అపరిచితుడు
అపరిచితుడు | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎస్. శంకర్ |
కథా రచయిత | ఎస్. శంకర్ సుజాత రంగరాజన్ |
నిర్మాత | వి రవిచంద్రన్ |
తారాగణం | విక్రం సదా |
ఛాయాగ్రహణం | రవివర్మన్, వి. మణికండన్ |
కూర్పు | వి. టి. విజయన్ |
సంగీతం | హ్యారీస్ జయరాజ్ |
నిర్మాణ సంస్థ | ఆస్కార్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 2005 జూన్ 17 |
సినిమా నిడివి | 181 నిమిషాలు |
భాషలు | తమిళం, తెలుగు |
బడ్జెట్ | 60,00000 డాలర్లు |
బాక్స్ ఆఫీసు | 11.000000 డాలర్లు |
అపరిచితుడు 2005 జూన్ 17 న తమిళ "అన్నియన్" నుండి తెలుగులోకి అనువదించబడి విడుదలైన చిత్రము. ఎస్. శంకర్ దర్శకత్వంలో విక్రం[1] అనన్య సామాన్యమైన నటన ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నది.
సంక్షిప్త చిత్రకథ[మార్చు]
చెన్నైలోని ట్రిప్లికేన్ లో నివసించే రామానుజం వినియోగదారుల హక్కుల కోసం పోరాడే ఒక నిజాయితీగల, అమాయకుడైన న్యాయవాది. అందరూ న్యాయాన్ని, చట్టాన్ని అనుసరించాలని, అలా చేయని వారిపై విచారణ జరిపిస్తుంటాడు. అయితే సాక్ష్యాలు సరిగా లేకపోవడం వల్ల అతని ప్రయత్నాలన్నీ విఫలమయి అతను నేరారోపణ చేసిన దోషులందరూ నిర్దోషులుగా విడుదలై అతన్ని అవహేళన చేస్తుంటారు. దీన్ని గురించి ప్రజల్లో అతను ఎంత అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసినా వ్యవస్థ అంతటా విస్తరించిఉన్న లంచగొండితనం, చిన్న చిన్న నేరాల పట్ల జనాల్లో ఉపేక్ష అతనికి అడ్డుపడుతుంటాయి. సంఘంలో అన్నిచోట్ల జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించి విఫలుడై మానసిక క్షోభకు లోనౌతాడు. అణిచివేసిన ఈ క్షోభ అతనిలో అపరిచితుడి పేరుతో మరో వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. ఈ అపరిచితుడు అవినీతిపరులకు, సమాజం గురించి పట్టనివారికి మరణదండన విధిస్తుంటాడు. ఇందుకోసం అపరిచితుడు ఒక వెబ్‌సైటు తయారు చేసి అందులో తప్పుచేసిన వారి గురించి ఫిర్యాదులు స్వీకరించి అందులో ఉన్నవారికి గరుడ పురాణంలో పేర్కొన్న శిక్షలు విధిస్తుంటాడు.
రామానుజం తమ పక్కింట్లోనే ఉన్న నందిని అనే అమ్మాయిని రహస్యంగా ప్రేమిస్తుంటాడు. ఈమె ఒక వైద్య విద్యార్థి. కర్ణాటక సంగీతంలో కూడా ప్రవేశం ఉంటుంది. ఆమె ఎక్కడ తనను కాదంటుందో అని తన ప్రేమను వ్యక్తం చేయాలంటే జంకుతూ ఉంటాడు రామానుజం. ఒకసారి వారి కుటుంబాలంతా కలిసి త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలకు వెళ్ళగా, అక్కడ తన స్నేహితుడు పోలీస్ ఇన్‌స్పెక్టర్ చారి ప్రోద్బలంతో నందినికి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. అయితే చీటికీ మాటికీ అతను రూల్స్ గురించి మాట్లాడుతూ, విసిగించే ప్రవర్తన కారణంగా ఆమె అతని ప్రేమను తిరస్కరిస్తుంది. అది తట్టుకోలేక రామానుజం నీళ్ళలో మునిగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. అయితే ఊపిరి ఆగిపోబోయే చివరి క్షణంలో తన మనసు మార్చుకుంటాడు. తర్వాత అతనిలో రెమో అనే పేరుతో ఒక ఆధునిక యువకుడి వ్యక్తిత్వం ఒకటి మొలకెత్తుతుంది. నందినికి రెమో వ్యక్తిత్వం బాగా ఆకట్టుకుంటుంది. అతను రామానుజానికి మరో వ్యక్తిత్వమే అని తెలియక నందిని అతనితో ప్రేమలో పడుతుంది. తల్లిదండ్రులు వారికి వివాహం కూడా నిశ్చయిస్తారు.
