అప్పయ్య దీక్షితులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అప్పయ్య దీక్షితులు ఒక శివాగమ పండితుడు, వేదవేదాంత భాష్యకర్త మఱియు అద్వైతానుయాయి. అద్వైత సంప్రదాయానికి వీరు చేసిన విశేష కృషి అజరామరము.

జీవితము[మార్చు]

అప్పయ్య దీక్షితుల వారి పూర్వ నామము వినాయక సుబ్రహ్మణ్యం. వీరు తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా అరణి వద్ద అడయపాలెం అను ఊరియందు ప్రమాదీచ సంవత్సరము కన్యా మాసము కృష్ణపక్షము ఉత్తర భాద్రపదా నక్షత్రమున (సం. 1520) జన్మించారు.[1] వీరి తండ్రి పేరు రంగరాజాధ్వరి.[2] అప్పయ్య దీక్షితుల వారి తమ్ముని పేరు ఆచార్య దీక్షితులు. రామ కవీంద్రుల వారి గురుముఖతః దీక్షితుల వారు విద్యాభ్యాసము చేసారు. దీక్షితులు వారు భారతదేశ పర్యంతము ప్రయాణము చేసి వివిధ వాదప్రతివాదములయందు పాల్గొనిరి. అనేక రచనలు చేసి అద్వైతసంప్రదాయమునకు విశేష కృషి చేసిన మహనీయులలో దీక్షితులవారు ఒక్కరు.

వీరు చేసిన వాదనలకు ముగ్దులైన వివిధ దేశ రాజులు దీక్షితులవారికి అనేక విధములైన సన్మానములను చేసి సత్కరించారు. దీక్షితులవారిని సత్కరించిన వారిలో వెల్లూరు, తంజావూరు, విజయనగర, వేంకటగిరి రాజులు ప్రముఖులు.[3]

భారతదేశ ఆమూలగ్రమూ పర్యటన చేసి శైవమత స్థాపన చేసి అనన్యసామాన్య కృషి చేసిన మహనీయులు దీక్షితుల వారు. దీక్షితులు శ్రీఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించిన అద్వైత మతమును పూర్తిగా నమ్మినవారు. శ్రీమహావిష్ణువును వీరు పరమశివుని ప్రథమభక్తునిగా భావించారు. ఒక పర్యాయము దీక్షితులవారు తిరుమలను సందర్శించినప్పుడు శ్రీవెంకటేశ్వర స్వామివారి మూర్తి శివలింగముగా మరి దర్శనమిచ్చిందని ఒక నానుడి.

యోగి పుంగవుడు[మార్చు]

దీక్షితులవారు గొప్ప కవి, శివభక్తుడే కాక ఒక మహా సిద్ధయోగి కూడా. వారి శిష్యులు ఒక ఉదంతమును వారి యోగశక్తికి నిదర్శనగా చెప్పుదురు. దీక్షితులవారికి విపరీతమైన కడుపునొప్పి ఉండేడిది. అది తమ పూర్వజన్మ సంచిత పాపమని, ప్రారబ్దమని భావించెడివారు. కానీ దీక్షితులవారి ధ్యానమునకు ఈ నొప్పి ఒక అడ్డంకిగా పరిణమించేది. వారు ధ్యాన సమయములో ఎదుట ఒక చిన్న తుండుగుడ్డను పెట్టుకొని ధ్యానానిమగ్నులయ్యేవారు. అప్పుడు అ చిన్న తుండుగుడ్డ విపరీతముగా పైకిక్రిందికి ఆడేది. శిష్యులు అడిగినప్పుడు దీక్షితులవారు తమ నొప్పిని ఆ గుడ్డకు బదలాయించితినని. ధ్యానానంతరము తిరిగి తీసుకునేవాడిననీ చెప్పేవారు. ఈ సంఘటన దీక్షితులవారి అమోఘ యోగతపోశక్తిని తెలియజేస్తుంది.

ఆత్మార్పణ స్తుతి[మార్చు]

దీక్షితులవారి ఒక కృతి "ఆత్మార్పణ స్తుతి". స్వతఃగా కవీన్ద్రులైన దీక్షితులవారు 50 చిన్న శ్లోకములో భక్తిభావనను ఇందులో స్ఫుటీకరించారు. ఒక పరమభక్తుని యొక్క తీవ్ర మనోకామనను ఈ స్తుతిసంపుటి తెలియజేస్తుంది.ఒకానొక వివరము ప్రకారము, దీక్షితులవారికి ఒక కోరిక కలిగినది. తనలోని శివభక్తిని వీరు పరీక్షించదలిచి, దత్తూర ఫలము యొక్క రసమును త్రాగి, తన శిష్యులతో తాను పలికిన పలుకులను పలికిన విధముగా వ్రాయమని ఆజ్ఞాపించారు[4]. అట్టి మతిస్థిమితము లేని సమయములో తమ మనస్సులోని భావము నిస్సంకోచముగా, నిర్భయముగా బయటకు వచ్చునని భావించారు. ఆ విధముగా వీరు చెప్పగా వీరి శిష్యులు వ్రాసిన కృతి "ఆత్మార్పణస్తుతి".

