అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తృతీయాశ్వాసము

[మార్చు]

శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ విద్య బోధంచిన తరువాత " అర్జునా ! నా చిత్తము నా తండ్రి వసుదేవుడిని చూడాలని ఆరాట పడుతుంది. నేను త్వరగా ద్వారకకు వెళ్ళాలి. మీ అనుమతి కొరకు ఎదురు చూస్తున్నాను " అని అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! అయితే మనము వెంటనే హస్థినకు వెడదాము. నేను నీ ద్వారక ప్రయాణము గురించి ధర్మరాజుకు చెప్పి ఒప్పిస్తాను. ఆయన కూడా నిన్ను సంతోషముగా ద్వారకకు పంపుతాడు " అని అన్నాడు తరువాత కృష్ణార్జునులు రథము ఎక్కి హస్థినకు పయనమయ్యారు. మార్గమధ్యములో " కృష్ణా ! నీ దయ వలన కౌరవసైన్యము అనే సాగరమును దాటాము. యుద్ధములో శత్రువులను జయించాము. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన మహా వీరులను జయించాము. నీవు ముందుగా శత్రువులను చంపిన తరువాత మేము ఈ కీర్తి ప్రతిష్ఠలను పొందాము. ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ జయము నీది. నీవు సర్వాంతర్యామివి. నీ మహిమగురించి పొగడటము మా తరమా ! దామోదరా ! నీవు ఈ విశ్వసంవిధాతవు. నీ తేజస్సే అగ్నిష్టోమము. నీవే కాలస్వరూపుడవు. నీ ఉఛ్వాసనిశ్వాసములే వాయువు. నీ క్రోధమే మృత్యువు. నీ అనుగ్రహమే లక్ష్మీకటాక్షము. నీ మూలముగానే మానవులకు జనన మరణాలు సంభవిస్తున్నాయి. ఈ చరాచరజగత్తు నీ వలనే ఉద్భవించింది. నీవు భావాతీతుడవు. నీవు సర్వజగత్పతివి. కృష్ణా ! నారదుడు, దేవలుడు, కౌశికుడు, వ్యాసుడు మొదలైన మహామునులు, భీష్ముడు, చెప్పిన మంచి మాటలు విని నీవు సకల ధర్మస్వరూపుడవని తెలుసుకున్నాను. నీవు నా మీద ఉన్న కరుణాకటాక్షముతో ఆధ్యాత్మవిద్యను బోధించావు. అది విని నేను బ్రహ్మానందం పొందాను " అని అర్జునుడు శ్రీకృష్ణుడిని భక్తితోస్తుతించాడు. ఆ మాటలు విన్న వాసుదేవుడు అర్జునుడిని అభినందిస్తూ ఆదరంగా చూసాడు. కృష్ణార్జునులు హస్థినాపురము పోయి ముందుగా ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి ధృతరాష్ట్ర గాంధారీల ఆశీర్వాదము తీసుకున్నారు. తరువాత కుంతీదేవి ఆశీర్వాదము తీసుకున్నారు. తరువాత విదురుడు, ధౌమ్యుడు, యుయుత్సుడు, సంజయుడు మొదలగు వారిని కలుసుకుని తరువాత ధర్మరాజు వద్దకు వెళ్ళరు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఆలింగనము చేసుకున్నాడు. అర్జునుడు అన్నగారికి భక్తితో నమస్కరించాడు.

శ్రీకృష్ణుని ద్వారక ప్రయాణ ప్రస్థావన

[మార్చు]

మరునాడు కృష్ణార్జునులు కలిసి ఆస్థాన మండపములో ఉన్న ధర్మరాజు వద్దకు వెళ్ళారు. అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! మన బావ శ్రీకృష్ణుడు హస్థినకు వచ్చి చాలా రోజులు అయ్యింది కదా ! ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు అతడి సోదరులు అతడి కొరకు ఎదురు చూస్తుంటారు కదా ! వారిని చూడాలని శ్రీకృష్ణుడు కూడా ఆతురతగా ఉన్నాడు. అందువలన తమరు అనుమతిస్తే శ్రీకృష్ణుడు ద్వారకకు బయలు దేరుతాడు. అక్కడ దేవకీ వసుదేలనూ అన్న బలరాముడిని చూసి వారితో కొంతకాలము గడిపి తిరిగి హస్థినకు వస్తాడు " అని అన్నాడు. ధర్మరాజు సంతోషముగా " తమ్ముడూ అర్జునా ! అలాగే చేస్తాము. కృష్ణా తమరు ద్వారకకు వెళ్ళి మా బదులుగా తమరి తల్లి దేవకీదేవికి తండ్రి వసుదేవుడికి మా నమస్కారములు తెలియజెయ్యండి. తక్కిన బంధువుల మిత్రుల యోగక్షేమును అడిగినట్లు చెప్పండి. కొన్నిరోజులు వారితో గడిపి తరువాత తమరు నేను చేయబోవు అశ్వమేధయాగముకు బంధుమిత్ర సమేతంగా సపరివారంగా రండి " అని సాదరంగా ఆహ్వానము తెలిపాడు. తరువాత శ్రీకృష్ణుడు కుంతీదేవి అనుమతి తీసుకున్నాడు. ద్రౌపది సుభద్రలను కలుసుకుని వారి అనుమతి తీసుకున్నాడు. సుభద్రను హస్థినకు తీసుకు వెళ్ళడానికి కుంతీదేవి అర్జునుల అనుమతి తీసుకున్నాడు.

