అరుణ్ జైట్లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణ్ జైట్లీ
అరుణ్ జైట్లీ


వ్యక్తిగత వివరాలు

జననం (1952-12-28) 1952 డిసెంబరు 28 (వయస్సు: 67  సంవత్సరాలు)
కొత్త ఢిల్లీ
మరణం ఆగస్టు 24, 2019
ఢిల్లీ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సంగీత జైట్లీ
సంతానము రోహన్ జైట్లీ, సోనాలీ జైట్లీ
వృత్తి భారత ఆర్దిక శాఖ మంత్రి
మతం హిందూమతము
వెబ్‌సైటు Official website

అరుణ్ జైట్లీ (డిసెంబర్ 28, 1952 - ఆగస్టు 24, 2019) భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా, మోదీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ ప్రస్తుతం రాజ్యసభలో అధికార నాయకుడిగా వ్యవహరించారు.[1]

బాల్యం[మార్చు]

1952 డిసెంబర్‌ 28న మహరాజా కిషన్‌జైట్లీ, రత్నప్రభ దంపతులకు జన్మించారు. తండ్రి న్యాయవాది. జైట్లీ బాల్యమంతా దిల్లీ నారాయణవిహార్‌లో గడిచింది. తల్లి సామాజిక సేవకురాలు. జైట్లీకి ఇద్దరు అక్కలు. దిల్లీ సెయింట్‌ జేవియర్‌ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయింది. శ్రీరామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో వాణిజ్యశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. ఆయన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)గా స్ధిరపడదామనుకున్నా, ఆ పరీక్షకు ఉన్న పోటీ ఆ ఆలోచనను విరమించుకునేలా చేశాయి. కెరీర్‌కు బీజం పడిందక్కడే. కళాశాలలోనే విభిన్న భాషల్లో చర్చల్లో పాల్గొనేవారు. జమ్మూ-కశ్మీర్‌ మాజీ ఆర్థికమంత్రి గిరిధారిలాల్‌ డోగ్రా కుమార్తె సంగీతాడోగ్రాను 1982, మే 24న పెళ్లాడారు. ఈ దంపతులకు కుమారుడు రోహన్‌, కుమార్తె సోనాలి ఉన్నారు. వీరిద్దరూ న్యాయవాదులే.

విద్యార్థి నేత[మార్చు]

దిల్లీ యూనివర్సిటీలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యారి పరిషత్‌(ఏబీవీపీ) నేతగా వర్సిటీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న రోజుల్లో 1974లో వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏబీవీపీ అభ్యర్థిగా ఆయన సాధించిన గెలుపు. ఆనాడు దేశ విద్యార్థి రాజకీయాలపై గణనీయ ముద్ర వేసింది. 1973లో జయప్రకాశ్‌ నారాయణ్‌- రాజ్‌ నారాయణ్‌ ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో జైట్లీ ఓ ప్రధాన నేత. 1975-77 నాటి అత్యయిక పరిస్థితిని వ్యతిరేకిస్తూ జైట్లీ యువనేతగా గళమెత్తారు. ‘1975 జూన్‌ 25న ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు పోలీసులు నన్ను అరెస్టు చేయడానికి మా ఇంటికొచ్చారు. నేను మా స్నేహితుడి ఇంటికి వెళ్లి అరెస్టు నుంచి తప్పించుకున్నాను. మర్నాడు ఉదయం ఇందిరాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశాం. ఎమర్జెన్సీ వ్యతిరేక నినాదాలు చేశాం. అప్పుడు నేనే స్వచ్ఛందంగా అరెస్టయ్యాను. అంటే సాంకేతికంగా నేనే తొలి సత్యాగ్రాహిని’’ అని జైట్లీ జర్నలిస్టు సోనియాసింగ్‌ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. 19 నెలల పాటు తనను అంబాలా జైలులో ఉంచారన్నారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో జైల్లో ఉన్నపుడు మరో 12 మంది అగ్రనాయకులతో కలిసి ఒకే సెల్‌లో ఉండే అవకాశం చిక్కింది. వాజ్‌పేయి, ఆడ్వాణీ, నానాజీ దేశ్‌ముఖ్‌లతో అప్పుడే సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సమయంలో వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన నేతలతో పరిచయాల్ని, పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. భారత రాజ్యాంగ సభ చర్చలన్నింటినీ నేను జైల్లో ఉన్నపుడే చదివాను’’ అని ఆయన వివరించారు. జైలు నుంచి బయటికొచ్చాక జనసంఘ్‌లో చేరారు. 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనతా పార్టీ ప్రచారం కోసం ఏర్పాటు చేసిన లోక్‌తాంత్రిక్‌ యువమోర్చాకు కన్వీనర్‌గా ఉన్న జైట్లీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. తర్వాత ఏబీవీపీ దిల్లీ శాఖ అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా నియామకమయ్యారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు అంబాలా, తిహార్‌ జైల్లలో గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక 1980ల్లో జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి హయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా కల మంత్రిగా నియమించబడ్డారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.[2]

