంచి పరిశీలించడం వల్ల, భూమి ఉపరితలానికి చేరని సౌర గాలులు, ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు, అతినీలలోహిత కిరణాలను అధ్యయనం చేయగలుగుతున్నారు. సూర్యుడే ఎక్కువ భాగం అంతరిక్ష వాతావరణాన్ని సృష్టిస్తాడు. అది భూమిపై విద్యుత్ ఉత్పత్తి, ప్రసార వ్యవస్థలపై ప్రభావం చూపడమే కాకుండా, ఉపగ్రహాలు, అంతరిక్ష పరిశోధనా యానాలకు ఆటంకం కలిగించగలదు; కొన్నిసార్లు వాటిని దెబ్బతీయగలదు కూడా. ప్రత్యేఖించి సూర్యుణ్ని పరిశీలించేందుకు అనేక అంతరిక్ష నౌకలను ప్రయోగించారు. వాటిలో తొలినాళ్ళలో చేపట్టినవాటిలో అపోలో టెలిస్కోప్ మౌంట్ ప్రముఖమైనది. మరికొన్ని యానాల్లో సౌర పరిశీలన ద్వితీయ లక్ష్యంగా ఉండేది. 2018లో ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్, సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్ళిన యాత్రగా నిలిచింది. అది బుధగ్రహ కక్ష్య దూరంలో తొమ్మిదో వంతు వరకు సూర్యుడికి దగ్గరగా చేరుకోనుంది
బుధుడు
[మార్చు]
భూమిలాంటి ఘన గ్రహాల్లో ఇప్పటికీ అతి తక్కువగా పరిశోధించబడిన గ్రహం, బుధుడు. 2013 మే వరకు, మారినర్ 10, మెసెంజర్‌లు మాత్రమే బుధుడిని సమీపంగా పరిశీలించాయి. మెసెంజర్ 2011 మార్చిలో మెర్క్యురీ కక్ష్యలోకి ప్రవేశించింది. 1975లో మారినర్ 10 చేసిన పరిశీలనలను మరింత లోతుగా అధ్యయనం చేయడం దాని ముఖ్య లక్ష్యం. 2025లో మెర్క్యురీ చేరేందుకు రూపొందించిన బేపికొలంబో యాత్రలో రెండు పరిశోధనా ప్రోబ్‌లు ఉన్నాయి. ఇది యూరపియన్ స్పేస్ ఏజన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లొరేషన్ ఏజన్సీలు సంయుక్తంగా చేపట్టిన యాత్ర. మారినర్ 10 గుర్తించిన అనేక రహస్యాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన పరస్పరపూరక సమాచారాన్ని మెసెంజర్, బేపికొలంబో యాత్రలు సేకరించాలనే ఉద్దేశం ఉంది.
సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలకు ప్రయాణాలు శక్తి వ్యయంతో జరుగుతాయి. దీనిని అంతరిక్ష నౌక యొక్క నికర వేగ మార్పు లేదా డెల్టా-వి ద్వారా వివరిస్తారు. బుధ గ్రహాన్ని చేరుకోవడానికి సాపేక్షంగా అధిక డెల్టా-వి అవసరం కావడం, అది సూర్యునికి సమీపంలో ఉండటం వల్ల, దానిని అన్వేషించడం కష్టం -దాని చుట్టూ ఉన్న కక్ష్యలు చాలా అస్థిరంగా ఉంటాయి.
శుక్రుడు
[మార్చు]అంతర్‌గ్రహ ఫ్లైబై, ల్యాండర్ యాత్రల తొలి లక్ష్యంగా శుక్రగ్రహం నిలిచింది. సౌర కుటుంబంలో అత్యంత ప్రతికూల ఉపరితల వాతావరణాల్లో ఒకటి దీనిపై ఉన్నప్పటికీ, భూమి కాకుండా ఈ గ్రహంపైననే అత్యధికంగా ల్యాండర్లు దిగాయి. వీటిలో ఎక్కువ భాగం సోవియట్ యూనియన్ పంపినవే. 1961లో జరిగిన వెనెరా 1 శుక్రుడిపై చేసిన తొలి ఫ్లైబై యాత్ర. అయితే, విజయవంతంగా సమాచారం పంపిన తొలి ఫ్లైబై మాత్రం 1962 లో పంపిన మారినర్ 2. తర్వాత అనేక అంతరిక్ష సంస్థలు శుక్రుడి సమీప యాత్రలు చేపట్టాయి. వాటిలో కొన్ని, ఇతర గ్రహాల దిశగా ప్రయాణించేందుకు వీనస్ గురుత్వాకర్షణ సహాయాన్ని వినియోగించుకున్నాయి. 1967 లో వెనెరా 4, వీనస్ వాతావరణంలోకి ప్రవేశించి దానిని నేరుగా పరిశీలించిన తొలి నౌక. 1970లో వెనెరా 7 వీనస్ ఉపరితలంపై విజయవంతంగా దిగిన తొలి ల్యాండర్‌గా నిలిచింది. 1985 నాటికి, దాని తర్వాత మరో ఎనిమిది విజయవంతమైన సోవియట్ ల్యాండర్లు వీనస్‌పై దిగాయి. అవి చిత్రాలు, ఉపరితల సమాచారాన్ని భూమికి పంపించాయి. 1975 లో వెనెరా 9 తో మొదలుపెట్టి, వీనస్ చుట్టూ విజయవంతంగా పది వరకు కక్ష్య యాత్రలు సాగాయి. తరువాతి యాత్రలు రాడార్ సహాయంతో, దట్టమైన వాతావరణాన్ని ఛేదించి వీనస్ ఉపరితల పటాలను రూపొందించగలిగాయి.
భూమి
[మార్చు]
భూమిని ఒక ఖగోళ వస్తువుగా అర్థం చేసుకోవడానికి అంతరిక్ష అన్వేషణను ఒక సాధనంగా ఉపయోగించారు. కేవలం భూమిపై నుండి పొందడం కష్టంగా లేదా అసాధ్యంగా ఉండే భూమికి సంబంధించిన సమాచారాన్ని కక్ష్య యాత్రలు అందించగలవు.
