అంతర్జాతీయ వన్డే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా మరియు భారతదేశం మధ్య జరుగుతున్న ఒక వన్డే మ్యాచ్. దీనిలో పసుపు రంగు దుస్తులు ధరించిన ఆస్ట్రేలియన్లు బ్యాటింగ్ చేస్తుండగా, నీలి రంగు దుస్తులు ధరించిన భారత జట్టు ఫీల్డింగ్ చేస్తుంది.

అంతర్జాతీయ వన్డే (One Day International - ODI) అనేది క్రికెట్ యొక్క ఒక రూపం, దీనిలో రెండు జాతీయ క్రికెట్ జట్లు ఒక్కొక్కటి 50 ఓవర్‌లపాటు క్రికెట్ ఆడతాయి. క్రికెట్ ప్రపంచ కప్‌ను ఈ రూపంలో ఆడతారు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లను లిమిటెడ్ ఓవర్స్ ఇంటర్నేషనల్స్ (LOI) గా కూడా పిలుస్తారు, ఎందుకంటే వీటిని జాతీయ జట్ల మధ్య పరిమిత ఓవర్‌ల క్రికెట్‌గా నిర్వహిస్తారు, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినట్లయితే ఇవి ఎల్లప్పుడూ ఒక రోజులో పూర్తి కావు. అంతర్జాతీయ మరియు దేశవాళీ స్థాయిల్లో ముఖ్యమైన వన్డే మ్యాచ్‌లకు తరచుగా రెండు రోజులు కేటాయించడం జరుగుతుంది, రెండో రోజు "రిజర్వ్" డేగా ఉంటుంది, మొదటి రోజు ఫలితం తేలడం సాధ్యం కానప్పుడు ఆటను పూర్తి చేయడానికి రెండో రోజును పరిగణలోకి తీసుకుంటారు (ఉదాహరణకు ఆట వర్షం కారణంగా నిలిచిపోయినట్లయితే లేదా అవాంతరం ఏర్పడినట్లయితే).

అంతర్జాతీయ వన్డే క్రికెట్ 20వ శతాబ్దం చివరి భాగంలో అభివృద్ధి చెందింది. మొదటి వన్డే మ్యాచ్ 1971 జనవరి 5న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగింది. మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి మూడు రోజులు వర్షం కారణంగా తుడిచిపెట్టుకపోవడంతో, అధికారులు మ్యాచ్‌ను రద్దు చేశారు, దీనికి బదులుగా ఓవర్‌కు ఆరు బంతుల చొప్పున 40 ఓవర్‌ల మ్యాచ్‌ను ఒక రోజు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్‌ల తేడాతో విజయం సాధించింది.

1970వ దశకం చివరి కాలంలో కెర్రీ ప్యాకెర్, వరల్డ్ సిరీస్ క్రికెట్ (WSC) అనే టోర్నమెంట్‌ను స్థాపించారు, ప్రస్తుతం సాధారణంగా ఉపయోగించబడుతున్న అంతర్జాతీయ వన్డే క్రికెట్ ప్రత్యేకతలను దీనిలో పరిచయం చేశారు, రంగుల దుస్తులు, తెల్ల బంతి మరియు నలుపు సైట్ స్క్రీన్‌లతో ఫ్లడ్‌లైట్‌ల వెలుగులో రాత్రిపూట మ్యాచ్‌లు ఆడటం, టెలివిజన్ ప్రసారాలు, పలువిధాలుగా కెమెరా కోణాలు, పిచ్‌పై ఆటగాళ్ల నుంచి శబ్దాలను గ్రహించేందుకు మైక్రోఫోన్‌ల వినియోగం మరియు స్క్రీన్‌పై గ్రాఫిక్స్ వంటివాటిని దీనిలో ప్రవేశపెట్టడం జరిగింది. రంగుల దుస్తులు ధరించి ఆడిన మొదటి మ్యాచ్‌లో WSC ఆస్ట్రేలియా (లేత పసుపు రంగు దుస్తులు ధరించింది) మరియు WSC వెస్టిండీస్ (ముదురు గులాబీ రంగు దుస్తులు ధరించింది) జట్లు తలపడ్డాయి, 1979 జనవరి 17న మెల్బోర్న్‌లోని VFL పార్కులో ఈ మ్యాచ్ జరిగింది. క్రికెట్‌ను ఈ టోర్నమెంట్ మరింత ప్రొఫెషనల్ క్రీడగా మార్చింది.