నేతగా ఎదిగిన న్యాయ ప్రస్థానం[మార్చు]

దేశంలోని దిగ్గజ న్యాయవాదుల్లో ఒకరిగా పేరొందిన అరుణ్‌జైట్లీ.. న్యాయస్థానం నుంచి వృత్తి జీవితాన్ని మొదలుపెట్టి రాజకీయ నేతగా చట్టసభకు ప్రస్థానం సాగించారు.1987 నుంచి పలురాష్ట్రాల హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 1990లో 37 ఏళ్ల వయసులోనే దిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వొకేట్‌ హోదా లభించింది. అంతకు ఏడాది ముందు అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ)గా నియమితులయ్యారు. ఏఎస్‌జీగా అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించిన బోఫోర్స్‌ కేసును చేపట్టారు. దేశంలో చరిత్రాత్మక తీర్పులు వెలువడిన ఎన్నో ముఖ్యమైన కేసుల్ని వాదించారు. ఆయన క్లయింట్లలో శరద్‌యాదవ్‌, మాధవరావు సింధియా, ఎల్‌కే ఆడ్వాణీ, బిర్లా కుటుంబం తదితరులే కాకుండా బహళజాతి కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయి. న్యాయ తదితర అంశాలపై పుస్తకాలు వెలువరించారు. రాజ్యసభలో విపక్షనేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవాద వృత్తికి దూరమయ్యారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు గవర్నర్ల బోర్డులో సభ్యుడిగానూ వ్యవహరించారు.

గుజరాత్‌ అల్లర్ల కేసులో మోదీకి, వివాదాస్పద సోహ్రబుద్దీన్‌, ఇస్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్ల కేసుల్లో అమిత్‌షాకు న్యాయసేవలు అందించారు. కేంద్రం చేపట్టే న్యాయ నియామకాల్లో జైట్లీ ముద్ర సుస్పష్టం. న్యాయమంత్రిగా పలు ఎన్నికలు, న్యాయ సంస్కరణలు చేపట్టారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు పథకాన్ని అమలు చేశారు. కోర్టుల కంప్యూటరీకరణపై ప్రత్యేక దృష్టిసారించారు. కేసులు త్వరగా పరిష్కారమయ్యేందుకు వీలుకల్పిస్తూ పలు చట్టాల్లో సవరణలు తీసుకొచ్చారు.

బోఫోర్స్‌ పేపర్‌ వర్క్‌[మార్చు]

1986 నుంచి అరుణ్‌ జైట్లీ తన న్యాయవాద వృత్తిని విస్తృతంగా కొనసాగించారు. 1989లో అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ ఆయనను అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమించి అత్యంత కీలకమైన బోఫోర్స్‌ కుంభకోణంలో న్యాయపరమైన చిక్కుముళ్లను విప్పదీసే పనిని అప్పజెప్పారు. ‘బోఫోర్స్‌’ను వెలికితీసే పేపర్‌ వర్క్‌ అంతా జైట్లీయే చేశారు. న్యాయ, రాజ్యాంగ వ్యవహారాల్లో ఆయనది అందెవేసిన చెయ్యి. ఎంపీగా ఉన్న సమయంలోనే న్యాయవాదిగా తన ఆదాయం 130 కోట్లుగా పేర్కొనడం విశేషం. రాజ్యసభాపక్ష నేతగా ఎంపిక కాకముందు జైట్లీ ఒక్కో సిటింగ్‌కు 3 లక్షలు తీసుకునేవారు. దానికితోడు కేసు విలువలో పర్సంటేజీ తీసుకునేవారు.

వాజ్‌పేయి-ఆడ్వాణీ నీడలో[మార్చు]

1990 నుంచి జైట్లీ బీజేపీలో ఉన్నతస్థాయికి అధిరోహించడం మొదలైంది. అగ్రనేతలు వాజ్‌పేయి, ఆడ్వాణీ నీడలో, వారి ఆత్మీయుడిగా అంచలంచెలుగా ఎదిగారు. 2003లో మధ్యప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి తేవడం వెనుక ఆయన కృషి నిరుపమానం.

