అకాల్ తఖ్త్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అకాల్ తఖ్త్
ਅਕਾਲ ਤਖ਼ਤ ਸਾਹਿਬ
Akal takhat amritsar.jpg
అకాల్ తఖ్త్ సాహిబ్
సాధారణ సమాచారం
నిర్మాణ శైలిసిక్ఖు నిర్మాణ శైలి
పట్టణం లేదా నగరంఅమృత్ సర్
దేశంభారత దేశం
పూర్తి చేయబడినది17వ శతాబ్ది

అకాల్ తఖ్త్ (పంజాబీ: ਅਕਾਲ ਤਖ਼ਤ), (కాలాతీతమైన సింహాసనం అని అర్థం[1]) సిక్ఖు మతంలోని ఐదు తఖ్త్ (అధికారిక పీఠాలు) ల్లో ఒకటి. పంజాబ్ లోని అమృత్ సర్లో ఉన్న హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) కాంప్లెక్స్ లో నెలకొంది. న్యాయాన్ని అందించేందుకు, తాత్కాలిక సమస్యలను పరిష్కరించేందుకు గురు గోవింద్ సింగ్ ఈ స్థానాన్ని నెలకొల్పారు; ఖల్సాలో భూమిపై ఉన్న అత్యున్నత అధికార స్థానంగా, సిక్ఖుల అత్యున్నత స్థాయి ప్రతినిధి అయిన జాతేదార్ స్థానంగా ఇది నిలుస్తోంది. ప్రస్తుత జాతేదార్ సింగ్ సాహిబ్ జైనీ గుర్బచ్చన్ సింగ్ ఖల్సా.

చరిత్ర[మార్చు]

గురు నానక్ గుర్పురాబ్, హర్మందిర్ సాహిబ్, అమృత్ సర్ లో వెలుగులీనుతున్న అకాల్ తఖ్త్.
పంజాబ్ లోని అమృత్ సర్ లో అకాల్ తఖ్త్, హర్మందిర్ సాహిబ్.

అకాల్ తఖ్త్ ను ఆరవ సిక్ఖు గురువు గురు హర్ గోవింద్ రాజకీయ సార్వభౌమత్వానికి చిహ్నంగా, సిక్ఖు ప్రజలు ఆధ్యాత్మిక, భౌతిక సమస్యలను విన్నవించుకునే కొలువుగా నిర్మించారు.[1] అకాల్ తఖ్త్ సిక్ఖు సార్వభౌమత్వానికి ప్రతీకగా పలు పోరాటాలు, యుద్ధాలను వీక్షించింది. 18వ శతాబ్దిలో అహ్మద్ షా అబ్దాలీ, మస్సా రాంగర్ అకాల్ తఖ్త్, హర్మందిర్ సాహిబ్ లపై వరుస దాడులకు పాల్పడ్డారు.[1] హరి సింగ్ నల్వా అనే మహారాజా రంజిత్ సింగ్ సైన్యాధ్యక్షుడు అకాల్ తఖ్త్ ను బంగారంతో పూతపూయించి అలంకరించారు.[2]

ఆపరేషన్ బ్లూస్టార్[మార్చు]

1980ల్లో ఖలిస్తాన్ వేర్పాటు ఉద్యమ సంక్షోభంలో తీవ్రవాది భింద్రన్ వాలే స్వర్ణ దేవాలయంలో ప్రవేశించి అకాల్ తఖ్త్ లో నివాసం ఏర్పరుచుకున్నారు. మధ్యయుగాల నాడు సిక్ఖు గురువులు సిక్ఖు పోరాట వీరులకు ఆశీర్వచనాలు, యుద్ధతంత్రం అందించిన ఆ ప్రదేశం నుంచి సంకేతాత్మకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నడింపించారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని ముఘలులతో పోలుస్తూ అక్కడి నుంచి వ్యాఖ్యలు చేశారు. ఈ తిరుగుబాటు తీవ్రస్థాయికి చేరడంతో 1984 జూన్ 4లో భారతీయ సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ ప్రారంభించింది. అప్పటికే అకాల్ తఖ్త్ ను, హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్ ను కోటగా మలుస్తూ, సైనిక పోస్టులు ఏర్పాటుచేసి భింద్రన్ వాలే ఉగ్రవాద సైన్యం పోరాటం ప్రారంభించడంతో జరిగిన దాడిలో అకాల్ తఖ్త్ దెబ్బతింది.