MCGలో జరుగుతున్న ఒక వన్డే మ్యాచ్, దీనిని ఫ్లడ్‌లైట్‌ల వెలుతురులో ఆడుతున్నారు.

నిబంధనలు[మార్చు]

ప్రధానంగా క్రికెట్ చట్టాలు దీనికి కూడా వర్తిస్తాయి. అయితే, వన్డేల్లో ప్రతి జట్టుకు బ్యాటింగ్ చేసేందుకు నిర్దిష్ట సంఖ్యలో ఓవర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వన్డే క్రికెట్ ప్రారంభ రోజుల్లో, ప్రతి జట్టుకు అందుబాటులో ఉన్న ఓవర్ల సంఖ్య సాధారణంగా 60 వద్ద ఉండగా, ఇప్పుడు ప్రతి జట్టుకు 50 ఓవర్లు కేటాయిస్తున్నారు.

సాధారణంగా మ్యాచ్ ఈ కింది విధంగా సాగుతుంది:

 • ఒక వన్డేలో రెండు జట్లు తలపడతాయి, ఒక్కో జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటారు.
 • టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ మొదట బ్యాట్ లేదా బౌల్ (ఫీల్డింగ్) చేయడంలో ఏదో ఒకటి ఎంచుకుంటాడు.
 • మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఒక ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టుకు లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. బ్యాటింగ్ చేస్తున్న జట్టులోని సభ్యులందరూ అవుట్ అయ్యే వరకు (అంటే జట్టులో 11 మంది సభ్యుల్లో పది మంది అవుట్ అయ్యే వరకు) లేదా జట్టుకు కేటాయించిన ఓవర్లు పూర్తయ్యే వరకు ఇన్నింగ్స్ కొనసాగుతుంది.
 • ప్రతి బౌలర్‌ను గరిష్ఠంగా 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసేందుకు అనుమతిస్తారు (వర్షం కారణంగా ఓవర్లు కుదించిన సందర్భాల్లో మరియు మ్యాచ్‌ను కుదించిన ఇతర సందర్భాల్లో మాత్రం సాధారణంగా ఐదింట ఒక వంతుకు మించకుండా లేదా ఇన్నింగ్స్‌కు కేటాయించిన మొత్తం ఓవర్‌లలో 20% ఓవర్లను బౌలర్‌కు కేటాయించడం జరుగుతుంది).
 • మొదటి జట్టు తరువాత బ్యాటింగ్ చేపట్టే జట్టు మ్యాచ్‌లో విజయం సాధించేందుకు నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అదే విధంగా, మొదటి జట్టు విజయం సాధించేందుకు అది నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువ పరుగులకు ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంది.
 • రెండో జట్టు తమ చేతిలోని అన్ని వికెట్‌లను కోల్పోయినప్పుడు లేదా ఓవర్‌లు అన్నీ ముగిసినప్పుడు రెండు జట్లు చేసిన పరుగులు సమంగా ఉన్నట్లయితే అప్పుడు మ్యాచ్ టై అయినట్లు ప్రకటిస్తారు (రెండు జట్లు కోల్పోయిన వికెట్‌ల సంఖ్యను ఈ సందర్భంలో పరిగణలోకి తీసుకోరు).

