Jump to content

అబ్దుల్ హకీం జాని షేక్

వికీపీడియా నుండి
(అబ్దుల్ హకీం జానీ షేక్ నుండి దారిమార్పు చెందింది)

అబ్దుల్ హకీం జాని షేక్, బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో 2022 నాటికి బాలసాహిత్యంలో 35 పుస్తకాలు, 270కు పైగా నీతి కథలు, తెలుగు పత్రికలలో 1400 కు పైగా ఆర్టికల్స్ , ఆదివారం అనుబంధాలకు 50 కుపైగా కవర్ పేజీ కథనాలతో పాటు, 30 వయోజన వాచకాలతో కలుపుకుని మొత్తం 70 పుస్తకాలు వెలువరించాడు.[1][2]

బాల్యం

[మార్చు]

అబ్దుల్‌ హకీం జాని షేక్‌, గుంటూరు జిల్లా తెనాలిలో 1963 జనవరి 1 జన్మించాడు. ఇతని తల్లితండ్రులు: షేక్‌ మహబూబ్‌బీ, షేక్‌ ఫరీద్‌ సాహెబ్‌.

ఉద్యోగిగా, రచయితగా గుర్తింపు

[మార్చు]

ఇతను బి.ఏ., బి.ఇడి., చదివి, ప్రైవేట్ విద్యాసంస్థలనందు తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఉపాధ్యాయ వృత్తిని, జర్నలిజం ప్రవృత్తిని రెండు కళ్ళుగా చేసుకుని రచయితగా గుర్తింపు పొందాడు.[3]

రచనా వ్యాసంగం

[మార్చు]

ఇతను 1976లో విద్యార్థిగా కన్నందుకు శిక్ష నాటిక రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభించారు. 1991 నుండి 2022 వరకు తెలుగు దిన, వార, మాస పత్రికలతో పాటు ఆదివారం అనుబంధాలకు వివిధాంశాల మీద సుమారు 1400 పైగా వ్యాసాలు, ఆదివారం అనుబంధాలకు 50 కుపైగా కవర్ పేజీ కథనాలతో పాటు, 30 వయోజన వాచకాలతో కలుపుకుని మొత్తం 70 పుస్తకాలు వెలువరించాడు.[2] బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో 35 పుస్తకాలు వెలువరించాడు. బి. ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర, మనవీర వనితలు,  ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ యాత్రా దర్శిని, సుందర భారతదేశ యాత్రా దర్శిని ఇత్యాది గ్రంధాలను రచించాడు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, బాలసాహితీవేత్తగా హకీం జాని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. పిల్లల కోసం ఇతను రచించిన బాలసాహితీ కథలను అమ్మఒడి పేరుతో ఒక పుస్తకం, బుడిబుడి అడుగులు పేరుతో మరో పుస్తకం ప్రచురించాడు. 2022 నాటికి పిల్లల కోసం 270 కు పైగా నీతి కథలు రచించగా, అవి పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇవి కాకుండా హకీం జాని ఎంతో శ్రమతో సేకరించిన  ఈసఫ్ నీతి కథలు (164 కథలు),  ముల్లా నసీరుద్దీన్ కథలు (220), తెనాలి రామకృష్ణుని కథలు (81), మర్యాదరామన్న కథలు (58), పంచతంత్ర కథలు (77 ) ఇత్యాది బాలల కథల గ్రంథాలు వెలువడ్డాయి.  పూణే లోని మహారాష్ట్ర పాఠ్య ప్రణాళిక పరిశోధనా సంస్థ వారు  11  వ తరగతి విద్యార్థుల కోసం యువభారతి పేరుతో  ప్రచురించిన ప్రథమ భాష తెలుగు పాఠ్య పుస్తకంలో హకీం జాని రచించిన "బాధ్యతాయుత పౌరుడు" అనే కథను 2019  విద్యాసంవత్సరానికి గాను పాఠ్యాంశంగా, 2020లో "కొత్త వెలుగు" అనే కథను 12 వ తరగతికి పాఠ్యాంశంగా పొందుపర్చారు. ఆకాశవాణి ద్వారా కవితలు, కథానికలు ప్రసారం అయ్యాయి.

