Jump to content

అబ్బూరి రామకృష్ణారావు

వికీపీడియా నుండి
అబ్బూరి రామకృష్ణారావు
జననం(1896-05-20)1896 మే 20
అనంతవరం, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా
మరణం1979 ఏప్రిల్ 30(1979-04-30) (వయసు 82)
దిల్లీ
వృత్తితెలుగు పండితుడు, గ్రంథాలయశాస్త్ర ఆచార్యుడు, గ్రంథాలయాధికారి.
జీవిత భాగస్వామిఅబ్బూరి రుక్మిణి
పిల్లలునలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలుు
తల్లిదండ్రులు
  • లక్ష్మీనరసింహశాస్త్రి (తండ్రి)
  • బాపమ్మ (తల్లి)

అబ్బూరి రామకృష్ణారావు ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి మార్గదర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు భావకవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త, విమర్శకుడు, అభ్యుదయ భావాలున్నవాడు, మానవతావాది, గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడు, గ్రంథాలయాధికారి. ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావులను కవిత్రయమని పేర్కొంటారు. ఆధునిక కవిత్వానికి ముగ్గురూ మార్గదర్శకులే కాక వారి రచనలు ఒకే కాలాన ప్రచురితం అయ్యాయి. అబ్బూరి జీవితంలో ప్రతి అడుగూ మిత్రుల సాంగత్యం, సాహిత్యం తోటే ముడిపడి ఉంది.[1]

కుటుంబం

[మార్చు]

రామకృష్ణారావు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని అనంతవరం గ్రామంలో లక్ష్మీనరసింహశాస్త్రి, బాపమ్మ దంపతులకు 1896, మే 20 న జన్మించాడు. వారిది పండిత వంశం. తాతగారు కవి. తండ్రి సంస్కృతాంధ్రాలలో పండితుడు. ఆయన చిన్నతనంలో తిరుపతి వెంకట కవులలో ఒకడైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తరచుగా అబ్బూరి తండ్రి గారి ఇంటికి వస్తుండేవాడు. అబ్బూరి కూడా బహుభాషా కోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లము, బెంగాలీ, పర్షియన్ సాహిత్యాలను క్షుణ్ణంగా చదివినవారు. 15వ ఏటనే వారికి మేనమామ కుమార్తె రుక్మిణితో వివాహం అయింది. వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[2] పెద్ద కుమారుడు స్వర్గీయ అబ్బూరి వరదరాజేశ్వరరావు రచయత, విమర్శకుడు, అధికార భాషా సంఘానికి అధ్యక్ష్యులుగా పనిచేశారు. నవలా రచయత్రి, స్త్రీవాద రచయత్రి, సాహిత్యఅకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి వీరి కోడలు.[3] రెండవ కుమారుడు స్వర్గీయ అబ్బూరి గోపాలకృష్ణ, చిత్రకారుడు, అనేక కళా సంస్థలతో అనుబంధం ఉన్నవాడు. ఈయన అనేక కీలక పదవులు నిర్వహించి, ఆంధ్ర విశ్వవిద్యాలయం థియేటర్ ఆర్ట్స్ విభాగాధిపతిగా పదవీవిరమణ కావించారు.[4]

విద్య

[మార్చు]

వీరి పాఠశాల విద్య 5వ ఫారం వరకూ తెనాలి లోనే జరిగింది. సికింద్రాబాద్ లో మహబూబ్ కళాశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై అక్కడే అరబిక్ ను అభ్యసించారు. ఎఫ్.ఎ. (నేటి ఇంటర్మీడియట్) చదవడానికి నోబుల్ కళాశాలలో చేరారు. బలిజేపల్లి లక్ష్మీకాంతం, గోవిందరాజులు సుబ్బారావులు అబ్బూరికి మిత్రులు. అబ్బూరి మైసూరు లోని సంస్కృత కళాశాలలో చేరినప్పుడు, అప్పటి విద్యాధికారి కట్టమంచి రామలింగారెడ్డి, 1915 లో అబ్బూరి రాసిన మల్లికాంబను చదివి మెచ్చుకొన్నాడు. అబ్బూరికి అక్కడే ఉన్న రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మతో స్నేహం కుదిరింది. అబ్బూరి 1916లో వీణ శేషన్న వద్ద కొంతకాలం పాటు వీణను కూడా నేర్చుకొన్నాడు. తరువాత మైసూరులో ఫలప్రదంగా గడిపిన 3 సంవత్సరాలు అబ్బూరిలో సృజనాత్మకత వెల్లివిరియడానికి దోహదం చేసింది. అక్కడే ఊహాగానము, నదీసుందరి వంటి కావ్యాలు రచించారు. కోడి రామమూర్తిని ప్రశంసిస్తూ, "ఆంధ్రవీర కంఠీరవ" (ఆంధ్రవీరులలో మృగరాజు వంటి వాడు) అనే పద్యాన్ని వ్రాయడం జరిగింది. 1918లో కలకత్తా వెళ్ళి సిటీ కళాశాలలో బి.ఏ. కొరకు ప్రవేశం తీసుకున్నారు. అక్కడ పండితులు అక్కిరాజు ఉమాపతి తరువాత బెంగాల్ ఆంధ్ర సంఘం (అసోఏసిఏషన్) కు ఉపాధ్యక్షులు కూడా అయ్యారు. బి.ఏ. పట్టా తీసుకున్న తరువాత కొంతకాలం శాంతినికేతన్ లో ఉండి తిరిగి ఆంధ్ర రాష్ట్రానికు తిరిగివచ్చారు. అబ్బూరికి కాంగ్రెస్ నాయకులు భోగరాజు పట్టాభిరామయ్య, చెరుకువాడ వేంకట నరసింహం, కవులు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, త్రిపురనేని రామస్వామి, కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు వంటి వారి సాహచర్యం లభించింది.