ఉదాహరణకు అననుకూల వాతావరణ పరిస్థితుల వంటి సందర్భాల్లో, ఆట జరగాల్సిన సమయానికి నష్టం జరిగినట్లయితే, ఓవర్‌ల సంఖ్యను తగ్గిస్తారు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఎదుర్కొన్న ఓవర్ల సంఖ్యకు తరువాత బ్యాటింగ్ చేసే జట్టుకు అందుబాటులో ఉన్న ఓవర్ల సంఖ్య భిన్నంగా ఉన్నట్లయితే, ఇటువంటి సందర్భాల్లో ఫలితాన్ని డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ద్వారా తేలుస్తారు.

ఫీల్డింగ్ చేస్తున్న జట్టు ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉన్నట్లయితే ఫ్లడ్‌లైట్‌లను ఉపయోగించేందుకు అనుమతిస్తారు, బంతికి తేమ కాకుండా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వస్త్రాన్ని ఉపయోగించేందుకు కెప్టెన్‌లను అనుమతిస్తారు.

పవర్‌ప్లే[మార్చు]

పవర్‌ప్లేల సమయంలో వలయం వెలుపల మైదానంలోకి పరిమిత సంఖ్యలో ఫీల్డర్‌లను మాత్రమే అనుమతిస్తారు.

బౌలింగ్ చేస్తున్న జట్టు ఫీల్డింగ్ నియమాలు పాటించాల్సి ఉంటుంది, ఈ నియమాల ప్రకారం క్యాచింగ్ స్థానాల్లో ఉన్న ఇద్దరు ఫీల్డర్‌లతోపాటు, మొత్తం తొమ్మిది మంది ఫీల్డర్‌లు నిర్దిష్ట సంఖ్యలో ఓవర్లపాటు తప్పనిసరిగా ఫీల్డింగ్ సర్కిల్‌లో ఉండాలి. సాంప్రదాయికంగా, ప్రతి ఇన్నింగ్స్‌లో మొదటి 15 ఓవర్లపాటు ఫీల్డింగ్ నిబంధనలను అమలు చేస్తారు.

2005 జూలై 30న ప్రారంభమైన 10 నెలల పరీక్షా కాలంలో, ఐసిసి పలు కొత్త వన్డే పవర్‌ప్లేల నిబంధనను పరిచయం చేసింది, పవర్‌ప్లేల నిబంధన పరిధిలో, ఫీల్డింగ్ నియమాలు మొదటి 10 ఓవర్లపాటు అమల్లో ఉంటాయి, ఐదేసి ఓవర్లు ఉండే మరో రెండు భాగాల్లో కూడా ఈ నియమాలు అమలు చేస్తారు (ఈ భాగాలను పవర్‌ప్లే ఫైవ్స్‌గా పిలుస్తారు). అక్టోబరు 2008 నుంచి బ్యాటింగ్ చేస్తున్న జట్టు మిగిలిన రెండు పవర్‌ప్లే భాగాల్లో ఒకదానిని తమ ఇష్టం ప్రకారం ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయిస్తుంది, మరో పవర్‌ప్లేను ఎప్పుడు ప్రారంభించాలనేది ఫీల్డింగ్ చేస్తున్న జట్టు నిర్ణయిస్తుంది. మొదటి పవర్‌ప్లేలో, 30 యార్డుల వలయం వెలుపల ఇద్దరు కంటే ఎక్కువ మంది ఫీల్డర్‌లు ఉండరాదు (రెండు మరియు మూడో పవర్‌ప్లేలలో మాత్రం వలయం వెలుపల ఉండే ఫీల్డర్‌ల సంఖ్యను మూడుకు పెంచారు). మొదటి 10 ఓవర్లలో, కనీసం ఇద్దరు ఫీల్డర్‌లను క్యాచింగ్ స్థానాలకు దగ్గరిలో మోహరించాల్సిన అవసరం ఉంటుంది.