శ్రీకృష్ణుడు ఉదంకుడిని కలుసుకొనుట

[మార్చు]

శ్రీకృష్ణుడు ద్వారకకు పయనమయ్యాడు. రథము ముందుకు పోతుందే కాని శ్రీకృష్ణుడి మనసు మాత్రము అర్జునుడి మీద నుండి మరల లేదు. రథము ముందుకు పోతుంటే శ్రీకృష్ణుడు అర్జునుడు కనిపించినంత సేపు వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు సాత్యకి ఒక రథము మీద ఉంటే సుభద్ర వేరొక రథము మీద ప్రయాణం చేస్తున్నారు. అలా ద్వారకకు వెడుతూ శ్రీకృష్ణుడు ఉదంకుడి ఆశ్రమము చూసి అయన వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు శ్రీకృష్ణుడిని చూసి " కృష్ణా ! పాండవులు కౌరవులు ఇరువురి నడుమ సయోధ్య కుదిర్చావా ! కౌరవులు, పాండవులు ఎవరి రాజ్యములు వారు పాలిస్తూ క్షేమంగా ఉన్నారా ! " అని ఏమీ ఎరుగని వాడిలా అడిగాడు. శ్రీకృష్ణుడు కూడా ఏమీ ఎరుగని వాడిలా " మహర్షీ ! నేను కురు పాండవుల సంధి ప్రయత్నం చేస్తూ వారితో అనేక విధముల వాదించి నయానా భయానా చెప్పాను. కొంచెం గద్దించి కూడా చెప్పాను. అయినా సుయోధనుడు అతడి తమ్ములు పెడచెవిన పెట్టారు. నాతోచేరి మహర్షులు, మునులు, భీష్ముడు, ద్రోణుడు సంధి చేసుకోవడమే మేలని పలు విధముల చెప్పారు. కాని సుయోధనుడు లోభత్వముతో సంధికి అంగీకరించలేదు. కురుపాండవులకు జరిగిన యుద్ధములో కౌరవులు సమూలంగా నాశనం అయ్యారు. పాండవులు ఐదుగురు తప్ప ఇరువర్గాలలో ఎవరూ మిగల లేదు. కాల నిర్ణయమును ఎవరు తప్పించగలరు " అని చెప్పాడు.

ఉదంకుడి ఆగ్రహం

[మార్చు]