ఉదాహరణకు, అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి కృత్రిమ ఉపగ్రహమైన ఎక్స్‌ప్లోరర్ 1 కనుగొనే వరకూ వాన్ అలెన్ రేడియేషన్ బెల్టుల ఉనికి గురించి తెలియదు. ఈ బెల్టులలో భూమి అయస్కాంత క్షేత్రాలచే బంధించబడిన రేడియేషన్ ఉంటుంది. దీని కారణంగా, భూమి ఉపరితలం నుండి 1000 కిలోమీటర్లకు మించిన దూరంలో నివాసయోగ్యమైన అంతరిక్ష కేంద్రాల నిర్మాణం ఆచరణ సాధ్యం కాదు. ఈ ఊహించని ఆవిష్కరణ తరువాత, భూమిని అంతరిక్ష ఆధారిత దృక్కోణం నుండి అన్వేషించడానికి ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో భూ పరిశీలన ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ ఉపగ్రహాలు వివిధ రకాల భూ-ఆధారిత దృగ్విషయాలను అర్థం చేసుకోవడానికి గణనీయంగా దోహదపడ్డాయి. ఉదాహరణకు, భూమి వాతావరణాన్ని అన్వేషిస్తున్న ఒక కృత్రిమ ఉపగ్రహం ద్వారా ఓజోన్ పొరలోని రంధ్రాన్ని కనుగొన్నారు. ఇతరత్రా గుర్తించడం కష్టంగా లేదా అసాధ్యంగా ఉన్న పురావస్తు ప్రదేశాలు లేదా భౌగోళిక నిర్మాణాలను కనుగొనడానికి కూడా ఉపగ్రహాలు వీలు కల్పించాయి.
చంద్రుడు
[మార్చు]
అంతరిక్ష అన్వేషణకు వస్తువుగా మారిన మొట్టమొదటి ఖగోళ వస్తువు చంద్రుడు . అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించి, పరిభ్రమించి, దానిపై దిగిన మొట్టమొదటి సుదూర ఖగోళ వస్తువుగా, మానవులు ఇప్పటివరకు సందర్శించిన ఏకైక సుదూర ఖగోళ వస్తువుగా దీనికి ప్రత్యేకత ఉంది.
1959 లో సోవియట్లు చంద్రుని అవతలి వైపు యొక్క మొదటి చిత్రాలను తీసారు. అవి అంతకు ముందు మానవులకు ఎన్నడూ కనిపించలేదు. 1962లో రేంజర్ 4 ఇంపాక్టర్‌తో అమెరికా చంద్రునిపై చేసిన అన్వేషణ మొదలైంది. 1966 నుండి, సోవియట్‌లు చంద్రునిపైకి అనేక ల్యాండర్‌లను విజయవంతంగా పంపారు. ఇవి చంద్రుని ఉపరితలం నుండి నేరుగా డేటాను సేకరించగలిగాయి; నాలుగు నెలల తర్వాత, సర్వేయర్ 1 విజయవంతమైన అమెరికా ల్యాండర్‌ల శ్రేణికి నాంది పలికింది. సోవియట్ మానవరహిత యాత్రలు 1970ల ప్రారంభంలో లూనోఖోడ్ కార్యక్రమంతో పరాకాష్టకు చేరుకున్నాయి. ఇందులో మొదటి మానవరహిత రోవర్‌లు ఉన్నాయి. అధ్యయనం కోసం చంద్రుని మట్టి నమూనాలను విజయవంతంగా భూమికి తీసుకువచ్చింది. ఇది గ్రహాంతర మట్టి నమూనాలను భూమికి స్వయంచాలకంగా తిరిగి తీసుకువచ్చిన మొదటి (ఇప్పటి వరకు ఏకైక) యాత్రగా నిలిచింది. వివిధ దేశాలు కాలానుగుణంగా చంద్ర కక్ష్య ఉపగ్రహాలను పంపుతూ చంద్రుని మానవరహిత అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాయి. 2019లో చైనాకు చెందిన చాంగ్'ఈ 4, 2024లో చాంగ్'ఈ 6, చంద్రుని అవతలి వైపున ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి, నమూనాలను తిరిగి తీసుకువచ్చాయి. 2023 లో భారతదేశానికి చెందిన చంద్రయాన్-3, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో అడుగుపెట్టింది.
1968లో అపోలో 8 యాత్రతో చంద్రునిపై మానవసహిత అన్వేషణ ప్రారంభమైంది. ఈ యాత్ర చంద్రుని చుట్టూ విజయవంతంగా పరిభ్రమించింది, మానవులు ఏదైనా గ్రహేతర వస్తువు చుట్టూ పరిభ్రమించడం ఇదే మొదటిసారి. 1969లో, అపోలో 11 యాత్ర మానవులు మరో ప్రపంచంపై అడుగుపెట్టిన మొదటియాత్రగా నిలిచింది. చంద్రునిపై మానవసహిత అన్వేషణ ఎక్కువ కాలం కొనసాగలేదు. 1972లో జరిగిన అపోలో 17 యాత్ర ఆరవసారి చంద్రునిపై అడుగుపెట్టడమే మానవుడి చివరి యాత్ర. 2026లో ఆర్టెమిస్ II మానవసహిత చంద్రుని సమీప యాత్రను పూర్తి చేసింది. 2028కి ప్రణాళిక చేయబడిన ఆర్టెమిస్ IV, అపోలో 17 తర్వాత మానవుడు చంద్రునిపై అడుగుపెట్టే మొదటి యాత్ర అవుతుంది. రోబోటిక్ యాత్రలు ఇప్పటికీ ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.