2007 అక్టోబరు 1 నుంచి పవర్‌ప్లేలకు సంబంధించి రెండు 5-ఓవర్‌ల పవర్‌ప్లేలలో ఒకదానిలో 30 యార్డుల వలయం వెలుపల ముగ్గురు ఫీల్డర్‌లను మోహరించేందుకు ఫీల్డింగ్ చేస్తున్న జట్టు కెప్టెన్ నిర్ణయం తీసుకోవచ్చని ఐసిసి ప్రకటించింది. 2007 అక్టోబరు 1న దంబుల్లా స్టేడియంలో శ్రీలంక మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ నియమాన్ని మొదటిసారి అమలు చేశారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 119 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం 2వ మరియు 3వ పవర్‌ప్లేలు మలయ్యే సమయంలో 30 యార్డుల వలయం వెలుపల 3 ఫీల్డర్‌లను ఉంచాలి, ఒక పవర్‌ప్లేను బ్యాటింగ్ చేస్తున్న జట్టు ఎంపిక చేస్తుంది.

ప్రయోగాత్మక నిబంధనలు[మార్చు]

ప్రయోగాత్మక నిబంధనల్లో భాగంగా ఒక మార్పిడి నియమాన్ని కూడా పరిచయం చేశారు, దీని ద్వారా మ్యాచ్ ఏ దశలోనైనా ఒక ఆటగాడి స్థానంలో మరో ఆటగాడి చేత ఆడించేందుకు వీలు కల్పిస్తారు. టాస్ వేయడానికి ముందు జట్లు తమ ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటిస్తాయి, ఈ ఆటగాడిని సూపర్‌సబ్‌గా పిలుస్తారు. సూపర్‌సబ్‌గా ఉండే ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లేదా వికెట్ కీపింగ్ చేయవచ్చు; తన స్థానం నుంచి వైదొలిగిన ఆటగాడు తిరిగి మ్యాచ్‌లో ఆడేందుకు వీలుండదు. ఆరు నెలలపాటు ఇది అమల్లో ఉంది, దీనిలో సూపర్‌సబ్ ఆటగాడు టాస్ గెలిచిన జట్టుకు బాగా ప్రయోజనకరంగా ఉన్నట్లు, తద్వారా మ్యాచ్‌లో సమాన అవకాశాలు దెబ్బతింటున్నాయని స్పష్టమైంది. అనేక మంది అంతర్జాతీయ జట్ల కెప్టెన్‌లు 2005 చివరి కాలంలో ఈ నియమాన్ని ఉపయోగించరాదని ఒక పెద్దమనుషుల ఒప్పందం చేసుకున్నారు. మ్యాచ్‌కు అవసరమైన విధంగా వారు సూపర్‌సబ్‌లను నామమాత్రంగా ప్రకటించడం చేశారు, అయితే వారిని ఉపయోగించలేదు. 2006 ఫిబ్రవరి 15న ఐసిసి 2006 మార్చి 21 నుంచి సూపర్‌సబ్ నియమాన్ని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన చేసింది.

వన్డే హోదా ఉన్న జట్లు[మార్చు]

ఏ జట్లకు వన్డే హోదా ఉండాలనేది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్ణయిస్తుంది (అంటే ఇటువంటి హోదా ఉన్న ఏవైనా రెండు జట్ల మధ్య ప్రామాణిక వన్డే నియమాల పరిధిలో మ్యాచ్ జరిగినట్లయితే దానిని వన్డేగా పరిగణిస్తారు).

పది టెస్ట్-ఆడే దేశాలకు (ఇవి ఐసిసిలో పూర్తిస్థాయి సభ్యదేశాలుగా ఉన్నాయి) శాశ్వత వన్డే హోదా ఉంది. శాశ్వత వన్డే హోదా ఉన్న దేశాలు ఇక్కడ పేర్కొన్నారు, బ్రాకెట్‌లలో వాటికి వన్డే హోదా వచ్చిన తేదీలు తెలియజేశారు:

