అవక్షేపణ రాయి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సిల్ట్ శిలలు (క్రింద) మరియు సున్నపు రాళ్ల (పైన) మిడిల్ ట్రియసిక్ సముద్ర అంచు శ్రేణి, వర్జిన్ ఫార్మేషన్, నైరుతి ఉటా, USA

భూమి యొక్క ఉపరితలము మరియు జలస్వరూపాలలో ఉన్న పదార్థాల అవక్షేపణ వలన ఏర్పడే ఒక రకమైన రాయి అవక్షేపణ రాయి (Sedimentary Rock). ఖనిజ మరియు/లేదా సేంద్రియ అణువులు (శైధిల్యాలు) స్థిరపడి, ప్రోగుపడటం లేదా ఒక ద్రావణం నుండి ఖనిజాలు అవక్షేపము చెందటానికి కారణమయ్యే ప్రక్రియకు ఉన్న పేరు అవక్షేపణ. ప్రోగుపడటం ద్వారా అవక్షేపణ రాయిని ఏర్పరిచే అణువులను ఆవక్షేపాలు అంటారు. నిక్షేపితం కాకముందు, నిక్షేపము ఉత్పత్తి ప్రదేశంలో శైధిల్యం మరియు క్రమక్షయం వలన ఏర్పడి, నిక్షేపం అయ్యే ప్రదేశానికి వికోషీకరణ కారకాలుగా పిలువబడే నీరు, గాలి, బృహచ్చలనం లేదా హిమానీనదాల ద్వారా రవాణా చేయబడుతుంది.

ఖండాల యొక్క భూపటలంపైన అవక్షేప శిల వ్యాప్తి విస్తారంగా ఉంది, కానీ భూపటలం యొక్క మొత్తం పరిమాణంలో అవక్షేపణ శిలలు కేవలం 5% మాత్రమే ఉంటాయని అంచనా. ప్రధానంగా అగ్ని మరియు రూపాంతరప్రాప్తి శిలలు ఉన్న పటలం మీద అవక్షేపణ శిలలు కేవలం ఒక పలుచని పొరగా మాత్రమే ఉన్నాయి.

అవక్షేప శిలలు పొరలలో ఒక స్తరంగా నిక్షేపించబడి, సంస్తరణంగా పిలువబడే ఒక నిర్మాణంగా ఏర్పడతాయి. అవక్షేప శిలలు మరియు శిలా స్తరాల అధ్యయనం సివిల్ ఇంజినీరింగ్‌కి ఉపయోగపడే అంతర్భౌమ సమాచారాన్ని అందిస్తుంది, ఉదాహరణకు రహదారులు, గృహాలు, సొరంగాలు, కాలువలు లేక ఇతర నిర్మాణాలు. అవక్షేపణ శిలలు బొగ్గు, శిలాజ ఇంధనాలు, త్రాగు నీరు లేదా ముడి ఖనిజం వంటి సహజ వనరులకు కూడా ముఖ్యవనరుగా ఉన్నాయి.

అవక్షేపణ శిలా స్తరాల అనుక్రమణ యొక్క అధ్యయనం, పురాభౌగోళికశాస్త్రం, పురాశీతోష్ణస్థితిశాస్త్రం మరియు జీవ చరిత్రలతో కూడిన భూమి చరిత్ర గురించి శాస్త్రీయ విజ్ఞానానికి ముఖ్యవనరుగా ఉంది.

అవక్షేపణ శిలల పుట్టుక మరియు లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రీయ విభాగం అవక్షేపశాస్త్రం (సెడిమెంటాలజి). అవక్షేపశాస్త్రం భూవిజ్ఞానశాస్త్రం మరియు భౌతిక భూగోళశాస్త్ర్రాల రెంటిలోనూ భాగంగా ఉండి, భూ శాస్త్రాల ఇతర విభాగాలైన, మృత్తికాశాస్త్రం, భూస్వరూపశాస్త్రం, భూ రసాయనశాస్త్రం లేదా నిర్మితీయ భూవిజ్ఞానశాస్త్రంలతో అతివ్యాప్తమౌతుంది.

విషయ సూచిక

జన్యు వర్గీకరణ ప్రణాళికలు[మార్చు]

వాటి శిలావిన్యాసానికి ఆధారమైన పద్ధతులనుబట్టి అవక్షేపణ శిలలు నాలుగు విభాగాలుగా విభజించవచ్చు: శకలమయ అవక్షేపణ శిలలు, జీవరసాయన (లేదా జీవజన్య) అవక్షేపణ శిలలు, రసాయన అవక్షేపణ శిలలు మరియు నాల్గవ విభాగంగా ప్రభావపాతం, అగ్నిపర్వత ప్రక్రియ మరియు ఇతర సూక్ష్మ పద్ధతుల ద్వారా ఏర్పడే "ఇతర" అవక్షేపణ శిలలు.

శకలమయ అవక్షేపణ శిలలు[మార్చు]

గ్లేషియల్ లేక్ మిస్సౌలా, మోంటానా, USAలో నిక్షేపితమైన జంబాల రాయి. దూర సరోవరీయ నిక్షేపాలకు సాధారణమైన నున్నని సమతల సంస్తరణమును గమనించవచ్చు.

శకలమయ అవక్షేపణ రాళ్లు ప్రవాహ ద్రవాలచే (ఆధార భారం, విలంబిత భారం, లేదా అవక్షేప గురుత్వ ప్రవాహాలచే) రవాణా చేయబడిన రాతి తునకలు మరియు సిలికేట్ ఖనిజాలచే తయారుకాబడి ఈ ద్రవాలు ఆగిపోయినచోట అవక్షేపించబడతాయి. శకలమయ శిలలు ఎక్కువభాగం క్వార్ట్జ్, ఫెల్స్పార్, రాతి (అశ్మ) తునకలు, బంకమన్ను ఖనిజాలు, మరియు మైకాలతో తయారు కాబడతాయి; అనేక ఇతర ఉపసాధనాలుగా అనేక ఖనిజాలు మరియు ప్రాంతీయంగా ముఖ్యమైనవి కూడా ఉండవచ్చు.

శకలమయ అవక్షేపం, మరియు దానికనుగుణంగా శకలమయ అవక్షేపణ శిలలు, వాటిలోని ముఖ్య కణ పరిమాణం (వ్యాసం) ఆధారంగా విభజింపబడ్డాయి. ఎక్కువమంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఉడెన్-వెంట్వర్త్ రేణు పరిమాణ ప్రమాణం ఉపయోగించి అదృఢమైన అవక్షేపాన్ని మూడు భాగాలుగా విభజించారు: గ్రావెల్ (>2 మిమి వ్యాసం), ఇసుక (1/16 నుండి 2 మిమి వ్యాసం), మరియు బురద (బంకమన్ను <1/256 మిమి మరియు సిల్ట్ 1/16 మరియు 1/256 మిమి మధ్య). శకలమయ అవక్షేపణ శిలల వర్గీకరణకు సమాంతరంగా ఈ క్రమపద్ధతి ఏర్పడింది; కంగ్లోమెరేట్స్ మరియు బ్రెక్షియాస్‌లు అత్యధికభాగం గ్రావెల్‌తో తయారుకాబడతాయి, ఇసుక రాళ్ళు ఎక్కువగా ఇసుకతోను, మరియు బురదరాళ్ళు ఎక్కువ భాగం బురదతోనూ తయారుకాబడతాయి. ఈ త్రివిధ వర్గీకరణ పురాతన సాహిత్యంలో విస్తృత వర్గీకరణ అయిన రూడైట్స్, అరెనైట్స్, మరియు లుటైట్స్‌ను వరుసగా ప్రతిబింబిస్తుంది.

ఈ విస్తృత వర్గాల విభజన, శకల ఆకారం (కంగ్లోమెరేట్స్ మరియు బ్రెక్షియాస్), సంఘటనం (ఇసుకరాళ్ళు), రేణు పరిమాణం మరియు/లేదా అమరిక (బురదరాళ్ళు) లలోని భేదాల ఆధారంగా జరిగింది.

కంగ్లోమెరేట్స్ మరియు బ్రెక్షియాస్[మార్చు]

కంగ్లోమెరేట్స్ ప్రధానంగా గోళాకార గ్రావెల్ (గులకరాయి) తోను మరియు బ్రెక్షియాస్ ప్రధానంగా కోణాకార గ్రావెల్‌‌తోనూ తయారౌతాయి.

ఇసుకరాళ్ళు[మార్చు]

ఇసుకరాయి వర్గీకరణ ప్రణాళిక విస్తృతంగా మారుతూ ఉంటుంది, కానీ అత్యధిక భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు డాట్ ప్రణాళికను అనుసరించారు, [1] ఇది వర్గీకరణలో క్వార్ట్జ్, ఫెల్స్పార్ మరియు అశ్మ నిర్మాణ కణాల సాపేక్ష లభ్యత మరియు ఈ భారీ రేణువుల మధ్య పంక మాత్రిక లభ్యతను ఉపయోగిస్తుంది.

చట్రనిర్మాణ కణాల సంఘటనం
ఇసుక-పరిమాణ చట్రనిర్మాణ కణాల సాపేక్ష సమృద్ధి లభ్యత ఇసుక రాయి యొక్క పేరులో మొదటి పదాన్ని నిర్ణయిస్తుంది. పేరు పెట్టే ప్రయోజనానికి, చట్రనిర్మాణ కణాల లభ్యత క్వార్ట్జ్, ఫెల్స్పార్, మరియు ఇతర శిలల నుండి తయారైన అశ్మ భాగాలతో ప్రమాణంగా ఉంటుంది. ఇవి ఇసుకరాళ్ళ యొక్క అత్యధిక లభ్యత కలిగిన మూడు ముఖ్య అనుఘటకాలు; ఇతర అన్ని రకాల ఖనిజాలు వాటి లభ్యతతో సంబంధంలేకుండా, అదనపు భాగాలుగా పరిగణింప బడతాయి కానీ, పేరు పెట్టే ప్రక్రియలో ఉపయోగింపబడవు.
 • క్వార్ట్జ్ ఇసుకరాళ్ళు >90% క్వార్ట్జ్ కణాలను కలిగి ఉంటాయి
 • ఫెల్స్పతిక్ ఇసుకరాళ్ళు <90% క్వార్ట్జ్ కణాలను మరియు లిథిక్(అశ్మ) కణాల కంటే ఎక్కువగా ఫెల్స్పార్ కణాలను కలిగి ఉంటాయి.
 • అశ్మ ఇసుకరాళ్ళు <90% క్వార్ట్జ్ కణాలు మరియు ఫెల్స్పార్ కణాల కంటే అధిక అశ్మ కణాలను కలిగి ఉంటాయి.
ఇసుక కణాల మధ్య పంక మాత్రిక యొక్క లభ్యత
ఇసుక-పరిమాణ కణాలు అవక్షేపించబడినప్పుడు, ఇసుక రేణువుల మధ్య స్థలం ఖాళీగా మిగిలి ఉంటుంది లేదా బురద(సిల్ట్ మరియు/లేదా బంకమన్ను పరిమాణ కణాలు)తో నిండి ఉంటుంది.
 • తెరచుకొని ఉన్న ఖాళీ రంధ్రాలను(తరువాత సిమెంట్ తో నింపబడవచ్చు)

కలిగిన "స్వచ్చమైన" ఇసుకరాళ్ళు అరెనైట్స్ గా పిలువబడతాయి.

 • పంక మాత్రిక (>10%)లభ్యతతో ఉన్న బురదతో కూడిన ఇసుకరాళ్ళు వాక్స్‌గా పిలువబడతాయి.

కణాల సంఘటనం (క్వార్ట్జ్-, ఫెల్స్పాతిక్-, మరియు లిథిక్-) మరియు మాత్రిక పరిమాణం (వాక్ లేదా అరెనైట్) వివరణలను ఉపయోగించి ఆరు రకాల ఇసుకరాయి పేర్లను చెప్పవచ్చు. ఉదాహరణకు, ఒక క్వార్ట్జ్ అరెనైట్ అనునది (>90%) క్వార్ట్జ్ కణాలను మరియు వాటి మధ్య బంకమన్ను మాత్రికను కొద్దిగా/అసలు లేకుండా ఉండవచ్చు, ఒక లిథిక్ వాక్ అనునది అధిక లిథిక్ కణాలు (<90% క్వార్ట్జ్, మిగిలిన భాగం ఫెల్స్పార్ కంటే ఎక్కువ లిథిక్) మరియు అధిక పంక మాత్రికను కలిగిఉండవచ్చు, మొ.

