అంబల్ల జనార్ధన్ (రచయిత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబల్ల జనార్దన్
అంబల్ల జనార్దన్
జననం (1950-11-09) 1950 నవంబరు 9 (వయసు 72)
జాతీయతభారతదేశం
విద్యఎం.కామ్‌., ఎల్.ఎల్.బి.
వృత్తిజనరల్ మేనేజర్ (ఆంధ్రప్రదేశ్)
ఉద్యోగందివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, కవి
గుర్తించదగిన సేవలు
బొంబాయి కథలు, బొంబాయి నానీలు, అంబల్ల జనార్దన్ కథలు
తల్లిదండ్రులుఅంబల్ల నర్సయ్య, నర్సవ్వ

అంబల్ల జనార్దన్ ప్రవాసాంధ్ర రచయిత, కవి, కథకుడు. అతనికి ముంబయి తెలుగు రత్న అనే బిరుదు ఉంది. అతను ముంబయిలో తెలుగు సాహిత్యాభివృద్ధికి శ్రీకారం చుట్టి సాహిత్యరంగంలో ‘ముంబయి జనార్దన్‌’గా పేరొందిన రచయిత. తెలుగుపై మక్కువ పెంచుకున్న అతను వివిధ ఉద్యోగాలు చేస్తూనే మూడు దశాబ్దాల నుంచి కథలు రాస్తున్నాడు. సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అంబల్ల జనార్థన్ 1950, నవంబరు 9న నిజామాబాద్‌ జిల్లా మోధాన్‌ మండలం ధర్మోరా గ్రామంలోని పద్మశాలీ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి అంబల్ల నర్సయ్య. తల్లి నర్సవ్వ. స్వంత గ్రామంలో ఉపాధి అవకాశాలు కొరవడటంతో తండ్రి ముంబయికి వలసవెళ్ళాడు. దాంతో జనార్దన్‌ పుట్టుక, చదువు, ఉద్యోగం అన్నీ ముంబయిలోనే జరిగాయి.అతను ఏడుగురు సంతానంలో పెద్దవాడు. అతనికి ఐదుగురు చెల్లెళ్ళు, తమ్ముడు ఉన్నారు. అతను పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు ఓగేటి పరీక్షిత్‌ శర్మ ప్రోత్సాహంతో తెలుగు భాషాచంధస్సు నేర్చుకున్నాడు. తెలుగుతో సహా హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ భాషలు అనర్గళంగా మాట్లాడగలస్థాయికి ఎదిగాడు. మాతృభాషపట్ల ప్రేమతో తెలుగు దిన, వార, మాస పత్రికలు క్షుణ్ణంగా చదివేవాడు. పత్రికల్లో వ్యాసాలు రాసేవాడు. రెండేళ్ళు కళాశాలలో చదివి సెలవురోజుల్లో ముంబయి యూనివర్సిటీ తరపున యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో టెంపరరీ క్లార్క్‌ (1969) గా, ఆ తర్వాత పూర్తిస్థాయి (1970) ఉద్యోగిగా స్థిరపడి, ఎంకాం, ఎల్‌.ఎల్‌.బి పూర్తి చేశాడు.

ఉద్యోగం[మార్చు]

అతను పదోన్నతులకోసం ప్రైవేటురంగంలో పనిచేశాడు. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగి 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసాడు. తరువాత అతను సాహిత్య వ్యాసంగంపై మరింత దృష్టి కేంద్రీకరించాడు. ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా కార్పొరేట్‌ సంస్థలకు ప్రస్తుతం సలహాదారుగా ఉన్నాడు. కవిత్వం‍ రాయడం అతనికి బాల్యం నుంచీ అలవడింది. సినిమా పాటలు పేరడీచేసి పాడుతూ, అందరినీ నవ్వించేవాడు. స్కూల్‌ ఫేర్‌వెల్‌ ఫంక్షన్‌లో గురువులకు కృతజ్ఞతలు చెబుతూ సొంతంగా పాటలు రాసి పాడేవాడు. ముంబయి సాంస్కృతిక సంఘంవారి నాటకాల్లో కృష్ణుడుగానూ, సారంగధర లాంటి యక్షగానాల్లోనూ నటించేవాడు. అతను ఆంధ్ర యువజన స్నేహమండలి స్థాపించి సేవలందించారు.[2]