 1.  ఆస్ట్రేలియా (1971 జనవరి 5)
 2.  ఇంగ్లాండ్ (1971 జనవరి 5)
 3.  New Zealand (1973 ఫిబ్రవరి 11)
 4.  పాకిస్తాన్ (1973 ఫిబ్రవరి 11)
 5.  వెస్ట్ ఇండీస్ (1973 సెప్టెంబరు 5)
 6.  India (1974 జూలై 13)
 7.  శ్రీలంక (1975 జూన్ 7)
 8.  Zimbabwe (1983 జూన్ 9)
 9.  Bangladesh (1986 మార్చి 31)
 10.  South Africa (1991 నవంబరు 10)

ఇతర జట్లకు కూడా ఐసిసి తాత్కాలికంగా వన్డే హోదాను ఇచ్చింది; ప్రస్తుతం తాత్కాలిక వన్డే హోదా ఉన్న దేశాలు:

 •  కెన్యా (1996 ఫిబ్రవరి 18 నుంచి 2013 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ వరకు)
 •  Canada (2006 జనవరి 1 నుంచి 2013 ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫైయర్ వరకు)
 •  Ireland (2006 జనవరి 1 నుంచి 2013 ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫైయర్ వరకు)
 •  డచ్చిదేశం (2006 జనవరి 1 నుంచి 2013 ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫైయర్ వరకు)
 •  Scotland (2006 జనవరి 1 నుంచి 2013 ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫైయర్ వరకు)
 •  ఆఫ్ఘనిస్తాన్ (2009 ఏప్రిల్ 19 నుంచి 2013 ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫైయర్ వరకు)

2005 ఐసిసి ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా కెనడా, ఐర్లాండ్, నెదర్లాండ్స్ మరియు స్కాట్లాండ్‌లకు కూడా ఈ హోదా ఇచ్చారు. ఐసిసి ఈ పూర్వప్రమాణాన్ని 2009లో కూడా ఉపయోగించింది, తరువాతి నాలుగు సంవత్సరాలకు వన్డే హోదాను ఇచ్చేందుకు 2009 ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫైయర్ (ఐసిసి ట్రోఫీకి కొత్త పేరు) ఫలితాలను ఉపయోగించింది. టోర్నమెంట్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌ ఐదో స్థానంలో నిలవడంతోపాటు, వన్డే హోదాను పొందింది.

ఒక దశలో, ఐసిసి అప్పుడప్పుడు సహచర సభ్యదేశాలకు పూర్తిస్థాయి సభ్యత్వం మరియు టెస్ట్ హోదా ఇవ్వకుండా శాశ్వత వన్డే హోదాను కల్పించింది. పూర్తిస్థాయి సభ్యత్వం పొందడానికి ముందు అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన సహచర సభ్యదేశాల జట్లను పరిచయం చేసేందుకు ఐసిసి ఈ విధానాన్ని పాటించింది. మొదట బంగ్లాదేశ్ మరియు తరువాత కెన్యా ఈ హోదాను పొందాయి. బంగ్లాదేశ్ ఆ తరువాత టెస్ట్ హోదా మరియు పూర్తి సభ్యత్వం రెండింటినీ పొందింది; ఐసిసి పేలవమైన ప్రదర్శన కారణంగా కెన్యా యొక్క శాశ్వత వన్డే హోదాను రద్దు చేసింది.

అంతేకాకుండా, కొన్ని ప్రధాన టోర్నమెంట్‌లలో అన్ని మ్యాచ్‌లకు ప్రత్యేక వన్డే హోదాను కల్పించే హక్కు ఐసిసికి ఉంది, దీని ఫలితంగా పూర్తిస్థాయి వన్డేల్లో ఈ కింది దేశాలు పాల్గొన్నాయి:

