అర్జునునికి వసువుల శాపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కురుక్షేత్ర సంగ్రామంలో అష్ట వసువులలో ఒకరైన భీష్ముని ఓడించిన అర్జునుడు

అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముని వధించాడు.

ఒకసారి అర్జునుని భార్య అయిన ఉలూచి నాగ కన్యలతో కలసి గంగానదికి వెళ్లింది. అక్కడికి ఎనిమిది వసువులు స్నానమాచరించటకు వచ్చారు. అప్పుడు గంగాదేవి వారికి నమస్కరించి వారితో నా కుమారుడు భీష్ముని అర్జునుడు శిఖండిని ముందు ఉంచుకుని తన బాణాలతో చంపినాడు. భీష్ముడు మీ వసువులలో ఒకరే కదా. అర్జునుని శపించి శిక్షించరా?" అని అడిగినది.

వసువులు గంగాదేవి చెప్పినదానికి అంగీకరించి అర్జునునికి ఎటువంటి శాపము ఇవ్వాలో చర్చించుకుంటున్నారు. ఇది అంతయూ చూసిన ఉలూచి తన తండ్రి అయిన కౌరవ్యుని పిలిచి తన భర్తని కాపాడవలసినది అని వేడుకున్నది.

కౌరవ్యుడు వసువులకు నమస్కరించి భీష్ముడే ధర్మమును రక్షించ తలచి శిఖండి ఉపాయము ధర్మరాజుకు చెప్పాడు. దీనియందు అర్జునుని దోషం లేదు కావున శపించవలదు అని కోరాడు. వసువులు కౌరవ్యుడు చెప్పినది విని తాము శపించకపోయిననూ అర్జునుడు పాపము అనుభవించ వలసి వచ్చును అని చెప్పారు.

కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుడు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు మణిపురము వచ్చినప్పుడు బభృవాహనుడు అర్జునునికి ఎదురేగి పాదాభివందనము చేసినాడు. అర్జునునికి తన కుమారుడు వీరుని వలే ఎదిరించకుండా లొంగిపోవుట నచ్చక "వీరపుత్రులు యుద్ధమునకు వెనుకాడరు" అని పల్కాడు. బభృవాహనుడు తన తండ్రి మాటలకు కుంగిపోయి తన రాజధానికి చేరాడు. ఆ విషయము తెలిసికొన్న ఉలూచి బభృవాహనుడు వద్దకు వచ్చి యుద్ధము చేసి తండ్రిని సంతోషపెట్టమని చెప్పింది. అంతట సకల సైన్యముతో బభృవాహనుడు అర్జునునిపై దండెత్తాడు. ఆ యుద్ధములో అర్జునుని బాణమునకు బభృవాహనుడు మూర్చపోయినాడు. కాని బభృవాహనుడు మూర్చపోక ముందు ప్రయోగించిన బాణము అర్జునుని రొమ్ములో గ్రుచ్చుకుని అర్జునుని ప్రాణం తీసింది. ఈ విషయము తెలిసి చిత్రాంగద, ఉలూచి రణరంగమునకు వచ్చారు. అంతలో బభృవాహనుడు మూర్చనుంచి తేరుకుని లేచి తండ్రి మరణించాడని తెలుసుకుని హతాశుడై ఉలూచిని దుర్భాషలాడి, ప్రాయోపవేశము చేసి ప్రాణాలు విడుచుటకు సిద్దమయ్యాడు. అప్పుడు ఉలూచి బభృవాహనునికి సంజీవనిమణిని ఇచ్చి అర్జునుని గుండెలపై ఉంచమని చెప్పింది. అర్జునుడు తిరిగి బ్రతికాడు. ఉలూచి వారికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు భీష్ముని (ఎనిమిదవ వసువు అవతారం) చంపుట వల్ల వసువులు ఇచ్చిన శాపం గురించి వివరించింది.


చూడండి

[మార్చు]