అంగారక గ్రహం
[మార్చు]
సోవియట్ యూనియన్ (తరువాత రష్యా), యునైటెడ్ స్టేట్స్, యూరప్, జపాన్, భారతదేశాలు చేసిన అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలలో అంగారక గ్రహ అన్వేషణ ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. 1960వ దశకం నుండి ఆర్బిటర్లు, ల్యాండర్లు, రోవర్లతో సహా డజన్ల కొద్దీ రోబోటిక్ అంతరిక్ష నౌకలను అంగారక గ్రహం వైపు ప్రయోగించారు. ఈ యాత్రల ముఖ్య ఉద్దేశ్యం, ప్రస్తుత పరిస్థితుల గురించి సమాచారాన్ని సేకరించడం, అంగారక గ్రహ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడం. శాస్త్రీయ సమాజం లేవనెత్తిన ఈ ప్రశ్నలు, అంగారక గ్రహంపై మరింత అవగాహనను కల్పించడమే కాకుండా, భూమి గతం గురించీ, సాధ్యమయ్యే భవిష్యత్తు గురించీ కూడా లోతైన అవగాహనను అందిస్తాయని భావిస్తున్నారు.
అంగారక గ్రహ అన్వేషణకు గణనీయమైన ఆర్థిక వ్యయం అయింది. అంగారక గ్రహానికి పంపిన అన్ని అంతరిక్ష నౌకలలో దాదాపు మూడింట రెండు వంతులు తమ లక్ష్యాలను పూర్తి చేయకముందే విఫలమయ్యాయి. కొన్ని అసలు ప్రారంభం కాకముందే విఫలమయ్యాయి. ఇంత అధిక వైఫల్య రేటుకు కారణం గ్రహాంతర ప్రయాణంలో ఉండే సంక్లిష్టత, అనేక ఇతర అంశాలు. పరిశోధకులు హాస్యంగా"ది గ్రేట్ గెలాక్టిక్ ఘౌల్" [25] అని పిలవడానికి ఇది కారణమైంది. ఇది అంగారక గ్రహ పరిశోధక నౌకలను ఆహారంగా తీసుకుని జీవిస్తుంది. ఈ దృగ్విషయాన్ని అనధికారికంగా "అంగారక శాపం" అని కూడా అంటారు.[26] అంగారక గ్రహ అన్వేషణలో సంభవించిన అధిక వైఫల్యాల రేట్లకు విరుద్ధంగా, భారతదేశం తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన మొదటి దేశంగా నిలిచింది. భారతదేశం ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)[27][28][29] ఇప్పటివరకు చేపట్టిన అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన గ్రహాంతర యాత్రల్లో ఒకటి. దీని మొత్తం వ్యయం సుమారు ₹ 450 కోట్లు.[30] [31] అరబ్ దేశాల్లో మొట్టమొదటిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగారక గ్రహ యాత్ర చేపట్టింది. ఎమిరేట్స్ మార్స్ మిషన్ అని పిలువబడే దీనిని 2020 జూలై 19 న ప్రయోగించారు. ఇది 2021 ఫిబ్రవరి 9 న అంగారక గ్రహం చుట్టూ కక్ష్యలోకి ప్రవేశించింది. మానవరహిత అన్వేషణా ప్రోబ్‌కు "హోప్ ప్రోబ్" అని పేరు పెట్టారు. అంగారక వాతావరణాన్ని వివరంగా అధ్యయనం చేయడానికి దీనిని పంపారు.[32]
ఫోబోస్
[మార్చు]2011 నవంబరు 9 న ప్రయోగించిన రష్యన్ అంతరిక్ష యాత్ర ఫోబోస్-గ్రంట్, ఒక వైఫల్యాన్ని ఎదుర్కొని భూమికి సమీప కక్ష్యలో చిక్కుకుపోయింది. [33] దీని ఉద్దేశ్యం ఫోబోస్, అంగారక గ్రహ పరివేష్టిత కక్ష్యను అన్వేషించడం. అంగారక గ్రహానికి ప్రయాణించే అంతరిక్ష నౌకలకు, అంగారకుని ఉపగ్రహాలు లేదా కనీసం ఫోబోస్ అయినా, ఒక "రవాణా కేంద్రంగా" ఉపయోగపడగలదా అని అధ్యయనం చేయడం కూడా ఒక లక్ష్యం.[34]
గ్రహశకలాలు
[మార్చు]
అంతరిక్ష ప్రయాణం ప్రారంభమయ్యే వరకు, గ్రహశకలాల పట్టీలోని వస్తువులు అతిపెద్ద టెలిస్కోపులలో కూడా కేవలం సూదిమొనల వంటి కాంతి బిందువులుగా మాత్రమే కనిపించేవి, వాటి ఆకారాలు, భూభాగం ఒక రహస్యంగానే మిగిలిపోయాయి. ఇప్పుడు అనేక గ్రహశకలాలను ప్రోబ్‌లు సందర్శించాయి, వాటిలో మొదటిది గెలీలియో. ఇది 1991లో 951 గాస్ప్రాను, ఆ తర్వాత 1993లో 243 ఇడాను దాటి ప్రయాణించింది. ఈ రెండూ బృహస్పతికి వెళ్ళేందుకు గెలీలియో ప్రణాళిక చేసిన మార్గానికి చాలా దగ్గరగా ఉండటంతో, వాటిని ఆమోదయోగ్యమైన ఖర్చుతో సందర్శించడం సాధ్యమైంది. 433 ఎరోస్ అనే వస్తువు యొక్క కక్ష్యా సర్వే తర్వాత, 2000 సంవత్సరంలో నియర్ షూమేకర్ ప్రోబ్ ఒక గ్రహశకలంపై మొదటిసారి దిగింది. మూడు అతిపెద్ద గ్రహశకలాలలో రెండైన మరగుజ్జు గ్రహం సెరెస్, 4 వెస్టా అనే గ్రహశకలాన్ని, 2007లో ప్రయోగించిన నాసా వారి డాన్ అంతరిక్ష నౌక సందర్శించింది.