తత్త్వము[మార్చు]

ఒక్క అద్వైతిగా దీక్షితులవారు పరబ్రహ్మతత్వములో భేదమును చూడలేదు. శివవైష్ణవ తారతమ్యమును పరిగణింపలేదు. కానీ వేదపురాణములకు గల వేర్వేరు భాష్యములను ఖండించలేదు. దీక్షితులవారి మాటల్లో - "బ్రహ్మసూత్రములే వేర్వేరు అర్థములను చూపినప్పుడు మనమెందుకు ఒకటిగా పరిగణింపవలెను"? అన్నారు.

దీక్షితులవారి కృతులు[మార్చు]

సంస్కృతభాషలోని వీరు చేసిన ఇంచుమించు 104 రచనలలో ఇప్పుడు మనకు కేవలము 60 రచనలు మాత్రమే లభ్యమవుతున్నాయి.[5] ఇవి వేదాంత, శైవ, అద్వైత, మీమాంస, వ్యాకరణ, కావ్యాలంకార, భక్తిస్తుతులుగా లభ్యమవుతున్నాయి. కొందరు చారిత్రకుల ప్రకారము దీక్షితులవారు అద్వైతసంప్రదాయములో "శైవాద్వైత" సంప్రదాయమునకు ఆద్యులు. ఈ సంప్రదాయము రామానుజాచార్యుల విశిష్టాద్వైతమునకు దగ్గరగా ఉందును కానీ, విష్ణువు స్థానమును శివుడు అధిరోహించును.

దీక్షితులవారి కొన్ని రచనలు క్రింద ఇవ్వబడినవి:[6]

 1. సిద్ధాంతలేశ సంగ్రహము
 2. న్యాయరక్షామణి
 3. కల్పతరు పరిమళ
 4. మాధ్వతంత్ర ముఖ మర్దన
 5. మాధ్వమత విధ్వంసన
 6. పూర్వోత్తర మీమాంస వాద నక్షత్ర మాలా
 7. చతుర్మఠ సారసంగ్రహ
 8. రామానుజ శృంగభంగ
 9. శికరిణిమాలా
 10. రామాయణ తాత్పర్యసంగ్రహ
 11. బ్రహ్మతర్కస్తవ
 12. శివధ్యాన పద్ధతి
 13. శివపూజావిధి
 14. శివార్చన చంద్రికా
 15. శివకర్ణామృత
 16. శ్రీ శివార్కమణిదీపికా
 17. శివాద్వైత నిర్మయ
 18. ఆనందలహరి చంద్రికా
 19. భస్మవాదావళి
 20. రత్నత్రయపరీక్షా
 21. శివ మహిమా కాళికాస్తుతి
 22. పంచరత్న స్తుతి మఱియు టీకా
 23. విధిరసాయనం
 24. సుఖోపయోగిని
 25. ఉపాకర్మ పరాక్రమ
 26. చిత్రపాఠం
 27. మయూఖావళి
 28. తాంత్రిక మీమాంస
 29. ధర్మ మీమాంస పరిభాష
 30. పాణినీయ తంత్రవాద నక్షత్రమాలా
 31. యాదవాభ్యుదయ వ్యాఖ్యానము
 32. కువలయానంద
 33. చిత్ర మీమాంస
 34. వృత్తివార్తికా
 35. వరదరజస్తవము మఱియు టీకా
 36. ఆత్మార్పణస్తుతి
 37. అపీతకుచాంబాస్తవము
 38. మానసోల్లాసము
 39. నిగ్రహాష్టకము
 40. హరి హర స్తుతి
 41. దుర్గా చంద్ర కళా స్తుతి మఱియు టీకా
 42. ఆదిత్యస్తోత్రరత్నము మఱియు టీకా
 43. శ్రీమార్గబంధు పంచరత్నము
 44. శ్రీమార్గసహాయలింగస్తుతి
 45. గంగాధరాష్టకము

మూలాలు[మార్చు]