అలెగ్జాండర్ ఇవానోవిచ్ కుప్రీన్
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
అలెగ్జాండర్ ఇవానోవిచ్ కుప్రీన్ రష్యన్ నవలాకారుడు జననం 07-9-1870 మరణం 1938 ఆగస్టు 25 వ తారీకు. పూర్వపు సోవియట్ రష్యా మధ్య భాగంలో కుప్రీన్ అనే చిన్న నది ప్రవహించే ప్రాంతంలో ‘సరోవత్’ అనే చిన్న పట్టణం కుప్రీన్ జన్మస్థలం. తండ్రి చిరుద్యోగి, కుప్రీన్ పుట్టిన ఏడాదికే తండ్రి చనిపోయాడు. తల్లి వోల్గా టార్టార్ కుటుంబాలకు సంబంధించినది, భర్త పోయిన తరువాత ఆమె వితంతు శరణాలయంలో తలదాచుకొన్నది. కుప్రీన్ ని ఆయిదో ఏట అనాథ శరణాలయంలో చేర్చారు, అక్కడే మిలటరీ సెకండరీ స్కూల్లో చదివాడు. ఆ స్కూల్ ల్లో చిన్నచిన్న తప్పులకు కుడా పిల్లలను కోరడాలతో చావబాదేవారు. కుప్రీన్ బాల్యం ఆనందకరమైన వాతావరణంలో గడవలేదు, పేదరికం, బాధలు, బాల్యానుభవాలు అతని వ్యక్తిత్వంమీద గాఢమైన ముద్ర వేశాయి. తొలి యవ్వనంలోనే పుష్కిన్, గోర్కీ వంటి ప్రసిద్ధుల రచనలతో తనకు పరిచయం అయింది. అతను తరుణ వయస్కుడుగానే కవితలు రాయడం మొదలు పెట్టాడు. తన తొలికథ 19 ఏళ్లకే పత్రికలో అచ్చయింది. కుప్రీన్ మిలటరిలో ఆఫీసర్ గా చేరాడు కానీ పై అధికారుల జబర్దస్తీని చాలా అసహ్యించుకున్నాడు. సైన్యంలో ఈ అనుభవాలనే తర్వాత “ద్వంద్వ యుద్ధం” నవలగా రాశాడు. సైన్యం నుంచి ఉద్యోగ విరమణ తరువాత, “దానేత్సకా” బొగ్గుగనుల ప్రాంతంలో కొంతకాలం పత్రికావిలేకరిగా చేసి, రైల్వే పట్టాలు తయారుచేసే కర్మాగారంలో గుమాస్తా ఉద్యోగం సంపాదించాడు. అక్కడే శ్రామికుల సమష్టి జీవన సౌందర్యం తనను ఆకట్టుకొన్నది. శ్రామికుల సాహస పూర్ణమయిన కౌశల్యాన్ని, పనితనాన్ని అభినందించాడు. సమాజ హితం కోసం చేసే శ్రమే మానవ జీవిత పరమార్థమని తనకు అనిపించింది. “మోలఖ్” నవలికలో శ్రమ, యాజమాన్యం మధ్యన ఉన్న వైరుధ్యాలను గ్రహించి, శ్రమదోపిడి దురన్యాయాన్ని చిత్రీకరించాడు. మోలఖ్ పురాతన ఫొనీషియన్ దేవుడు, యుద్ధానికి, అగ్నికి అధిదేవత, శిశువులను బలిస్తేగాని సంతుష్ఠి చెందని దేవుడు. సమకాలిక పెట్టుబడిదారీ విధానం, రక్తపిపాసి మోలఖ్ దేవత కన్నా దారుణంగా, అసహ్యకరంగా ఉందని కుప్రీన్ అభిప్రాయం. ఈ రచనలో గణాంకాలతో సహా ఇచ్చి, గనిలో, లోహపు వనిలో ఒక కార్మికుని జీవితంలో షుమారు నాలుగోవంతు హరించబడుతుందని కుప్రీన్ అంటాడు. మోలఖ్ నవలికలో కథానాయకుడు నిజాయితీపరుడు, అతను సత్యాన్ని అన్వేషిస్తూ, అదృష్ట హీనుల, నిరుపేదల పక్షాన నిలిచే వ్యక్తి. ఈ నవలలో ‘చూబ్రోక’ కథానాయకుడికి ప్రేమనీ, గౌరవాన్ని, అన్నింటినీ డబ్బుతో