యూపీఏకి వణుకే[మార్చు]

కోర్టు హాల్లో కంటే పార్లమెంటు భవనంలోనే జైట్లీ వాదన పటిష్ఠంగా ఉండేది. 2004లో వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ ఓడిపోయినపుడు కూడా పార్టీలో ఆయన ప్రాభవం తగ్గలేదు. యూపీఏ హయాంలో తీవ్రమైన రాజకీయ దాడి జరిగినపుడు బీజేపీకి అండగా నిలిచిన పెద్ద నేత ఆయన! జైట్లీ మాట్లాడ్డానికి లేచారంటే యూపీఏ నేతలు శ్రద్ధతో ఆలకించేవారు. పాలసీ పెరాలసిస్‌ (విధానపరమైన అనారోగ్యం) అనే పదాన్ని సృష్టించి, మన్మోహన్‌ ప్రభుత్వ విధానాలను దునుమాడి, సర్కారుకు కంట్లో నలుసులా మారారు. ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీ ఆర్థికవేత్తలందరి మన్ననలూ అందుకోలేకపోయారు. కానీ, మోదీ ఆర్థిక అజెండాను అమలు చేయడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు. ఇక జైట్లీ హయాంలో రెండో పెద్ద నిర్ణయం.. జీఎస్టీని తేవడం.

బటర్‌ చికెన్‌ ప్రియుడు[మార్చు]

జైట్లీది పంజాబీ బ్రాహ్మణ కుటుంబం. ఆయనకు బటర్‌ చికెన్‌ అంటే మహా ఇష్టం. ‘‘జైల్లో ఉన్నపుడు చికెన్‌ లేదా మటన్‌ తెప్పించుకునేవాళ్లం. దానిని జైల్లోనే వండి బటర్‌ చికెన్‌ తినేవాళ్లం’’ అని ఆయన వెల్లడించారు.

ఆయన శిష్యులే[మార్చు]

కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఓ సందర్భంలో జైట్లీని సూపర్‌ స్ట్రాటజిస్ట్‌ అని అభివర్ణించారు. పార్టీ ప్రతినిధులు ఏం మాట్లాడాలన్నా మొదట జైట్లీ దగ్గరనుంచి బ్రీఫింగ్‌ తీసుకునేవారు. నిర్మలా సీతారామన్‌, జావడేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, పీయూశ్‌ గోయెల్‌ సహా అనేకమంది మంత్రులు జైట్లీకి ప్రత్యక్ష శిష్యులే. సంబిత్‌ పాత్రా, అమిత్‌ మాలవీయ మొదలైనవారూ ఆయన శిష్యులుగా రాణించినవారే.

క్రికెట్‌ అంటే ప్రాణం[మార్చు]

క్రికెట్‌ అంటే అరుణ్‌ జైట్లీకి మహా ఇష్టం. కుటుంబంతో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌లు చూడడం మహా సరదా. ఈ ఆసక్తే ఆయనను ఢిల్లీ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా కూడా చేసింది. బీసీసీఐ వ్యవహారాల్లో కూడా ఆయన చురుగ్గా పనిచేశారు.

జైట్లీ పదవుల ప్రస్థానం[మార్చు]

 • 1974లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ నేతగా ఎన్నిక
 • 1977లో లోక్‌తాంత్రిక్‌ యువ మోర్చా కన్వీనర్‌గా.. ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా నియామకం
 • బీజేపీ తొలి యువజన విభాగం అధ్యక్షుడిగా, పార్టీ ఢిల్లీ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు
 • 1989లో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు
 • 1991 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
 • 1999లో వాజ్‌పేయి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా.. రాం జెఠ్మలానీ రాజీనామా తర్వాత న్యాయ, కంపెనీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు
 • 2009-14 మధ్య రాజ్యసభలో విపక్ష నేత
 • 2002 జూలైలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ కార్యదర్శిగా, ప్రధాన ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. 2003లో వాజ్‌పేయి మంత్రివర్గంలో చేరారు
 • 2014లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014, 2017లో కొద్ది నెలల పాటు రక్షణ మంత్రిగా వ్యవహరించి రక్షణ రంగంలో ప్రైవేటీకరణ వంటి కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.

