అల్లుడే మేనల్లుడు
అల్లుడే మేనల్లుడు (1970 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.పుల్లయ్య |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల |
సంగీతం | బి.శంకర్ |
నిర్మాణ సంస్థ | పద్మశ్రీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
అల్లుడే మేనల్లుడు పద్మశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి.వెంకటేశ్వర్లు నిర్మించిన తెలుగు కుటుంబకథా చిత్రం. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1970, నవంబరు 5న విడుదలయ్యింది.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణ - చంద్రం
- కృష్ణంరాజు - రంగన్న
- నాగభూషణం - జమీందారు ప్రసాద్
- అల్లు రామలింగయ్య
- రాజబాబు - సుందరవదనం
- నెల్లూరు కాంతారావు
- ధూళిపాళ - జానకి భర్త
- కైకాల సత్యనారాయణ - నాగన్న
- చలపతిరావు
- డాక్టర్ శివరామకృష్ణయ్య
- విజయనిర్మల - సరోజ
- శాంతకుమారి - జానకి
- సావిత్రి - కమల
- సూర్యకాంతం - జమీందారు భార్య విశాలాక్షి
- రమాప్రభ
- జ్యోతిలక్ష్మి
- సాక్షి రంగారావు
- కాకరాల
- మాస్టర్ ఆదినారాయణ
- బేబీ బ్రహ్మాజీ
- బేబీ రాణి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: పి.పుల్లయ్య
- మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
- పాటలు: ఆత్రేయ, దాశరథి, కొసరాజు
- సంగీతం: బి.శంకర్
- ఛాయాగ్రహణం: వర్మ
- నృత్యం: తంగప్ప
- కళ: ఎస్.కృష్ణారావు, సూరన్న
- కూర్పు: శ్రీరాములు
- సహకార దర్శకుడు: డి.ఎస్.ప్రకాశరావు
- నిర్మాత: వి.వెంకటేశ్వర్లు
కథా సంగ్రహం
[మార్చు]జమీందారు ప్రసాద్‌కు కమల అనే చెల్లెలు ఉంటుంది. ఆమె ఒక సామాన్యుని ప్రేమించి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆమెకు చంద్రం అనే కొడుకు పుడతాడు. ఆమె తన అవసాన దశలో ఆదుకొమ్మంటూ అన్నకు ఉత్తరం వ్రాస్తుంది. చెల్లెలంటే అమితమైన ప్రేమాభిమానాలు కలిగిన ప్రసాద్‌కు చెల్లెలు వ్రాసిన ఉత్తరం, తన భార్య విశాలాక్షి మూలంగా చాలా ఆలస్యంగా అందుతుంది. చెల్లెల్ని ఆదుకోవాలని వెళ్ళిన ప్రసాద్‌కు చెల్లెలు దొరకదు, మేనల్లుడు దొరకడు. కమల అంతకుముందు చనిపోతూ తన తోడి కోడలు జానకికి తన కొడుకును అప్పగిస్తుంది. జానకి చంద్రాన్ని తన ఊరు తీసుకుపోయి భర్తకు ఇష్టం లేకపోయినా కొడుకు రంగన్నతో సమానంగా పెంచుతుంది. తన మేనల్లుడి కోసం ఎంత ఖర్చయినా వెదికించి అతడినే కూతురు సరోజకు భర్తగా చేస్తానని ప్రసాద్ పంతం పడతాడు. అక్కడ జానకి కొడుకు తాను చేసిన తప్పులన్నింటినీ చంద్రంమీద బనాయిస్తూ ఉంటాడు. ఐతే ఒకానొక సంఘటనలో రంగన్న జైలుకు పోవలసి వస్తుంది. జానకి భర్త చంద్రాన్ని ఇంటి నుండి వెళ్ళగొడతాడు. చంద్రం విజయవాడ వెళ్తూ దారిలో సోడా మరిడయ్య, సుందరవదనంలను కలుసుకుంటాడు. ఈ సుందర వదనం ప్రసాద్‌కు, లక్ష్మికి పుట్టిన బిడ్డ. లక్ష్మి అన్నయ్య నాగులు ప్రసాద్‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతుంటాడు. చంద్రం విజయవాడ చేరుకుని సోడాలు అమ్ముతూ, విశాలాక్షి ఇంటిలో పనికి కుదురుతాడు. విశాలాక్షి కూతురు సరోజ, చంద్రం ప్రేమించుకుంటారు. జైలు నుండి బయటకు వచ్చిన రంగన్నను నాగన్న ప్రసాద్ మేనల్లునిగా చూపించి ప్రసాద్ ఆస్తిని కొల్లగొట్టడానికి పన్నాగం పన్నుతాడు. రంగన్నే తన మేనల్లుడని ప్రసాద్ నమ్మి సరోజకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. సరోజ చంద్రాన్ని ప్రేమిస్తుందన్న విషయాన్ని గ్రహించిన ప్రసాద్ చంద్రాన్ని బెదిరించి, డబ్బు ఆశ చూపించి, చివరకు బ్రతిమాలుతాడు. దాంతో చంద్రం సరోజకు తనపై అసహ్యం కలిగేలా ప్రవర్తించి ఎక్కడికో వెళ్ళిపోతాడు. నాగన్న చంద్రాన్ని బంధించి రంగన్నను వివాహం చేసుకోకపోతే అతడిని చంపేస్తానని సరోజను బెదిరిస్తాడు. పతాక సన్నివేశంలో ప్రసాద్ తన మేనల్లుడిగా చంద్రాన్ని గుర్తించి, తన చెల్లెలికి చేసిన ప్రమాణాన్ని నెగ్గేలా చంద్రం సరోజల వివాహం జరిపించి కథను సుఖాంతం గావిస్తాడు.[2][3]
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు బి.శంకర్ బాణీలు కట్టాడు.[3]
క్ర.సం. | పాట | రచయిత | గాయకులు |
---|---|---|---|
1 | పెళ్ళి కుదిరిందమ్మా పెళ్ళి కుదిరింది నాన్నా నాన్నా ప్రేమ గెలిచింది | ఆత్రేయ | పి.సుశీల |
2 | సై బడాజోరు పిల్లా వచ్చింది చూస్కో సై రాజా | కొసరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి |
3 | నీవనీ నేననీ లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డుతెరలు | సినారె | ఘంటసాల, సుశీల |
4 | సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కమ్మో ఓ సుక్కమ్మో చూస్కో మన జోడు ఓ సుక్కమ్మా | కొసరాజు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి |
5 | జాబిల్లి వచ్చాడే పిల్లా నిన్నెంతో మెచ్చాడే నీకు మనసిచ్చాడే ఎదురు చూస్తున్నాడే పిల్లా | దాశరథి | ఘంటసాల |
6 | వానల్లు కురవాలి వరిచేలు పండాలి మాయింట మాలక్ష్మి చిందెయ్యాలి | కొసరాజు | ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Allude Menalludu (P. Pullaiah) 1970". ఇండియన్ సినిమా. Retrieved 26 December 2022.
- ↑ వి.ఆర్. (6 November 1970). "చిత్రసమీక్ష: అల్లుడే మేనల్లుడు" (PDF). ఆంధ్రపత్రిక దినపత్రిక. Archived from the original (PDF) on 26 డిసెంబరు 2022. Retrieved 26 December 2022.
- ↑ 3.0 3.1 వెబ్ మాస్టర్. "Allude Menalludu (1970)-Song_Booklet". ఇండియన్ సినిమా. Retrieved 26 December 2022.