కొనగలిగే ఈ ప్రపంచం అంటే పట్టరాని కోపం. మరొక పాత్ర, ‘బోచోయ్’ మిత్రుడు డాక్టర్ గోల్డ్ బర్గు “మోలఖ్ ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. “కార్మికులు అద్భుతమైన మనుషులు, పసిపిల్లలవంటివాళ్ళు, వీరులు కూడా!" అంటాడు. ఈ పాత్రలు కార్మికుల తిరుగుబాటును కళ్ళారా ప్రత్యక్షంగా చూస్తాయి. “రష్యన్ సంపద” పత్రికలో కుప్రీన్ మొదటి కథ ‘మోలఖ్’ ప్రచురించబడింది, సెన్సార్ నిబంధనలు, మరి కొన్ని ఇతర కారణాలవల్ల కుప్రీన్ ‘బోబోవ్’ అనుభూతులను ముందు పెట్టవల్సి వచ్చిందట! ఈ కథ విషాదాంతం. శ్రామిక తిరుగుబాటు హింసతో అణచివేయబడుతుంది. డాక్టర్ గోల్డ్ బెర్గ్ గాయపడిన, కాళ్ళు చేతులు, అవయవాలు కోల్పోయిన కార్మికులకు వైద్యం చేయడంతో నవలిక ముగుస్తుంది. 19 వ శతాబ్ది ముగింపు సంవత్సరాలలో కుప్రీన్ రష్యాదేశం అంతటా పర్యటిస్తూ ఏపని దొరికితే ఆపని చేస్తూ జీవించాడు, అయితే ఒకచోట స్థిరంగా వుండి రచనావ్యాసంగం సాగించాలని కుప్రీన్ ఆశ.
1901 ఫాల్, ఆకురాలుకాలం కల్లా సెయింట్ పీటర్సు బర్గ్ లో స్థిరపడి, అక్కడి సాహిత్య సాంస్కృతిక వాతావారణంలోకి వచ్చిపడ్డాడు. ఐ. బ్రూనిన్, సెరఫి మోవిచ్, ఎన్. గారిన్, మిహిలోవ్.స్కీ, వంటి రచయితలతో సంబంధాలు ఏర్పడ్డాయి. లియో టోల్ స్టాయ్, మక్సిం గోర్కిల పరిచయం అతని సాహిత్య జీవితంలో మైలు రాళ్ళు. గోర్కీ ప్రభావం సాధారణ ప్రజలమీద, రచయితలమీద విపరీతంగా ఉన్నకాలం అది. గోర్కి కుప్రీన్ ను “జ్ఞానప్రచు రణల”లో పాల్గొనమని ప్రోత్సహించాడు, ఉత్తేజపరిచాడు. అవి రష్యన్ అభ్యుదయ రచయితలను ఒక తాటికిందకు తీసుకొని రావాలనే ప్రయత్నం కొనసాగుతున్న రోజులు. కుప్రీన్.కు సర్కస్ ప్రదర్శనలతో, నాటక ప్రదర్శనలతో సంబంధం, అనుభవంఉంది. ఈ అనుభవాలను ఆయన రచించిన “ఒలేస్యా” కథలో నిక్షేపించాడు. ఒలేస్యా కథ మొలఖ్ కథకు జతగా అనిపించే రచన, చాలా ప్రఖ్యాతి పొందిన కథ. “ఒలేస్యా" అడవిలోతుల్లో పెరిగిన నిసర్గ సౌందర్యం.” కుప్రీన్ రచనల్లోని అద్భుతమైన స్త్రీ పాత్రల్లో ఒలేస్యా ఒకటి. ప్రేమభావం, ఆత్మత్యాగం, సర్వదా ఆనందంలో, దుఃఖంలో, ఎప్పుడూ తనలాగే కనిపించే పాత్ర. ఆమె చుట్టూతా ఒక నిగూఢమైన పరివేషం ఆవరించి ఉంటుంది. ఈ కథ గాఢమైన విషాదాంతంగా ముగుస్తుంది. ఇవాన్ తిమో ఫే యేవిచ్ దయాస్వభావుడే, కానీ దుర్బలుడు. ఈ నగరవాసిని ఇవాన్. ను వనవాసిని ఒలెస్యా వరించింది. ఈ కథలో కుప్రీన్ చేసిన ప్రకృతివర్ణనలు కథను చక్కగా ముదుకు నడిపిస్తాయి. అరణ్యం యొక్క గంభీరమైన శీతల నిశ్శబ్దం ఒకవైపు, ఇవాన్ తిమో ఫే యె విచ్ ఒంటరితనం మరొక వైపు.