సంస్కరణాభిలాషి[మార్చు]

అరుణ్‌ జైట్లీ అస్తమించినప్పటికీ.. ఆయన వదలిన సంస్కరణల ముద్రలు మాత్రం భారత్‌లో ఉదయిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా జీఎస్‌టీ అమలును చెప్పుకోవాలి. ఒకే దేశం.. ఒకే పన్ను కోసం మోదీ 1.0 ప్రభుత్వం తలపెట్టిన కార్యాన్ని నెత్తికెత్తుకుంది ఈయనే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో మొండి బకాయిల ప్రక్షాళనకావించిన జైట్లీ తన హయాంలో పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అదే సమయంలో వృద్ధి మందగమనం రూపంలో అతిపెద్ద వైఫల్యాన్నీ మూటగట్టుకున్నారు.

జైట్లీ హయాంలో సంస్కరణలు[మార్చు]

జీఎస్‌టీ[మార్చు]

వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ) విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడం అరుణ్‌ జైట్లీ అతి పెద్ద విజయం. దేశం మొత్తాన్ని ఒకే పన్ను కిందకు తీసుకురావడానికి ఉభయ సభల్లో బిల్లు ఆమోదంలోనూ మోదీకి మంచి చేయూతనిచ్చారు. ఆ తర్వాత తన అధ్యక్షతన జరిగిన లెక్కకు మించిన జీఎస్‌టీ మండలి సమావేశాల్లో శ్లాబుల నుంచి పలు అంశాల్లో సవరణలు చేసే విషయంలో, వాటిపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి.. అందరికీ సానుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడం సఫలం అయ్యారు.

దివాలా స్మృతి[మార్చు]

బ్యాంకింగ్‌ వ్యవస్థలో దివాలా కోసం ఉన్న పలు వ్యవస్థలన్నిటినీ ఒకే చట్టం కిందకు తీసుకొచ్చారు. సంక్లిష్టతలను తగ్గించారు. మొండి బకాయిల వసూలును సరళతరం చేశారు. ఇటీవల దీనికి మరికొన్ని సవరణలూ చేపట్టి.. కంపెనీలకు మరింత వెసలుబాటు కల్పించారు. మొత్తం మీద జైట్లీ హయాంలో వచ్చిన ఈ బిల్లు ప్రారంభం నుంచి అమలు వరకూ ఆయన కీలక పాత్ర పోషించారు.

జన్‌ధన్‌[మార్చు]

బ్యాంకింగ్‌ సేవలను మూలమూల్లోకీ విస్తరించడమే ధ్యేయంగా చేపట్టిన ప్రధాన్‌ మంత్రి జన్‌ధన్‌ యోజన ద్వారా పల్లెసీమల్లో అత్యధికంగా ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఇక ఆధార్‌ ఆధారంగా 55 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేశారు. దీని వల్ల రూ.లక్ష కోట్ల వరకు ప్రజాధనం పక్కదార్లు పట్టకుండా కాపాడినట్లు తెలుస్తోంది.

సీఎండీ పోస్టు విభజన[మార్చు]

ఆర్థిక వ్యవస్థలో మార్పులను ముందుగానే ఊహించిన జైట్లీ.. పీజే నాయక్‌ కమిటీ సిఫారసులను అమలు చేశారు. బ్యాంకు బోర్డుల్లో పలు సంస్కరణలు చేపట్టారు. సీఎండీ పోస్టును విభజించడంతో పాటు.. డైరెక్టర్లు, బ్యాంకు అధిపతుల నియామకం కోసం బ్యాంక్‌ బోర్డ్స్‌ బ్యూరో(బీబీబీ)ను ఏర్పాటు చేశారు. ఆర్‌బీఐకి తోడుగా కొత్త నియంత్రణ సంస్థల వైపు కూడా ఆయన మొగ్గుచూపారు.

ద్రవ్యలోటు[మార్చు]

జైట్లీ హయాంలో ద్రవ్యలోటు నియంత్రణలోనే ఉంది. అయితే లక్ష్యమైన 3 శాతాన్ని ఎపుడూ చేరలేదు. మధ్యంతర బడ్జెట్‌లో మాత్రం 3.4 శాతానికి చేర్చగలిగారు. ప్రధాని నిర్దేశించిన ద్రవ్యోల్బణ లక్ష్యాలను సాధించగలిగారు. ఆయన పగ్గాలు చేపట్టిన సమయంలో ద్రవ్యోల్బణం 7.72 శాతంగా ఉండగా.. అనారోగ్యం కారణంగా తాత్కాలికంగా పక్కకు తప్పుకునే సమయానికి 2.92 శాతానికి చేరింది.

