భగవద్గీత-అర్జునవిషాద యోగము

వికీపీడియా నుండి
(అర్జున విషాద యోగము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భగవద్గీత
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
గీతా మహాత్యము
గీత సంస్కృత పాఠము
గీత తెలుగు అనువాదము
హిందూధర్మశాస్త్రాలు

గమనిక


Krishna_and_PArtha

అర్జునవిషాద యోగము, భగవద్గీతలో మొదటి అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

'అర్జునవిషాద యోగములో ముఖ్య విషయాలు : అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్థించాడు.

ఆధ్యాయ సంగ్రహం[మార్చు]

ధృతరాష్ట్రుడు, సంజయుడు

యుద్ధం ఆపమని వ్యాసుడు ధృతరాష్ట్రునికి హితవు చెప్పాడు. తాను అసహాయుడనని, ఆ పని తన వల్ల కాదని ధృతరాష్ట్రుడు విన్నవించుకొన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం అనివార్యం అని గ్రహించిన తరువాత యుద్ధం విశేషాలు దర్శించడానికి, వివరించడానికి వీలుగా వ్యాసుడు సంజయునకు దివ్యమైన దృష్టి, అవగాహన, శీఘ్రగమనం వంటి శక్తులిచ్చాడు. వాటి సహాయంతో సంజయుడు ధృతరాష్ట్రుడికి భూమండలం విశేషాలు దర్శించి వివరించాడు. తరువాత రాజు ఆనతిపై యుద్ధభూమికి వెళ్ళాడు.

అలా వెళ్ళిన సంజయుడు పది రోజులకు గాని తిరిగి రాలేదు. వస్తూనే మహావీరుడు భీష్మ పితామహుడు రణభూమిలో కూలి అంపశయ్యపై విశ్రమించాడని చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు దుఃఖించాడు. పిదప ధృతరాష్ట్రుడు మొదటినుండి యుద్ధం గురించి చెప్పమని సంజయుడిని ఇలా అడిగాడు.

ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నా బిడ్డలు, పాండవులు ఏమి చేశారు?

ఇదే భగవద్గీతలో మొదటి శ్లోకం. అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు.

మహాయోధులు సిద్ధం

వ్యూహాలు తీరియున్న సేనను చూసి దుర్యోధనుడు ఆచార్య ద్రోణుని వద్దకు వెళ్ళి ఇరు పక్షాలలో మహాయోధుల గురించి ప్రస్తావించాడు. "పాండవుల పక్షాన సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్ట కేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతి భోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఐదుగురు ద్రౌపది పుత్రులు (ప్రతివింధ్యుడు, సుతసోముడు, శ్రుతకర్ముడు, శతానీకుడు, శ్రుతసేనుడు) వంటి మహావీరులున్నారు. మన (కౌరవ) పక్షాన తమరు (ద్రోణుడు), భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు వంటి మహావీరులున్నారు. అంతా జీవితాలను పణంగా పెట్టి యుద్ధరంగానికి వచ్చారు. భీముని రక్షణలో ఉన్న పాండవ సేనకంటే భీష్ముని రక్షణలో ఉన్న కౌరవ సేన అపరిమితము, అజేయము. కనుక అందరూ భీష్ముని రక్షించడానికి సావధానంగా ఉండాలి" - అని దుర్యోధనుడు ద్రోణుడితో అన్నారు.

కురువృద్ధుడు, పితామహుడు అగు భీష్ముడు సింహనాదం చేస్తూ శంఖాన్ని పూరించాడు. కృష్ణుడు పాంచజన్య శంఖాన్నీ, అర్జునుడు దేవదత్త శంఖాన్నీ అలాగే ఇతరులు తమతమ శంఖాలనూ పూరించారు. భేరీ భాంకారాలతో యుద్ధరంగం దద్ధరిల్లింది.

అర్జునుని ఉత్సుకత

అప్పుడు కౌరవులబలం, వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం కపిధ్వజుడైన అర్జునుడు తన బావ, సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు. కృష్ణుడు అలానే చేసాడు. అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న బిడ్డలను, గురువులను, వయోవృద్ధులను అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూశాడు.