స్వరాజ్యోద్యమం

[మార్చు]

1919 సంవత్సరంలో ఆంధ్ర దేశంలో స్వరాజ్యోద్యమం మమ్మురంగా సాగుతున్న రోజులలో రామదండును నిర్వహిస్తున్న ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో అబ్బూరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆకాలంలో "జలియన్ వాలాబాగ్" బుర్రకథ (జంగం కథ) రచించి అనేక చోట్ల ప్రదర్శించారు. ఇది బహుళ ప్రజాదరణ, ప్రచారం పొందింది, కానీ అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఈ ప్రచురణ కూడా అందుబాటు లేదు. అబ్బూరికి కార్మీక సంఘాలతోను, కమ్యూనిష్టు పార్టీ నేతలతోనూ అనుబంధం ఉండేది. ఆ సందర్భం లోనే పుచ్చపల్లి సుందరయ్య తో, ఎం.ఎన్.రాయ్ వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది.[5]

సాహితీసేవ

[మార్చు]

అబ్బూరి 1909 నాటికే, అయిదో ఫారం చదువుతుండగానే "జలాంజలి" అను పద్యకావ్యం రచించారు. 1917-19 మధ్యకాలం అబ్బూరి గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్ సన్నిధిలో శాంతినికేతన్ లో గడిపారు. అప్పుడే వీరు "ఊహాగానం", నిరాడంబరతా భావనాబలాలు" రచించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ), భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు మొదలగువారు అబ్బూరిని తమ గురువుగా భావించేవారు, వారిని మేస్టారు అని సంబోధించేవారు. వారితో అనేక సాహిత్య చర్చలు జరిపేవారు.[5] 1917- 18 మధ్య ఆంధ్ర పత్రికలో "సారస్వతానుబంధం" అను శీర్షికను పెట్టవలసిందని నాగేశ్వరరావు పంతులుకు అబ్బూరి సూచించాడు. ఇతని "అభినవకవితాప్రశంస" అను వ్యాసముతో శీర్షిక ఆరంభమైంది. 1923-24 సంవత్సరాల మధ్య "రసమంజరి" అను కొత్త అనుబంధం ప్రవేశపెట్టించారు.[6] పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందాతనం గోచరిస్తుంది. ఉత్తమ సంస్కృత కావ్యాలలోని పూర్ణతా, గౌరవమూ, గాంభీర్యమూ ఈయన పద్యాలలో ప్రతిబింబిస్తాయి. నన్నయ నాటి అక్కరలకు మార్పులు తెచ్చి, కొత్త నడకలు నడిపించడమే కాకుండా, స్వకపోలకల్పితాలైన నూతన ఛందస్సులు కూడా కల్పించాడు. ఈయన పద్యాలలో ఒక్క పలుకు పట్టి చూచినా ఉత్తమ సంస్కారి అని తెలుస్తుంది. వీరు రాసిన చాటువులు, ఆశువులు చాలా ప్రసిద్ధి పొందాయి. ఇంకా ఆంగ్ల సాహిత్యంలో తరచుగా కనిపించే సానెట్స్ (గీత మాలికలు) రాశారు.[2] 1936లో ప్రేమచంద్, నజ్జాద్ జహీర్, హిరేన్ ముఖర్జీ వంటి వారితో కలసి అఖిల భారత అభ్యుదయ రచయతల సంఘం స్థాపించి, వారి పత్రిక "ఇండియన్ లిటరేచర్" సంపాదకవర్గంలో ఒకరుగా ఉన్నారు.[7]ఈయన 1939 లో ఎం.ఎన్.రాయ్, లక్ష్మణశాస్త్రి, సచ్చిదానంద వత్సాయన్ వంటి వారితో కలసి స్థాపించిన భారతీయ పునరుజ్జీవన సంఘం (ఇండియన్ రినైసెంస్ అసోసియేషన్) సాహిత్య పునర్వికాసంలో ముఖ్యపాత్ర వహించింది.[8]