అవార్డులు - పురస్కారాలు

[మార్చు]

ఇతనికి సమతారావు బాల సాహితీ పురస్కారం, పత్రికా రంగంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, విశ్వదాత అవార్డు (2007), ఆంధ్ర సారస్వత సమితి పురస్కారం (2009). లభించాయి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని 2012  లో అప్పటి ముఖ్యమంత్రి  యన్. కిరణ్ కుమార్ రెడ్డి చేతులమీదుగా ఒకసారి, 2018  లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి కోడెల శివప్రసాద్ చేతుల మీదుగా రెండవసారి అందుకున్నాడు.  2018  లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఉత్తమ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఇతని లక్ష్యం మానవీయ సంస్కృతీ-సంప్రదాయల పట్ల అవగాహన కల్పిస్తూ, బాలబాలికల అభ్యున్నతికి ఉత్తమ సాహిత్య సృష్టి చేయటం.

శ్రీకృష్ణదేవరాయలపాత్రలో  

[మార్చు]

పలు నృత్య రూపకాలలో షేక్ అబ్దుల్ హకీం జాని  శ్రీకృష్ణదేవరాయలుగా  అభినయించారు.   2010  లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గుంటూరు జిల్లా కొండవీడులో జరిగిన శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది పట్టాభిషేక ఉత్సవాల సందర్భంగా తాను పనిచేస్తున్న పాఠశాలకు చెందిన  50  మంది బాలబాలికలతో మొదటిసారిగా ఒక నృత్యరూపకంలో శ్రీకృష్ణదేవరాయలుగా అభినయించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత  మొత్తం 14  పర్యాయాలు శ్రీకృష్ణదేవరాయలుగా పలు నృత్యరూపకాలలో అభినయించారు. తెనాలి లో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్-2009 , ఆసియా  ఫెస్టివల్-2010 , బాపు చిత్రకళాప్రదర్శన-2011 , గ్లోబల్ హాస్పిటల్స్ వారి ఉచిత మెగా మెడికల్ క్యాంప్-2013 , నంది నాటకోత్సవాలు-2017 ఇత్యాది అనేక అతి పెద్ద కార్యక్రమాలకు హకీం జాని ప్రెస్ పీఆర్వో గా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు.

రికార్డ్స్ లో హకీం జాని స్థానం

[మార్చు]

2013 లో తెలుగు పత్రికలలో 1270 ఆర్టికల్స్ పచురితమైన నేపథ్యంలో వండర్ బుక్ ఆప్ రికార్డ్స్ లోనూ, 2021లో 1360 ఆర్టికల్స్ ప్రచురితమైన సందర్బంలో తెలుగు బుక్ ఆప్ రికార్డ్స్ ,[3] 2022లో 1400 ఆర్టికల్స్ ప్రచురితమైన నేపథ్యంలో ఆసియా వరల్డ్ రికార్డ్స్ , ఇండియన్ బుక్ ఆప్ రికార్డ్స్ లో స్థానం పొందాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Sakshi Telugu Daily Guntur District epaper dated Thu, 23 Jun 22". epaper.sakshi.com. Archived from the original on 2022-10-22. Retrieved 2022-10-22.
  2. 2.0 2.1 "ఆంధ్ర ప్రభ : Andhra Prabha Telugu News Paper | Andhra Prabha ePaper | Andhra Prabha Andhra Pradesh | Andhra Prabha Telangana | Andhra Prabha Hyderabad". epaper.prabhanews.com. Retrieved 2022-11-19.
  3. 3.0 3.1 "Sakshi Telugu Daily Guntur District, Thu, 23 Jun 22". web.archive.org. 2022-10-22. Archived from the original on 2022-10-22. Retrieved 2022-10-22.
  4. https://web.archive.org/web/20221119061044/https://epaper.sakshi.com/Home/FullPage?eid=32&edate=07/10/2022&pgid=29977
  5. https://web.archive.org/web/20221119061747/https://epaper.sakshi.com/Home/FullPage?eid=99&edate=04/09/2022&pgid=11560

వెలుపలి లంకెలు

[మార్చు]
  • అక్షరశిల్పులు గ్రంథం, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్, ప్రచురణ 2010, ప్రచురణకర్త ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, వినుకొండ, పుట 31