హయబూసా అనేది జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన ఒక రోబోటిక్ అంతరిక్ష నౌక. భూమికి సమీపంలో ఉన్న 25143 ఇటోకావా అనే చిన్న గ్రహశకలం నుండి పదార్థ నమూనాను తదుపరి విశ్లేషణ కోసం భూమికి తిరిగి తీసుకురావడమే దీని లక్ష్యం . హయాబుసాను 2003 మే 9 న ప్రయోగించారు. ఇది 2005 సెప్టెంబరు మధ్యలో ఇటోకావాను చేరుకుంది. ఇటోకావాకు చేరుకున్న తర్వాత, హయాబుసా ఆ గ్రహశకలం ఆకారం, భ్రమణం, ఉపరితల స్వరూపం, రంగు, కూర్పు, సాంద్రత, చరిత్రను అధ్యయనం చేసింది. 2005 నవంబరులో ఇది ఆ గ్రహశకలంపై రెండుసార్లు దిగి నమూనాలను సేకరించింది. ఈ అంతరిక్ష నౌక 2010 జూన్ 13 న భూమికి తిరిగి వచ్చింది.
బృహస్పతి
[మార్చు]
బృహస్పతిపై అన్వేషణ, 1973 నుండి నాసా ప్రయీగించిన అనేక అనేక స్వయంచాలిత అంతరిక్ష నౌకల ద్వారానే జరిగింది. ఈ నౌకలు చేసిన యాత్రల్లో అధిక భాగం "ఫ్లైబై"లే. ఫ్లైబై యాత్రల్లో ప్రోబ్, గ్రహంపై దిగకుండా లేదా కక్ష్యలోకి ప్రవేశించకుండా వివరణాత్మక పరిశీలనలు చేస్తాయి; ఉదాహరణకు పయనీర్, వాయేజర్ కార్యక్రమాలలో అలాగే చేసారు. గెలీలియో, జూనో అంతరిక్ష నౌకలు మాత్రమే గురుగ్రహపు కక్ష్యలోకి ప్రవేశించిన ఏకైక అంతరిక్ష నౌకలు. బృహస్పతికి సాపేక్షంగా చిన్న రాతి కేంద్రకం మాత్రమే ఉందనీ నిజమైన ఘన ఉపరితలం లేదనీ నమ్ముతున్నందున, దానిపై దిగే యాత్ర సాధ్యపడదు.
భూమి నుండి బృహస్పతిని చేరుకోవడానికి 9.2 కిమీ/సె, డెల్టా-వి అవసరం.[35] ఇది భూ నిమ్న కక్ష్యను చేరుకోవడానికి అవసరమైన 9.7 కిమీ/సె డెల్టా-వి తో పోల్చదగినది.[36] అదృష్టవశాత్తూ, గ్రహాలకు సమీపంలో ప్రయాణించడం ద్వారా వాటి గురుత్వాకర్షణ సహాయాన్ని ఉపయోగించి బృహస్పతిని చేరుకోవడానికి అవసరమైన శక్తిని తగ్గించవచ్చు, అయినప్పటికీ దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా పెరుగుతుంది.[35]
బృహస్పతికి, 95 దాకా సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో చాలా వాటి గురించి సాపేక్షంగా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది.
శని
[మార్చు]నాసా ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష నౌకల ద్వారా మాత్రమే శని గ్రహాన్ని అన్వేషించారు. వీటిలో ఇతర అంతరిక్ష సంస్థల సహకారంతో ప్రణాళిక చేసి, అమలు చేసిన ఒక యాత్ర ( కాస్సిని-హైగెన్స్) కూడా ఉంది. ఈ యాత్రలలో 1979లో పయనీర్ 11, 1980లో వాయేజర్ 1, 1982లో వాయేజర్ 2 చేసిన ఫ్లైబైలు, 2004 నుండి 2017 వరకు కొనసాగిన కాస్సిని అంతరిక్ష నౌక కక్ష్యా యాత్ర ఉన్నాయి.
శని గ్రహానికి కనీసం 62 ఉపగ్రహాలున్నాయి. అయితే వాటి కచ్చితమైన సంఖ్య చర్చనీయాంశం. ఎందుకంటే శని వలయాలు వివిధ పరిమాణాలలో, స్వతంత్రంగా పరిభ్రమించే అసంఖ్యాకమైన వస్తువులతో ఏర్పడి ఉంటాయి. ఈ చంద్రులలో అతిపెద్దది టైటాన్. సౌర వ్యవస్థలో భూమి వాతావరణం కంటే దట్టమైన, మందమైన వాతావరణం కలిగిన ఏకైక చంద్రుడు అనే ప్రత్యేకత దీనికి ఉంది. బాహ్య సౌర వ్యవస్థలో కాస్సిని అంతరిక్ష నౌక ద్వారా పంపబడిన హ్యూజెన్స్ ప్రోబ్ అనే ల్యాండర్‌తో అన్వేషించబడిన ఏకైక వస్తువు కూడా టైటానే.
యురేనస్
[మార్చు]యురేనస్ అన్వేషణ పూర్తిగా వాయేజర్ 2 అంతరిక్ష నౌక ద్వారా జరిగింది. అయితే, చైనాకు చెందిన టియాన్వెన్ 4 మిషన్ దానిని లేదా కాలిస్టోను సందర్శించడానికి ప్రణాళికలు ఉన్నాయి.[37] యురేనస్ అక్షపు వంపు 97.77° కావడం, దాని ధ్రువ ప్రాంతాలు ఎక్కువ కాలం పాటు సూర్యకాంతికి లేదా చీకటికి గురికావడం వలన, యురేనస్ వద్ద ఏమి ఉంటుందో శాస్త్రవేత్తలకు ఖచ్చితంగా తెలియదు. 1986 జనవరి 24 న వాయేజర్ 2 యురేనస్‌కు అత్యంత సమీపంగా వెళ్ళింది. ఆ గ్రహం యొక్క ప్రత్యేకమైన వాతావరణాన్ని, అయస్కాంత క్షేత్రాన్నీ అధ్యయనం చేసింది. వాయేజర్ 2, యురేనస్ వలయ వ్యవస్థను, దాని చంద్రులను కూడా పరిశీలించింది. ఇందులో ఇంతకు ముందు తెలిసిన ఐదు చంద్రులతో పాటు, తెలియని అదనపు పది చంద్రులను కూడా కనుగొంది.