ఈ మాటలకు ఉదంకుడు కోపంతో ఊగిపోతూ " కృష్ణా ! దీనికంతా నువ్వే కారణం. నువ్వు తలచు కుంటే సంధి కుదిరేది. నీకు శక్తి ఉండి కూడా ప్రయత్నించక నీ మోసంతో కౌరవులను సమూలంగా నాశనం చేసావు. ఇంత ఘోరము నీ వలననే జరిగింది కనుక నేను నిన్ను శపిస్తున్నాను " అని కోపంతో పలికాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు " మహర్షీ ! నేను చెప్పబోవు మాటలు విని తరువాత మీ ఇష్టము వచ్చిన విధముగా చెయ్యండి. మహర్షీ మునులకు కోపంము తగదు. కనుక శాంతం వహించి ప్రశాంత చిత్తముతో నేను చెప్పేది వినండి. అనవసరంగా నాకు శాపం ఇచ్చి తమరి అమూల్యమైన తపోబలం వ్యర్ధము చేసుకోకండి " అని అన్నాడు. ఉదంకుడు శాంతించి " సరే నువ్వు చెప్పదల్చుకుంది ఏదో చెప్పు శాంతంగా వింటాను " అని అన్నాడు. శ్రీకృష్ణుడుచిరునవ్వు నవ్వి " ఉదంకా ! నేనెవరో నీకు తెలియచెప్తాను. సత్వరజోతమో గుణములు నా యందే ఉండి నా ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాయి. మరుత్తులు, వసువులు మొదలైన దేవతాగణములన్ని నా అందే ఉద్భవించాయి. ఈ విశ్వమంతా నేను వ్యాపించి ఉన్నాను. ఈ సృష్టి అంతా నా అందే వ్యాపించి ఉంది. పర, అపర తత్వములు నేనే. ఓంకారము, వేదములు, నాలుగు వర్ణములు , నాలుగు విధములైన ఆశ్రమాలు, వాటికి సంబంధించిన సమస్త కర్మలు, స్వర్గము, మోక్షము అన్నీ నేనే నా రూపాలే. యజ్ఞయాగాలలో నన్ను స్థుతించి యజ్ఞఫలమును పొందుతుంటారు. పాపములు చేసిన వారు కూడా నన్ను భజించి వారి పాపములకు ప్రాయశ్చితము చేసుకుంటారు. ఈ లోకములో అధర్మము పెచ్చుపెరిగి పోయనప్పుడు నేను అవతరించి అధర్మమును రూపుమాపి ధర్మమును రక్షిస్తాను. నేను బ్రహ్మగా, ఈశ్వరుడుగా, విష్ణువుగా ఆయా విధులు నిర్వహిస్తూంటను. అంటే సృష్టి, స్థితి, లయములను నేను మూడు రూపములలో నిర్వర్తిస్తుంటాను. ధర్మముకు హాని జరిగినప్పుడు అధర్మవర్తకులను రూపు మాపి ధార్మికులను రక్షించి లోకోపకారము చేస్తాను. ఉదంకా నేను సర్వసమర్ధుడిని అయినా అధర్మవర్తనులైన కౌరవులతో ధర్మవర్తనులైన పాండవులను కలపడానికి ఎంతో ప్రయత్నము చేసాను. నేను చేసిన ప్రయత్నమును వ్యాసుడు, మొదలైన మహా మునులు కూడా ప్రశంసించారు. కాని దుర్మదులైన కరవులకు నా మాటలు రుచించ లేదు. అందువలన యుద్ధమే శరణ్యం అయినది. అధర్మవతనులైన కౌరవులు సమూలంగా నాశనం అయ్యారు. జరిగిన విషయం నీకు చెప్పాను. ఇక నీవు చెయ్యతలచినది చెయ్యి " అన్నాడు. ఉదంకుడు " శ్రీకృష్ణా ! నీవు ఎవరో నీ మహిమలు ఏమిటో నాకు ముందే తెలుసు. కాని నేను తాత్కాలిక కోపానికి గురి అయ్యాను. అందుకే నిన్ను నిందించాను. నీ అమృతతుల్యమైన వాక్కులతో నా మనసులోని మాలిన్యాలను కడిగివేసావు. కాని నాకు ఒక కోరిక ఉంది. మహోన్నతమైన నీ విశ్వరూపము చూడాలని కోరికగా ఉంది. నేను అందుకు అర్హుడిని అనుకుంటే నాకు నీ విశ్వరూపము చూపించు " అని ప్రార్థించాడు. ఉదంకుడి మాటలు మన్నించిన శ్రీకృష్ణుడు నాడు యుద్ధభూమిలో అర్జునుడికి చూపించిన విశ్వరూపమును ఉదంకుడికి చూపించాడు. అనిర్వచనము, అద్భుతమైన ఆవిశ్వరూపమును చూసిన ఉదంకుడు ఏకకాలమున భయము ఆనందము ఆశ్చర్యముకు లోనై చేతులు జోడించి శ్రీకృష్ణుడిని ఇలా స్తుతించాడు. " పుండరీకాక్షా ! ఈ భూమి అంతా నీ పాదపద్మములతో నిండి పోయింది. ఆకాశమంతా నీ శిరస్సులతో నిండి పోయింది. నీ యొక్క నడుము అంతరిక్షము అంతా నిండి పోయింది. నీ భుజములు, చేతులు అన్నిదిక్కులను ఆక్రమించాయి. లెక్క లేనన్ని శిరస్సులతో చేతులతో కాళ్ళతో ఈ విశ్వం అంతా నీవే నిండి ఉన్నావు. మహాత్మా ! నీ విశ్వరూపమును కళ్ళారా చూసి ధన్యుడిని అయ్యాను. నా మనస్సు తృప్తి చెందింది. లోకోత్తరమైన ఈ విశ్వరూపమును ఉపసంహరించి నీ జగన్మోహనాకారమైన నీ సహజరూపమును ధరించమని ప్రార్ధిస్తున్నాను కృష్ణా ! " అని ఉదంకుడు ప్రార్థించాడు.

ఉదంకుడు అమృతం

[మార్చు]

