Jump to content

అజ్మీర్ సింగ్

వికీపీడియా నుండి
అజ్మీర్ సింగ్
జననం(1940-02-01)1940 ఫిబ్రవరి 1
కుప్ కలాన్, సంగ్రూర్ జిల్లా, పంజాబ్
మరణం2010 జనవరి 26(2010-01-26) (వయసు: 69)
చండీగఢ్
జాతీయతభారతీయుడు
వృత్తిక్రీడాకారుడు, విద్యావేత్త
Olympic medal record
పురుషుల అథ్లెటిక్స్
Competitor for IND
ఆసియా క్రీడలు
Gold medal – first place1966 బ్యాంకాక్400 మీ.
Silver medal – second place1966 బ్యాంకాక్200 మీ
Silver medal – second place1970 బ్యాంకాక్4x400 మీ రిలే

అజ్మీర్ సింగ్ (1 ఫిబ్రవరి 1940-26 జనవరి 2010) 1964 వేసవి ఒలింపిక్స్‌లో పోటీ చేసిన భారతీయ క్రీడాకారుడు. ఇతడు బ్యాంకాక్‌లో జరిగిన 1966 ఆసియా క్రీడలలో బంగారు పతక విజేత. చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో క్రీడా డైరెక్టర్‌గా పనిచేశాడు.[1]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

ఇతడు పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా కుప్ కలాన్ గ్రామంలో కర్తార్ సింగ్ ఔలఖ్, బచన్ కౌర్ ఔలఖ్ అనే జాట్ సిక్కు రైతుకుటుంబానికి చెందిన దంపతులకు జన్మించాడు.[2][3]

ఇతడు మలేర్‌కోట్లా ప్రభుత్వ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు, తరువాత గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బిపిఇ)ని పూర్తి చేశాడు. దీని తరువాత చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., పిహెచ్.డి. చేశాడు.

ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్డీ డిగ్రీ పొందిన ఏకైక భారతీయ వ్యక్తి అజ్మీర్ సింగ్. భారత ప్రభుత్వం ఇతడిని అర్జున అవార్డుతో సత్కరించింది. ఇతడు స్వీయ-నియంత్రిత వ్యక్తి , జీవితమంతా వినయపూర్వకమైన వ్యక్తిగా ఉన్నాడు. సమర్థుడైన నిర్వాహకుడిగా, గొప్ప శిక్షకుడిగా, మంచి ఉపాధ్యాయుడిగా పేరు పొందాడు.

మాధ్యమిక పాఠశాల స్థాయి విద్య వరకు, అజ్మీర్ కుప్ గ్రామానికి సుమారు 2 మైళ్ళు (సుమారు 4 కిలోమీటర్ల) దూరంలో ఉన్న పొరుగున ఉన్న రోహిరా గ్రామానికి నడవాల్సి వచ్చేది. నిరుపేద కుటుంబానికి చెందిన అజ్మీర్ చెప్పులు లేకుండా, ఎండ, వాన, చలి మొదలైన వాటిని లెక్క చేయకుండా, పాఠశాలకు వెళ్లేవాడు. అన్ని పాఠశాల స్థాయి పరీక్షలలో మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు. విద్యుత్ సదుపాయంలేని ఆ రోజులలో ఇతడు రాత్రిపూట ఒక చిన్న నూనె దీపం దగ్గర కూర్చుని చదువుకునేవాడు, పగటిపూట అన్ని కుటుంబపనులకు సహాయం చేసేవాడు.

ఎప్పుడూ తక్కువ ఆహారంతో, పోషకాహారలోపంతో పెరిగిన అజ్మీర్ తరువాత పరుగులో ఆసియా ఛాంపియన్, ఒలింపియన్ అథ్లెట్ కాగలిగాడు. చిన్నతనంలోనే ఇతడు తన తల్లిని కోల్పోయాడు.

వృత్తి

[మార్చు]

ఇతడు 1964 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. రెండు సంవత్సరాల తరువాత బ్యాంకాక్‌లో జరిగిన 1966 ఆసియా క్రీడలలో, ఇతడు 400 మీటర్ల పరుగులో బంగారు, 200 మీటర్ల పరుగులో వెండి పతకాలను గెలుచుకున్నాడు.[2]

ఇతడు 1976 నుండి 1979 వరకు నైజీరియా ఫెడరల్ ప్రభుత్వానికి ప్రత్యేక విద్యా అధికారిగా డిప్యుటేషన్‌లో పనిచేశాడు. నైజీరియాలో ఉన్నప్పుడు, అజ్మీర్ నైజీరియాలోని పోర్థార్ కోర్ట్, అబులోమా లోని ఫెడరల్ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో తన విద్యార్థిగా ఉన్న దగ్బా మిన్హాకు అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చాడు. మిన్హా, అజ్మీర్ మార్గదర్శకత్వంలో, షాట్ పుట్, డిస్కస్ త్రోలలో నైజీరియా జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు వైస్ ఛాన్సలర్‌గా, చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో మౌలానా అబుల్ కలాం పీఠానికి అధిపతిగా, క్రీడా డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు.[2][4]

ఇతడు 2010 జనవరి 26 తేదీన చండీగఢ్‌లో 70 సంవత్సరాల వయసులో మరణించాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, మనుమలు ఉన్నారు.[5]

ఇతనికి 1966లో భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును ప్రదానం చేసింది.[6] మరణానికి రెండు సంవత్సరాల ముందు, అజ్మీర్ తన శరీరాన్ని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు వైద్య పరిశోధన కోసం విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. అలాగే, అజ్మీర్ తన జ్ఞాపకార్థం ఏ విధమైన స్మారకచిహ్నాలను నిర్మించరాదని ప్రకటించాడు. ఇతని ఈ రెండు కోరికలను తన కుటుంబం నెరవేర్చింది.

పతకాలు

[మార్చు]

అంతర్జాతీయ పోటీలలో ఇతడు గెలుచుకున్న పతకాల వివరాలు[7]:

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1966ఆసియా క్రీడలుబ్యాంకాక్, థాయిలాండ్1వ400 మీ.47.1
1966ఆసియా క్రీడలుబ్యాంకాక్, థాయిలాండ్2వ200 మీ21.5
1970ఆసియా క్రీడలుబ్యాంకాక్, థాయిలాండ్2వ4x400 మీ రిలే3:11.9

మూలాలు

[మార్చు]
  1. Evans, Hilary; Gjerde, Arild; Heijmans, Jeroen; Mallon, Bill; et al. "అజ్మీర్ సింగ్". Olympics at Sports-Reference.com. Sports Reference LLC. the original నుండి 18 April 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 May 2012.
  2. 1 2 3 "Olympian athlete Ajmer Singh passed away". The Times of India. 27 January 2010. ఒరిజినల్ నుండి 28 September 2013 న ఆర్కైవు చెయ్యబడింది."Olympian athlete Ajmer Singh passed away". The Times of India. 27 January 2010. Archived from the original on 28 September 2013.
  3. Olympian athlete Prof Ajmer Singh is dead sports wire, 26 January 2010.
  4. Olympian athlete Prof Ajmer Singh is dead sports wire, 26 January 2010.
  5. Olympian athlete Prof Ajmer Singh is dead sports wire, 26 January 2010.
  6. Olympian athlete Prof Ajmer Singh is dead sports wire, 26 January 2010.
  7. వెబ్ మాస్టర్. "Ajmer Singh". Athletics Podium. Athletics Podium. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 December 2025.

బాహ్య లింకులు

[మార్చు]