 •  East Africa (జూన్ 1975 నుంచి 1975 జూన్ 14 వరకు)
 •  సంయుక్త అరబ్బు ఎమిరేట్లు (1994 ఏప్రిల్ 13 నుంచి 1994 ఏప్రిల్ 17 వరకు; 1996 ఫిబ్రవరి 16 నుంచి 1996 మార్చి 1 వరకు; 2004 జూలై 16 నుంచి 2004 జూలై 17 వరకు మరియు 2008 జూన్ 24 నుంచి 2008 జూన్ 26 వరకు)
 •  Namibia (2003 ఫిబ్రవరి 10 నుంచి 2003 మార్చి 3 వరకు)
 •  Hong Kong (2004 జూలై 16 నుంచి 2004 జూలై 18 వరకు మరియు 2008 జూన్ 24 నుంచి 2008 జూన్ 25 వరకు)
 •  United States (2004 సెప్టెంబరు 10 నుంచి 2004 సెప్టెంబరు 13 వరకు)
 •  Bermuda (2006 జనవరి 1 నుంచి 2009 ఏప్రిల్ 8 వరకు)

2005లో ఐసిసి మొదటిసారి వివాదాస్పదంగా వన్డే హోదాను ఇచ్చింది, వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్న జట్లు ఆడిన అనేక మ్యాచ్‌లకు వన్డే హోదా ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లు ఆసియా XI - ఐసిసి వరల్డ్ XI మధ్య జరిగాయి, జనవరి 2005లో 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ సహాయ చర్యల కోసం నిధుల సమీకరణకు వరల్డ్ క్రికెట్ సునామీ అప్పీల్‌‌లో భాగంగా ఈ మ్యాచ్‌లను నిర్వహించారు, వ్యాపారపరంగా ప్రాయోజితం చేయబడిన ఈ మూడు "ఆస్ట్రేలియా - ఐసిసి వరల్డ్ XI" ఐసిసి సూపర్ సిరీస్ మ్యాచ్‌లు అక్టోబరు 2005లో మెల్బోర్న్‌లో జరిగాయి. తరువాతి మ్యాచ్‌లకు ప్రేక్షకులు అంతంతమాత్రంగా హాజరయ్యారు, పూర్తిస్థాయిలో ఏకపక్షంగా సాగాయి, క్రికెట్ ప్రపంచంలో వీటికి అతికొద్ది ప్రాధాన్యత మాత్రమే లభించింది. ఇది ఒక ప్రయోగంగా ఉంది, ఎక్కువ మంది ఇటువంటి ప్రయోగాలు పునరావృతం కాకూడదని అభిప్రాయపడ్డారు (ఉదాహరణకు, బిల్ ఫ్రిండాల్), ఎక్కువ మంది క్రికెట్ గణాంక నిపుణులు ఈ మ్యాచ్‌లను అధికారిక వన్డే రికార్డుల్లో చేర్చరాదనే భావనలు వ్యక్తపరిచారు.[1][2]

టోర్నమెంట్‌లు[మార్చు]

సాధారణంగా రెండు జట్లు లేదా మూడు జట్ల మధ్య వన్డే సిరీస్‌ను నిర్వహిస్తారు. అత్యంత ప్రసిద్ధ వన్డే టోర్నమెంట్‌లు‌:

 • క్రికెట్ ప్రపంచ కప్
 • ICC ఛాంపియన్స్ ట్రోఫీ

అంతర్జాతీయ వన్డే రికార్డులు[మార్చు]

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో భారతదేశానికి చెందిన సచిన్ టెండూల్కర్ అత్యధిక 100లు (సెంచరీలు) మరియు 50లు (అర్ధ సెంచరీలు) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మరియు వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా కూడా సచిన్ పేరిట రికార్డులు ఉన్నాయి, అతను 2010 ఫిబ్రవరి 24న వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.

"జాబితా ఏ"లో ఒక పరిమిత ఓవర్‌ల మ్యాచ్‌లో అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు చేసిన జట్టుగా శ్రీలంక రికార్డు సృష్టించింది, 2006 జూలై 4న అంస్టెల్వీన్‌లో జరిగిన 50 ఓవర్‌ల అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై శ్రీలంక 443 పరుగులు చేసింది. వన్డే క్రికెట్‌లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా జింబాబ్వే నిలిచింది, 2004లో హరారేలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేను శ్రీలంక జట్టు 35 పరుగులకే ఆలౌట్ చేసింది.