ఉదంకుడి ప్రార్థన మన్నించి శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును ఉపసంహరించి " ఉదంకా ! ఏదైనా వరము కోరుకో ఇస్తాను " అన్నాడు. ఉదంకుడు " మహాత్మా ! సామాన్యులకు దుర్లభమైన నీ విశ్వరూపమును కనులారా చూసాను. నాకు ఇంత కంటే ఏమి కావాలి. ఈ భాగ్యము నాకు చాలు " అన్నాడు. శ్రీకృష్ణుడు " ఉదంకా ! నా విశ్వరూపమును దర్శించిన నీకు శుభములు కలుగుతాయి. కాని నీకు ఒక వరము ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అడుగు " అని కృష్ణుడు పలికాడు. ఉదంకుడు " కృష్ణా ! ఈ ప్రాంతం అంతా కరువు ప్రాంతం. వర్షపు జలము కాని భూగర్భజలము కాని దొరకవు. కనుక నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు నాకు జలము లభించే వరము ప్రసాదించు " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " ఉదంకా ! దానికేముంది నీకు నీరు కావాలని అనిపించినప్పుడు నన్ను స్మరించిన నీకు నీరు లభిస్తుంది " అని వరము ఇచ్చాడు. తరువాత శ్రీ కృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. ఒకరోజు ఉదంకుడికి దాహము వేసింది. అప్పుడు ఉదంకుడికి కడజాతి వాడు ఒకడు కనిపించాడు. అతడి ఒంటి మీద బట్టలు లేవు. చాలా మురికిగా ఉన్నాడు. అతడి చుట్టూ కుక్కలు తిరుగుతున్నాయి. కాని అతడి ఒంటి మీద నిర్మలమైన జలము స్రవిస్తుంది. అతడు ఉదంకుడిని పిలిచి " ఉదంకా ! నీకు దాహము వేస్తుంది కదా నాశరీరము నుండి స్రవించే నిర్మలమైన జలము త్రాగు " అని అన్నాడు. ఉదంకుడు అది విని ఆగ్రహించి అతడిని అక్కడ నుండి వెళ్ళి పొమ్మని అరిచాడు. అప్పుడు ఆ కడజాతివాడు కుక్కలతో సహా మాయం అయ్యాడు. ఇంతలో కృష్ణుడు అక్కడ కనిపించాడు. ఉదంకుడు " కృష్ణా ! నిన్ను తలచుకుంటే జలము లభిస్తుందని అన్నావు కదా ! నీవేమో నన్ను ఈ కడజాతి వాడి శరీరము నుండి లభించే జలము త్రాగమని అంటున్నావు. ఇదేనా నీవు నాకు ఇచ్చే వరము " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " నీకు నేనిచ్చిన మంచి అవకాశము జారవిడిచావు. నేను నీకు అమృతము ప్రసాదించమని దేవేంద్రుడిని కోరాను. మానవులు అమృతము త్రాగడానికి అర్హులు కాదు అని దేవేంద్రుడు నాతో అని నా మాట కాదని అనలేక ఇంద్రుడు " దేవా ! నీవు కోరిన విధంగా నేను ఉదంకుడికి అమృతము ఇస్తాను కాని నేను అతడి వద్దకు కడజాతివాడి రూపములో వెడతాను. అతడు నేను ఇచ్చే అమృతమును ఇష్టపడ పోతే నేను చేయకలిగింది ఏమీ లేదు " అని అన్నాడు. ఇంద్రుడు నీ వద్దకు కడజాతివాడి రూపములో వచ్చి అమృతము త్రాగమని చెప్పాడు. దానిని నీవూ తిరస్కరించావు. ఇక నేను ఏమి చేయగలను. కాని నీకు నేను ఇంకొక వరము ఇస్తాను. నీకు సంవత్సరం పొడవునా ఎప్పుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీరు లభించే వరము ప్రసాదిస్తున్నాను. నీవు కోరుకున్న వెంటనే మేఘములు నీ వద్దకు వచ్చి వర్షము కురిపిస్తాయి. అలా వర్షాన్ని కురిపించే మేఘాలను జనులు ఇక నుండి ఉదంక మేఘాలని పిలుస్తారు. నీ కోరిక ఈ విధముగా నెరవేర కలదు " అని పలికాడు " అని వైశంపాయనుడు జనమేజయుడికి ఉదంకోపఖ్యానము వినిపించాడు.

ఉదంకుడి వృత్తాంతం

[మార్చు]