డాట్ వర్గీకరణ పద్ధతి[1] అవక్షేపశాస్త్రవేత్తలచే విస్తృతంగా ఉపయోగించబడినప్పటికీ, సాధారణ నామాలైన గ్రేవాక్, అర్కోసే, మరియు క్వార్ట్జ్ ఇసుకరాయి వంటివి ఇప్పటికీ సాధారణ ప్రజలలో మరియు జనామోద సాహిత్యంలో వినియోగంలో ఉన్నాయి.

బురదరాళ్ళు[మార్చు]
లోవర్ యాన్టీలోప్ కాన్యన్, యాంత్రిక మరియు రసాయనిక శైధిల్యం వలన పరిసరాలలోని ఇసుక రాయిచే మలచబడింది.గాలి, ఇసుక, మరియు అకస్మాత్తుగా ఏర్పడే వరదల నీరు ప్రాథమిక శైధిల్య కారకాలు.

బురదరాళ్ళు కనీసం 50% సిల్ట్- మరియు బంకమన్ను-పరిమాణ రేణువులు కలిగిన అవక్షేపన శిలలు. సాపేక్షంగా సూక్ష్మ-కణ రేణువులైన ఇవి సాధారణంగా నీరు లేదా గాలిలో సంక్షుబ్ద ప్రవాహాల ద్వారా విలంబిత కణాలుగా రవాణా కాబడి, ప్రవాహం మందగించినపుడు విలంబన కణాలు అవసాధన చెంది నిక్షేపం చెందుతాయి.

ప్రస్తుతం అత్యధిక రచయితలు బురద ముఖ్య అనుఘటకంగా తయారైన అన్ని శిలలను సూచించటానికి "బురదరాయి" అనే పదాన్ని వాడుతున్నారు.[2][3][4][5] బురదశిలలను సిల్ట్ రాళ్ళు (ప్రధానంగా సిల్ట్-పరిమాణ కణాలతో తయారైనవి), బురదరాళ్ళు (సిల్ట్- మరియు బంకమన్ను-పరిమాణ కణాల సమ మిశ్రమం), మరియు బంకమన్నురాళ్ళు (అధికంగా బంకమన్ను-పరిమాణ కణాలతో తయారైనవి).[2][3] అత్యధిక రచయితలు విచ్చేదన బురదశిలకు (కణ పరిమాణంతో సంబంధం లేకుండా) "షేల్" అనే పదాన్ని ఉపయోగించారు, అయితే కొంత పురాతన సాహిత్యం "షేల్"ను బురదశిలలకు సమానార్ధకంగా ఉపయోగించింది.

జీవ రసాయన అవక్షేపణ రాళ్ళు[మార్చు]

ఆర్డోవిషియన్ ఆయిల్ షేల్ (కుకర్‌సైట్) బహిర్గతాలు, ఉత్తర ఎస్టోనియా

జీవులు తమ కణజాల నిర్మాణానికి నీరు లేదా గాలిలో కరిగిఉన్న పదార్థాలను ఉపయోగించుకున్నపుడు జీవరసాయన అవక్షేపణ రాళ్ళు ఏర్పడతాయి. ఉదాహరణలు:

 • అత్యధిక రకాల సున్నపు రాళ్ళు పగడం, మొలస్క్, మరియు ఫొరామినీఫెరా వంటి జీవుల సున్నపు అస్థిపంజరాల నుండి తయారౌతాయి.
 • మొక్కలు తమ కణజాల నిర్మాణానికి వాతావరణంలోని కార్బన్ను గ్రహించి ఇతర మూలకాలతో కలిపినపుడు బొగ్గు ఏర్పడుతుంది.
 • రేడియోలెరియా మరియు డయాటమ్స్ వంటి సూక్ష్మ జీవుల సిలికీయ అస్థిపంజరాలు పోగుపడటంవల్ల చెర్ట్ నిక్షేపాలు ఏర్పడతాయి.

రసాయన అవక్షేపణ రాళ్ళు[మార్చు]

ద్రావణంలోని ఖనిజ అనుఘటకాలు అతిసంతృప్తం చెంది అకార్బనిక అవక్షేపం చెందినపుడు రసాయన అవక్షేపణ రాయి ఏర్పడుతుంది. సాధారణ రసాయన అవక్షేపణ రాళ్ళలో ఊలైటిక్ సున్నపురాయి మరియు పరిసోషిత ఖనిజాలైన హాలైట్ (రాతి ఉప్పు), సిల్వైట్, బరైట్ మరియు జిప్సంవంటి వాటితో ఏర్పడిన రాళ్ళు కూడా కలిసిఉంటాయి.

"ఇతర" అవక్షేపణ రాళ్ళు[మార్చు]

నాల్గవ వర్గమైన నానావిధ రాళ్ళలో తాపశిలాశకల ప్రవాహాలు, ప్రభావపాత బ్రెక్షియా, అగ్నిపర్వత బ్రెక్షియా, మరియు ఇతర సాపేక్షంగా అసాధారణ పద్ధతులలో తయారయ్యే శిలలు ఉంటాయి.

సంఘటనాత్మక వర్గీకరణ పద్ధతులు[మార్చు]

ప్రత్యామ్నాయంగా, వాటి ఖనిజత్వం ఆధారపడి అవక్షేపణ రాళ్ళు సంఘటనాత్మక సమూహాలుగా ఉపవిభజన చేయబడతాయి.

 • సిలిసిక్లాస్టిక్ అవక్షేపణ శిలలు, పైన వివరించిన విధంగా ఇవి ప్రధానంగా సిలికేట్ ఖనిజాలతో ఏర్పడతాయి. ఈ రాయిని ఏర్పరచే అవక్షేపం సంస్తర భారం, విలంబిత భారాలుగా, లేదా అవక్షేప గురుత్వ ప్రవాహాలచే రవాణా చేయబడుతుంది. సిలిసిక్లాస్టిక్ అవక్షేపణ శిలలు కంగ్లామరేట్స్ మరియు బ్రెక్షియాస్, ఇసుకరాయి, మరియు బురద రాళ్ళుగా ఉపవిభజన చేయబడతాయి.
 • కార్బోనేట్ అవక్షేపణ శిలలు కాల్సైట్ (రాంబోహెడ్రల్ CaCO
  3
  ), అరగొనైట్ (ఆర్థోరామ్బిక్CaCO
  3
  ), డోలమైట్ (CaMg(CO
  3
  )
  2
  ), మరియు CO2−
  3
  అయాన్ పై ఆధారపడిన ఇతర కార్బోనేట్ ఖనిజాలతో తయారవుతాయి. సాధారణ ఉదాహరణలలో సున్నపురాయి మరియు డోలోస్టోన్ ఉన్నాయి.
 • పరిశోషిత అవక్షేపణ శిలలు నీటి బాష్పీభవనం కారణంగా ఏర్పడిన ఖనిజాల నుండి తయారవుతాయి. అంత్యంత సాధారణ పరిశోషిత ఖనిజాలు కార్బొనేట్లు (కాల్సైట్ మరియు CO2−
  3
  పై ఆధారపడిన ఇతరములు), క్లోరైడ్స్ (హాలైట్ మరియు Cl
  పై ఆధారపడిన ఇతరములు), మరియు సల్ఫేట్లు (జిప్సం మరియు SO2−
  4
  పై ఆధారపడిన ఇతరములు). పరిశోషిత శిలలు హాలైట్ (రాతి ఉప్పు), జిప్సం, మరియు ఎన్‌హైడ్రేట్‌లను అధికంగా కలిగిఉంటాయి.
 • సేంద్రియ-సంపన్న అవక్షేపణ శిలలు గుర్తించదగిన మొత్తాలలో సేంద్రియ పదార్థాన్ని కలిగిఉంటాయి, 5% మొత్తం సేంద్రియ కర్బనం కంటే సాధారణంగా అధికంగా ఉంటుంది. సాధారణ ఉదాహరణలలో బొగ్గు, చమురు షేల్, మరియు ద్రవ హైడ్రో కార్బన్లు మరియు సహజ వాయువులకు వనరులుగా పనిచేసే ఇతర అవక్షేపణ శిలలు ఉంటాయి.
 • సిలికీయ అవక్షేపణ శిలలు దాదాపు పూర్తిగా సిలికాతో (SiO
  2
  ) తయారవుతాయి, చెర్ట్, విమలకం, చాల్సిడొనీ లేదా ఇతర సూక్ష్మస్ఫటికీయ రూపాలు ఉదాహరణలుగా ఉన్నాయి.
 • ఇనుము-సంపన్న అవక్షేపణ శిలలు >15% కంటే ఎక్కువ ఇనుమును కలిగిఉంటాయి; పట్టిత ఇనుము రూపాలు మరియు ఇనుపశిలలు అత్యంత సాధారణ రూపాలు[3]
 • ఫాస్ఫటిక్ అవక్షేపణ శిలలు ఫాస్ఫేట్ ఖనిజాలను కలిగి 6.5% కంటే ఎక్కువ భాస్వరం కలిగిఉంటాయి; ఉదాహరణలలో ఫాస్ఫేట్ పర్వికలు, ఎముక సంస్తరాలు, మరియు ఫాస్ఫేటిక్ బురద రాళ్ళు[4] ఉన్నాయి

అవక్షేపణ శిలల సృష్టి[మార్చు]

అవక్షేప రవాణా మరియు నిక్షేపణ[మార్చు]

నున్నని ఇసుక రాయిలో తిర్యక్-సంస్తరణం మరియు నిర్ఘర్షణ; జాక్సన్ కౌంటీ, ఓహియో యొక్క లోగాన్ ఫార్మేషన్ (మిసిసిపియన్)

గాలి, మంచు, పవనం, గురుత్వం, లేదా నీటి ప్రవాహం ద్వారా తీసుకురాబడిన విలంబనంలో ఉన్న రేణువులచే నిక్షేపితమైన అవక్షేపణం నుండి అవక్షేపణ శిలలు ఏర్పడతాయి. తరచూ ఒక ఉత్పత్తి ప్రదేశంలో ఒక రాయి శైధిల్యం మరియు క్రమక్షయం ద్వారా వదులైన పదార్థంగా విడిపోయినపుడు అవక్షేపణ ఏర్పడుతుంది. అప్పుడు ఈ పదార్థం ఉత్పత్తి ప్రాంతం నుండి నిక్షేపిత ప్రాంతానికి రవాణా చేయబడుతుంది. అవక్షేప రవాణా యొక్క రకం పోషకభూమి యొక్క భూవిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది (అవక్షేపం యొక్క ఉత్పత్తి ప్రాంతం). ఏదేమైనా, పరిశోషితములు వంటి కొన్ని అవక్షేప శిలలు, నిక్షేపిత ప్రదేశంలో ఏర్పడిన పదార్థాలను కలిగిఉంటాయి. అందువలన అవక్షేపణ రాయి యొక్క స్వభావం అవక్షేప సరఫరా పైన మాత్రమే కాక అది రూపొందిన అవక్షేప నిక్షేపిత పర్యావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది.

డయాజెనిసిస్[మార్చు]

ఒక శకలమయ శిలలో పనిచేస్తున్న పీడన ద్రావణంరేణువులు సంబంధం కలిగి ఉన్న ప్రదేశాలలో పదార్థం ఆవిరైపోగా, బయట ఉన్న సచ్చిద్ర ప్రదేశాలలలో ద్రావణం (సిమెంట్ వంటివి) లోని పదార్థం స్ఫటికంగా మారుతుంది.అధిక వత్తిడి గల ప్రాంతాల నుండి అల్ప వత్తిడి గల ప్రాంతాలకు పదార్థం యొక్క నికర ప్రవాహం ఉంటుందని దీని అర్ధం.ఫలితంగా, ఈ రాయి మరింత సంఘటితంగా మరియు దృఢముగా మారుతుంది. ఈ విధంగా విడి ఇసుక ఇసుకరాయిగా మారవచ్చు.

డయాజెనిసిస్ అనే పదం, ఒక అవక్షేపం ప్రాథమిక నిక్షేపణ తరువాత, ఉపరితల శైధిల్యాన్ని మినహాయించి బంధనీకరణంతో సహా పొందిన రసాయనిక, భౌతిక, మరియు జీవ మార్పులను వివరిస్తుంది. ఈ ప్రక్రియలలో కొన్ని అవక్షేపం ఏకీకృతం కావడానికి కారణమవుతాయి: విడి పదార్థం నుండి సంఘటిత, దృఢమైన పదార్థం తయారవుతుంది. యుక్త అవక్షేపణ శిలలు, ప్రత్యేకించి క్వాటర్నరీ యుగానికి చెందినవి (భౌమ కాల మానంలో అత్యంత ఇటీవలి కాలం) ఇప్పటికీ ఏకీకృతంకానివిగా భావించబడతాయి. అవక్షేప నిక్షేపం పెరుగుతున్న కొద్దీ, అధిక భార (లేదా శిలాస్థాపక) పీడనం పెరిగి ఆశ్మీకరణంగా పిలువబడే ప్రక్రియ జరుగుతుంది.