విజయవంతమైన అంశాలను పక్కనపెడితే ఎన్‌బీఎఫ్‌సీల మొండి బకాయిలను ఒక దారికి తీసుకువచ్చే కార్యక్రమాన్ని అసంపూర్తిగానే వదిలి వెళ్లారు. వైఫల్యాల విషయానికొస్తే వృద్ధిని పరుగులు తీయించలేకపోయారు. మందగమనానికి అడ్డుకట్టవేయలేకపోయారు. ఒక దశలో 8% పైన నమోదైన వృద్ధి ప్రస్తుతం 7% దిగువకు చేరుకుంది. అయితే ఈ మందగమనాన్ని జైట్లీకే అంటగట్టలేం. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ మందగమనం, అధిక కమొడిటీ, ముడి చమురు ధరలు కూడా మందగమనానికి కారణాలుగా పనిచేశాయి.

జైట్లీ విజయాలు[మార్చు]

 • జీఎస్‌టీ, దివాలా బిల్లు వంటి సంస్కరణల అమలు
 • ద్రవ్యోల్బణం 7.7% నుంచి 2.9%కి పరిమితం
 • ద్రవ్య నియంత్రణ చర్యలు
 • బ్యాంకుల్లో మొండి బకాయిల ప్రక్షాళన
 • జన్‌ధన్‌ ఖాతాలు
 • స్థిరాస్తి బిల్లు
 • సంక్షేమ పథకాలకు ఆధార్‌ ఆధారిత ప్రత్యక్ష నగదు బదిలీ
 • నాయక్‌ కమిటీ సిఫారసుల అమలు

పురస్కారాలు[మార్చు]

 1. పద్మ విభూషణ్ పురస్కారం - భారత ప్రభుత్వం, (పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2020), 26 జనవరి, 2020[3][4][5]

మరణం[మార్చు]

గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ 2019, ఆగస్టు 9న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ 2019, ఆగస్టు 24 శనివారం మధ్యాహ్నం గం. 12.07 ని.లకు తుదిశ్వాస విడిచారు. అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసారు. దిగ్గజ నేతకు పెద్ద ఎత్తున నాయకులు, అశేష జనవాహిని తుది వీడ్కోలు పలికారు. పలువురు నేతలు కన్నీటిని ఆపుకోలేకపోయారు. భావోద్వేగానికి గురయ్యారు. యమునా నది ఒడ్డున ఉన్న నిగం బోధ్ ఘాట్‌లో ఆయన భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జైట్లీ చితికి ఆయన కుమారుడు నిప్పుపెట్టారు. అంత్యక్రియలు జరుగుతుండగా భారీ వర్షం కురిసినప్పటికీ లెక్కచేయకుండా పార్టీలకు అతీతంగా నేతలు, అశేష జనవాహిని పాల్గొని తమ ప్రియతమ నేతకు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.[6][7]

మూలాలు[మార్చు]

 1. సాక్షి, జాతీయం (24 August 2019). "అరుణ్‌ జైట్లీ అస్తమయం". మూలం నుండి 24 ఆగస్టు 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 August 2019. Cite news requires |newspaper= (help)
 2. నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (24 August 2019). "అరుణ్ జైట్లీ రాజకీయ ప్రస్థానం." www.ntnews.com. మూలం నుండి 24 ఆగస్టు 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 August 2019.
 3. సాక్షి, ఎడ్యూకేషన్ (25 January 2020). "పద్మ పురస్కారాలు-2020". మూలం నుండి 10 ఫిబ్రవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 10 February 2020. Cite news requires |newspaper= (help)
 4. నమస్తే తెలంగాణ, జాతీయం (25 January 2020). "141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం". మూలం నుండి 10 February 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 10 February 2020. Cite news requires |newspaper= (help)
 5. హెచ్ఎంటీవి, ఆంధ్రప్రదేశ్ (26 January 2020). "పద్మ అవార్డు గ్రహీతల పూర్తి జాబితా". రాజ్. మూలం నుండి 10 February 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 10 February 2020. Cite news requires |newspaper= (help)
 6. ఈనాడు, తాజావార్తలు (24 August 2019). "అరుణ్‌జైట్లీ కన్నుమూత". మూలం నుండి 24 ఆగస్టు 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 August 2019. Cite news requires |newspaper= (help)
 7. https://www.andhrajyothy.com/artical?SID=888315