నాటక కర్త

[మార్చు]

వీరికి నాటకాలంటే చాలా ఇష్టం ఉండేది. వారు నాటకాలు రచించారు. దర్శకత్వం వహించారు, హైదరాబాదులో, దిల్లీలో కూడా ప్రదర్శించారు. ముఖ్యంగా కన్యాశుల్కం, ప్రతిమాసుందరి వంటి వాటిలో నటించారు. కన్యాశుల్కం లో రామప్పపంతులు వేషం వేసి రక్తి కట్టించారు.[9] నటాలి, నాట్యగోష్ఠి వంటి సంస్థలు అబ్బూరి వారి నాటకరంగ సేవకు నిదర్శనాలు. 1957 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగీత, నాటక, సాహిత్య, లలిత అకాడమీ స్థాపనలో ముఖ్య సలహాదారుగా కీలకపాత్ర వహించి అకాడమీ స్థాపనకు అంకురార్పణ చేశారు. వీరి సూచన అనుసరించి ఆకాశవాణిలో 1957 లో 90 నిముషాల జాతీయ నాటకాల ప్రసారం మొదలుపెట్టింది.[10] మృచ్ఛకటికం నాటకాన్ని తర్జుమాచేశారు. మృచ్ఛకటికం నాటకాన్ని అప్పుడే దిల్లీలో ప్రారంభమైన దూరదర్శన్ (1965) లో, డా. సర్వేపల్లి రాధాకృష్ణ వద్ద రాష్ట్రపతిభవన్ లో ప్రదర్శించారు.[11] ఆయన పదవీ విరమణ తరువాత హైదరాబాద్ లో ఏ.ఆర్.కృష్ణ, మంత్రి శ్రీనివాసరావు తదితరులతో కలసి "నాట్య విద్యాలయ"ను స్థాపించి నాటకాలకు దర్శకత్వం వహించడమే కాకుండా ఒక సంవత్సరం థియేటర్ ఆర్ట్స్ లో సర్టిఫికేట్ అధ్యయనాలను ఆరంభించారు. జాతీయ నాటక పాఠశాల, దిల్లీ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, దిల్లీ) పట్టప్రదాన సభ యందు స్నాతకోపన్యాసం ఇచ్చారు.[12]

రచనలు

[మార్చు]
  1. ఊహాగానము, ఇతర కృతులు (పద్య గేయ కృతుల సంపుటి) ప్రథమ ముద్రణ 1973, ద్వితీయ ముద్రణ 1994 లో ప్రచురితమైనది.
  2. మల్లికాంబ (1915-16) ఆంధ్ర భారతి పత్రిక [13]
  3. నదీసుందరి (నాటకం) 1923లో ప్రచురితమైనది
  4. ఎర్రగన్నేరు (1924)
  5. సూర్యరాజు చెప్పిన కథలు (కృష్ణా పత్రిక, 1923)[14]
  6. కల్పనా కథలు. (కృష్ణా పత్రిక, 1923)
  7. మేఘా లేఖ్యములు (శారదా పత్రిక, 1923)
  8. మంగళసూత్రం (అపరాధ పరిశోధక నవల) 1924లో ప్రచురితమైంది.
  9. మంగళసూత్రం (ఇది అబ్బూరి వారు రచించిన నవల, కథల సంకలనం) 1995 లో ప్రచురితమైనది.