అర్జునుడి దుఃఖం

వారిని చూడగానే గుండె కరిగిపోయి అర్జునుడు కృష్ణునితో ఈ విధంగా అన్నాడు. "కృష్ణా! అందరూ మనవాళ్ళే, వారిలో కొందరు పూజ్యనీయులు. ఈ స్వజనాన్ని చూస్తుంటే నా శరీరావయవాలు పట్టు తప్పుతున్నాయి. నోరు ఎండిపోతున్నది. గాండీవం చేజారుతున్నది. బంధుమిత్రులకోసమే మనం రాజ్య భోగాలు కోరుకుంటాం. అలాంటి బంధుమిత్రులే ఇక్కడ ప్రాణాలను వదులుకోడానికి సిద్ధంగా ఉన్నారు. వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను? అయినా జయాపజయాలు దైవాధీనాలు కదా. ఎవరు గెలుస్తారో తెలియదు. యుద్ధం కారణం చేత కుల క్షయం సంభవిస్తుంది. అయ్యో రాజ్య సుఖ లోభం కారణంగా స్వజనులను చంపే ఘోర పాపకృత్యానికి ఒడిగట్టాము కదా? ఇది దారుణం. వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను. దుఃఖం చేత నేను, నా అవయవాలు స్థిమితం కోల్పోతున్నాయి" అని అంటూ తన ధనుర్బాణాలు వదిలివేసి దుఃఖించసాగాడు.

తాత్విక, ఆధ్యాత్మిక విశేషాలు[మార్చు]

కొన్ని ముఖ్య శ్లోకాలు, వ్యాఖ్యలు[మార్చు]

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ |

ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి? - ఇది భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకం.

పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనఞ్జయః
పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం భీమకర్మా వృకోదరః
అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ

ఈ శ్లోకాలలో కృష్ణుని, పాండవుల శంఖాల పేర్లున్నాయి - కృష్ణుని శంఖం - పాంచజన్యం; అర్జునుని శంఖం - దేవదత్తం ; భీముని శంఖం - పౌండ్రకం; ధర్మరాజు శంఖం - అనంత విజయం; నకులుని శంఖం - సుఘోషం; సహదేవుని శంఖం - మణి పుష్పకం;

న కాఙ్క్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా
యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ
త ఇమేऽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సమ్బన్ధినస్తథా
ఏతాన్న హన్తుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే

అర్జునుని విషాదానికి కారణం పై శ్లోకాలలో ఉంది - ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా! రాజ్యం వలన కాని, భోగాల వలన కాని, జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి? ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు. ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ మొదలైన వారు. మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా? జనార్ధనా! దృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి సంతోషం కలుగుతుంది? చంపినా మనకి పాపమే వస్తుంది. అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము?

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వనరులు[మార్చు]

  • శ్రీమద్భగవద్గీత - తత్వవివేచనీ వ్యాఖ్య - రచన: జయదయాల్ గోయందకా - గీతాప్రెస్, గోరఖ్‌పూర్ ప్రచురణ (2002)
  • భగవద్గీత యథాతథము - రచన: ఏ.సి.భక్తివేదాంత ప్రభుపాద రచన - ప్రచురణ: భక్తివేదాంత బుక్‌ట్రస్ట్, హైదరాబాదు (2006)
  • శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతము - బొమ్మకంటి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కొంపెల్ల వేంకటరామశాస్త్రి - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్స్, రాజమండ్రి (2001)
  • శ్రీ మద్భగవద్గీత - రచన: ఈశ్వర సత్యనారాయణ శర్మ - ప్రచురణ : కళ్యాణి ప్రెస్, తెనాలి (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం - ఈ పరచనలలో 9వ అధ్యాయాన్ని గురించి విశేషమైన వివరణ ఉంది.
  • శ్రీమద్భగవద్గీతా పరిచయం - సంకలనం: బాలగంగాధర పట్నాయక్, దీపశిఖ, ఒడిషా - శ్రీ శాంతి ఆశ్రమం, తూర్పుగోదావరి జిల్లా - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం

బయటి లింకులు[మార్చు]