అనిశెట్టి రజిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిశెట్టి రజిత
జననంఏప్రిల్ 14, 1958
జాతీయతభారతీయురాలు
వృత్తిరచయిత్రి

అనిశెట్టి రజిత తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి స్త్రీ విముక్తి, స్త్రీకి సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తున్న రచయిత్రి. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె వరంగల్లులో 1958, ఏప్రిల్ 14వ తేదీన జన్మించింది. చిన్ననాటి నుండి ఆకాశవాణిలో ప్రసారమయ్యే తెలంగాణ ఉద్యమ సంఘర్షణలు, కవిసమ్మేళనాలను, దాశరథి, ఆరుద్ర, కొలకలూరి ఇనాక్ తదితరుల ఉపన్యాసాలకు ఆకర్షితురాలై 1969లో కాజీపేటలోని ఫాతిమానగర్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సమయంలో ప్రజాకవి కాళోజీ ధిక్కార స్వర వారసత్వాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొనింది. ఈమె హన్మకొండలో మహిళా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటుపై తనకున్న మక్కువను చాటింది. అనంతరం ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రోత్సాహంతో మలిదశ ఉద్యమంలో పాల్గొని అనేక బహిరంగ సభల్లో తన ఉపన్యాసాలతో ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షితులు అయ్యేలా చేసింది.[2]

రచనలు[మార్చు]

1973లో 'చైతన్యం పడగెత్తింది' అనే తొలిరచనతో ఈమె తన సాహిత్య జీవితాన్ని ఆరంభించింది. అనంతరం "ప్రపంచమంతా పైసా మయం" అనే ఉపన్యాసాన్ని రాష్ట్ర సాంస్కృతిక రజతోత్సవాలలో ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకుంది. నాటి నుండి సాహిత్యంపై మక్కువ పెంచుకుని తన రచనలు కొనసాగిస్తుంది. దాదాపు ఇప్పటివరకు 500పైగా కవితలు, 100పైగా వ్యాసాలు, 30పైగా కవితలు, 30కిపైగా పాటలు రాసి పాడింది.

ఈమె రచనలలో కొన్ని:[3]

  1. గులాబీలు జ్వలిస్తున్నాయి (కవిత్వం 1994)
  2. నేనొక నల్లమబ్బునవుతా (కవిత్వం 1997)
  3. చెమటచెట్టు (కవిత్వం 1999)
  4. ఓ లచ్చవ్వ (దీర్ఘకవిత 2005)
  5. ఉసురు (కవిత్వం 2002)
  6. గోరంతదీపాలు (నానీలు 2005)
  7. దస్తఖత్‌ (హైకూలు2005)
  8. అనగనగా కాలం (కవిత్వం 2005)
  9. మట్టిబంధం (కథా సంపుటి 2006)
  10. నన్హే ఓ నన్హే
  11. మార్కెట్‌ స్మార్ట్‌ శ్రీమతి

ఈమె సంపాదకత్వంలో వెలువడిన రచనలు:

  1. వెతలే కథలై
  2. ఊపిరి
  3. జిగర్‌
  4. ఉద్విగ
  5. ఆకాశపుష్పం
  6. ముజఫర్‌నగర్‌ మారణకాండ
  7. అగ్నిశిఖ
  8. పోలవరం-ప్రాణాంతక ప్రమాదం మొదలైనవి.

ఉద్యోగం[మార్చు]

ఈమె 1992లో కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరింది. నేటికి తన సేవలను అందిస్తూనే ఉంది. 1977లో కాళోజీతో సాహిత్య పరిచయం ఏర్పడి అనేక మెళకువలను నేర్చుకుంది. ఈమె ఉద్యోగినిగా తన సేవలను అందిస్తూనే అనేక సంస్థల వివిధ హోదాలలో చురుకుగా పాల్గొంటున్నది.

ఈమెతో అనుబంధమున్న సంస్థలు:

  • సావిత్రిబాయిపూలే చారిటబుల్‌ ట్రస్ట్‌, విశాఖపట్నం - ఛీఫ్ అడ్వయిజర్
  • ముక్త తెలంగాణ ఉమెన్స్‌ కలెక్టివ్ - అడ్వయిజర్
  • తెలంగాణ ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక - కార్యదర్శి
  • రుద్రమ ప్రచురణలు - ఫౌండర్

పురస్కారాలు[మార్చు]

సమాజంలోని సామాజిక అంశాలను సాహిత్యంతో స్పృశించి ప్రజలను చైతన్య పరుస్తున్న అనిశెట్టి రజిత రచనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నో సంస్థలు పలు అవార్డులు అందించాయి. వాటిలో కొన్ని:

  • 1984 :జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ట్రస్ట్‌, న్యూఢిల్లీ వారి అవార్డు
  • వరంగల్ జిల్లా ఆల్‌ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ - పంచరత్న సాహిత్య అవార్డు
  • 2001: డాక్టర్‌ మలయశ్రీ ప్రగతిశీల సాహిత్య పురస్కారం
  • 2001: భారతీయ దళిత సాహిత్య అకాడమీ వారి వీరాంగన సావిత్రీబాయి పూలే ఫెలోషిప్‌ అవార్డు
  • 2003: జైమినీ అకాడమీ, ఉత్తర్ ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో సుభద్ర కుమారి చౌహాన్‌ సమాన్న్‌ పురస్కార్‌
  • 2005: హైదరాబాద్‌లోని యువకళా వాహిని వారిచే గురుప్రసాద్‌ సాహిత్య ఎక్స్‌లెన్సీ పురస్కారం
  • 2005: సుశీలా నారాయణరెడ్డి కవిత్వ గ్రంథ రచన పురస్కారం
  • 2006: ఎస్‌ఆర్‌ఎల్‌జి కళా సమితీ, రాజోలు, తూర్పుగోదావరి జిల్లా వారి బోయి భీమన్న పురస్కారం
  • 2015: తేజా సాహిత్య పురస్కారం, హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా
  • 2014: ప్రతిభా పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం, 2014[4]
  • 2016: తెలంగాణ రచయితల వేదిక వారి అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 12 April 2017.
  2. ప్రజాచైతన్యం కోసమే 'అనిశెట్టి' రచనలు
  3. కాలంతో సంఘర్షిస్తున్న రజతోత్సవ రచయిత్రి - వి.వీరాచారి[permanent dead link]
  4. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 9 సెప్టెంబరు 2017. Retrieved 6 జూన్ 2020.