అబ్బురి వారి రచనలను సేకరించి ఊహాగానము, ఇతర కృతులు పేరుతో కవితాసంస్థ ప్రచురించింది.[15]

గ్రంథాలయ శాస్త్ర ఆచార్యులు, గ్రంథాలయాధికారి

[మార్చు]

ఆంధ్ర విశ్వకళా పరిషత్ 1926 లో స్థాపించిన తరువాత కట్టమంచి రామలింగారెడ్డి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు అయ్యాక అబ్బూరిని గ్రంథాలయంలో నియమించారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్ష్యులుగా ఉన్నప్పుడు డా. ఎం.ఓ. థామస్ ను గ్రంథాలయాధికారిగా నియమించి, అబ్బూరిని తెలుగు విభాగములో ప్రప్రథమ ఆంధ్రోపన్యాసకుడుగా పంపారు. అక్కడ తెలుగు భాషతో బాటు సంస్కృతం కూడా బోధించారు. థామస్ తరువాత విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి గ్రంథాలయాధికారిగా నియమింపబడి అబ్బూరి అక్కడే సుమారు 30 సంవత్సరాలు పనిచేశారు.[16] గ్రంథాలయాధికారిగా నియంపబడినప్పుడు గ్రంథాలయ సంబంధిత ఉద్యోగార్హతలు లేవు. 1932-33 మధ్య బ్రిటీష్ గ్రంథాలయ సంఘం, లండన్ వారి నుంచి (ఎఫ్.ఎల్.ఎ) "ఫెలో ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్, లండన్" అనే గౌరవ పట్టా పొందారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలలో విద్వత్తు కలిగిన అబ్బురి గ్రంథాలయాధికారిగా ఉన్నందున అనేక మంది కవులు, పరిశోధకులు కూడా ఆయన సలహాలను పొందుతూండేవారు. విశాఖపట్నంలో సాహిత్య వాతావరణం పెరగడానికి అది దోహదం చేసింది.[17] గ్రంథాలయాలు వాటి విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి వివిధ స్థాయిలలో శిక్షణ పొందిన సిబ్బంది అవసరాన్ని గుర్తించిన అబ్బూరి వారు ఆంధ్ర విశ్వకళా పరిషత్ గ్రంథాలయశాస్త్రంలో సర్టిఫికేట్, డిప్లమాలలో అధ్యయనాలు ప్రవేశ పెట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు డా. వి.ఎస్.కృష్ణతో వారి సాన్నిహిత్యం, ఆత్మీయత విశ్వవిద్యాలయ గ్రంథాలయం ఇంకా గ్రంథాలయశాస్త్ర అధ్యయనాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడ్డాయి. అబ్బూరి రామకృష్ణారావు తమ పదవీకాలం పూర్తయిన 2/3 సంవత్సరాల తరువాత 1960లో పదవీ విరమణ చేశారు. గ్రంథాలయాలకు సంబంధించి వారు "గ్రంథాలయాలు అనాధ శరణాలయాలు కాదు ... అనాధ శరణాలయాలు మాదిరి అభివృద్ధి చెందకూడదు." అని సందేశాన్ని ఇచ్చారు.[5][18] ఇంకా అంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు అబ్బురి రాష్ట్ర గ్రంథాలయ కమిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, పౌర గ్రంథాలయోద్యమ సమస్యలను చర్చించి అక్కడి జిల్లాగ్రంథపాలకులకు తమ సహకారాన్ని అందించారు. వారిలో చాలావరకు అతని విద్యార్థులే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడుతున్నప్పుడు ఆంధ్ర గ్రంథాలయ చట్టం ఏర్పడటములో కీలక పాత్ర వహించారు.[19]

బిరుదులు, సన్మానాలు, గౌరవ పదవులు

[మార్చు]

వీరు ఎన్నో బిరుదులు, సన్మానాలు నిరాకరించారు. తెలుగు సాహిత్య సేవకి, ఆంధ్రవిశ్వవిద్యాలయ గ్రంథాలయాభివృద్ధికి, పౌర గ్రంథాలయోద్యమంలో అబ్బూరి కీలకపాత్రను గుర్తించి ఆంధ్ర విశ్వకళా పరిషత్ తమ 47వ పట్టప్రదాన సభ యందు 1974 ఆగస్టు 3న అబ్బూరికి కళా ప్రపూర్ణ బిరుదు ప్రదానం చేశారు. దీనిని మాత్రమే స్వీకరించారు.[20] 1953 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి తరువాత రాష్ట్ర ప్రభుత్వం 1956 లో కొత్తగా ఏర్పడ్డ విశాలాంధ్ర రాష్ట్రంలో గ్రంథాలయాల అనుసంధానాన్ని విస్తృతం చేయడానికి, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఏర్పాటులో అబ్బూరి వారి సలహా, సహకారం కోరింది. విశాఖ రచయతల సంఘం అధ్యక్ష్యులుగా నన్నయ్య పదసూచి సంకలనానికి ఆరంభించారు. సాహిత్య అకాడమీ ఏర్పడ్డ తరువాత తిక్కన్న మొదలగు ఆచూకీ గ్రంథాలు, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్య ప్రచురణల సూచిని తయారు చేయుటకు ప్రణాళికలు తయారు చేశారు. వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ, కేంద్ర సంగీత నాటక అకాడమీతో అనుబంధం ఉంది. 1957-58 మధ్యలో సాహిత్య అకాడమీ వారి అభ్యర్ధన మేరకు రవీంద్రనాధ టాగూరు వారి చాలా నాటకాలు తెలుగులోకి తర్జుమా చేశారు.