నందిని తన వివాహంలో కట్నం కోసం కొంత భూమిని కొనాలనుకుంటుంది. ప్రభుత్వానికి చెల్లించే స్టాంపు డ్యూటీని తగ్గించడం కోసం ఆమె పత్రంలో ఆ స్థలం విలువ తగ్గించి చూపిస్తుంది. ఆమెతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్ళిన రామానుజం ఆమె ప్రభుత్వాన్ని మోసం చేయడాన్ని నిరసిస్తాడు. ఆమెకు సహాయం చేయనని నిర్ద్వంద్వంగా చెబుతాడు. తర్వాత నందిని రెమోతో కలిసి సరదాగా బయటికి వెళుతుంది. వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంటులో ఉండగా అపరిచితుడు బయటపడి రిజిస్టర్ ఆఫీసులో ఆమె చేసిన పనికి ఆమెను శిక్షించడానికి ప్రయత్నిస్తాడు. అతను రాముకు తెలిసిన విషయాలే మాట్లాడటం చూసి ఆమె అతన్ని నిలదీయడంతో చంపబోతున్నవాడల్లా ఆగిపోయి స్పృహతప్పి పడిపోతాడు. నందిని అతన్ని నిమ్‌హాన్స్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఒక మానసిక వైద్యుడికి చూపిస్తుంది. అక్కడ అతను మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా రికార్డెడ్ మెమరీ థెరపీ అనే ప్రక్రియ ద్వారా అతని గతం గురించి తెలుసుకుంటారు. అతనికి పదేళ్ళ వయసులో ఉండగా అతని చెల్లెలు ఉద్యోగులు, సమాజం చూపిన నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ ప్రమాదానికి గురై మరణించి ఉంటుంది. ఈ సంఘటన అతని మనసులో చెరగని ముద్ర వేసి ఉంటుంది. దాంతో అతను ఒక ఆదర్శవంతుడైనా వ్యక్తిగా రూపుదిద్దుకుంటాడు. అపరిచితుడికి, రెమోకి రామానుజం అనే వేరే వ్యక్తి ఉన్నట్లు తెలిసినా రామానుజం మాత్రం తనలో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలియదని వైద్యుడు చెబుతాడు. అతనిలో రెమో మాయం కావాలంటే నందిని రామానుజం ప్రేమను ఒప్పుకోవాలని చెబుతాడు. ఆమె అతని ప్రేమను అంగీకరించగానే రెమో మాయమైపోతాడు. కానీ అతనిలోనుంచి అపరిచితుడు మాయం కావాలంటే సమాజమే మారాలని చెబుతాడు.
ఈ లోపు డిసిపి ప్రభాకర్, చారి అపరిచితుడు చేసిన హత్యలను పరిశోధిస్తూ వస్తుంటారు. అతనికి తెలియకుండా అతను వదిలిన ఆధారాలను బట్టి అవి అక్షరాలు అటూ ఇటూ మారిస్తే గరుడ పురాణంలో వివిధ రకాలైన పాపాలు చేసేవారికి నరకంలో విధించే శిక్షలు అని తెలుస్తుంది. రైల్వే కాంట్రాక్టరుగా పనిచేసే ప్రభాకర్ అన్న చొక్కలింగం అపరిచితుడి బాధితుల్లో ఒకడు కావడం వల్ల, అతన్ని ఎలాగైనా శిక్షించాలని ప్రభాకర్ ఆ కేసును వ్యక్తిగతంగా తీసుకుని పరిశీలిస్తుంటాడు. ఇంతలో అపరిచితుడు నెహ్రూ స్టేడియంలో విలేకరులతో సహా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి అందులో తాను చేసిన హత్యలన్నీ ఒప్పుకుంటాడు. అందుకు కారణాలు కూడా వివరిస్తాడు. నిర్లక్ష్యంగా ఉండటం వల్లే భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందలేకపోతున్నదని చెబుతాడు. అతని పద్ధతులను కొంతమంది ప్రశంసిస్తారు, కొంతమంది విమర్శిస్తారు. సమావేశం ముగిసాక ప్రభాకర్ అపరిచితుణ్ణి పట్టుకోవాలని చూస్తాడు కానీ అతను తప్పించుకుని పారిపోతాడు.
అపరిచితుడి ఫోన్ కాల్ రికార్డులు, ఇంటర్నెట్ యాక్టివిటీ రికార్డులు పరిశీలించిన మీదట అవి రామానుజం ఇంటినుంచే వస్తున్నాయని తెలుస్తుంది. అంతే కాకుండా అపరిచితుడి బహిరంగ సమావేశం తాలూకు వీడియో ఫుటేజిని విశ్లేషించడం ద్వారా అతని ముసుగు వెనకున్న ముఖం రామానుజమేనని తెలుస్తుంది. ప్రభాకర్ రామానుజాన్ని అరెస్టు చేసి అతన్ని పాలీగ్రాఫ్ టెస్టుల ద్వారా విచారించి అతను చేసిన నేరాల్ని ఒప్పుకోమంటాడు. అతను అతను నేరాన్ని అంగీకరించడు. పాలీగ్రాఫ్ టెస్టులు కూడా అతను నిజమే చెబుతున్నట్లు ధృవీకరిస్తాయి. ప్రభాకర్ కోపంతో రగిలిపోయి చారితో సహా తన తోటి పోలీసు ఆఫీసర్లందరినీ బయటకి పంపించి అతన్ని గరుడ పురాణంలో చెప్పిన ఘోరమైన శిక్షలకు గురి చేస్తాడు. తర్వాత ప్రభాకర్ అతన్ని సలసలా కాగుతున్న ఉప్పునీళ్ళలో ఉంచుతాడు. తర్వాత ఉన్నట్టుండి దాని ఉష్ణోగ్రతను గడ్డకట్టేలా చేస్తాడు.