అవక్షేపణ శిలలు తరచూ సముద్రజలం లేదా భూగర్భజలంతో సంతృప్తమై ఉంటాయి, దీనిలో ఖనిజాలు కరిగిపోగలవు లేదా అవక్షేపం చెందగలవు. అవక్షేపిత ఖనిజాలు రాయిలోని సచ్చిద్ర అంతరాళాన్ని తగ్గిస్తాయి, ఈ ప్రక్రియను బంధనీకరణం అంటారు. సచ్చిద్ర అంతరాళంలో తరుగుదల వలన, సహజ శిలాత్మక ద్రవాలు బహిష్క్రుతమవుతాయి. అవక్షేపిత ఖనిజాలు ఒక బంధనంగా రూపొంది రాయిని మరింత సంఘటితంగా మరియు సమర్ధంగా తయారుచేస్తాయి. ఈ విధంగా, ఒక అవక్షేపణ రాయిలోని విడి శకలాలు "బంధిత"మవుతాయి.

అవక్షేపణ కొనసాగినపుడు, ఫలితంగా పురాతన రాతి పొర లోతుగా కప్పివేయబడుతుంది. పైన ఏర్పడే అవక్షేప భారం కారణంగా రాయిలోని శిలాస్థాపక పీడనం పెరుగుతుంది. రేణువుల యాంత్రిక పునరమరిక ప్రక్రియ అయిన సంఘటనమునకు ఇది కారణమవుతుంది. ఉదాహరణకు, సంఘటనం అనేది బంకమట్టిలో ఒక ముఖ్యమైన డయాజెనెటిక్ ప్రక్రియ, ఇది ప్రారంభంలో 60% నీరు కలిగిఉంటుంది. సంఘటనంలో, ఈ అల్పాంతరాల నీరు సచ్చిద్ర అంతరాళాల నుండి బయటకు పంపబడుతుంది. పీడన ద్రావణంలో రేణువులు కరిగిపోవడం ఫలితంగా కూడా సంఘటనం ఏర్పడవచ్చు. కరిగిపోయిన పదార్థం బాహ్య సచ్చిద్ర అంతరాళాలలో తిరిగి అవక్షేపం చెందుతుంది, అనగా రంధ్రాలలోకి పదార్థ ప్రసరణం ఉంటుంది. ఏదేమైనా, కొన్ని సందర్భాలలో నిర్దిష్ట ఖనిజం కరుగుతుంది కానీ తిరిగి అవక్షేపం చెందదు. ఈ ప్రక్రియను నిక్షాళన అంటారు, ఇది రాయిలోని సచ్చిద్ర అంతరాళాన్ని పెంచుతుంది.

బాక్టీరియా చర్య వంటి కొన్ని జీవరసాయనిక ప్రక్రియలు, రాయిలోని ఖనిజాలను ప్రభావితం చేయగలవు, అందువలన డయాజెనిసెస్‌లో భాగంగా చూడబడతాయి. ఫంగి మరియు మొక్కలు (వాటి వేర్లచే) మరియు ఉపరితలం క్రింద నివసించే అనేక ఇతర జీవరాశులు కూడా డయాజెనిసెస్‌‌ను ప్రభావితం చేస్తాయి.

కొనసాగుతున్న అవక్షేపం కారణంగా రాళ్లు పూడ్చుకుపోయి అధిక పీడనం మరియు ఉష్ణోగ్రతకు దారితీస్తాయి, ఇది కొన్ని నిర్దిష్ట రసాయనిక చర్యలకు దోహదం చేస్తుంది. సేంద్రియ పదార్థం లిగ్నైట్ లేదా బొగ్గుగా మారే చర్య దీనికి ఒక ఉదాహరణ. ఉష్ణోగ్రత మరియు పీడనం మరింత పెరిగినపుడు, డయాజెనిసెస్‌ ఆవరణ రూపాంతర ప్రాప్తికి దారితీస్తుంది, ఈ ప్రక్రియ రూపాంతరప్రాప్తి శిలను ఏర్పరుస్తుంది.

లక్షణాలు[మార్చు]

పట్టిత ఇనుప ఏర్పాటు యొక్క ఒక ముక్క, ఐరన్ (III) ఆక్సైడ్ (ఎరుపు) మరియు ఐరన్ (II) ఆక్సైడ్ (బూడిద రంగు) పొరలను ఒకదాని తరువాత మరొకటి కలిగిన రాయి యొక్క రకం. వాతావరణంలో ఆక్సిజన్ సుసంపన్నంగా లేని ప్రీకాంబ్రియన్ కాలంలో BIFలు ఎక్కువగా ఏర్పడ్డాయి.మూరీస్ గ్రూప్, బార్బెర్టన్ గ్రీన్స్టోన్ బెల్ట్, దక్షిణ ఆఫ్రికా.

రంగు[మార్చు]

అవక్షేపణ రాయి యొక్క రంగు తరచు ఇనుముచే నిర్ధారించబడుతుంది, ఇది రెండు ఆక్సైడ్‌లను కలిగిఉన్న మూలకం: ఇనుము (II) ఆక్సైడ్ మరియు ఇనుము (III) ఆక్సైడ్. ఇనుము (II) ఆక్సైడ్ కేవలం ఆక్సిజన్ రహిత పరిస్థితుల క్రింద ఏర్పడి రాయికి బూడిద లేదా ఆకుపచ్చ రంగుని ఇస్తుంది. ఇనుము (III) ఆక్సైడ్ తరచు ఖనిజ హెమటైట్ రూపంలో ఉండి, శిలకు ఎరుపు నుండి గోధుమ రంగుని ఇస్తుంది. శుష్క ఖండాంతర శీతోష్ణస్థితులలో శిలలు వాతావరణంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగిఉంటాయి, మరియు ఆక్సీకరణ ముఖ్యమైన ప్రక్రియగా ఉండి శిలకు ఎరుపు లేదా కాషాయ రంగుని ఇస్తుంది. శుష్క శీతోష్ణస్థితులలో ఏర్పడిన ఎరుపు అవక్షేపణ శిలల మందపాటి శ్రేణులని ఎరుపు సంస్తరాలు అని పిలుస్తారు. ఏదేమైనా, ఒక రాయి ఎరుపు రంగులో ఉంటే అది తప్పనిసరిగా ఖండాంతర పర్యావరణం లేదా శుష్క శీతోష్ణస్థితిలో ఏర్పడవలసిన అవసరం లేదు.[6]

సేంద్రియ పదార్థం యొక్క ఉనికి ఒక రాయికి నలుపు లేదా బూడిద రంగుని ఇవ్వగలదు. ప్రకృతిలో సేంద్రియ పదార్థం మృత పదార్థాల వలన ఏర్పడి, అధికభాగం మొక్కలను కలిగిఉంటుంది. సాధారణంగా, ఆ విధమైన పదార్థం చివరకు ఆక్సీకరణ లేదా బాక్టీరియా చర్య వలన కుళ్లిపోతుంది. అయితే, ఆక్సిజన్ రహిత పరిస్థితులలో, సేంద్రియ పదార్థం కుళ్ళిపోదు, సేంద్రియ పదార్థం సుసంపన్నంగా ఉండే ముదురు అవక్షేపణగా మారుతుంది. ఉదాహరణకు, ఇది సముద్రాలు మరియు సరస్సుల లోపలి అడుగుభాగాలలో ఏర్పడుతుంది. ఆ విధమైన పర్యావరణాలలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది, అందువలన ఉపరితల నీటి నుండి ఆక్సిజన్ క్రిందకు రాదు, మరియు నిక్షేపించబడిన రాయి సాధారణంగా మృదువైన ముదురు మృత్తికది అయి ఉంటుంది. ముదురు రంగు రాళ్ళు సేంద్రియ పదార్థంతో సుసంపన్నంగా ఉండి తరచు షేల్‌లుగా ఉంటాయి.[7]

అమరిక[మార్చు]

బాగా విడదీయబడిన (ఎడమ) మరియు బాగా విడదీయబడని (కుడి) రేణువులను చూపుతున్న పటం.

ఒక శిల యొక్క పరిమాణం, రూపం మరియు శకలాలు మరియు ఖనిజాల స్థానం దాని అమరికగా పిలువబడుతుంది. అమరిక రాయి యొక్క స్వల్ప స్థాయి-లక్షణమే అయినప్పటికీ, అది దాని పెద్ద-స్థాయి లక్షణాలైన సాంద్రత, సచ్చిద్రత లేదా పారగమ్యత వంటి వాటిని నిర్ధారిస్తుంది.[8]

శకలమయ శిలలు 'శకలమయ అమరికను కలిగిఉంటాయి', అనగా అవి శకలాలను కలిగిఉంటాయి. ఈ శకలాల 3D స్థానం రాయి యొక్క స్థితి నిర్మాణంగా పిలువబడుతుంది. ఈ శకలాల మధ్య రాయి ఒక మాత్రిక లేదా సిమెంట్‌తో తయారయి ఉంటుంది (ఈ సిమెంట్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవక్షేపిత ఖనిజ స్ఫటికాలను కలిగిఉంటుంది). ఈ శకలాల పరిమాణం మరియు ఆకారాన్ని ఉపయోగించి శిలలు రూపుదిద్దుకున్న అవక్షేపిత పర్యావరణంలో ప్రవాహం యొక్క వేగాన్ని మరియు దిశను నిర్ణయించవచ్చు; మృదువైన, సున్నపు బురద మాత్రమే నిలకడైన నీటిలో అవసాధన చెందుతుంది, కాగా గ్రావెల్ మరియు పెద్దవైన శకలాలు మాత్రమే వేగంగా ప్రవహించే నీటిచే నిక్షేపితమవుతాయి.[9] కొన్నిసార్లు ప్రత్యామ్నాయ ప్రమాణాలను ఉపయోగించినప్పటికీ, సాధారణంగా రాయి కణం యొక్క పరిమాణాన్ని వెంట్వర్త్ స్కేల్ లో సూచిస్తారు. కణ పరిమాణం వ్యాసంగా లేదా ఘనపరిమాణంగా సూచించవచ్చు, మరియు ఇది ఎల్లపుడూ ఒక సగటు విలువ మాత్రమే - ఒక రాయి విభిన్న పరిమాణాలుగల శకలాలతో తయారవుతుంది. కణ పరిమాణాల గణాంక విస్తృతి విభిన్న శిలలకు విభిన్నంగా ఉండి శిల యొక్క సార్టింగ్ (వేర్పాటు చేయడం) అనే లక్షణం ద్వారా వివరించబడుతుంది. కొద్ది ఎక్కువ లేదా తక్కువ తేడాలతో శకలాలు వేరు చేయబడినపుడు, ఆ రాయి 'చక్కగా-వేరుచేయబడినది'గా పిలువబడుతుంది, పరిమాణంలో విస్తృతి ఎక్కువగా ఉన్నపుడు, ఈ రాయి 'సరిగా వేరుచేయబడనిది'గా పిలువబడుతుంది.[10]

రేణువుల యొక్క గుండ్రని మరియు గోళాకారాన్ని చూపుతున్న చిత్రం.

శకలాల రూపం రాయి యొక్క మూలాన్ని ప్రతిబింబిస్తుంది.

విరిగిన పెంకుల శకలాల నుండి ఏర్పడే కోక్వినా రాయి, ప్రభావవంతమైన నీటిలో మాత్రమే ఏర్పడుతుంది. శకలం యొక్క రూపం నాలుగు ప్రమాణాలను అనుసరించి వివరించబడుతుంది:[11]

 • ఉపరితల అమరిక, సాధారణ రూపంపై అతి తక్కువ ప్రభావాన్ని చూపే కణం యొక్క ఉపరితలం యొక్క సూక్ష్మ-స్థాయి స్వరూపం యొక్క పరిమాణాన్ని తెలియచేస్తుంది.
 • గుండ్రనితనం కణ ఆకారం యొక్క సాధారణ నునుపుదనాన్ని వివరిస్తుంది.
 • 'గోళత్వం' కణం ఏ స్థాయివరకు గోళంగా రూపుదిద్దుకుందో వివరిస్తుంది.
 • 'కణ రూపం' కణం యొక్క త్రిమితీయ ఆకారాన్ని వివరిస్తుంది.

రసాయన అవక్షేపణ శిలలు శకల-రహిత అమరికను కలిగి, పూర్తిగా స్ఫటికాలను కలిగిఉంటాయి. అలాంటి అమరికను వివరించటానికి కేవలం స్ఫటికాల యొక్క సగటు పరిమాణం మరియు స్థితినిర్మాణం అవసరం.