ఉదంకుని వృత్తాంతం విన్న జనమేజయుడు వైశంపాయనుడితో " మహాత్మా ! ఉదంకుడికి శ్రీకృష్ణుడిని కూడా శపించగలిగిన శక్తి ఎలా వచ్చింది? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా ! ఉదంకుడికి కల గురుభక్తి వలన గువుకు అతడు చేసిన శుశ్రూష వలన ఉదంకుడికి అంతటి శక్తి వచ్చింది. ఉదంకుడు గౌతమునికి శిష్యుడు. విద్యాభ్యాసము పూత్రి అయిన తరువాత మిగిలిన శిష్యులందరికి గౌతముడు ఎవరికి తగిన వరాలు వారికి ఇచ్చి పంపాడు. కాని ఉదంకుడికి మాత్రము ఏ వరము ఇచ్చి పంపలేదు. ఉదంకుడు గురువు వద్దనే ఉండి గౌతముడికి భక్తితో శుశ్రూష చేయసాగాడు. ఒకరోజు ఉదంకుడు మిక్కిలి బరువైన కట్టెలమోపు తీసుకు వచ్చి ఆశ్రమం వద్ద పడవేసే సమయంలో అతడి జడ ఒకటి ఆ కట్టెల మోపులో చిక్కి తెగిపోయింది. అతడి జడ లోని వెంట్రుక తెల్లగా మెరిసి పోవడము చూసిన ఉదంకుడు తనకు వయసు మీరి పోయిన విషయము గ్రహించి బాధను ఓర్వలేక ఏడవసాగాడు. అది చూసిన గౌతముడు ఉదంకుడి కన్నీళ్ళు భూమి మీద పడకుండా పట్టమని తన కుమార్తెను పంపాడు. తండ్రి ఆజ్ఞ మీద గౌతముడి పుత్రి ఆ కన్నీళ్ళను పట్టడానికి ప్రయత్నించి అవి సలసల కాగుతుండటము వలన వాటిని జారవిడిచింది. అది చూసి గౌతముడు " ఉదంకా ! ఎందుకు ఏడుస్తున్నావు ? " అని అడిగాడు. ఉదంకుడు " గురువుగారూ ! మీరు మిగిలిన శిష్యుల మీద చూపిన దయ నా మీద చూప లేదు. వారు వెళ్ళి హాయిగా గృహస్థులై సుఖపడుతున్నారు. నేను మాత్రము ఇలా ముసలివాడిని అయ్యాను. ఇక నాకు వివాహము కాదు. అందుకే ఈ ఏడుపు " అని చెప్పాడు. గౌతముడు " ఉదంకా ! దిగులుపడకు. నీకు మరలా యవ్వనం ప్రసాదిస్తున్నాను. అంతే కాక నా కుమార్తెను నీకిచ్చి వివాహము చేస్తాను. నీవిక గృహస్థాశ్రమం స్వీకరించి సంతోషాన్ను అనుభవించు " అని అన్నాడు. గౌతముడు తన కుమార్తెకు కూడా అప్పటికే వయసు మీరి పోయిందని గ్రహించి ఆమెకు కూడా యవ్వనం ప్రసాదించి వారిరువురికి వివాహము చేసాడు.

ఉదంకుడి గురుదక్షిణ

[మార్చు]

గౌతముడుఉదంకుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహము చేసిన పిదప ఉదంకుడు " గురువర్యా ! మీరు నాకు యవ్వనాన్ని యవ్వనవతి అయిన కుమార్తెను ఇచ్చి వివాహము చేసారు. మీ ఋణము ఎలా తీర్చుకోగలను. మీరు నాకు ఏదో ఒక పని చెప్పండి. అది నెరవేర్చి నా ఋణము తీర్చుకుంటాను. అదే నా గురుదక్షిణ " అన్నాడు. గౌతముడు " అదేమిటి ఉదంకా ! నీవు నాకు వేరే గురుదక్షిణ ఇవ్వాలా ! నీ గురుభక్తి మంచి నడవడిక ఇదే నీ గురుదక్షిణ " అని చెప్పి బయటకు వెళ్ళాడు. అప్పుడు ఉదంకుడు తన గురుపత్ని అహల్య వద్దకు వెళ్ళి " అమ్మా ! తమరైనా చెప్పండి తమకు నేను ఏ విధంగా గురుదక్షిణ సమర్పించుకోవాలో " అని అడిగాడు. అందుకు అహల్య " అదేమిటి మీ గురువుగారి మాటే కదా నామాట. అయినా నువ్వు అడిగావు కనుక నేను చెప్తున్నాను. నీవు మిత్రసఖుడు అను వాని వద్దకు వెళ్ళి అతడి భార్య వద్ద ఉన్న కుండలములు తెచ్చి నాకు ఇవ్వు " అని చెప్పింది. ఉదంకుడు కుండలములు తెచ్చే పనిమీద వెళ్ళాడు. కొంతసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చిన గౌతముడికి ఉదంకుడు కనిపించక పోయేసరికి భార్యను అడిగాడు. అహల్య ఉదంకుడిని కుండలములకు పంపిన విషయము చెప్పింది. గౌతముడు " సౌదాసుడు రాక్షసుడు. అతడు శాపవశాన మనుష మాంసము తింటూన్నాడు. ఈ విషయము ఉదంకుడికి తెలియదు కనుక ఏమి జరుగనున్నదో " అని గౌతముడు కలవర పడ్డాడు. ఆ మాటలకు అహల్య కలవర పడి " నాధా ! నాకు ఈ విషయము తెలియదు కనుక పంపాను. మీరు ఎలాగైనా ఉదంకుడిని కాపాడండి " అని ప్రార్థించింది. గౌతముడు నవ్వి " నువ్వు నిశ్చింతగా ఉండు ఉదంకుడికి ఎలాంటి ఆపదా రానివ్వను " అన్నాడు. అని భార్యను ఊరడించాడు.