అతని కథల్లో చిత్రించిన జీవిత కోణాలు ప్రత్యేకమైనవి. అట్టడుగు గ్రామీణ పట్టణ జీవిత పరిణామాలను వస్తువుగా స్వీకరించి రచనలు చేస్తూంటాడు. అతను ముంబయిలో స్థిరపడినా బాల్యం అంతా పల్లెలు, ఊళ్ళూ, బంధువులతో సన్నిహిత సంబంధాలు, అతని కతల్లో సజీవంగా సాక్షాత్కరిస్తాయి. అతను ముంబై జన జీవనంలో కలసిపోయి ఎందరి జీవితాలనో, జరిగిన సంఘటనలతో ప్రత్యక్షంగా చూసి, అనుభవించి విషయ విజ్ఞానం తనకు తెలిసిన విషయాలను, పరిచయమైన మనుషుల గురించి మాత్రమే అతను కథలుగా మలిచాడు.[3]

ముంబయిలో ఎంతోమంది యువ రచయితలను తయారు చేశారాయన. ముంబయిలో తెలుగువారి జీవనస్థితిగతులను తన కథల్లో ప్రతిబింబిస్తూ తెలుగువారు అత్యధికంగా ఉండే ముంబయి ప్రాంతానికీ–తెలుగు రాష్ర్టాలకు మధ్య వారథిగా ఉంటూ ముప్ఫైఏళ్ళుగా సాహిత్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు . ఇప్పటివరకు ఆయన 15 పుస్తకాలు వెలువరించాడు

పాఠ్య పుస్తకాల్లో కథలు[మార్చు]

వివిధ నేపథ్యాల్లో అతను రాసిన కొన్ని కథలు మహారాష్ట్రలోని 8, 9, 10వ తరగతి తెలుగు, మరాఠీ భాషా పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. 8వ తరగతిలో చమురుదీపం, 9వ తరగతిలో శ్రీకారం, 10వ తరగతిలో బయలుబతుకు అనే కథలను పాఠ్యాంశాలుగా మహారాష్ట్ర ప్రభుత్వం ముద్రించింది. శ్రీకారం కథలో ఒక తెలుగు విద్యార్థి ముంబయిలో ఉంటూ సొంత రాష్ట్రానికి వస్తాడు. అతను తెలుగు మాట్లాడలేడు. బస్సులపై పేర్లు చదవలేడు. అదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన ఒక విద్యార్థి మంచి తెలుగులో మాట్లాడతాడు. ఆ సందర్భాన్ని చెబుతూ తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలో వివరించాడాయన. స్వయం ఉపాధి పేరిట రాసిన మరో కథ అంతకు ముందు 9వ తరగతిలో పాఠ్యాంశంగా ఉండేది. అతను తెలుగు సాహిత్యంపై తరచూ సదస్సులు నిర్వహిస్తుంటాడు.

రచనలు[4][మార్చు]

ఇప్పటివరకు మూడు కవితా సంపుటిలు వెలువరించారు. ‘ముంబయి నానీలు’ (2001), ‘ముంబయి మువ్వలు’ (2007), జనార్దన్‌ షష్టిపూర్తి సందర్భంగా వెలువరించిన ‘ముంబయి చాట్‌ భేల్‌’ (2010) కవితా సంపుటిలు వెలువడ్డాయి. తెలుగు, మరాఠా పుస్తకాల్లోపాఠ్యాంశాలుగా కథలుఅంబల్ల జనార్దన్‌ తొలి కథ ‘వీడిన మబ్బులు’ (1993). కొడుకులకోసం, కొత్త తరం ఆలోచనలను అందిపుచ్చుకున్న ఓ తండ్రి కథ ఇది. ‘మయూరి’ వారపత్రికలో ప్రచురితమైంది.‘అమృత కిరణ్’ పక్ష పత్రిక నిర్వహించిన జాతీయస్థాయి కథలపోటీల్లో ఆయన రాసిన ‘చమురుదీపం’ కథకు ద్వితీయ బహుమతి లభించింది. 1556కథల్లో అగ్రభాగాన నిలిచి బహుమతి గెలుచుకుంది.

  • బొంబాయి కథలు (1988) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆర్థిక సహాయంతో
  • బొంబయి నానీలు (2001)
  • అంబల్ల జనార్ధన్ కథలు (2004)
  • ముంబా మువ్వలు - నానీలు (2007)
  • చిత్ అణి పత్ - స్వీయ తెలుగు కథలు మరాఠి అనువాద సంపుటి (2008)
  • బొమ్మవెనుక మరికొన్ని కథలు (2009)

మూలాలు[మార్చు]

  1. "సంకలనంగా తీసుకొస్తేనే కథలు నిలుస్తాయి - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.
  2. "ప్రపంచదేశాల్లో తెలుగువారందరికీ సాహిత్యమే బొడ్డుతాడు". lit.andhrajyothy.com. Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.
  3. "Display Books of this Author". www.avkf.org. Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.
  4. Janardhan Amballa | Authors | Home - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.