"జాబితా ఏ"లో ఒక పరిమిత ఓవర్‌ల క్రికెట్ మ్యాచ్‌లో ఇరు జట్లు సంయుక్తంగా నమోదు చేసిన అత్యధిక స్కోరు 872: మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్‌లలో నాలుగు వికెట్‌ల నష్టానికి 434 పరుగులు చేయగా, తరువాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్‌లు కోల్పోయి ఒక బంతి మిగిలివుండగా 438 పరుగులు చేసింది, 2006లో జోహనెస్‌బర్గ్‌లో జరిగిన వన్డేలో ఈ రికార్డు నమోదయింది.

కొలంబోలో 2001-02 సీజన్‌లో శ్రీలంక-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో చమింద వాస్ వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 8-19 నమోదు చేశాడు, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్‌గా వాస్ గుర్తింపు పొందాడు.

ఒక జట్టు కంటే ఎక్కువ జట్లకు ఆడిన ఆటగాళ్లు[మార్చు]

అంతర్జాతీయ స్థాయిలో ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నివాస మరియు/లేదా పౌరసత్వ అవసరాలు ఉంటాయి, సాధారణంగా ఒక ఆటగాడు తన కెరీర్‌లో వన్డేల్లో ఒక జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాడు. అయితే పలువురు ఆటగాళ్లు ఒకటి కంటే ఎక్కువ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. వారు:[1]

 • కెప్లెర్ వెస్సెల్స్ (ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా) టెస్టులు మరియు అంతర్జాతీయ వన్డేలు
 • క్లేటన్ లాంబెర్ట్ (వెస్టిండీస్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు)
 • డౌగీ బ్రౌన్ (ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్)
 • ఆండర్సన్ కుమ్మిన్స్ (వెస్టిండీస్ మరియు కెనడా)
 • ఏయిన్ మోర్గాన్ (ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్)
 • డిర్క్ నన్నెస్ (నెదర్లాండ్స్ మరియు ఆస్ట్రేలియా)
 • ఎడ్ జాయిస్ (ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్)

అంతేకాకుండా, జాన్ ట్రాయ్‌కోస్ దక్షిణాఫ్రికా మరియు జింబాబ్వే జట్ల తరపున టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, అయితే వన్డేలు మాత్రం జింబాబ్వేకు మాత్రమే ఆడాడు, గావిన్ హామిల్టన్ స్కాట్లాండ్ కోసం వన్డేలు మాత్రమే ఆడాడు, అయితే ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. డిర్క్ నన్నెస్ ఇంగ్లాండ్‌లో జరిగిన 2009 ఐసిసి వరల్డ్ ట్వంటీ20 కోసం టి20 మ్యాచ్‌లలో నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు, అయితే స్కాట్లాండ్‌తో జరిగిన ఒక వన్డేలో ఆస్ట్రేలియా తరపున ఆడాడు. ఆ తరువాత నుంచి అతను ఆస్ట్రేలియా తరపున మరిన్ని టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇమ్రాన్ తాహిర్ అనే మరో ఆటగాడు గతంలో లాహోర్, పాకిస్థాన్ ఏ, రెడ్కో పాకిస్థాన్ లిమిటెడ్, సుయ్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ జట్ల తరుపన పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ ఆడాడు, అయితే అతను ప్రస్తుతం ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ICC టెస్ట్ ఛాంపియన్‌షిప్
 • పరిమిత ఓవర్‌ల క్రికెట్
 • అంతర్జాతీయ వన్డే రికార్డులు
 • అంతర్జాతీయ వన్డే టోర్నమెంట్‌లు
 • అంతర్జాతీయ వన్డే హ్యాట్రిక్‌లు
 • అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 10000కుపైగా పరుగులు చేసిన బ్యాట్‌మెన్ జాబితా

సూచనలు[మార్చు]

 1. Martin Williamson (18 October 2005), Few outside Australia will mourn the end of this Sorry Series
 2. Bill Frindall (20 August 2008), Ask Bearders #176

మూస:Forms of cricket