అర్జున్ (2004 సినిమా)
| అర్జున్ | |
|---|---|
| దర్శకత్వం | గుణశేఖర్ |
| రచన | గుణశేఖర్ |
| నిర్మాత | రమేష్.జి |
| తారాగణం | మహేష్ బాబు, శ్రియా సరన్, కీర్తి రెడ్డి, ప్రకాష్ రాజ్ |
| ఛాయాగ్రహణం | శేఖర్ వి. జోసెఫ్ |
| సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీ | 20 ఆగస్టు 2004 |
| భాష | తెలుగు |
| బడ్జెట్ | 18 కోట్లు |
అర్జున్ గుణశేఖర్ దర్శకత్వంలో 2004లో విడుదలైన సినిమా. మహేష్ బాబు, శ్రీయ, కీర్తి రెడ్డి ఇందులో ప్రధాన పాత్రధారులు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నటనకు గాను మహేష్ బాబు, సరితకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల్లో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ఈ చిత్రం ప్రదర్శింపబడింది.[1] ఈ సినిమా మైదాన్-ఎ-జంగ్ పేరుతో హిందీలోకి, వరెండ మదురైక్కు అనేపేరుతో తమిళంలోకి అనువాదమైంది.
కథ
[మార్చు]అర్జున్, మీనాక్షి కవల పిల్లలు. ఒకేసారి చదువు పూర్తి చేసుకుని బయటికి వస్తారు. తల్లిదండ్రులు మీనాక్షికి మంచి సంబంధం చూసి పెళ్ళిచేయాలనుకుంటుంటారు. మీనాక్షి క్లాస్ మేట్ అయిన ఉదయ్ ఆమెకు ప్రేమలేఖ రాసి తన తల్లిదండ్రులు బాలనాయగర్, ఆండాళ్ వేరే అమ్మాయితో పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నారనీ, వారిద్దరూ లేచిపోయి పెళ్ళి చేసుకుందామని అడుగుతాడు. ఆమె ఆ ఉత్తరాన్ని అర్జున్ కి చూపిస్తుంది. ఆమెకు కూడా ఉదయ్ అంటే ఇష్టం ఉంటుంది. అర్జున్ మధురై వెళ్ళి అక్కడ ఉదయ్ పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుండగా అతని తల్లిదండ్రులతో విషయాన్ని నేరుగా మాట్లాడతాడు అర్జున్. ఉదయ్ మీనాక్షిని పెళ్ళి చేసుకోవడానికి తల్లిదండ్రులముందే ధైర్యంగా ఒప్పుకొంటాడు. ఉదయ్ తల్లిదండ్రులు కూడా పెళ్ళికి ఒప్పుకొంటారు కానీ వారికి మనసులో వేరే ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు.
ఈ లోపు అర్జున్ కి తనకు కళాశాలలో పరిచయమున్న రూప అక్కడ కనపడుతుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. మీనాక్షి అత్తమామలు ఆమె వల్ల కొడుకు చేసుకోవాల్సిన అమ్మాయి, దానితో వచ్చే ఆస్తిని కోల్పోయామని భావించి ఉదయ్ ఇంట్లోలేని సమయంలో ఆమెను చంపాలని చూస్తుంటారు. రకరకాల పథకాలు వేసినా మీనాక్షి మాత్రం అదృష్టవశాత్తూ వాటినుంచి బయటపడుతూ ఉంటుంది. అర్జున్ వచ్చి ఉదయ్, మీనాక్షికి ఈ ప్రయత్నాలు గురించి చెబుతాడు కానీ వాళ్ళు నమ్మరు. ఒకప్రయత్నంలో ఆమె నిజం తెలుసుకుని తమ్ముడి మాటలు నమ్ముతుంది. తనను చంపబోవడానికి వేసిన ప్రణాళికను తమ్ముడి సహాయంతో తప్పించుకుని కవలపిల్లలకు జన్మనిస్తుంది. ఆమెను చంపాలని చూసిన బాలనాయగర్ చనిపోగా ఆండాళ్ పక్షవాతం వచ్చిపడిపోతుంది. దగ్గరుండి ఇవన్నీ చూసిన ఉదయ్ అర్జున్ మాటలు పూర్తిగా నమ్ముతాడు. అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
తారాగణం
[మార్చు]- అర్జున్ గా మహేష్ బాబు
- రూపగా శ్రీయ
- మీనాక్షిగా కీర్తి రెడ్డి
- ఉదయ్ గా రాజా
- అర్జున్ తండ్రిగా మురళీ మోహన్
- బాలనాయగర్ గా ప్రకాష్ రాజ్
- ఆండాళ్ గా సరిత
- రూప తండ్రిగా తనికెళ్ళ భరణి
- కళాభవన్ మణి
- రాజన్ పి దేవ్
- ఎం.ఎస్.నారాయణ
- వేన్నిరాడై నిర్మల
- మాస్టర్ రామ్ తేజ
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుణశేఖర్
- కథ: గుణశేఖర్
- సంగీతం: మణిశర్మ
- మాటలు: పరుచూరి బ్రదర్స్
- పాటలు: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: శంకర్ మహదేవన్, కె .ఎస్ .చిత్ర, కార్తీక్ , ఉన్ని కృష్ణన్, హరిణి, ఉదిత్ నారాయన్, స్వర్ణలత, శ్రేయా ఘోషల్, శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. బి .చరణ్
- ఛాయా గ్రహణం: శేఖర్ వి జోసెఫ్
- ఎడిటింగ్: ఎ.శ్రీకర ప్రసాద్
- నిర్మాత: జి.రమేష్ బాబు
- విడుదల:18:08:2004.
పాటల జాబితా
[మార్చు]పాటల రచయిత వేటూరి సుందర రామమూర్తి.
- ఒక్క మాట , శంకర మహదేవన్
- మధుర మధుర , ఉన్ని కృష్ణన్, హరిణి
- ఓ చెలీ , కె ఎస్ చిత్ర , కార్తీక్
- రా రాజకుమారా , ఉడిత్ నారాయణ్ , స్వర్ణలత
- హే పిల్లా , శ్రేయా ఘోషల్, ఎస్. పి. చరణ్
- డుo డుమారే , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
మూలాలు
[మార్చు]- ↑ "Directorate of Film Festival" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 23 March 2015. Retrieved 12 July 2015.