అశోకుని ఎర్రగుడి శిలాశాసనములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అశోకుని ఎర్రగుడి శిలాశాసనములు గ్రంథాన్ని రాయప్రోలు సుబ్రహ్మణ్యం ప్రాచీన శాసనాలను వ్యాఖ్యానిస్తూ రచించిన గ్రంథం. అశోక చక్రవర్తి వేసిన పలు శాసనాలు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి-ఎర్రగుడి గ్రామాల నడుమ దొరికాయి. వాటీని వ్యాఖ్యానించి ఈ గ్రంథప్రచురణ చేశారు.

రచన నేపథ్యం[మార్చు]

ప్రాచీన భారతీయ లిపుల్లో అశోకుని శాసన లిపి అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ ఈ గ్రంథాన్ని ప్రచురించింది. గ్రంథానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ బోర్డు మెంబర్, పురావస్తు శాఖ డైరెక్టర్ రమేశన్ సంపాదకత్వం వహించారు. 1971లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఈ అంశం చర్చకు వచ్చి తెలుగు వారి పూర్వ భాషావైభవాలకు గుర్తైన ఈ శాసనాన్ని అందరికీ అర్థమయ్యేలా తెలుగులోకి అనువదించి ప్రచురించనున్నట్టు ఆనాటి రాష్ట్రమంత్రి ప్రకటించగా ఈ పుస్తకం 1975 ప్రచురితమైంది.[1]

ఎర్రగుడి శాసనాల ప్రాధాన్యత[మార్చు]

1927లో నేటి కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి-జొన్నగిరి గ్రామాల నడుమ కొండపై అశోక చక్రవర్తి వేయించిన శాసనాలు దొరికాయి. సింధు నాగరికతలోని నాణాలపైనున్న లిపి తర్వాత ప్రాచీన భారతదేశంలో దొరికిన లిపి పాఠ్యం అశోకుని కాలం నాటి శాసనాలపై ఉన్నదే కావడంతో ఇవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అశోకుని ఎర్రగుడి శాసనాలు బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలో ఉంది. ప్రజల భాషయైన ప్రాకృతంలోనే అశోకుడు వారికి అవసరమైన ధర్మ శాసనాలు వేయించి ఉంటాడని భావిస్తూన్న పరిశోధకులు ఈ లిపి అప్పటి ప్రజల వ్రాతకట్టని, ప్రాచీన దక్షిణాపథంలోని ఈ భాగంలో ప్రాకృతం వాడుకలో ఉందని భావిస్తున్నారు. ఆంధ్రుల ప్రాచీన చరిత్రకు ఆధారాలు కావడంతో ఈ శాసనాలు ప్రజలకు ఉపకరించేవని భావించి ప్రచురించారు. అశోకుని దక్షిణ ప్రాంత రాజధానిగా భావిస్తున్న స్వర్ణగిరి కాలక్రమేణా సొర్నగిరి, జొన్నగిరిగా మారిందని పరిశోధకులు భావిస్తున్నారు.[2]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. అశోకుని ఎఱ్ఱగుడి శిలాశాసనములు:రాయప్రోలు సుబ్రహ్మణ్యం:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురావస్తుశాఖ ప్రచురణ:1975
  2. అశోకుని ఎఱ్ఱగుడి శిలాశాసనములు(తొలిమాట):రాయప్రోలు సుబ్రహ్మణ్యం:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురావస్తుశాఖ ప్రచురణ:1975