ఖనిజశాస్త్రం[మార్చు]

అత్యధిక అవక్షేపణ శిలలు క్వార్ట్జ్ (ప్రత్యేకించి సిలికిక్లాస్టిక్ శిలలు) ను లేదా కాల్సైట్ (ప్రత్యేకించి కార్బొనేట్ శిలలు) ను కలిగిఉంటాయి. అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలకు విరుద్ధంగా, అవక్షేపణ శిలలు సాధారణంగా కొన్ని రకాల విభిన్న భారీ మూలకాలను మాత్రమే కలిగిఉంటాయి. ఏమైనా, ఒక అవక్షేపణ శిలలో ఖనిజాల మూలం ఒక అగ్ని శిలలో కంటే క్లిష్టమైనది. అవక్షేపణ రాయిలో ఖనిజాలు అవక్షేపణ లేదా డయాజెనిసిస్ దశలో అవపాతం చేత రూపొందుతాయి. రెండవ సందర్భంలో, ఖనిజ అవపాతం పాత తరం సిమెంట్ మీద వృద్ధి చెందుతుంది.[12] ఒక సంక్లిష్ట డయాజెనిటిక్ చరిత్ర పెట్రోగ్రఫిక్ సూక్ష్మదర్శిని ఉపయోగించి ప్రకాశ ఖనిజశాస్త్రం (ఆప్టికల్ మినరాలజీ) చే అధ్యయనం చేయబడుతుంది.

కార్బొనేట్ శిలలు ప్రధానంగా కార్బొనేట్ ఖనిజాలైన కాల్సైట్, అరగొనైట్ లేదా డోలమైట్ లను కలిగిఉంటాయి. కార్బొనేట్ రాయి యొక్క సిమెంట్ మరియు శకలాలు రెండూ (శిలాజాలు మరియు ఊయిద్ లు కూడా) కార్బొనేట్ ఖనిజాలను కలిగి ఉండగలవు. శకలమయ రాయి యొక్క ఖనిజ స్వభావం, మూల ప్రదేశం నుండి సరఫరా చేయబడిన పదార్థంచేత, అవపాత ప్రదేశానికి రవాణా అయిన విధానం మరియు ఒక ప్రత్యేక ఖనిజం యొక్క స్థిరత్వంచేత నిర్ణయింపబడుతుంది. శిలలు రూపొందటానికి ముఖ్య ఖనిజాల స్థిరత్వం (శైధిల్యానికి వాటి నిరోధకత) బొవేన్స్ ప్రతిక్రియ శ్రేణిచే సూచించబడుతుంది. ఈ శ్రేణిలో, క్వార్ట్జ్ అత్యధిక స్థిరత్వం కలది, తరువాత స్థానంలో ఫెల్స్పార్, మైకాలు ఉండగా, అల్ప స్థిరత్వ ఖనిజాలు తక్కువ శైధిల్యం ఉన్నపుడు మాత్రమే ఉంటాయి.[13] శైధిల్యత ప్రధానంగా, మూల ప్రదేశం నుండి దూరం, స్థానిక శీతోష్ణస్థితి మరియు అవక్షేపణ ఆ ప్రదేశానికి రవాణా కావడానికి పట్టే కాలంపై ఆధారపడి ఉంటుంది. అధికభాగం అవక్షేపణ శిలలలో, మైకా, ఫెల్డ్స్పార్ మరియు తక్కువ స్థిరత్వం కలిగిన ఖనిజాలు, కయోలినైట్, ఇలైట్ లేదా స్మెక్టైట్ వంటి బంకమట్టి ఖనిజాలకు ప్రతిచర్య చూపాయి.

శిలాజాలు[మార్చు]

ఒక అవక్షేపణ రాయిలోని శిలాజ సంపన్న పొరలు, అనో న్యూవో స్టేట్ రిజర్వ్, కాలిఫోర్నియా.

అవక్షేపణ రాళ్ళు మాత్రమే శిలాజాలను, అనగా మరణించిన జీవరాశుల యొక్క అవశేషాలు లేదా ముద్రలు కలిగి ఉండగలిగిన రాతి యొక్క రకాలు. ప్రకృతిలో, మరణించిన జీవరాశులు సాధారణంగా స్కావెంజర్లు, బాక్టీరియా, కుళ్ళిపోవడం మరియు క్రమక్షయం ద్వారా త్వరగా తొలగించబడతాయి. ఈ సహజ ప్రక్రియలు పనిచేయకపోవడం వలన కొన్ని అసాధారణ పరిస్థితులలో ఒక కళేబరం శిలాజీకరణ పొందుతుంది. అవక్షేపణ రేటు అధికంగా ఉన్నపుడు (కళేబరం త్వరగా పూడ్చబడినపుడు), ఆక్సిజన్ రహిత పర్యావరణాలలో (బాక్టీరియా చర్యలు తక్కువగా ఉన్నపుడు) లేదా జీవరాశి ప్రత్యేకించి కఠినమైన అస్థిపంజరాన్ని కలిగిఉన్నపుడు శిలాజీకరణ అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్దవైన, జాగ్రత్తగా సంరక్షించబడిన శిలాజాలు సాపేక్షంగా అరుదుగా ఉంటాయి. అధికభాగం అవక్షేపణ రాళ్ళు శిలాజాలను కలిగిఉంటాయి, అయితే అవి సూక్ష్మదర్శిని (సూక్ష్మ శిలాజములు) లేదా ఒక భూతద్దం క్రింద అధ్యయనం చేసినపుడు మాత్రమే కనిపిస్తాయి.

సంక్షుబ్దంలోని బొరియలు, క్రస్టేషియన్లచే నిర్మించబడినవి.పైరనీస్ యొక్క దక్షిణ అగ్రభూమి, ఐన్సా బేసిన్ యొక్క సాన్ విన్సెంటే ఫార్మేషన్ (పూర్వ ఎయోసీన్).

శిలాజాలు జీవరాశుల యొక్క ప్రత్యక్ష అవశేషాలు లేదా ముద్రలు మరియు అస్థిపంజరాలుగా ఉండవచ్చు. అంత్యంత సాధారణంగా భద్రపరచబడినవి ఎముకలు, పెంకులు, మొక్కల యొక్క చెక్క కణజాలం వంటి జీవరాశుల యొక్క కఠినమైన భాగాలు. మృదు కణజాలానికి సంరక్షింపబడి మరియు శిలాజీకరించబడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరియు 40 మిలియన్ సంవత్సరాల కంటే పురాతనమైన జంతువుల మృదు కణజాలం చాలా అరుదుగా ఉంటుంది.[14] జీవించి ఉండగానే ఏర్పడిన జీవరాశుల ముద్రలు జాడ శిలాజములుగా పిలువబడతాయి. ఉదాహరణలు బొరియలు, పాద ముద్రలు, మొదలైనవి.

అవక్షేపణ రాయి యొక్క భాగంగా, శిలాజాలు రాయి మాదిరిగానే డయాజెనెటిక్ ప్రక్రియలకు లోనవుతాయి. ఉదాహరణకు, కాల్సైట్ ను కలిగి ఉన్న ఒక పెంకు కరిగినపుడు, సిమెంట్ లేదా సిలికా ఆ రంధ్రాన్ని పూడుస్తాయి. అదే విధంగా, అంతకు ముందు రక్త నాళములు, రక్తనాళ కణజాలం లేదా ఇతర మృదు కణజాలంచే ఆక్రమించబడి ఉన్న రంధ్రాలను అవక్షేపిత ఖనిజాలు మూసివేయవచ్చు. ఇది జీవరాశి యొక్క రూపాన్ని సంరక్షిస్తుంది కానీ దాని రసాయనిక కూర్పును మార్చివేస్తుంది, ఈ ప్రక్రియ పెర్మినరలైజేషన్‌గా పిలువబడుతుంది.[15] పెర్మినరలైజేషన్ సిమెంట్ లలో అత్యంత సాధారణంగా ఉండే ఖనిజాలు కార్బోనేట్‌‌లు (ప్రత్యేకించి కాల్సైట్), అమోర్ఫ్స్ సిలికా (ఖాల్సేడోనీ, ఫ్లింట్, చెర్ట్) మరియు పైరైట్‌ల రూపాలు. సిలికా సిమెంట్లు వాడిన సందర్భంలో, ఈ ప్రక్రియ ఆశ్మీకరణంగా పిలువబడుతుంది.

అధిక పీడనం మరియు ఉష్ణోగ్రతలో, మృత జీవి యొక్క సేంద్రియ పదార్థం రసాయనిక ప్రతిచర్యలకు లోనవుతుంది, దీనిలో నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి బాష్పాలు విసర్జించబడతాయి. శిలాజం, చివరకు, స్వచ్ఛమైన కర్బనం యొక్క పలుచని పొరను లేదా దాని ఖనిజ రూపమైన గ్రాఫైట్‌ను కలిగిఉంటుంది. శిలాజీకరణ యొక్క ఈ రూపం కర్బనీకరణంగా పిలువబడుతుంది. ఇది ప్రత్యేకించి వృక్ష శిలాజాలలో ముఖ్యమైనది.[16] ఇది విధమైన ప్రక్రియలో లిగ్నైట్ లేదా బొగ్గు వంటి శిలాజ ఇంధనాలు ఏర్పడతాయి.

ప్రాథమిక అవక్షేపణ నిర్మాణాలు[మార్చు]

నదీకృత ఇసుకరాయిలో ఒక తిర్యక్ సంస్తరణం, మిడిల్ ఓల్డ్ రెడ్ సాండ్‌స్టోన్ (డెవోనియన్) బ్రేస్సే, షేట్లాండ్ ఐలాండ్స్.
ఉటా యొక్క బుక్ క్లిఫ్స్ నుండి ఒక జాడ శకలం, ఒక విధమైన పాదతల చిహ్నం.
ఒక ఇసుకరాయిలో ప్రవాహంచేత రూపొందిన అలల చిహ్నాలు, ఈ రాయి తరువాత ఒరిగింది.ప్రదేశం: హాబెర్గ్, బవేరియా.

అవక్షేపణ శిలలలో నిర్మాణాలను 'ప్రాథమిక' నిర్మాణాలు (నిక్షేపణ సమయంలో ఏర్పడినవి) మరియు 'ద్వితీయ' నిర్మాణాలు (నిక్షేపణ తరువాత ఏర్పడేవి) గా విభజించవచ్చు. అమరికల వలె కాక, నిర్మాణాలు ఎప్పుడూ భారీ స్థాయి లక్షణాలుగా ఉండి, క్షేత్రంలో సులభంగా అధ్యయనం చేయబడతాయి. అవక్షేపణ నిర్మాణాలు, అవక్షేపణ పర్యావరణం గురించి ఏదైనా చెప్పగలవు లేదా విరూపకారకాలు ప్రక్కకు తిప్పడం లేదా తలక్రిందులు చేసినపుడు అవక్షేపణ పొరల యొక్క ఏ భాగం పైకి ఉన్నదో చెప్పడానికి ఉపయోగపడగలవు.

అవక్షేపణ శిలలు సంస్తరములు లేదా స్తరాలుగా పిలువబడే పొరలలో ఉంటాయి. ఒకే విధమైన శిలా శాస్త్రం మరియు అమరిక కలిగిన రాయి యొక్క పొర ఒక సంస్తరంగా నిర్వచింపబడుతుంది. ఒకదానిపై ఒకటిగా ఏర్పడే అవక్షేపాల పొరల యొక్క నిక్షేపాల వలన సంస్తరాలు ఏర్పడతాయి. అవక్షేపణ రాళ్ళను స్వాభావీకరించే సంస్తరాల శ్రేణిని సంస్తరణం అంటారు.[17] ఒక సంస్తరం రెండు సెంటీమీటర్ల నుండి అనేక సెంటీమీటర్ల వరకు మందాన్ని కలిగిఉంటుంది. నున్నని, తక్కువ నిర్ధారించబడిన పొరలు పత్రాలుగా పిలువబడతాయి మరియు అది ఏర్పరచే రాయి పత్రీకరణంగా పిలువబడుతుంది. పత్రాలు సాధారణంగా కొన్ని సెంటీమీటర్ల కంటే తక్కువ మందాన్ని కలిగిఉంటాయి.[18] సంస్తరణం మరియు పత్రీకరణ సాధారణంగా స్వభావంలో క్షితిజ సమాంతరంగా ఉన్నప్పటికీ, అవి ఎప్పుడూ అదే విధంగా ఉండవు. కొన్ని పర్యావరణాలలో, స్తరాలు (సాధారణంగా చిన్నవి) ఒక కోణంలో నిక్షేపించబడతాయి. కొన్నిసార్లు ఒకే రాయిలో విభిన్న స్థానాలలో పొరల యొక్క అనేక సముదాయాలు ఉనికిలో ఉంటాయి, ఈ నిర్మాణం తిర్యక్-సంస్తరణంగా పిలువబడుతుంది.[19] నిక్షేపం సమయంలో స్వల్ప-స్థాయి క్రమక్షయాలు ఏర్పడి, స్తరాలలోని భాగాన్ని విభజించినపుడు తిర్యక్-సంస్తరణం ఏర్పడుతుంది. పాత వాటి నుండి ఒక కోణంలో కొత్త స్తరాలు ఏర్పడతాయి.