ఇక అతను చలికి గడ్డకట్టి చనిపోతాడనగా అతను అపరిచితుడిలా మారి ఆ ట్యాంకును బద్దలు కొట్టుకుని బయటకి వస్తాడు. అతనిలో రామానుజం, అపరిచితుడుగా వెంటవెంటనే వస్తున్న మార్పులు చూసి ప్రభాకర్ ఆశ్చర్యపోతాడు. అపరిచితుడిలా ప్రభాకర్ ని శిక్షించిన అతనే రామానుజంలా మారి క్షమాపణలు వేడుకుంటుంటాడు. తర్వాత రామానుజం మీద హత్యానేరం కేసు విచారణకు వస్తుంది. ఆ కేసులో అతన్ని ముందు పరిశీలించిన మానసిన వైద్యుడు వచ్చి అతని మానసిక పరిస్థితిని వివరిస్తాడు. చారి కూడా ప్రభాకర్ రామానుజాన్ని చిత్రహింసలు పెట్టిన దృశ్యాల్ని రహస్యంగా చిత్రీకరించి కోర్టుకు నివేదిస్తాడు. కోర్టు రామానుజాన్ని విడిచిపెడుతుంది. అయితే అతను కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలనీ, ఆ తర్వాతే అతనికి విడుదల ఉంటుందని చెబుతాడు న్యాయమూర్తి.
రెండు సంవత్సరాల తర్వాత రామానుజం ఆసుపత్రి నుంచి విడుదలవుతాడు. చట్టాల పట్ల, నిబంధనల పట్ల అతని వైఖరి మారిపోయి ఉంటుంది. ఇదివరకట్లా కాకుండా కొంచెం చూసీ చూడనట్లు వ్యవహరించడం నేర్చుకుని ఉంటాడు. నందినిని పెళ్ళి చేసుకుంటాడు. ఇద్దరూ కలిసి రైలులో హనీమూన్ వెళుతుండగా అతనికి రైల్లో నిర్లక్ష్యంగా మద్యం సేవిస్తున్న వ్యక్తి కనిపిస్తాడు. అతను తన చిన్నతనంలో చెల్లెలు చావుకు కారణమైన ఎలక్ట్రీషియన్. అతని మానసిక వ్యాధి తిరగగబెట్టి అతను మళ్ళీ అపరిచితుడిలా మారి అతన్ని రైల్లోంచి బయటకు తోసి చంపేస్తాడు. కానీ తిరిగి మామూలుగా నందిని దగ్గరకు వచ్చి ఆ సంఘటన గురించి ఆమెకు ఏమీ చెప్పడు. అంటే తనలో ఉన్న అపరిచితుడి వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా, దాన్ని కూడా అసలు వ్యక్తిత్వంలో ఇముడ్చుకున్నట్లు అర్థం అవుతుంది.
పాటలు[మార్చు]
- కుమారీ
- జియ్యంగారి ఇంటి సొగసా
- లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు రెమో
- నాకూ నీకూ నోకియా
- కొండ కాకి కుండే దానా
సంభాషణలు[మార్చు]
- మీరు మాత్రం చట్టాన్ని మీరవచ్చు, నేను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం తప్పా?
- దీనికి ఎవడు చంపుతాడులే అన్న ధైర్యంతోనే కదా, ఇన్ని తప్పులు చేస్తున్నారు?
- ఒరేయ్, ఒరేయ్, కమల్ ను చూశా, రజినీను చూశా, చిరంజీవిని చూశా, కానీ నీ లా నటించే వాడిని మాత్రం చూడలేదు రా!
విశేషాలు[మార్చు]
- ఈ చిత్రం సిడ్నీ షెల్డన్ రచించిన ఆంగ్ల నవల టెల్ మీ యువర్ డ్రీమ్స్ ఆధారంగా నిర్మించబడింది.
మూలాలు[మార్చు]
- ↑ ఈటీవీ భారత్, సినిమా (17 October 2019). "తన రికార్డు తానే తిరగరాసే పనిలో విక్రమ్". www.etvbharat.com. Archived from the original on 12 May 2020. Retrieved 12 May 2020.
బయటి లింకులు[మార్చు]
- Articles with short description
- Short description is different from Wikidata
- 2005 తెలుగు సినిమాలు
- Pages using infobox film with unknown empty parameters
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- తమిళ అనువాద చిత్రాలు