సుదాసుడి భార్య

[మార్చు]

ఉదంకుడు ఒక అడవిలో సౌదాసుడిని కలుసుకున్నాడు. మిత్రసఖుడికి సౌదాసుడన్న పేరుకూడా ఉంది. ఉదంకుడు కలుసుకున్న సమయంలో సౌదాసుడు ఆ నిర్జన ప్రదేశంలో ఎర్రటి కళ్ళతో రక్తసిక్త శరీరముతో భయంకరముగా ఉన్నాడు. అయినా ఉదంకుడు సౌదాసుడిని చూసి భయపడ లేదు. ధైర్యంగా తన ముందు నిలబడిన ఉదంకుడిని చూసిన సౌదాసుడు " ఎవరు నువ్వు ఎక్కడకు వెడుతున్నావు. ఈ రోజు ఆహారము దొకక అవస్థ పడుతున్నాను. సరి అయిన సమయంలో వచ్చిన నిన్ను ఇక చంపి తినకవదలను " అన్నాడు. అందుకు ఉదంకుడు " రాజా ! నేను మాగురువు గారి పనిమీద వెళుతున్నాను. గురుకార్యము మీద వెళ్ళే నన్ను చంపుట మహా పాపము. ఇంతటి అధర్మకార్యానికి ఒడిగట్టుతావా " అని అన్నాడు. సౌదాసుడు " బ్రాహ్మణా ! నీకు దినములో మూడవ ఝామున మనుష్య మాంసము తినమని దేవతలు ఆదేశించారు. కనుక నా ఆకలిని నిన్నుతిని తీర్చుకుంటాను అని అన్నాడు. ఉదంకుడు " అలాగా సరే నేను ముందు నాగురువుగారి కార్యము నెరవేర్చి తరువాత నీ ఆకలి తీర్చగలను నన్ను నమ్ము. అయ్యా ! తమరు మిమ్మలిని యాచించిన వారి కోరికలను తీరుస్తారు కదా ! నేనిది నా కొరకు కోరడము లేదు. గురుపత్ని కొరకు అడుగుతున్నాను. కనుక నా కోరిక తప్పక తీరుస్తారని నమ్ముతున్నాను " అని అడిగాడు ఉదంకుడు. ఆ మాటలకు సౌదాసుడు " నీ కోరిక ఏమిటి ? " అని అడిగాడు. ఉదంకుడు " మహాత్మా ! నా గురుపత్ని తమరి భార్య కుండలములు కావాలని అడిగింది. అవి మీరు ఇప్పిస్తే నేను వాటిని గురుపత్నికి సమర్పించి తిరిగి వచ్చి మీకు ఆహారము కాగలను " అని అన్నాడు. అందుకు సౌదాసుడు " ఆ కుండలములు నావి కాదు కదా ! పరుల సొమ్ము నేను ఎలా ఇవ్వగలను " అన్నాడు. ఉదంకుడు " నేను మీ భార్య కుండలములు కోరుతున్నాను అది పరుల సొమ్ము ఎలా ఔతాయి " అన్నాడు. సౌదాసుడు " అయితే నువ్వు నా భార్య వద్దకు వెళ్ళి నేను చెప్పానని చెప్పి కండలములు తీసుకో " అన్నాడు. ఉదంకుడు " అయ్యా మీ భార్య ఉండే ప్రదేశము నాకు చెప్పండి " అని అడిగాడు. సౌదాసుడు " ఆ కనపడేదే ఆమె నివాసము " అని చెప్పాడు. ఉదంకుడు సౌదాసుడి భార్య వద్దకు వెళ్ళి " మా గురుపత్ని అహల్య. మీ కుండలములు అడిగి తెమ్మని నన్నుపంపింది. మీరు కుండలములు ఇస్తే నేను వెడతాను " అని అన్నాడు. సౌదాసుడి భార్య " నువ్వు ఉదంకుడివి అని నా భర్త సౌదాసుడు నిన్ను పంపాడనినాకు నమ్మకము ఏమిటి ? " అని అడిగింది. ఉదంకుడు తిరిగి సౌదాసుడి వద్దము వెళ్ళి " నీ భార్య నన్ను గుర్తు తీసుకురమ్మని అడిగింది కనుక నాకు ఏదైనా గుర్తు ఇచ్చి పంపు" అన్నాడు. సౌదాసుడు "నేను చెప్పే మాటలు జాగ్రత్తగా చెపితే నా భార్య నిన్ను గుర్తించి కుండలము ఇస్తుంది" అన్నాడు. ఉదంకుడు సౌదాసుడి భార్య వద్దకు వెళ్ళి సౌదాసుడి మాటలు చెప్పగానే సౌదాసుడి భార్య మదయంతి సంతోషముతో " కుమారా ! ఈ కుండలముల కొరకు దేవతలు, గంధర్వులు, నాగులు పొంచి ఉన్నారు. వారు ఈ కుండలములు పొందడానికి అనేక ఉపాయములు పన్నుతుంటారు. కనుక నీవు జాగ్రత్త వహించాలి. ఈ కుండలములను నీవు నేల మీద పెట్టినా, ఈ కుండలములకు ఎంగిలి సోకినా, ఏమరుపాటున నిద్రించినా వీటిని అపహరించే ప్రమాదము ఉంది. నీవు ఈ కుండలములను భక్తితో సేవించి పూజించిన నీకు ఆకలిదప్పులు ఉండవు. నీకు అగ్నివలన, విషమువలన, భూత ప్రేత పిశాచములవలన భయము ఉండదు. ఈ కుండలములను పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరికైనా ఖచ్చితంగా సరిపోతాయి. ఈ కుండలములు బంగారమును కురిపిస్తాయి. అందువలన వీటిని అత్యంత అప్రమత్తతతో తీసుకు వెళ్ళి నీ గురుపత్నికి సమర్పించాలి " అని మదయంతి తగు జాగ్రత్తలు చెప్పి కుండలములను ఉదంకుడికి ఇచ్చి ఆశీర్వదించి పంపింది.