తిర్యక్ సంస్తరణం యొక్క వ్యతిరేకం సమాంతర పత్రీకరణ, దీనిలో అన్ని అవక్షేపణ పొరలు సమాంతరంగా ఉంటాయి.[20] పత్రీకరణలతో, అవక్షేపణ సరఫరాలో చక్రీయ మార్పుల కారణంగా సాధారణంగా తేడాలు ఏర్పడతాయి, ఇవి వర్షపాతంలో ఋతుసంబంధ మార్పులు, ఉష్ణోగ్రత లేదా జీవరసాయన చర్య కారణంగా జరుగుతాయి. ఋతుసంబంధ మార్పులను సూచించే పత్రాలు (వృక్ష వలయముల వంటివి) అవక్షేపములుగా పిలువబడతాయి. కొన్ని రాళ్ళలో అసలు పాత్రీకరణ అనేది ఉండదు, ఆ విధమైన నిర్మాణ స్వభావం స్థూల సంస్తరణంగా పిలువబడుతుంది.

శ్రేణీకృత సంస్తరణ నిర్మాణంలో స్వల్ప రేణువు పరిమాణం కలిగిన స్తరాలు పెద్ద రేణువులను కలిగిన స్తరాల పైన ఉంటాయి. వేగంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం ఆగిపోయినపుడు ఈ నిర్మాణం ఏర్పడుతుంది. ఒక విలంబనంలో పెద్దవి మరియు బరువైన శకలాలు ముందుగా స్థిరపడగా, తరువాత చిన్న శకలాలు ఉంటాయి. శ్రేణీకృత సంస్తరణం విభిన్న పర్యావరణాలలో ఏర్పడవచ్చు, అయితే అది సంక్షుబ్ద ప్రవాహములతో స్వాభావీకరించబడుతుంది.[21]

సంస్తరరూపం (ఒక ప్రత్యేక సంస్తరం యొక్క ఉపరితలం) ఒక ప్రత్యేక అవక్షేపణ పర్యావరణాన్ని కూడా సూచించవచ్చు. దిబ్బలు మరియు తరగ గుర్తులు సంస్తర రూపాలకు ఉదాహరణలు. పరికరాల గుర్తులు మరియు అచ్చులు వంటి ప్రత్యేక ముద్రలు, సంరక్షింపబడిన అవక్షేప పొరలలో వేయబడిన గుర్తులు. ఇవి తరచూ పొడిగించబడిన నిర్మాణాలుగా ఉండి నిక్షేప సమయంలో ప్రవాహం యొక్క దిశను నిర్ధారించడానికి ఉపయోగపడతాయి.[22]

తరగ గుర్తులు ప్రవహిస్తున్న నీటిలో కూడా ఏర్పడవచ్చు. ఇవి రెండు రకాలు: అసౌష్టవ తరంగ తరగలు మరియు సౌష్టవ ప్రవాహ తరగలు. ప్రవాహం ఒకే దిశలో ఉండే నదుల వంటి పర్యావరణాలు, అసౌష్టవ తరగలను తయారుచేస్తాయి. ఆ విధమైన తరగల యొక్క పొడవైన అంచు ప్రవాహం యొక్క దిశకు వ్యతిరేక స్థానంలో ఉంటుంది.[23] వేలా మైదానాల వలె ప్రవాహాలు అన్ని దిశలలోనూ ఏర్పడే పర్యావరణాలలో తరంగ తరగలు ఏర్పడతాయి.

మరొక విధమైన స్తర రూపం బురద పగుళ్ళు, ఇవి అప్పుడప్పుడూ నీటి ఉపరితలంపైకి వచ్చే అవక్షేపం యొక్క నిర్జలీకరణ వలన ఏర్పడతాయి. ఆ విధమైన నిర్మాణాలు సాధారణంగా వేలా మైదానాలు లేదా నదుల వెంట ఉండే అగ్ర రోధికల వద్ద ఏర్పడతాయి.

ద్వితీయ అవక్షేపణ నిర్మాణాలు[మార్చు]

ద్వితీయ అవక్షేపణ నిర్మాణాలు అవక్షేపణ శిలలలో నిక్షేపణ తరువాత ఏర్పడిన నిర్మాణాలు. ఆ విధమైన నిర్మాణాలు అవక్షేపణలో రసాయనిక, భౌతిక మరియు జీవ ప్రక్రియల వలన ఏర్పడతాయి. అవి నిక్షేపణ తరువాత పరిస్థితులకి సూచనలుగా ఉంటాయి. కొన్ని లక్షణ నిర్ధారకాలుగా ఉపయోగించబడతాయి.

అవక్షేపణలో సేంద్రియ పదార్థ ఉనికి కేవలం శిలాజాల కంటే ఎక్కువ జాడలను వదలుతుంది. సంరక్షించబడిన జాడలు మరియు బొరియలు జాడ శిలాజములకు (ఇకనోఫాజిల్స్ అని కూడా పిలువబడతాయి) ఉదాహరణలుగా ఉన్నాయి.[24] డైనోసార్లు లేదా పూర్వ మానవుల పాదముద్రల వంటి జాడ శిలాజాలు మానవుల ఊహాశక్తికి అందగలవు, కానీ ఆ విధమైన గుర్తులు సాపేక్షంగా అరుదుగా ఉంటాయి. అధికభాగం జాడ శిలాజాలు మొలస్క్‌లు లేదా ఆర్థ్రోపోడ్లకు చెందినవి. ఈ విధంగా బొరియలు చేయడం అవక్షేపణ శాస్త్రవేత్తలచే జీవసంక్షుబ్ధంగా పిలువబడుతుంది. ఇది అవక్షేప నిక్షేపణ తరువాత జరిగిన జీవ మరియు పర్యావరణ పరిసరాలకు విలువైన సూచికగా ఉంటుంది. మరొకవైపు, జీవరాశుల యొక్క బొరియలు తవ్వే కార్యకలాపం అవక్షేపణలో ఇతర (ప్రాథమిక) నిర్మాణాలను నాశనం చేసి, పునర్నిర్మాణాన్ని కష్టతరం చేస్తుంది.

సుద్దలో చెర్ట్ సంగ్రధనాలు, మిడిల్ లేఫ్కార ఫార్మేషన్ (ఎగువ పురాకాలం నుండి మధ్య ఇయోసీన్ వరకు), సైప్రస్.

అవక్షేపణ నీటి స్థాయి కంటే పైకి వచ్చినపుడు డయాజెనెసిస్ లేదా మృత్తిక ఏర్పడటం వలన (పెడోజెనెసిస్) వలన కూడా ద్వితీయ నిర్మాణాలు ఏర్పడ్డాయి. కార్బోనేట్ శిలలలో సాధారణంగా ఉండే డయాజెనెటిక్ నిర్మాణానికి ఉదాహరణ స్టైలోలైట్.[25] స్టైలోలైట్‌లు రాతిలోని ఛిద్ర ప్రవాహాలలోకి పదార్థాన్ని ఇముడ్చుకొనే అక్రమ సమతలాలు. నిర్దిష్ట రసాయన జాతుల యొక్క అవక్షేప ఫలితం రాయికి రంగు లేదా మరకను ఏర్పరచడం, లేదా సంగ్రధనములు ఏర్పరచడంగా ఉంటుంది. సంగ్రధనములు సుమారుగా అతిధేయ శిల నుండి విభిన్న ఏర్పాటుతో ఉన్న ఏకకేంద్ర స్వరూపాలు. అతిధేయి శిల యొక్క కూర్పు లేదా సచ్చిద్రత లోని స్వల్ప వైవిధ్యాల కారణంగా స్థానికీయ అవక్షేప ఫలితంగా ఇవి ఏర్పడతాయి, సమీప శిలాజాలు, అంతర్గత బొరియలు లేదా సమీప మొక్కల వేర్లు వంటివి.[26] సున్నపురాయి లేదా సుద్ద, చెర్ట్ లేదా చెకుముకి రాయి వంటి కార్బోనేట్ శిలలలో సంగ్రధనాలు సాధారణం, భౌమ ఇసుకరాళ్ళు ఇనుప సంగ్రధనాలను కలిగిఉంటాయి. బంకమట్టిలోని కాల్సైట్ సంగ్రధనాలు సెప్టేరియన్ సంగ్రధనాలుగా పిలువబడతాయి.

నిక్షేపణ తరువాత, భౌతిక ప్రక్రియలు అవక్షేపాన్ని విరూపణ చేసి, ద్వితీయ నిర్మాణాల యొక్క తృతీయ తరగతిని ఏర్పరుస్తాయి. ఇసుక మరియు బంకమట్టి వంటి విభిన్న అవక్షేప పొరల మధ్య సాంద్రత విభేదిస్తుంది, ఇది విలోమ డయాపిరిజిమ్‌చే రూపొందించబడిన అగ్ని నిర్మాణములు లేదా భార శకలములు ఏర్పరుస్తుంది.[27] ఈ డయాపిరిజిమ్ సాంద్రమైన పైపొర మరొక పొరలో దిగేటట్లు చేస్తుంది. కొన్నిసార్లు, శిలావిజ్ఞానాలలో ఏదో ఒకటి నిర్జలీకరించబడినపుడు సాంద్రత వైవిధ్యం ఏర్పడటం మరియు పెరగడం జరుగుతుంది. నిర్జలీకరణ ఫలితంగా బంకమన్ను సులభంగా సంపీడన చెందగా, ఇసుక అదే పరిమాణాన్ని నిలుపుకొని సాపేక్షంగా తక్కువ సాంద్రతను పొందుతుంది. మరొకవైపు, ఒక ఇసుక పోరలోని సచ్చిద్ర ద్రవ పీడనం ఒక కచ్చితమైన బిందువును దాటినపుడు ఇసుక పైన ఉన్న బంకమన్ను పొరల నుండి ప్రవహించి, సెడిమెంటరీ డైక్‌లు అని పిలువబడే అవక్షేపణ రాయి యొక్క ప్రతిగత స్వరూపాలను ఏర్పరుస్తుంది (ఇదే విధమైన ప్రక్రియ ఉపరితలంపై బురద అగ్నిపర్వతములను ఏర్పరుస్తుంది).

సంవత్సరంలో అధికభాగం మృత్తిక శాశ్వతంగా ఘనీభవించే చల్లటి శీతోష్ణస్థితిలో కూడా అవక్షేపణ డైక్‌లు ఏర్పడతాయి. తుహిర శైదిల్యం మృత్తికలో పగుళ్ళను ఏర్పరుస్తుంది ఇది పైనుండి కంకరతో పూడ్చబడుతుంది. ఆ విధమైన నిర్మాణాలు లక్షణ నిర్ధారితాలుగా ఉండటంతోపాటు శీతోష్ణస్థితి సూచికలుగా కూడా ఉపయోగించబడతాయి.[28]

సాంద్రత వైవిధ్యం స్వల్ప-స్థాయి భ్రంశాలకు కూడా కారణమవుతుంది, అయినా అవక్షేపణ కొనసాగుతుంది (అవక్షేపణ భ్రంశం- కలిపి).[29] ఆశ్మీకరణ-చెందని అవక్షేపణ యొక్క భారీ సమూహాలు ఒక వాలుపై నిక్షేపించబడినపుడు కూడా ఆ విధమైన భ్రంశం ఏర్పడుతుంది, డెల్టా యొక్క ముందరి భాగం లేదా ఖండతీరపు వాలు వంటివి. ఆ విధమైన అవక్షేపాలలో అస్థిరతలు శిలాపాతానికి కారణమవుతాయి. రాయిలో ఫలితంగా ఏర్పడే నిర్మాణాలు మిశ్రమ-అవక్షేపణ ముడుతలు మరియు భ్రంశాలు, వీటిని ఆశ్మీకరణ శిలలలో విరూపకారక బలాల వలన ఏర్పడిన ముడుతలు మరియు భ్రంశాల నుండి విభేదించడం కష్టమవుతుంది.