పునర్నిర్మాణం[మార్చు]

భారత ప్రభుత్వం అకాల్ తఖ్త్ కు మరమ్మతులు చేసి పునర్నిర్మించింది. సిక్ఖుల్లో కొన్ని వర్గాలు ఇది ప్రభుత్వం నిర్మించిందన్న విషయాన్ని సూచించేలా "సర్కారీ తఖ్త్" (సర్కారీ అంటే హిందీ, పంజాబీల్లో ప్రభుత్వానికి చెందిన అని అర్థం) అని పిలువనారంభించారు, అది అకాల్ తఖ్త్ కాదన్న సూచన దీంట్లో గర్భితమైంది. సిక్ఖు మతస్తుడైన హోంమంత్రి బూటా సింగ్ కొత్త తఖ్త్ నిర్మాణంలో పాలుపంచుకున్నందుకు బహిష్కరణకు గురయ్యారు. కొంత కాలం పాటు హర్మందిర్ సాహిబ్ బయట భక్తుల పాదరక్షలు తుడుస్తూ సేవ చేశాకా సముదాయం ఆయనను తిరిగి స్వీకరించడం ప్రారంభించింది.[3] 1986లో సిక్ఖుల సర్బత్ ఖల్సా (సిక్ఖు సమాఖ్య లాంటిది)లో ఖలిస్తాన్ సిక్ఖుల మాతృభూమి అని ప్రకటించడంతో పాటు భారత ప్రభుత్వం మరమ్మతులతో పునర్నిర్మించిన శ్రీ అకాల్ తఖ్త్ సాహిబ్ ను మళ్ళీ నిర్మించుకోవాలన్న ప్రతిపాదన ముందుకువచ్చింది.

1986లో అమృత్ సర్ కు చెందిన సిక్ఖులు సర్కారీ తఖ్త్ బదులు, సిక్ఖుల సంప్రదాయానుసారం కరసేవ, స్వచ్ఛంద స్వయం సేవల ద్వారా అకాల్ తఖ్త్ పునర్నిర్మించుకోవాలని నిర్ణయించుకుని, 1995 నాటికి కొత్త విశాలమైన తఖ్త్ ను నిర్మాణం చేశారు.

నిర్మాణ శైలి[మార్చు]

అకాల్ తఖ్త్ మొదట విశాలమైన ఖాళీ ప్రదేశంలో పెద్ద దిబ్బ ఉన్న ప్రాంతంలో నిర్మించారు. హర్ గోవింద్ చిన్నతనంలో ఆడుకున్న ప్రాంతంలో దాని నిర్మాణం జరిగింది. మొట్టమొదట తఖ్త్ 3.5 అడుగుల ఎత్తైన సాధారణ వేదిక, దీనిపై హర్ గోవింద్ కూర్చొని అభ్యర్థనలు స్వీకరించి, న్యాయాన్ని అందించేవారు. రాజరికపు హోదాకు చిహ్నాలైన ఛత్రచామరాలతో ఆయన పరివేష్టించివుండేవారు. ఆ తర్వాత ఓపెన్ ఎయిర్, అర్థ చంద్రాకార నిర్మాణం పాలరాతి స్తంభాలు, బంగారు పూత పూసిన లోపలి భాగంతో నిర్మితమైంది. ఐరోపీయుల చిత్రాలు కూడా కుడ్యచిత్రాల్లో కనిపించేవి.[4]

ఆధునిక కట్టడం లోపల పాలరాయి, పైన స్వర్ణ దళపు గోపురంతో కూడిన ఐదంతస్తుల నిర్మాణం. మూడు అంతస్తులను 1700ల్లో రంజిత్ సింగ్ నిర్మింపజేయగా, ప్రస్తుతం ఉన్న పునర్నిర్మాణ కట్టడంలో సున్నంతో అలంకరించిన పొర కూడా కనిపిస్తుంది. సున్నపు ప్లాస్టర్ పునర్నిర్మాణానికి పూర్వమే ఉన్న నిర్మాణంలోనే భాగమయి వుండొచ్చు కానీ అది అసలు నిర్మాణంలో తర్వాతి దశల్లోనిది కావచ్చు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Fahlbusch E. (ed.) "The encyclopedia of Christianity." Eerdmans, Grand Rapids, Michigan, 2008. ISBN 978-0-8028-2417-2
  2. Sohan Lal Suri. 19th century. Umdat-ut-tawarikh, Daftar III, Part 2, trans. V.S. Suri, (1961) 2002, Amritsar: Guru Nanak Dev University, f. 260
  3. "Buta" Rediff.com, March 1998.
  4. G.S., Randhir (1990). Sikh shrines in India. New Delhi: The Director of Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. pp. 13–14.