ఉదంకుడు సుదాసుడిని ఓదార్చుట

[మార్చు]

సౌదాసుడి భార్య మదయంతి వద్ద కుండలములు తీసుకున్న ఉదంకుడు సౌదాసుడి వద్దకు వచ్చి " రాజా ! నీ దయ వలన నేను కృతార్ధుడను అయ్యాను. కాని నాకు ఒక సందేహము మిగిలి పోయింది. నీవు నీ గుర్తుగా చెప్పిన మాటలు నాకు అర్ధము కాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే వాటి అర్ధము వివరించండి " అని అడిగాడు. సౌదాసుడు " బ్రాహ్మణ కుమారా ! లోకములో క్షత్రియులు బ్రాహ్మణులను పూజిస్తారు. నేను కూడా బ్రాహ్మణులను పూజిస్తాను. నేను బ్రాహ్మణులపట్ల చేసిన చిన్న అపరాధము నన్నిలా మానవ మాంసభక్షకుడిగా చేసింది. నేను చేసిన పాపముకు పరిహారము బ్రాహ్మణపూజ ఒక్కటే మార్గము. అది అంతగా పని చేస్తుందని తెలియకున్నా అంతకంటే వేరు మార్గము లేదు. ఇదే నేను చెప్పిన మాటలకు అర్ధము. బ్రాహ్మణుడవైన నీకోరిక మన్నించి నీకు కుండలములను ఇవ్వమని చెప్పాను. అందువలన నా పాపమును కరిగించాలని అనుకున్నాను " అనిచెప్పాడు. ఊదంకుడి దర్శనము వలన సౌదాసుడికి పూర్వజన్మ జ్ఞానము, దానము చెయ్యాలన్న బుద్ధి, వినయము కలిగాయి. ఉదంకుడు సౌదాసుడిని చూసి " మహానుభావా ! నీ దయ వలన నాకు కుండలములు లభించాయి. నేను వెళ్ళి వీటిని నా గురుపత్నికి సమర్పించి తిరిగి నీ వద్దకు వచ్చి నీ ఆకలి తీరుస్తాను " అని చెప్పాడు. సౌదాసుడు నేను చంపుతానని తెలిసీ నా వద్దకు తిరిగి వస్తానని అన్నావు. నేను నీ సత్యదీక్షకు ప్రీతి చెందాను నీ తపోమహిమ వలన నన్ను దుఃఖ విముక్తిడిని చెయ్యి " ఉదంకుడు " రాజా ! మంచి మనసు కల వారికి పొరపాటున ఆపద కలిగినా అవి వెంటనే తొలగి పోతాయి. నీ సుగుణములే నీ పాపములను పోగొడతాయి. నా గురువు కృప నీ మీద ప్రసరించింది. ఇక నీకు శుభము జరుగుతుంది " అని చెప్పాడు. ఉదంకుడు సౌదాసుడి వద్ద సెలవు తీసుకుని జింకచర్మముతో చేసిన సంచిలో పెట్టిన కుండలములతో సహా గురుపత్ని వద్దకు ప్రయాణము వెళ్ళాడు.

ఉదంకుడి కుండలములను తస్కరించుట

[మార్చు]