ఉల్లాసంగా ఉండే వసంత ఋతువు ఒలేస్యా పట్ల ఇవాన్ తిమో ఫెయే విచ్ అనుభూతులతో ఆరంభంలో సమసిస్తుంది. నిగూఢమైన, మనోహర వేసవి వెన్నెలరాత్రి- ప్రేమికుల ఆనందం, చివరకు ఉరుములు వడగళ్లు.. కథ విషాద ఉపసంహారం..”
కుప్రీన్ వ్యక్తిత్వాన్ని రెండు విషయాలు ప్రభావితం చేశాయి. మానవుడూ, ప్రకృతీ- హృదయంలేని యంత్ర నాగరికతమీద విమర్శగా తన పూర్వుల నివాసం, భూమితో ఒక ఘనిష్ఠ సంబంధం ఏర్పరచుకోమని ఆయన మానవుడికి విజ్ఞప్తి చేసినట్లు అనిపిస్తుంది. మానవుడి అనుభూతుల్లో ప్రేమ మహోన్నతమైనది. కుప్రీన్. “సులమీఫ్, రాళ్ళవంకీ, వయొలెట్స్” వంటి కథల్లో ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని గానం చేస్తాడు. ఈ కథలు రష్యన్ సాహిత్యంలోనే ఆణిముత్యాలు. ఈలోపు రష్యా మొదటి విప్లవంలోకి(1905) ప్రవేశించింది. ఆ నేపథ్యంలో తొలినాళ్ళలో కుప్రీన్ ‘ద్వంద్వయుద్ధం’ వర్ణనాత్మక కథ ప్రచురణ కావడంతో ఆయనకు రష్యాలో ప్రముఖ రచయితగా గుర్తింపు లభించింది. సైనిక జీవితాన్ని గురించిన ఈ కథ రెండు అపజయాల తర్వాత ప్రచురించబడినది. రష్యా, జపాన్ యుద్ధంలో రష్యా అపజయం, ఓటమికి కారణాలను కుప్రీన్ ఈ బ్రహ్మాండమైన కథలో వివరించాడు. నిజాయితీ పరులైన మిలటరీ ఆఫీసర్ల మీద ఈ కథ గట్టి ముద్ర వేస్తుందని గోర్కి అభిప్రాయపడ్డారు. 1905 విప్లవకాలంలో, తరవాత కూడా కుప్రీన్ రష్యా సైనిక జీవితంలో క్రియశీలంగా పాల్గొన్నాడు. నల్లసముద్రపు నావికా దళాలతో సంబంధాలు పెట్టుకొని విప్లవకారుల సహాయార్థం నిర్వహించిన సభల్లో పాల్గొన్నాడు, విప్లవకారులకు ఆశ్రయం ఇచ్చాడు, నావికుల తిరుగుబాటును దారుణంగా అణచివేసినపుడు సైన్యాధికారి ఛుఖైవ్ జరిపిన దారుణ మారణకాండలో వందలాదిమంది నావికులు చనిపోయినపుడు కుప్రీన్ ఆ సైన్యాధిపతిని హంతకుడని పేర్కొని నిరసన తెలియజేస్తూ తీవ్రమైన ఆగ్రహంతో పత్రికల్లో రాశాడు. కుప్రీన్ సాహిత్య జీవితంలో ఇదొక ఉజ్వలమైన కాలం. జార్ అణచివేతకు అభ్యుదయ రచయితలు జంకిన సమయంలో కుప్రీన్ నిర్భయంగా దేశభక్తిని చాటుతూ ప్రజాస్వామ్యవాదిగా నిలిచాడు. తనకు అభిమానుల సంఖ్య ఎక్కువై ఇబ్బందులు పడుతూ, వారికి