బృహస్పతి, శని గ్రహాలపై కనిపించే తీవ్రమైన తుఫానులు లేదా వాతావరణ పట్టీల జాడలు ఏవీ లేకుండా, యురేనస్ చిత్రాలు ఏకరీతిగా కనిపించాయి. ఆ గ్రహం చిత్రాలలో కొన్ని మేఘాలను గుర్తించడానికి కూడా చాలా కృషి అవసరమైంది. అయితే, యురేనస్ అయస్కాంత క్షేత్రం ప్రత్యేకమైనదిగా తేలింది. ఎందుకంటే అది గ్రహం భ్రమణాక్షపు అసాధారణమైన వంపు వలన తీవ్రంగా ప్రభావితమైంది. యురేనస్ యొక్క నిస్తేజమైన రూపానికి భిన్నంగా, యురేనస్ చంద్రుల యొక్క అద్భుతమైన చిత్రాలు లభించాయి. వాటిలో మిరాండా అసాధారణంగా భౌగోళికంగా చురుకుగా ఉండేదనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి.
నెప్ట్యూన్
[మార్చు]1989 ఆగస్టు 25న వాయేజర్ 2 నెప్ట్యూన్ గ్రహ మండలాన్ని సమీపించడంతో ఆ గ్రహ అన్వేషణ ప్రారంభమైంది; ఆ గ్రహ మండలాన్ని సందర్శించడం ఈ ఒక్కసారే జరిగింది.నెప్ట్యూన్ ఆర్బిటర్ పంపే అవకాశం గురించిన చర్చ జరిగింది గానీ, యాత్రలు చేపట్టే విషయం గురించి మాత్రం తీవ్రంగా ఆలోచించలేదు.
1986లో వాయేజర్ 2 యురేనస్‌ను సందర్శించినప్పుడు, ఆ గ్రహం చాలా ఏకరీతిగా కనిపించింది. అందువల్ల నెప్ట్యూన్‌పై కూడా పెద్దగా వాతావరణ మార్పులు కనిపించవని భావించారు. కానీ వాయేజర్ 2, నెప్ట్యూన్‌పై స్పష్టమైన మేఘ పట్టీలు, కనబడే మేఘాలు, ధ్రువ కాంతులు, అలాగే గురుడి గ్రేట్ రెడ్ స్పాట్‌కు సమాన పరిమాణంలో ఉన్న భారీ ప్రతిచక్రవాత తుఫానునూ గుర్తించింది. నెప్ట్యూన్‌పై సౌర కుటుంబంలోనే అత్యంత వేగవంతమైన గాలులు వీస్తున్నాయని కూడా తెలిసింది. వాటి వేగం గంటకు 2,100 కిలోమీటర్ల వరకు నమోదైంది.[38] వాయేజర్ 2, నెప్ట్యూన్ వలయాలు, ఉపగ్రహ వ్యవస్థను కూడా పరిశీలించింది. అది 900 సంపూర్ణ వలయాలను, అదనంగా కొంత భాగంగా ఉన్న వలయ ఖండాలను గుర్తించింది. అప్పటివరకు తెలిసిన మూడు ఉపగ్రహాలతో పాటు, మరో ఐదు కొత్త ఉపగ్రహాలను కూడా కనుగొంది. వాటిలో Proteus నెప్ట్యూన్ వ్యవస్థలో చివరిగా కనుగొనబడిన అతిపెద్ద ఉపగ్రహంగా నిలిచింది.
వాయేజర్ 2 సేకరించిన సమాచారం ప్రకారం, నెప్ట్యూన్ అతిపెద్ద ఉపగ్రహం ట్రైటన్, కైపర్ బెల్ట్ నుంచి ఆకర్షించబడిన ఖగోళ వస్తువుగా భావిస్తున్నారు.[39]
ప్లూటో
[మార్చు]మరుగుజ్జు గ్రహమైన ప్లూటో, భూమి నుండి చాలా దూరంలో ఉండటం (సహేతుకమైన ప్రయాణ సమయాల కోసం అధిక వేగం అవసరం), తక్కువ ద్రవ్యరాశి (ప్రస్తుతం కక్ష్యలోకి ప్రవేశించడం కష్టతరం చేస్తుంది) కారణంగా అంతరిక్ష నౌకలకు గణనీయమైన సవాళ్లను విసురుతుంది. వాయేజర్ 1 ప్లూటోను సందర్శించగలిగి ఉండేది. కానీ దాని నియంత్రకులు ఫ్లూటో బదులుగా శని ఉపగ్రహమైన టైటాన్ సమీపంగా వెళ్ళడానికి ఎంచుకున్నారు. దీని ఫలితంగా ప్లూటో సమీప ప్రయాణానికి అనుకూలం కాని పథం ఏర్పడింది. వాయేజర్ 2కు ప్లూటోను చేరుకోవడానికి ఎప్పుడూ ఆచరణీయమైన పథం లేదు.[40]
తీవ్రమైన రాజకీయ పోరాటం తర్వాత, 2003 లో అమెరికా ప్రభుత్వం 'న్యూ హొరైజన్స్' అనే ప్లూటో యాత్రకు నిధులు మంజూరు చేసింది.[41] న్యూ హొరైజన్స్‌ను 2006 జనవరి 19 న విజయవంతంగా ప్రయోగించారు. 2007 ప్రారంభంలో ఈ వ్యోమనౌక బృహస్పతి నుండి గురుత్వాకర్షణ సహాయాన్ని ఉపయోగించుకుంది. ఇది 2015 జూలై 14 న ప్లూటోకు అత్యంత సమీపంగా వెళ్ళింది; ప్లూటోపై చేసిన శాస్త్రీయ పరిశీలనలు నౌక అత్యంత సమీపానికి రావడానికి ఐదు నెలల ముందు ప్రారంభమై, ఆ సంఘటన తర్వాత 16 రోజుల పాటు కొనసాగాయి.