అవక్షేపణ పర్యావరణాలు[మార్చు]

ఒక అవక్షేపణ రాయి ఏర్పడే నేపథ్యం అవక్షేపణ పర్యావరణంగా పిలువబడుతుంది. ప్రతి పర్యావరణం భౌమ ప్రక్రియల మరియు పరిస్థితుల లక్షనాంశ సమ్మేళనాలను కలిగిఉంటుంది. నిక్షేపించబడిన అవక్షేపం యొక్క రకం ఒక ప్రదేశానికి రవాణా చేయబడిన అవక్షేపం మీద మాత్రమే కాక, పర్యావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది.[30]

సముద్ర పర్యావరణమంటే ఆ రాయి సముద్రం లేదా మహాసముద్రంలో ఏర్పడిందని అర్ధం. తరచూ, లోతైన మరియు గాఢ సముద్ర పర్యావరణాల మధ్య ఒక విభజన ఏర్పరచబడుతుంది. లోతైన సముద్రం అంటే సాధారణంగా ఉపరితలం నుండి 200 మీటర్ల క్రిందకు సూచించబడుతుంది. గాఢ సముద్ర పర్యావరణాలు తీరరేఖల ప్రక్కన ఉంటాయి మరియు ఖండతీరపు అంచు సరిహద్దు వరకు విస్తరిస్తాయి. అల చర్య కారణంగా, లోతైన పర్యావరణాల కంటే ఆ విధమైన పర్యావరణాలలో నీరు సాధారణంగా అధిక శక్తిని కలిగిఉంటుంది. స్థూల అవక్షేపణ రేణువులు రవాణా చేయబడతాయి మరియు లోతైన పర్యావరణాల కంటే నిక్షేపిత అవక్షేపాలు స్థూలంగా ఉంటాయని దీని అర్ధం. లభ్యమైన అవక్షేపం ఖండం నుండి రవాణా చేయబడినపుడు, ఇసుక, బంక మన్ను మరియు సిల్ట్ నిక్షేపించబడుతుంది. ఖండం దూరంగా ఉన్నపుడు, తీసుకురాబడిన అవక్షేప మొత్తం తక్కువగా ఉండవచ్చు, మరియు జీవ రసాయనిక ప్రక్రియలు ఏర్పడే రాయి యొక్క రకంపై ఆధిపత్యం చూపుతాయి. ప్రత్యేకించి వెచ్చని శీతోష్ణస్థితులు, దూరంగా ఉన్న గాఢ సముద్ర పర్యావరణ అపతీరాలలో ప్రధానంగా కార్బోనేట్ రాళ్ళ నిక్షేపాలు ఉంటాయి. కార్బోనేట్ అస్థిపంజరాలను నిర్మించే అనేక చిన్న జీవరాశులకు గాఢ, వెచ్చని నీరు ఆదర్శవంతమైన నివాసంగా ఉంది. ఈ జీవరాశులు మరణించినపుడు వాటి అస్థిపంజరాలు క్రిందకు చేరి, సున్నపు బురద యొక్క మందమైన పొరగా ఏర్పడి సున్నపురాయిగా ఆశ్మీకరణం చెందవచ్చు. వెచ్చని గాఢ సముద్ర పర్యావరణాలు ప్రవాళ భిత్తికలకు కూడా అనువైనవి, అక్కడ ఈ అవక్షేపం ప్రధానంగా పెద్ద జీవరాశుల సున్నపు బురద అస్థిపంజరాన్ని కలిగిఉంటుంది.[31]

గాఢ సముద్ర పర్యావరణాలలో, సముద్ర అడుగుభాగం పైన నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది. కేవలం నున్నని రేణువులు మాత్రమే ఆ విధమైన ప్రదేశాలకు రవాణా చేయబడతాయి. సముద్ర అడుగు భాగంలో నిక్షేపించబడే అవక్షేపాలు సాధారణంగా నున్నని బంకమట్టి లేదా సూక్ష్మ జీవరాశుల చిన్న అస్థిపంజరాలు. 4 కిలోమీటర్ల అడుగున, కార్బోనేట్ల ద్రావణీయత నాటకీయంగా పెరుగుతుంది (ఇది జరిగే లోతైన ప్రాంతం లైసోక్లైన్ గా పిలువబడుతుంది). లైసోక్లైన్ క్రింద్రకు దిగే సున్నపు బురద కరిగిపోతుంది, అందువలన ఈ లోతు కంటే క్రింద సున్నపురాయి ఏర్పడదు. అయితే సిలికాతో ఏర్పడే సూక్ష్మ జీవరాశుల అస్థిపంజరాలు (రేడియోలారియన్ ల) వంటివి ఇంకా నిక్షేపించబడతాయి. సిలికా అస్థిపంజరాలతో ఏర్పడే రాయికి ఒక ఉదాహరణ రేడియోలారైట్. సముద్రం యొక్క అడుగుభాగం చిన్న ఏటవాలుతనం కలిగిఉన్నపుడు, ఉదాహరణకు ఖండతీరపు వాలులలో, అవక్షేపణ కవచం అస్థిరంగా మారి, సంక్షుబ్ద ప్రవాహాలకు కారణమవుతుంది. సంక్షుబ్ద ప్రవాహాలు సాధారణంగా చాలా నిశ్శబ్దంగా ఉండే సముద్ర పర్యావరణాలలో ఆకస్మిక అలజడులు కలిగించి, భౌగోళికంగా ఇసుక మరియు సిల్ట్ వంటి అవక్షేపాలు పెద్ద మొత్తంలో వెంటనే నిక్షేపితమవడానికి కారణమవుతాయి. సంక్షుబ్ద ప్రవాహం వలన ఏర్పడిన రాతి శ్రేణి టర్బిడైట్‌గా పిలువబడుతుంది.[32]

తీరం అనేది అల చర్య వలన ఏర్పడే పర్యావరణం. తీరం వద్ద ప్రధానంగా, ఇసుక లేదా గ్రావెల్ వంటి స్థూల అవక్షేపణలతో, పెంకు భాగాలతో కలసి నిక్షేపించబడి ఉంటుంది. వేలా మైదానములు మరియు ఇసుకమేటల వంటి ప్రదేశాలు కొన్నిసార్లు పోటుపాట్ల వలన తుడిచివేయబడతాయి. ఇవి తరచూ ఆవనాళికలచే ఖండించబడతాయి, అక్కడ ప్రవాహం బలంగా ఉంటుంది మరియు నిక్షేపించబడిన రేణువు యొక్క పరిమాణం పెద్దదిగా ఉంటుంది. అక్కడ తీరం వెంట (ఒక సముద్రం లేదా సరస్సు యొక్క తీరం) నదులు జల వనరులోకి ప్రవహించి, డెల్టాలు ఏర్పడతాయి. అవక్షేపణ యొక్క ఈ భారీ సంచితాలు ఖండ ప్రదేశాల నుండి నదీ ముఖద్వార ముందు ప్రదేశాల వరకు రవాణా చేయబడతాయి. డెల్టాలు ప్రధానంగా శకల అవక్షేపాలను కలిగిఉంటాయి.

నేలపై ఏర్పడిన ఒక అవక్షేపణ రాయి ఖండాంతర అవక్షేపణ పర్యావరణాన్ని కలిగి ఉంటుంది. ఖండాంతర పర్యావరణాలకు ఉదాహరణలు లాగూన్‌లు, సరస్సులు, తంపర భూములు, వరద మైదానములు మరియు ఒండలి వీవనలు. తంపర భూములు, సరస్సులు మరియు లాగూన్ ల నిశ్శబ్ద జలాలలో, నున్నని అవక్షేపం నిక్షేపించబడి, మరణించిన మొక్కలు మరియు జంతువుల సేంద్రియ పదార్థాలతో కలిసిపోతుంది. నదులలో, నీటి శక్తి అధికంగా ఉండి రవాణా చేయబడిన పదార్థం శకల అవక్షేపాలను కలిగిఉంటుంది. జల రవాణాతో పాటు, ఖండాంతర పర్యావరణాలలో అవక్షేపం గాలి మరియు హిమానీనదాల ద్వారా కూడా రవాణా చేయబడుతుంది. గాలి ద్వారా రవాణా చేయబడే అవక్షేపణ వాయుకృతంగా పిలువబడుతుంది. అది ఎప్పుడూ చక్కగా వేరుచేయబడి ఉంటుంది. హిమానీనదంచే రవాణా చేయబడిన అవక్షేపణ హిమానీనదానికి చెందినదిగా పిలువబడి చాలా తక్కువగా వేరు చేయబడిన స్వభావాన్ని కలిగి ఉంటుంది.[33]

అవక్షేప ఫెషీస్[మార్చు]

అవక్షేప పర్యావరణాలు సాధారణంగా ప్రత్యేక సహజ అనుక్రమాలలో ప్రక్కప్రక్కనే వ్యవస్థితమౌతాయి. ఇసుక మరియు గ్రావెల్ నిక్షేపితమై ఉండే సముద్ర తీరం, సాధారణంగా కొంత తీరనిగమన ప్రాంతంలో మృదువైన అవక్షేపితాలతో ఉన్న లోతైన సముద్ర పర్యావరణంతో పరివేష్టితమై ఉంటుంది. సముద్ర తీరం వెనుక, ఇసుక దిబ్బలు (చక్కగా వేరు చేయబడిన ఇసుక ప్రాధాన్య నిక్షేపంగా గల ప్రాంతం) లేదా ఒక లాగూన్ (మృదువైన బంకమన్ను మరియు సేంద్రియ పదార్థాలు నిక్షేపాలుగాగల ప్రాంతం) ఉండవచ్చు. ప్రతి అవక్షేపిత పర్యావరణం దానికే ప్రత్యేకమైన నిక్షేపాలను కలిగిఉంటుంది. ఒక ప్రత్యేక పర్యావరణంలో రూపొందిన విలక్షణ శిలలను అవక్షేప ఫెషీస్ అంటారు. కాలం గడిచే కొలదీ అవక్షేప స్తరాలు సంచితమైనపుడు, పర్యావరణం మార్పు చెంది, ఒక ప్రదేశంలో అంతర్భూమిలోని ఫెషీస్‌లో మార్పు వస్తుంది. మరొక వైపు, ఒక నిర్దిష్ట వయసుగల రాతి పొర ప్రక్కనుండి అనుసరించినపుడు, చివరికి శిలాశాస్త్రం (శిలల తీరు) మరియు ఫెషీస్ మారతాయి.[34]

సముద్రం యొక్క అతిక్రమణ (పైన) మరియు ప్రతిగమన (క్రింద) సందర్భాలలో స్థానాంతర అవక్షేప ఫేషీస్.

ఫెషీస్‌ను వివిధ మార్గాలలో గుర్తించవచ్చు: శిలాశాస్త్రం చేత (ఉదాహరణకు: సున్నపురాయి, సిల్ట్ రాయి లేదా ఇసుకరాయి) లేదా శిలాజ పదార్థం ద్వారా. ఉదాహరణకు ప్రవాళం కేవలం వెచ్చని మరియు లోతు తక్కువైన సముద్ర పర్యావరణంలోనే నివసిస్తుంది అందువల్ల ప్రవాళ శిలాజాలు గాఢ సముద్ర ఫెషీస్‌కు పరిమితమైనవి. శిలాశాస్త్రం చేత నిర్ణయింపబడిన ఫెషీస్‌ను లిథో ఫెషీస్ అంటారు; శిలాజాల చేత నిర్ణయింపబడిన ఫెషీస్‌ను బయో ఫెషీస్ అంటారు.[35]

అవక్షేపణ పర్యావరణాలు కాలాంతరంలో తమ భౌమ స్థానాలను మార్చుకోగలవు. సముద్ర మట్టం పడిపోయినపుడు, భూపటలంపై విరూపకారక శక్తుల వలన ఉపరితలంపైకి వచ్చినపుడు, లేదా ఒక నది ఒక పెద్ద డెల్టాను ఏర్పరిచినపుడు తీరరేఖలు సముద్రం యొక్క దిశలోకి మారతాయి. భూ అంతర్భాగంలో, గతంలోని ఆవిధమైన అవక్షేపణ పర్యావరణాల యొక్క భౌగోళిక మార్పులు అవక్షేపణ ఫెషీస్‌లో మార్పులను నమోదు చేసాయి. ఒక నిర్దిష్ట వయసు కలిగిన ఊహాత్మక రాతిపొరకు సమాంతరంగా లేదా లంబంగా అవక్షేపణ ఫెషీస్ మార్పుచెందగలవు అని దీని అర్ధం, ఇది వాల్థర్ ఫెషీస్ నియమంలో వివరించబడిన లక్షణం.[36]

తీరరేఖలు ఖండపు దిశవైపు కదిలే పరిస్థితిని అతిక్రమణం అని అంటారు. అతిక్రమణ సందర్భంలో, లోతైన సముద్ర ఫెషీస్ గాఢ ఫెషీస్‌పై నిక్షేపితమవుతాయి, ఇది ఆన్ లాప్ అని పిలువబడే ఒక అనుక్రమణం. ప్రతిగమనం అనేది ఒక తీరరేఖ సముద్రం దిశగా కదిలే ఒక సందర్భం. ప్రతిగమనంతో, గాఢ ఫెషీస్ లోతైన ఫెషీస్ పై నిక్షేపితమౌతాయి, ఈ సందర్భాన్ని ఆఫ్ లాప్ అంటారు.[37]

ఒక నిర్దిష్ట వయసుగల అన్ని శిలల ఫెషీస్ ను ఒక మానచిత్రంపై గుర్తించినపుడు పురాభూగోళశాస్త్రం గురించి ఒక అవలోకనాన్ని అందిస్తాయి. విభిన్న కాలాల మానచిత్రాల శ్రేణి ప్రాంతీయ భూగోళ అభివృద్ధి యొక్క పరిజ్ఞానాన్ని ఇస్తుంది.