దూరంగా నిసర్గ ప్రకృతిలో వనాలలో కెమెరా చేతబట్టుకొని, సంచరిస్తూ ఆనందిస్తూ, రైతులతో మాట్లాడుతూ రచనా వ్యాసంగం కొనసాగించాడు. కీర్తి, యశస్సు వచ్చినా, భుక్తి గడవడం కోసం కుప్రీన్ం కొన్ని చెత్త రచనలు రాసి తన ప్రతిభను వృధా చేసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి తరుణంలోనే కుప్రీన్ రచించిన కథలలో “గంబ్రీనస్, ఇజుమృద్, రాళ్ళవంకీ, ఓలేస్యా మొదలైన గొప్ప కథలు కళాత్మక రచనలని ప్రసిద్ధిచెందాయి. కుప్రీన్.కు దృఢమైన, బలమైన వ్యక్తిత్వం, అందమైన రూపం కలిగిన పాత్రలంటే ఇష్టం. సామాజిక దురాగతాలను, బలహినతలను ఎదిరించి పోరాడిన బలహీనులను గురించి, ఇంకా అటువంటి విషయాలమీద రాయాలని అభిలాష. ‘గంబ్రీనస్’ కథలో 1905 విప్లవానికి అంకితమైన పాత్రలు చాలా ఉన్నాయి. కథ వాస్తవంగా జరిగిన ఘటనలమీద అధారపడి రచించించాడు. జీవితంలో జరిగిన ఘటనలనే, లేదా తనకు తెలిసిన ఘటనలనే రచనలో వర్ణించేవాడు. ప్రజలమధ్యనే ఉండి, వాళ్ళ విశ్వాసాన్ని చూరగొని వారి ఆనందంకోసం కలలుకంటూన్న మనిషి కుప్రీన్. విద్యార్థులు, కార్మికులు, అందమైన పడుచులు, పీపాలమీద నిల్చొని ఉపన్యాసాలు చేసే విప్లవకారులు, ఎర్రజండాలు పట్టుకొని విప్లవగీతాలు ఆలపిస్తూ, వీధుల్లో సాగిపోయేవాళ్ళు, చిరునవ్వులతో వెలిగిపోతూ కరచాలనం చేసుకొంటున్న యువజనం-వీళ్ళే ఆయన రచనల్లో కనిపించే మనుషులు. “ఇజుమృద్” కథారచన చరిత్ర విచిత్రంగా ఉంటుందట! ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభపురోజుల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన ఘటనలనే అయన ఇందులో గ్రహించాడు. ఒక పందెపుగుర్రం యజమానితో పోటీపడి, అసూయతో మరొక అశ్వశాల యజమాని పందెపుగుర్రానికి విషం పెట్టాడు. కుప్రీన్ తానే అశ్వంలోకి పరకాయ ప్రవేశంచేసి, అశ్వరూపం ధరించి అశ్వ హృదయాన్ని, అలవాట్లను చిత్రించాడా అని విమర్శకులు ఆశ్చర్యచకితులయ్యారు. కుప్రీన్ అశ్వం యొక్క ప్రతి కదలిక, అది ఎలా మసలుకొంటుందో, దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కథలో కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు.