కైపర్ బెల్ట్ వస్తువులు
[మార్చు]న్యూ హొరైజన్స్ నౌక 2019లో కైపర్ బెల్ట్‌లోని అర్రోకోత్ అనే చిన్న గ్రహశకలం మీదుగా కూడా ప్రయాణించింది. ఇది దాని మొదటి పొడిగించిన యాత్ర.[42]

భూమి నుండి అనేక తోకచుక్కలను, కొన్నిసార్లు శతాబ్దాల తరబడి పరిశీలనలతో అధ్యయనం చేసినప్పటికీ, కేవలం కొన్ని తోకచుక్కలను మాత్రమే దగ్గరగా సందర్శించడం జరిగింది. 1985 లో ఇంటర్నేషనల్ కామెటరీ ఎక్స్‌ప్లోరర్ (అంతర్జాతీయ తోకచుక్క అన్వేషకం ) మొదటి తోకచుక్క సమీప గమనాన్ని ( 21P/జియాకోబినీ-జినర్ ) నిర్వహించింది. ఆ తరువాత అది హేలీ ఆర్మడాలో చేరి ప్రసిద్ధిగాంచిన హేలీ తోకచుక్కను అధ్యయనం చేసింది. 9P/టెంపెల్ తోకచుక్క నిర్మాణం, కూర్పు గురించి మరింత తెలుసుకోవడానికి <i id="mwAso">డీప్ ఇంపాక్ట్</i> ప్రోబ్ దానిని ఢీకొట్టింది. <i id="mwAs0">స్టార్‌డస్ట్</i> మిషన్ మరొక తోకచుక్క లోని తోక నమూనాలను భూమికి తీసుకువచ్చింది. విస్తృతమైన రోసెట్టా మిషన్‌లో భాగంగా, 2014లో ఫిలే ల్యాండర్ చుర్యుమోవ్-గెరాసిమెంకో తోకచుక్కపై విజయవంతంగా దిగింది.

లోతైన అంతరిక్ష అన్వేషణ అనేది ఖగోళ శాస్త్రం, వ్యోమయానం, అంతరిక్ష సాంకేతికత లోని ఒక శాఖ. ఇది బాహ్య అంతరిక్షంలోని సుదూర ప్రాంతాల అన్వేషణతో ముడిపడి ఉంటుంది. [43] అంతరిక్షం భౌతిక అన్వేషణ, మానవ అంతరిక్ష యాత్రలు (లోతైన-అంతరిక్ష వ్యోమయానం), రోబోటిక్ అంతరిక్ష నౌకల ద్వారా చేస్తారు.
భవిష్యత్తులో లోతైన అంతరిక్ష ఇంజిన్ సాంకేతికతలకు కొన్ని ఉత్తమ అభ్యర్థులలో యాంటీమ్యాటర్, అణుశక్తి, కిరణ చోదనం ఉన్నాయి. [44] కిరణ చోదనం, లోతైన అంతరిక్ష అన్వేషణ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ అభ్యర్థిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది తెలిసిన భౌతిక శాస్త్రాన్నీ, ఇతర ప్రయోజనాల కోసం అభివృద్ధి చేయబడుతున్న తెలిసిన సాంకేతికతనూ ఉపయోగిస్తుంది. [45]
అంతరిక్ష అన్వేషణ భవిష్యత్తు
[మార్చు]

బ్రేక్‌త్రూ స్టార్‌షాట్
[మార్చు]బ్రేక్‌త్రూ స్టార్‌షాట్ అనేది బ్రేక్‌త్రూ ఇనిషియేటివ్స్ వారి ఒక పరిశోధన, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. ఇది 4.37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆల్ఫా సెంటౌరీ నక్షత్ర వ్యవస్థకు ప్రయాణించగల సామర్థ్యం గల, స్టార్‌చిప్ [46] అనే పేరుతో ఒక ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ లైట్ సెయిల్ అంతరిక్ష నౌకల సముదాయాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది. దీనిని 2016లో యూరి మిల్నర్, స్టీఫెన్ హాకింగ్, మార్క్ జుకర్‌బర్గ్‌లు స్థాపించారు. [47] [48]
గ్రహశకలాలు
[మార్చు]గ్రహశకలాలను అంతరిక్ష అన్వేషణకు ద్వారంలా ఉపయోగించవచ్చని శాస్త్ర పత్రిక నేచర్‌లో వచ్చిన ఒక వ్యాసం సూచించింది. ఈ విధానంలో తుదిలక్ష్యం అంగారకుడిని చేరుకోవడం.
ఇలాంటి ప్రణాళిక సాధ్యపడాలంటే మూడు ప్రధాన అవసరాలు నెరవేరాలని ఆ వ్యాసం పేర్కొంది:
- వ్యోమగాములు సందర్శించగల సమీప గ్రహశకలాలను వేల సంఖ్యలో గుర్తించేందుకు సమగ్ర సర్వే నిర్వహించడం
- ప్రయాణ దూరం, వ్యవధిని క్రమంగా పెంచుతూ మార్స్ వరకు వెళ్లగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం
- గ్రహశకలం పరిమాణం, ఆకారం, భ్రమణం ఎలా ఉన్నా పరిశోధించేందుకు మెరుగైన రోబోటిక్ యానాలు, పరికరాలను తయారు చేయడం
అదనంగా, గ్రహశకలాలు వ్యోమగాములకు గెలాక్సీ అంతరిక్ష వికిరణాల నుంచి కొంత రక్షణనూ అందించగలవు. యాత్ర బృందాలు వాటిపై దిగినప్పుడు తీవ్రమైన వికిరణ ప్రమాదం లేకుండానే పనిచేయగలవని భావిస్తున్నారు.