అవక్షేప హరివాణాలు[మార్చు]

భారీ స్థాయి అవక్షేపణ జరిగే ప్రదేశాలు అవక్షేపణ హరివాణములుగా పిలువబడతాయి. ఒక హరివాణంలో నిక్షేపించబడే అవక్షేప మొత్తం ఆ హరివాణం యొక్క లోతుపై ఆధారపడి ఉంటుంది, అది స్థానకల్పన ప్రదేశంగా పిలువబడుతుంది. హరివాణం యొక్క లోతు, ఆకారం మరియు పరిమాణం భూమి యొక్క శిలావరణంలో విరూపకారకాలు, కదలికలపైన ఆధారపడి ఉంటుంది. శిలావరణం పైకి కదిలిన (విరూపకారక ఉద్ధరణ) ఫలితంగా నేల సముద్ర ఉపరితలం కంటే ఎగువకు లేచి, క్రమక్షయం అక్కడి పదార్థాన్ని తొలగించి, ఆ ప్రాంతం నూతన అవక్షేపానికి వనరుగా మారటానికి అనువుగా మారేటట్లు చేస్తుంది. శిలావరణం దిగువకు కదిలిన (విరూపకారక నిమజ్జనం) చోట, హరివాణం ఏర్పడి అవక్షేపం జరుగుతుంది. శిలావరణం నిమజ్జనం చెందినపుడు, కొత్తగా స్థానకల్పన సృష్టించబడుతుంది.

ఒక ఖండానికి చెందిన రెండు భాగాలు దూరంగా జరుగుతున్నపుడు రూపొందే ఒక రకమైన హరివాణానికి విదీర్ణ హరివాణం అంటారు. విదీర్ణ హరివాణాలు దీర్ఘాకారంగా, సన్నని మరియు లోతైనవిగా ఉంటాయి. అపసరణ చలనం వలన, శిలావరణం విస్తరించబడి పలుచగా ఉంటుంది, దీని కారణంగా వేడిగా ఉన్న ఎస్తేనోఆవరణం (ప్రతిబలరహిత ఆవరణం) పైకికదిలి అక్కడున్న విదీర్ణ హరివాణ ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఖండ అవక్షేపాలకు దూరంగా ఉన్న విదీర్ణ హరివాణాలు సాధారణంగా వాటి పూరక పదార్థాలుగా అగ్నిపర్వత నిక్షేపాలను కూడా కలిగిఉంటాయి. శిలావరణ విస్తీర్ణ కొనసాగింపు వలన హరివాణం పెరిగినపుడు, విదీర్ణం పెరిగి, సముద్రం ప్రవేశించడం వలన, సముద్ర నిక్షేపాలు ఏర్పడతాయి.

శిలావరణం యొక్క ఒక భాగం వేడెక్కి మరియు విస్తరించబడి మరలా చల్లబడినపుడు, దాని సాంద్రత పెరిగి, భూసమస్థితిక అవతరణకు కారణమవుతుంది. ఈ అవతరణ దీర్ఘకాలం కొనసాగితే ఈ హరివాణం పల్లపు హరివాణంగా పిలువబడుతుంది. పల్లపు హరివాణాలకు ఉదాహరణలు స్తబ్ద ఖండతీర అంచుల వెంట ఉండే ప్రాంతాలు, అయితే పల్లపు హరివానాలను ఖండాల అంతర్ భాగాలలో కూడా గమనించవచ్చు. పల్లపు హరివాణాలలో, నూతనంగా నిక్షేపించబడిన అవక్షేపాల అధిక బరువు అవతరణ ఒక విష వలయంలో సాగిపోవడానికి సరిపోతుంది. ఆ విధంగా పల్లపు హరివాణాలలో మొత్తం మందము 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది.

మూడవ రకపు హరివాణం అభిసరణ పలక సరిహద్దుల వెంట ఉంటుంది-ఈ ప్రదేశాలలో ఒక విరూపకారక పలక ఎస్తెనో ఆవరణంలో మరొక పలక క్రిందకు వెళుతుంది. ప్రక్కకు నెట్టివేసే పలక ముందు భాగంలో అణగిఉన్న పలక వంగి ఒక అగ్ర-చాప హరివాణం —ఒక దీర్ఘాకృత, లోతైన అసౌష్టవ హరివాణం ఏర్పరుస్తుంది. అగ్ర-చాప హరివాణాలు లోతైన సముద్ర నిక్షేపాలతో మరియు మందమైన సంక్షుబ్ద శ్రేణులతో పూడ్చబడతాయి. ఆ విధమైన అపూరణ ఫ్లిస్క్ గా పిలువబడుతుంది. రెండు పలకల అభిసరణ కదలిక ఫలితంగా ఖండాంతర అభిఘాతం జరిగినపుడు, హరివాణం లోతులేనిదిగా మారి అగ్రభూమి హరివాణంగా వృద్ధి చెందుతుంది. అదే సమయంలో, దీనికి పైనున్న పలకలో విరూపకారక ఉద్ధతి జరిగి పర్వత మేఖల రూపొందుతుంది, దీనినుండి అధిక మొత్తంలో పదార్థం క్రమక్షయమై హరివాణానికి రవాణా అవుతుంది. ఒక వృద్ధి చెందుతున్న అలాంటి పర్వత శ్రేణి యొక్క క్రమక్షయ పదార్థాన్ని మోలాస్సే అని పిలివబడి గాఢ సముద్ర ప్రాంతం లేదా ఖండాంతర ఫెషీస్ ను కలిగిఉంటుంది.

అదే సమయంలో, పర్వత శ్రేణి యొక్క పెరుగుతున్న బరువు దానికి ఆవలవైపు అడ్డుగానున్న పలక యొక్క ప్రాంతంలో భూసమస్థితిక అవతరణం కలిగిస్తుంది. ఈ అవతరణం ఫలితంగా ఏర్పడే హరివాణపు రకాన్ని వెనుక-చాప హరివాణం అంటారు మరియు ఇది సాధారణంగా గాఢ సముద్ర నిక్షేపాలు మరియు మోలాస్సేతో నింపబడుతుంది.[38]

దక్షిణ ఇంగ్లాండ్‌లోని లైమ్ రెగిస్ వద్దగల బ్లూ లియాస్‌లో సమర్ధ మరియు తక్కువ సమర్ధ సంస్తరాల చక్రీయ ప్రత్యామ్నాయం.

ఖగోళ చక్రాల ప్రభావం[మార్చు]

అనేక సందర్భాలలో అవక్షేప శిలా శ్రేణులలో ఫెషీస్ మార్పులు మరియు ఇతర శిలాజ లక్షణాలు చక్రీయ స్వభావాన్ని కలిగిఉంటాయి. ఈ విధమైన చక్రీయ స్వభావం అవక్షేప సరఫరా మరియు అవక్షేప పర్యావరణంలో చక్రీయ మార్పుల కారణంగా ఏర్పడుతుంది. ఈ చక్రీయ మార్పులలో అధికభాగం ఖగోళ చక్రాల వలన కలుగుతాయి. పాటుపోటులు లేదా పర్వవేలా తరంగం మధ్య పక్షానికొకసారి ఏర్పడే తేడా కారణంగా లఘు ఖగోళ చక్రాలు ఏర్పడతాయి. దీర్ఘ-కాల పరిమాణంలో, శీతోష్ణస్థితి మరియు సముద్ర మట్టాలలో చక్రీయ మార్పులు మిలన్కోవిచ్ చక్రాల వలన ఏర్పడతాయి: దిగ్విన్యాసంలో చక్రీయ మార్పులు మరియు/లేదా భూమి యొక్క భ్రమణాక్షం మరియు సూర్యుని చుట్టూ కక్ష్య యొక్క స్థానం. గత 10,000 మరియు 200,000 సంవత్సరాల మధ్య కాలంలో, మనకు తెలిసిన అనేక మిలన్కోవిచ్ చక్రాలు ఉన్నాయి.[39]

భూమి అక్షం యొక్క దిగ్విన్యాసం లేదా ఋతువుల నిడివిలో సాపేక్షంగా స్వల్ప మార్పులు భూమి శీతోష్ణస్థితిపై గొప్ప ప్రభావాన్ని కలిగించగలవు. ఉదాహరణకు, ఖగోళ చక్రాల కారణంగా ఏర్పడ్డాయని భావించబడే 2.6 మిలియన్ సంవత్సరాల పూర్వ హిమయుగాలు (క్వాటర్నరీ కాలం).[40] శీతోష్ణస్థితిలో మార్పు ప్రపంచ సముద్ర మట్టాన్ని (ఆ విధంగా అవక్షేప హరివాణాలలో స్థానకల్పన ప్రదేశాన్ని) మరియు ఒక నిర్దిష్ట ప్రాంతం నుండి అవక్షేప సరఫరాను ప్రభావితం చేయగలదు. చివరగా, ఖగోళ పరామితులలో స్వల్ప మార్పులు అవక్షేప పర్యావరణం మరియు అవక్షేపణలలో పెద్ద మార్పులకు కారణమవుతుంది.

అవక్షేపణ రేట్లు[మార్చు]

ప్రదేశంపై ఆధారపడి అవక్షేప నిక్షేపణ యొక్క రేటు మారుతూ ఉంటుంది. వేలా మైదానంలోని జలమార్గం ఒక రోజులో కొన్ని మీటర్ల నిక్షేపాన్ని పొందగా, లోతైన మహాసముద్ర అడుగుభాగంలో ప్రతి సంవత్సరం కొన్ని మిల్లీమీటర్ల అవక్షేపం పోగవుతుంది. సాధారణ అవక్షేపం మరియు వైపరీత్య ప్రక్రియల ద్వారా ఏర్పడే అవక్షేపాల మధ్య విభజన చేయవచ్చు. బృహచ్చలనాలు, శిలలు జారడం లేదా వరదలు వంటి ఆకస్మిక అరుదైన ప్రక్రియలు వెనుక చెప్పిన విభాగంలో చేరతాయి. వైపరీత్య ప్రక్రియలలో అవక్షేపం యొక్క ఆకస్మిక నిక్షేపణ పెద్దమొత్తంలో ఒకేసారి జరుగుతుంది. కొన్ని అవక్షేప పర్యావరణాలలో, పర్యావరణం సాధారణంగా ప్రశాంతమైనది అయినప్పటికీ, అవక్షేప శిలా స్తంభంలో అధికభాగం వైపరీత్య ప్రక్రియల వలన ఏర్పడుతుంది. ఇతర అవక్షేప పర్యావరణాలు సాధారణ, కొనసాగుతున్న అవక్షేపణ అధీనంలో ఉంటాయి.[41]

కొన్ని అవక్షేప పర్యావరణాలలో, అవక్షేపణ కొన్ని ప్రాంతాలలో మాత్రమే జరుగుతుంది. ఉదాహరణకు, ఒక ఎడారిలో, సిలిసిక్లాస్టిక్ పదార్థాన్ని (ఇసుక లేదా సిల్ట్) గాలి కొన్ని ప్రాంతాలలో నిక్షేపితం చేస్తుంది, లేదా ఒక వాడి యొక్క ఆకస్మిక వరదలు పెద్ద మొత్తంలో డెట్రిటల్ పదార్థ నిక్షేపాన్ని ఏర్పరచవచ్చు, కానీ అధిక ప్రాంతాలలో వాయుకృత అవక్షేపం ప్రబలంగా ఉంటుంది. ఏర్పడే అవక్షేపణ రాయి యొక్క మొత్తం సరఫరా చేయబడిన పదార్థం మీద మాత్రమే కాక, ఆ పదార్థం ఎంత చక్కగా ఏకీకృతమైంది అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. క్రమక్షయం నిక్షేపిత అవక్షేపంలో అధికభాగాన్ని నిక్షేపితమైన కొద్ది కాలంలోనే తొలగిస్తుంది.[41]

స్తరాత్మకత[మార్చు]

ఆజ్ఞేయ ఉటా ప్రదేశం యొక్క కొలరాడో పీఠభూమి జురాసిక్ స్తరశాస్త్రం నుండి పెర్మియన్, ఇది కాపిటల్ రీఫ్ నేషనల్ పార్క్ మరియు కాన్యన్లాండ్స్ నేషనల్ పార్క్ వంటి రక్షిత ప్రాంతాలలో ప్రఖ్యాతి చెందిన శిలాకృతులలో అధికభాగంగా ఉన్నాయి.పైనుండి క్రిందకి: నవజో సాండ్స్టోన్ గుండ్రని కమిలిన బురుజు, కెఎంటా ఫార్మేషన్ యొక్క ఎర్రటి పొర, శిఖరం-రూపొందుట, నిలువుగా అతుకబడిన, ఎరుపు విన్గేట్ సాండ్‌స్టోన్, వాలు-ఏర్పడటం, ఊదా వర్ణపు చిన్లే ఫార్మేషన్, లేత-ఎరుపు మోఎన్కోపి ఫార్మేషన్, మరియు తెలుపు, పొర కలిగిన కట్లర్ ఫార్మేషన్ ఇసుకరాయి.గ్లెన్ కాన్యన్ నేషనల్ రిక్రియేషన్ ఏరియా, ఉటా యొక్క చిత్రం.