మరణం

[మార్చు]

అబ్బూరి 30 ఏప్రిల్, 1979 రోజు మరణించారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు అబ్బూరి వారు తమను కలుసుకోవాలని చూడవచ్చిన భద్రిరాజు కృష్ణమూర్తికి చివరగా ఈ పద్యం వ్రాసుకోమని వినిపించారు.[21]

"చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో
ఏమి యగునో ఎవరికెరుగరాదు,
ఎరుకలేని వారలేమేమో చెప్పగా
విని తపించువారు వేనవేలు"

అబ్బురి చివరి కోరిక అనుసరించి ఆయన చితాభస్మాన్ని డెహ్రాడూన్ లో ఎం.ఎన్.రాయ్ సమాధి వద్ద ఉంచారు.[22]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వరద రాజేశ్వరరావు. మా నాన్నగారు. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్,నాట్యగోష్టి,1988.పు.157-175.
  2. 2.0 2.1 నవ్యకవితా వైతాళికుడు శ్రీ అబ్బూరి కాలధర్మం. ఆంధ్ర జ్యోతి 1979, మే 1 అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్,నాట్యగోష్టి,1988
  3. https://www.newindianexpress.com/states/telangana/2019/jun/28/popular-telugu-fiction-writer-abburi-chayadevi-passes-away-at-85-1996641.html
  4. https://www.thehindu.com/news/cities/Visakhapatnam/Abburi-Gopalakrishna-passes-away/article17125493.ece
  5. 5.0 5.1 5.2 హరిప్రసాద రావు, సూదన. సాహితీవేత్త-శ్రీ అబ్బూరి రామకృష్ణారావు. గ్రంధాలయ జ్యోతి. పు14-17. ఏప్రిల్-జూన్ 1980
  6. మసూనా. నవ్యాంధ్ర కవిత్వమూ. అబ్బూరివారూ.అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్,నాట్యగోష్టి,1988. పు.50-59
  7. అభ్యుదయ, జూన్ 1979. నిత్య విజ్ఞానాన్వేషి అబ్బూరి. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.90-92
  8. ప్రభాకరరావు, దేవులపల్లి. చెప్పుకోదగ్గ మనిషి.అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.85-87
  9. నరసింహారావు, ఎ.ఎల్. ఆప్తుడు అబ్బూరి. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ.హైదరాబాద్, నాట్యగోష్టి, 1988.పు.19-39
  10. రామారావు,పన్నూరి. గురువుగారు-శ్రీ అబ్బూరి రామకృష్ణారావుగారు. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి,1988.పు.78-84.
  11. కృష్ణ, ఎ.ఆర్. జ్ఞాపకాలు. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ.హైదరాబాద్,నాట్యగోష్టి,1988.పు.75-77
  12. రామకృష్ణా రావు, అబ్బూరి. Convocation Address.అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్,నాట్యగోష్టి,1988.పు.388-392
  13. https://www.sakshi.com/news/family/article-abburi-ramakrishna-rao-sakshi-sahityam-1087540
  14. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-16. Retrieved 2020-05-05.
  15. వెంకటేశ్వర రావు, నార్ల. శ్రీ అబ్బూరి. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.40-41
  16. యజ్ఞన్నశాస్త్రి, సోమంచి. అబ్బురి రామకృష్ణరావు గారూ - నేనూ.అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.4-11.
  17. https://www.sakshi.com/news/family/article-abburi-ramakrishna-rao-sakshi-sahityam-1087540
  18. నారాయణరావు,డి.జె. స్మృతిపధంలో శ్రీ అబ్బూరి. గ్రంధాలయ జ్యోతి. పు.7-11. ఏప్రిల్-జూన్ 1980.
  19. Subbarao,C.V.The ending age of Titans in Librarianship. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988.పు.350-356
  20. మాధవాచార్యులు, వై. ప్రఖ్యాపన ప్రసంగం. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.43-45.
  21. కృష్ణమూర్తి, భద్రిరాజు. అబ్బూరి మేస్టరుగారు నేను. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.64-69
  22. ఆంజనేయులు, కుందుర్తి. అబ్బురి: మనల్ని విడచి వెళ్ళిన మరోక వైతాళికుడు.అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.70-74