Jump to content

అధిక మాసం

వికీపీడియా నుండి
(అధిక మాసము నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని అంటారు. చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు 29.53 రోజులకు సమానం.[1] దీని ప్రకారం సంవత్సరం అంటే సుమారు 354 రోజులు. అంటే చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరాని కంటే 11 రోజుల, 1 గంటా 31 నిముషాల 12 సెకండ్లు తక్కువ ఉంటాయి. అంటే ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌరసంవత్సరం కంటే 30 రోజుల పాటు వెనకబడుతుంది. ఈ 30 రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ సంవత్సరంలో ఒకనెలను అధికంగా కలుపుతారు. ఈ నెలనే అధికమాసం అంటారు. అంటే అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది.[2]

ఇలా అధికంగా వచ్చే అధికమాసం శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని నిషేధించారు.

వివరణ

[మార్చు]

సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే మూలం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణాకాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విదంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు .... మేషం, వృషభం వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరుగుతుంది. అంటే ప్రతి నెల లోనూ ఒక సంక్రాంతి వస్తుంది. మకర రాశి సంక్రమణాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు రెండు నెలల పాటు ఒక రాశిలోనే ఉంటాడు. అలా ఏర్పడేదే అధిక మాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. దాన్నే అధిక మాసం అంటారు.

అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది. చాంద్ర మానం అంటే చంద్ర కళలను (తిథులను) ఆదారంగా ఒక నెల రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అనగా 12 x 27 = 324 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె 324 రోజులె పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 41 రోజులు తేడా ఉంది. ఈ వ్యత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు..... ఏడాదికి 12 మాసాల చొప్పున 228 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమే వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగు తున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌర మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే.

ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్రమాసము నుండి ఆశ్వయుజమాసము మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని అంటారు. అనగా ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు.

మూలాలు

[మార్చు]
  1. Desk, HT Telugu. "అధిక మాసం గురించి ఈ 7 పాయింట్లలో మొత్తం తెలుసుకోండి". Hindustantimes Telugu. Retrieved 2023-08-29.
  2. "అధిక మాసం అంటే…". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-07-18. Retrieved 2023-08-29.
"https://te.wikipedia.org/w/index.php?title=అధిక_మాసం&oldid=3964566" నుండి వెలికితీశారు