ఆర్టెమిస్ కార్యక్రమం
[మార్చు]ఆర్టెమిస్ కార్యక్రమం అనేది NASA, US వాణిజ్య అంతరిక్షయాన సంస్థలు, ESA వంటి అంతర్జాతీయ భాగస్వాములు నిర్వహిస్తున్న, సిబ్బందితో కూడిన అంతరిక్షయాన కార్యక్రమం.[49] దీని లక్ష్యం "మొదటి మహిళను, తదుపరి పురుషుడినీ" చంద్రునిపై, ప్రత్యేకంగా, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దించడం. చంద్రునిపై స్థిరమైన ఉనికిని స్థాపించడం, ప్రైవేట్ కంపెనీలు చంద్ర ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి పునాది వేయడం, చివరికి మానవులను అంగారకుడికి పంపడం వంటి దీర్ఘకాలిక లక్ష్యం దిశగా ఆర్టెమిస్, తదుపరి అడుగు అవుతుంది.
2017లో, స్పేస్ పాలసీ డైరెక్టివ్ 1 ద్వారా చంద్రునిపైకి వెళ్లే యాత్రకు అధికారం ఇవ్వబడింది. దీనికోసం ఓరియన్, లూనార్ గేట్‌వే, కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ వంటి వివిధ అంతరిక్ష నౌక కార్యక్రమాలను ఉపయోగించడంతో పాటు, ఇంకా అభివృద్ధి చేయని, సిబ్బందితో కూడిన ల్యాండర్‌ను కూడా జోడించారు. ఓరియన్ కోసం స్పేస్ లాంచ్ సిస్టమ్ ప్రాథమిక ప్రయోగ వాహనంగా పనిచేస్తుంది. అయితే ఈ యాత్రలోని ఇతర అంశాలను ప్రయోగించడానికి వాణిజ్య ప్రయోగ వాహనాలను ఉపయోగించాలని ప్రణాళిక చేసారు. నాసా 2020 ఆర్థిక సంవత్సరానికి ఆర్టెమిస్ కోసం అదనంగా $1.6 బిలియన్ల నిధులను అభ్యర్థించింది.[50] అదే సమయంలో యూఎస్ సెనేట్ అప్రోప్రియేషన్స్ కమిటీ, నాసా నుండి ఐదేళ్ల బడ్జెట్ ప్రొఫైల్‌ను అభ్యర్థించింది.[51] యూఎస్ కాంగ్రెస్ నుండి మూల్యాంకనం, ఆమోదం కోసం ఇది అవసరం. [52][53] మొదటి ఆర్టెమిస్ మిషన్‌ను 2022 లో ప్రయోగించబడింది. సిబ్బందితో కూడిన చంద్రుని సమీప యాత్ర చేసే రెండవ నౌకను 2026 ఏప్రిల్‌లో ప్రయోగించారు. లూనార్ గేట్‌వే నిర్మాణం కొనసాగుతోంది, దీని ప్రారంభ సామర్థ్యాలు 2025–2027 కాలపరిమితికి సిద్ధంగా ఉన్నాయి.[54] మొదటి CLPS ల్యాండర్ 2024 లో ల్యాండ్ అయింది, అపోలో 17 తర్వాత ల్యాండ్ అయిన మొదటి US అంతరిక్ష నౌకగా నిలిచింది.[55]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Chow, Denise (9 March 2011). "After 13 Years, International Space Station Has All Its NASA Rooms". Space.com.
- ↑ Connolly, John F. (October 2006). "Constellation Program Overview" (PDF). Constellation Program Office. the original (PDF) నుండి 10 July 2007 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 July 2009.
- ↑ Lawler, Andrew (22 October 2009). "No to NASA: Augustine Commission Wants to More Boldly Go". Science. the original నుండి 13 May 2013 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ ""What We Need Now is Urgency": Looking Back at Artemis After 5 Years". www.americaspace.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-03-26. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-05-09.
- ↑ King, C. C. (2003). The History of the Telescope. Dover Publications. pp. 30–32. ISBN 978-0-486-43265-6.
- ↑ A. Rupert Hall (1996). Isaac Newton: Adventurer in Thought. Cambridge University Press. p. 67. ISBN 978-0-521-56669-8.
- ↑ Angelo, Joseph A. (2014). Spacecraft for Astronomy. Infobase Publishing. p. 20. ISBN 978-1-4381-0896-4.
- ↑ "STS-31". NASA. ఒరిజినల్ నుండి August 15, 2011 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: April 26, 2008.
- ↑ "How Many Stars in the Milky Way?". NASA Blueshift. ఒరిజినల్ నుండి 25 January 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది.
- ↑ "100 Billion Alien Planets Fill Our Milky Way Galaxy: Study". Space.com. 2 January 2013. ఒరిజినల్ నుండి 3 January 2013 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది.
- ↑ Fountain, Henry (17 October 2016). "Two Trillion Galaxies, at the Very Least". The New York Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 October 2016.
- ↑ Lira, Nicolás; Iono, Daisuke; Oliver, Amy C.; Ferreira, Bárbara (7 April 2022). "Astronomers Detect Most Distant Galaxy Candidate Yet". Atacama Large Millimeter Array. the original నుండి 17 July 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 April 2022.
- ↑ Crane, Leah (7 April 2022). "Astronomers have found what may be the most distant galaxy ever seen – A galaxy called HD1 appears to be about 33.4 billion light years away, making it the most distant object ever seen – and its extreme brightness is puzzling researchers". New Scientist. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 April 2022.
- ↑ Buongiorno, Caitlyn (7 April 2022). "Astronomers discover the most distant galaxy yet - Unusually bright in ultraviolet light, HD1 may also set another cosmic record". Astronomy. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2022.
- ↑ Wenz, John (7 April 2022). "Behold! Astronomers May Have Discovered The Most Distant Galaxy Ever – HD1 could be from just 300 million years after the Big Bang". Inverse. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2022.