అధ్యారోపణ నియమంలో నూతన రాతి పొరలు, పురాతన పొరలపై ఉంటాయని చెప్పబడింది. సాధారణంగా ఈ శ్రేణులలో విషమవిన్యాసాలుగా పిలువబడే కొన్ని అంతరాలు ఉంటాయి. ఇవి నూతన అవక్షేపాలు స్థాపితం కాని కాలాలను, లేదా పూర్వపు అవక్షేప పొరలు సముద్రమట్టం కంటే పైకి వచ్చి క్రమక్షయం కావడాన్ని సూచిస్తాయి.

అవక్షేపణ రాళ్ళు భూమి యొక్క చరిత్ర గురించిన ముఖ్యమైన సమాచారాన్ని కలిగిఉంటాయి. ఇవి పురాతన వృక్షాల మరియు జంతువుల అవశేషాలు సంరక్షించబడిన శిలాజములను కలిగిఉంటాయి. బొగ్గు అవక్షేపణ రాయి యొక్క రకంగా పరిగణించబడుతుంది. అవక్షేపణల యొక్క కూర్పు మనకు మూల శిల గురించి ఆధారాన్ని అందిస్తుంది. వరుస పొరల మధ్య తేడాలు కాలాంతరంలో పర్యావరణంలోని తేడాను సూచిస్తాయి. అవక్షేపణ రాళ్ళు శిలాజాలను కలిగిఉంటాయి, దీనికి కారణం అగ్ని మరియు రూపాంతరప్రాప్తి శిలల వలె కాక, ఇవి శిలాజ అవశేషాలు నాశనం కాని ఉష్ణోగ్రత మరియు పీడనాలలో తయారవుతాయి.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • బాక్-స్ట్రిప్పింగ్
 • నిక్షేపణం (భూ విజ్ఞానశాస్త్రం)
 • డన్హమ్ వర్గీకరణ
 • క్రమక్షయం
 • ఖనిజాల యొక్క జాబితా
 • రాతి రకాల యొక్క జాబితా
 • అవక్షేప రవాణా

గమనికలు[మార్చు]

 1. 1.0 1.1 డాట్, R. H, (1964). వాకే, గ్రేవాకే అండ్ మాట్రిక్స్ - వాట్ అప్రోచ్ టు ఇమ్మెచ్యూర్ సాండ్‌స్టోన్ క్లాసిఫికేషన్: జర్నల్ అఫ్ సెడిమెంటరీ పెట్రాలజీ, సంపుటి-34, పేజీలు 625-632
 2. 2.0 2.1 బ్లాట్, H., మిడిల్టన్, G అండ్ ముర్రే, R., 1980: ఆరిజిన్ అఫ్ సెడిమెంటరీ రాక్స్. ప్రెంటిస్ హిల్, 782 పేజీ.
 3. 3.0 3.1 3.2 ప్రోతేరో, D.R. అండ్ స్చ్వాబ్, F., 2004, సెడిమెంటరీ జియాలజీ (2nd ed.), ఫ్రీమన్, న్యూ యార్క్, 557 పేజీ
 4. 4.0 4.1 బోగ్స్, S., 2006, ప్రిన్సిపుల్స్ అఫ్ సెడిమెంటాలజీ అండ్ స్ట్రాటిగ్రఫీ (4th ed.), పియర్సన్ ప్రెంటిస్ హాల్, అప్పర్ సాడిల్ రివర్, NJ, 662 పేజీ.
 5. స్టౌ, D., 2005, సెడిమెంటరీ రాక్స్ ఇన్ ది ఫీల్డ్. బర్లింగటన్, MA: అకడెమిక్ ప్రెస్.
 6. లెవిన్ (1987), పేజీ 57
 7. టర్బుక్ & లుట్జెన్స్ (1999), పేజీలు  145-146; లెవిన్ (1987) పేజీ 57
 8. బోగ్స్ (1987), పేజీ 105
 9. టర్బుక్ & లుట్జెన్స్ (1999), పేజీలు 156-157; లెవిన్ (1987), పేజీ 58
 10. బోగ్స్ (1987), పేజీలు 112-115; బ్లాట్ తదితరులు. (1980), పేజీలు 55-58
 11. లెవిన్ (1987), పేజి 60; బ్లాట్ తదితరులు (1980), పేజీలు 75-80
 12. ఫోక్ (1965), పేజీ 62
 13. ఫోక్ (1965), పేజీలు 62-64, సిలికీయ శిలలోని ప్రధాన ఖనిజాలు మరియు వాటి సాపేక్ష స్థిరత్వాల అవలోకనం కొరకు చూడుము
 14. స్టాన్లీ (1999), పేజీలు 60-61
 15. లెవిన్ (1987), పేజీ 92; స్టాన్లీ (1999), పేజీ 61
 16. లెవిన్ (1987), పేజీలు  92-93
 17. టర్బుక్ & లుట్జెన్స్ (1999), పేజీలు 160-161; ప్రెస్ తదితరులు. (2003), పేజీ 171
 18. బోగ్స్ (1987), పేజీ 138
 19. తిర్యక్-సంస్తరణం యొక్క వివరణల కొరకు, చూడుము బ్లాట్ తదితరులు (1980), పేజీ 128, పేజీలు 135-136; ప్రెస్ తదితరులు (2003), పేజీలు 171-172
 20. బ్లాట్ తదితరులు (1980), పేజీలు 133-135
 21. శ్రేణీకృత సంస్తరణంపై వివరణ కొరకు, చూడుము బోగ్స్ (1987), పేజీలు 143-144; టర్బుక్ & లుట్జెన్స్ (1999), పేజీ 161; ప్రెస్ తదితరులు (2003), పేజీ 172
 22. కొలిన్సన్ తదితరులు (2006), పేజీలు 46-52; బ్లాట్ తదితరులు (1980), పేజీలు 155-157
 23. టార్బుక్ & లుట్జెన్స్, పేజీ 162; లెవిన్ (1987), పేజీ 62; బ్లాట్ తదితరులు (1980), పేజీలు 136-154
 24. చూడుము స్టాన్లీ (1999), పేజీ 62; లెవిన్ (1987), పేజీలు 93-95; కొలిన్సన్ తదితరులు (2006), పేజీలు 216-232 అనురేఖీయ శిలాజాల సంక్షిప్త వివరణ కొరకు.
 25. కొలిన్సన్ తదితరులు (2006), పేజీ 215
 26. సంగ్రధనాల కొరకు చూడుము, కొలిన్సన్ తదితరులు (2006), పేజీలు 206-215
 27. కొలిన్సన్ తదితరులు (2006), పేజీలు 183-185
 28. కలిన్సన్ తదితరులు (2006), పేజీలు 193-194
 29. కొలిన్సన్ తదితరులు (2006), పేజీలు 202-203
 30. విభిన్న అవక్షేపణ పర్యావరణాలపై అవలోకనం కొరకు, చూడుము ప్రెస్ తదితరులు (2003) లేదా ఇయిన్సెలె (2000), పార్ట్ II
 31. గాఢ సముద్ర పర్యావరణాలపై నిర్వచనం కొరకు, చూడుము లెవిన్ (2003), పేజీ 63
 32. టార్బుక్ & లుట్జెన్స్ (1999), పేజీలు  452-453
 33. ఖండాంతర్గత పర్యావరణాలపై అవలోకనం కొరకు, చూడుము లెవిన్ (2003), పేజీ 67-68
 34. టార్బుక్ & లుట్జెన్స్ (1999), పేజీలు 158-160
 35. రీడింగ్ (1996), పేజీలు  19-20
 36. రీడింగ్ (1996), పేజీలు 20-21
 37. ఫేషీస్ స్థానాంతరాలు మరియు వాటిని గుర్తించగలిగే అవక్షేపణ రాయి సంబంధాల నమోదు యొక్క అవలోకనం కొరకు, చూడుము రీడింగ్ (1996), చూడుము 22-33
 38. అవక్షేపణ హరివాణ రకాల యొక్క అవలోకనం కొరకు చూడుము
  ప్రెస్ తదితరులు (2003), పేజీలు 187-189; ఇయిన్సెలె (2000), పేజీలు 3-9
 39. మిలన్కోవిచ్ చక్రీయాలపై సంక్షిప్త వివరణ కొరకు చూడుము టార్బుక్ & లుట్జెన్స్ (1999), పేజీలు 322-323; రీడింగ్ (1996), పేజీలు 14-15
 40. స్టాన్లీ (1999), పేజీ 536; అండర్సన్ & బోర్న్స్ (1994), పేజీలు 29-32
 41. 41.0 41.1 రీడింగ్ (1996), పేజీ 17

సూచనలు[మార్చు]

 • Andersen, B.G. & Borns, H.W.Jr.; 1994 : ది ఐస్ ఏజ్ వరల్డ్, స్కాండినేవియన్ యూనివర్సిటీ ప్రెస్, ISBN 82-00-37683-4.
 • Blatt, H.; Middleton, G. & Murray, R.; 1980 : ఆరిజిన్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్, ప్రెంటిస్-హాల్, ISBN 0-13-642710-3.
 • de Boer, P.L. & Smith, D.G.; 1994 : ఆర్బిటాల్ ఫోర్సింగ్ అండ్ సైక్లిక్ సీక్వెన్సెస్, స్పెషల్ పబ్లికేషన్స్ అఫ్ ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ అఫ్ సెడిమెంటాలజిస్ట్స్, స్పెషల్ పబ్లికేషన్ 19, ISBN 0-632-03736-9.
 • Boggs, S.Jr.; 1987 : ప్రిన్సిపుల్స్ అఫ్ సెడిమెన్టాలజీ అండ్ స్ట్రాటిగ్రఫీ, మెరిల్ పబ్లిషింగ్ కంపెనీ, ISBN 0-675-20487-9.
 • Collinson, J.; Mountney, N. & Thompson, D.; 2006 : సెడిమెన్టరీ స్ట్రక్చర్స్, టెర్రా పబ్లిషింగ్ (3rd ed.), ISBN 1-903544-19-X.
 • Einsele, G.; 2000 : సెడిమెంటరీ బేసిన్స్, ఎవల్యూషన్, ఫెసీస్, అండ్ సెడిమెంట్ బడ్జెట్ (2nd ed.), స్ప్రింగర్, ISBN 3-540-66193-X.
 • Folk, R.L.; 1965, పెట్రాలజీ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్, హెంప్‌హిల్, ఆన్లైన్ ఉపలభ్యం
 • Levin, H.L.; 1987 : ది ఎర్త్ త్రూ టైం, సాండర్స్ కాలేజ్ పబ్లిషింగ్ (3rd ed.), ISBN 0-03-008912-3.
 • Press, F.; Siever, R.; Grotzinger, J. & Jordan, T.H.; 2003 : అండర్‌స్టాండింగ్ ఎర్త్, ఫ్రీమన్ & కో (4th ed.), ISBN 0-7167-9617-1.
 • Reading, H.G.; 1996 : సెడిమెన్టరీ ఎన్విరాన్మెంట్స్: ప్రాసెసెస్, ఫెసీస్ అండ్ స్ట్రాటిగ్రఫీ, బ్లాక్‌వెల్ సైన్స్ (3rd ed.), ISBN 0-632-03627-3.
 • Stanley, S.M.; 1999 : ఎర్త్ సిస్టం హిస్టరీ, W.H. ఫ్రీమన్ & కో, ISBN 0-7167-2882-6.
 • Tarbuck, E.J. & Lutgens, F.K.; 1999 : ఎర్త్, యాన్ ఇంట్రడక్షన్ టు ఫిజికల్ జియాలజీ, ప్రెంటిస్ హాల్ (6th ed.), ISBN 0-13-011201-1.

బాహ్య లింకులు[మార్చు]