రాళ్లవంకీ కథారచన: బీతావెన్(L.Van Beethoven)సంగీతం ఈ కథకు స్పూర్తి, ఆ ‘సోనాటా’లోని ధ్వనులు, తాను సాక్షీభూతుడుగా ఉన్న ఒక ప్రేమకథతో ఆయన మనసు పెనవేసుకొని పోయాయి. తను చూసిన జీవితంలో సేకరించిన చిన్నచిన్న వివరలాతో సహా ఆయన ఈ కథలో నిక్షిప్తం చేశాడు. కుప్రీన్ ఈ కథలో “వెయ్యేళ్లలో ఒక్కసారే కనిపించే మహత్తర ప్రేమశక్తిని ఉద్దీపం చేయాలనుకొని, విషాద ఉపసంహారంతో కథను ముగించాడు.” ”ఇంతకంటే పరిశుద్ధ మైన దాన్ని(కథను)నేను యింకా రాయలేదు.” అని ఈ కథనుగరించి కుప్రీన్ ఒక మిత్రునికి రాసిన లేఖలో ఆంటాడు. కుప్రీన్ Desya, Moloch, The Duel, Yama The Pit, నవలలు రాశాడు. “కుప్రీన్ మనఃస్ఫూర్తిగా ఫిబ్రవరి విప్లవాన్ని, జారిజం పతనాన్ని ఆహ్వానించాడు”, కానీ మహత్తర అక్టోబర్ విప్లవం పట్ల ఆయన వైఖరి వైరుధ్య పూరితంగా ఉంది. బోల్షివిజాన్ని ప్రేమించినా తీవ్ర విప్లవ పోరాటాలపట్ల తనకు నమ్మకం పోయింది, భయంతో ఆ గందరగోళం మధ్య మాతృదేశాన్ని విడిచి ఫ్రాన్స్.కు వెళ్ళిపోయాడు. అయితే మాతృదేశంతో వియోగం ఆయనలో చాలా బాధ, దుఃఖం కలిగించాయి. రష్యాను పలవరించి, కలవరించి చివరకు 1937 లో తనదేశానికి తిరిగివచ్చి మరుసంవత్సరం 1938 లో కాలంచేశాడు. “మనుషులకు లాగే పుస్తకాలకూ అదృష్టం ఉంటుంది. కుప్రీన్ పుస్తకాలకి ఉన్న అదృష్టం అసూయ కారకం అవుతుంది. వాటికి దీర్ఘ చరిత్ర ఉంది, ఆబాల గోపాలం వాటిని చదువుతారు.” --ఆంద్రేయ్ చర్నిషోవ్. పూర్వపు సోవియట్ యూనియన్(USSR)ఇప్పుడు లేకపోయినా, ఆనాటి సోవియట్ పుస్తకాల అనువాదాలు మాత్రం మనకు లభిస్తున్నాయి. మాంచి చేయితిరిగిన అనువాదకులచేత సోవియట్ ప్రచురణలను భారతీయ భాషల్లోకి, తెలుగులోకి అనువదింపజేసి ఆదేశంలోనే ముద్రణ చేయించి దాదాపు కూటి నీళ్ళకు మనదేశంలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు రాదుగ, ప్రగతి వంటి సోవియట్ యూనియన్ తెలుగు ప్రచురణలను మనవాళ్ళు పునర్ముద్రణ చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సాహితి ప్రచురణ ఎ.కుప్రీన్ ఐదు నవలికలను “రాళ్ళ వంకీ కథలు” పేరుతో 2023లో పునర్ముద్రణ చేసింది. చాలా నిర్దుష్టంగా, అచ్చుతప్పులు లేకుండా తీసుకొని వచ్చింది, సోవియట్ ప్రచురణ లోని చిత్రాలు కూడా ఇందులో పునరుద్ధరించబడ్డాయి.ఆర్.వి.ఆర్. చేసిన అనువాదం ఎంతో నిర్దుష్టంగా ఉంది! రాళ్ళవంకీ పుస్తకం సోవియట్ రాదుగ ప్రచురణ(1984) లో నవలలో బొమ్మలు వేసిన చిత్రకారుడి పేరు కూడా అనువాదకుడి పేరంత ప్రముఖంగా ఉంది. ఆతరం వాళ్ళు ఎంత శ్రద్ధగా అనువాదం చేశారు! పరిశోధన గ్రంథానికి సమకూర్చినట్లు ఫుట్ నోట్సు, వివరణలు, అదనంగా సమాచారం అందించారు! ఈ పుస్తకానికి ఆంద్రేయ్ చెర్నిషోవ్ రాసిన పరిచయంలో కుప్రీన్. జీవిత రేఖలను కూడా చేర్చారు.
మూలాలు: రాదుగ ప్రచురణ, రాళ్లవంకీ, 1980. ముఖచిత్రం, ఓలేస్యా బొమ్మ