- ↑ Williams, Matt (2016-09-16). "How high is space?". Universe Today. ఒరిజినల్ నుండి 2017-06-02 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2017-05-14.
- ↑ "V-2 rocket (MW 18014) became the first human-made object in space on June 20, 1944". Our Planet. 20 June 2022. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 July 2022.
- ↑ "First Human-Made Object to Enter Space". NASA. 3 January 2008.
- ↑ "NASA on Luna 2 mission". Sse.jpl.nasa.gov. the original నుండి 31 March 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 May 2012.
- ↑ "NASA on Luna 9 mission". Sse.jpl.nasa.gov. the original నుండి 31 March 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 May 2012.
- ↑ "NASA on Luna 10 mission". Sse.jpl.nasa.gov. the original నుండి 18 February 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 May 2012.
- ↑ Harwood, William (12 September 2013). "Voyager 1 finally crosses into interstellar space". CBS News. ఒరిజినల్ నుండి 13 November 2013 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2019.
- ↑ "Voyager – Mission Status". Jet Propulsion Laboratory. National Aeronautics and Space Administration. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 January 2019.
- ↑ "Voyager 1". BBC Solar System. the original నుండి 3 February 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 September 2018.
- ↑ Dinerman, Taylor (27 September 2004). "Is the Great Galactic Ghoul losing his appetite?". The space review. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 March 2007.
- ↑ Knight, Matthew. "Beating the curse of Mars". Science & Space. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 March 2007.
- ↑ "India becomes first Asian nation to reach Mars orbit, joins elite global space club". The Washington Post. 24 September 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 September 2014.
India became the first Asian nation to reach the Red Planet when its indigenously made unmanned spacecraft entered the orbit of Mars on Wednesday.
- ↑ Park, Madison (24 September 2014). "India's spacecraft reaches Mars orbit ... and history". CNN.
India's Mars Orbiter Mission successfully entered Mars' orbit Wednesday morning, becoming the first nation to arrive on its first attempt and the first Asian country to reach the Red Planet.
- ↑ Harris, Gardiner (24 September 2014). "On a Shoestring, India Sends Orbiter to Mars on Its First Try". The New York Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 September 2014.
- ↑ "India Successfully Launches First Mission to Mars; PM Congratulates ISRO Team". International Business Times. 5 November 2013. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2014.
- ↑ Bhatt, Abhinav (5 November 2013). "India's 450-crore mission to Mars to begin today: 10 facts". NDTV. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2014.
- ↑ "Hope Mars Probe". mbrsc.ae. Mohammed Bin Rashid Space Centre. the original నుండి 25 July 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2016.
- ↑ Molczan, Ted (9 November 2011). "Phobos-Grunt – serious problem reported". SeeSat-L. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 November 2011.
- ↑ "Project Phobos-Grunt". YouTube. 22 August 2006. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 May 2012.
- 1 2 Wong, Al (28 May 1998). "Galileo FAQ: Navigation". NASA. the original నుండి 5 January 1997 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 November 2006.
- ↑ Hirata, Chris. "Delta-V in the Solar System". California Institute of Technology. the original నుండి 15 July 2006 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 November 2006.
- ↑ "China's plans for outer Solar System exploration". The Planetary Society (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-06.
- ↑ Suomi, V. E.; Limaye, S. S.; Johnson, D. R. (1991). "High winds of Neptune: A possible mechanism". Science. 251 (4996): 929–932. Bibcode:1991Sci...251..929S. doi:10.1126/science.251.4996.929. PMID 17847386. S2CID 46419483.
- ↑ . "Neptune's capture of its moon Triton in a binary-planet gravitational encounter".
- ↑ "Voyager Frequently Asked Questions". Jet Propulsion Laboratory. 14 January 2003. the original నుండి 21 July 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 September 2006.
- ↑ Britt, Robert Roy (26 February 2003). "Pluto mission gets green light at last". space.com. Space4Peace.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 December 2013.
- ↑ Green, Jim; Stern, S. Alan (12 December 2017). New Horizons Kuiper Belt Extended Mission (PDF). 2017 AGU Fall Meeting. Applied Physics Laboratory. pp. 12–15. the original (PDF) నుండి 26 December 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 December 2018.
- ↑ "Space and its Exploration: How Space is Explored". NASA.gov. the original నుండి 2 July 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-07-01.
- ↑ "Future Spaceflight". BBC. the original నుండి 22 April 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-07-01.
- ↑ Forward, Robert L. (January 1996). "Ad Astra!".
- ↑ Gilster, Paul (12 April 2016). "Breakthrough Starshot: Mission to Alpha Centauri". Centauri Dreams. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2016.
- ↑ F, Jessica (14 April 2016). "Stephen Hawking, Mark Zuckerberg, Yuri Milner Launch $100M Space Project Called Breakthrough Starshot". Nature World News.
- ↑ Lee, Seung (13 April 2016). "Mark Zuckerberg Launches $100 Million Initiative To Send Tiny Space Probes To Explore Stars". Newsweek (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 July 2019.
- ↑ "NASA: Moon to Mars". NASA. the original నుండి 5 August 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 May 2019.
- ↑ Harwood, William (17 July 2019). "NASA boss pleads for steady moon mission funding". CBS News. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 August 2019.
- ↑ Foust, Jeff (27 September 2019). "Senate appropriators advance bill funding NASA despite uncertainties about Artemis costs". SpaceNews. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: February 23, 2023.
- ↑ Fernholz, Tim (14 May 2019). "Trump wants $1.6 billion for a moon mission and proposes to get it from college aid". Quartz (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-05-14.
- ↑ Berger, Eric (2019-05-14). "NASA reveals funding needed for Moon program, says it will be named Artemis". Ars Technica (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-05-22.
- ↑ Zamora, Briana R.; NASA (2024-05-13). "Forward Progress on Gateway, Humanity's First Lunar Space Station". SciTechDaily (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-05-14.
- ↑ Foust, Jeff (2024-02-22). "Intuitive Machines lands on the moon". SpaceNews (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-05-14.