ఉదకుండి కుండలములను తీసుకు వెళుతూ ఉదంకుడికి మార్గమధ్యంలో ఆకలి వేసింది. ఉదంకుడు కుండలములు ఉన్న సంచిని ఒక పండ్లచెట్టుకు తగిలించి చెట్టు ఎక్కి పండ్లను కోసి తినసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా వీచిన గాలికి చెట్టు ఊగడంతో నేలకు తగిలించిన సంచి కింద పడింది. అక్కడ పొంచి ఉన్న ఒక నాగపాము ఆ సంచిని నోటకరచుకుని వేగంగా పోసాగింది. ఉదంకుడు ఆ పామును వెంబడంచగా అది ఒక పుట్టలోకి దూరింది. ఉదంకుడు ఒక కర్రను తీసుకుని ఆ పుట్టను తవ్వసాగాడు. ఆ తవ్వకానికి భూమి కంపించింది. ఇంతలో దేవేంద్రుడు అక్కడకు బ్రాహ్మణవేషంలో వచ్చి " బ్రాహ్మణోత్తమా ! అంత చిన్నకర్రతో తవ్వి పాతాళమును చేరడము సాధ్యమా ? ఇక్కడి నుండి పాతాళముకు వెయ్యి యోజనముల దూరము ఉంది. నీ కుండలము తస్కరించిన నాగుపాము ఎవరో కాదు. అతడు నాగరాజు అయిన ఇరావంతుడి కుమారుడు. ఉదంకుడు " దేవా ! అతడు పాతాళానికివెళ్ళినా నేను అతడిని వెంబడించి వెళ్ళి కుండలములను తీసుకు వస్తాను " అన్నాడు. దేవేంద్రుడికి ఉదంకుడి పట్టుదల నచ్చింది. అందువలన ఉదంకుడి చేతి కొయ్యకు వజ్రాయుధానికి ఉన్న శక్తిని ప్రసాదించాడు. ఉదంకుడు ఆ కర్రతో ఒక్క పోటుపొడవగానే భూదేవీ వజ్రాయుధ దెబ్బకు భయపడి పాతాళానికి దారి ఇచ్చింది. ఆ దారిగుండా ఉదంకుడు పాతాంలో ఉన్న నాగలోకానికి వెళ్ళాడు. పటిష్ఠమైన కోటగోడలు, ద్వారములు, అగడ్తలు ఉన్న నాగలోకాన్ని చూడగానే ఉదంకుడికి తాను కుండలములు పొందడము అంత సులువైన పనికాదని తెలిసింది. ఇంతలో అతడి ఎదుట అరుణవర్ణములు కలిగిన ఒక గుర్రము కనిపించింది. నలుపురంగు దేహము, శ్వేతవర్ణ తోక కలిగిన ఆ గుర్రము ఉదంకుడితో " ఉదంకా ! నీవెవరో నాకు తెలుసు. నేను నీవు రోజూ ఆశ్రమంలో పూజించే అగ్నిహోత్రుడిని. నాకు కుండలములు ఎక్కడ ఉన్నాయో నీకు చెప్తాను. నీవు ఏమీ అనుకోకుండా నా వెనుక భాగంలొ ఉదు " అన్నాడు. ఉదంకుడు ఆ గుర్రము వెనుక భాగంలో ఊదగానే ఆ గుర్రము శరీరము నుండి వచ్చిన సెగలుపొగలు నాగలోకమంతా వ్యాపించాయి. వాయుభక్షకులైన నాగులకు ఆ పొగవలన ఊపిరి ఆడలేదు. నాగులంతా విలవిలా కొట్టుకోసాగారు. కుండలములు దొంగిలించిన ఇరావంతుడి కుమారుడు కూడా గిలగిలా కొట్టుకోసాగాడు. వేరు మార్గాంతరము లేక నాగరాజులు కుండలములు తీసుకు వచ్చి ఉదంకుడికి ఇచ్చి శరణు వేడారు. ఉదంకుడు వారిని క్షమించి వెంటనే తన ఆశ్రమానికి వెళ్ళి గురుపత్నికి కుండలములు అందచేసాడు. గౌతముడు ఉదంకుడిని చూసి " ఉదంకా ! రాక్షస ప్రవృత్తి కలిగిన సౌదాసుడిని ప్రసన్నము చేసుకుని కుండలములు సంపాదించడము. అగ్నిదేవుని ప్రసన్నము చేసుకుని కుండలములు నాగరాజుల నుండి సంపాదించడము నీవే చేయగలవు. ఇది వేరొకరు చేయలేరు " అన్నాడు. అని వైశంపాయనుడు జనమేజయుడికి ఉదంకుడి వృత్తాంతము చెప్పాడు.

శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుట

[మార్చు]

వైశంపాయనుడు జనమేజయునకు శ్రీకృష్ణుడు ద్వారకకు చేరిన వృత్తాంతము ఇలా చెప్పసాగాడు. " జనమేజయ మహారాజా ! ఉదంకుడి వద్ద నుండి శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. ఆ సమయంలో రైవతక పర్వతానికి ఉత్సవాలు జరుగుతున్నాయి. ద్వారకాపురి వాసులంతా ఆ ఉత్సవానికి పోవడానికి సమాయత్తము కాసాగారు. శ్రీకృష్ణుడి రాకతో వారు ఆగి పోయి శ్రీకృష్ణుడికి స్వాగతము పలికారు. శ్రీకృష్ణుడు ముందు తల్లి తండ్రులైన దేవకీ వసుదేవులను అన్న బలరాముడిని కలిసి వారికి నమస్కరించాడు. వారికి ధర్మరాజు తరఫున ప్రణామములు అందించాడు. తరువాత తన తమ్ములను వారి భార్యలను కుమారులను వారి భార్యలను కలిసి వారికి ఆనందము కలిగించాడు.

శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధవిశేషాలు వసుదేవుడికి ఎరిగించుట

[మార్చు]

ఒక రోజు వసుదేవుడు శ్రీకృష్ణుడిని తన వద్ద కూర్చోబెట్టుకుని " నాయనా శ్రీకృష్ణా ! మహాభారత యుద్ధము జరిగిందని వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. కాని పూర్తి విషయాలు తెలియ లేదు. ఆ యుద్ధ విశేషాలు వినాలన్న కుతూహలంగా ఉంది " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " తండ్రీ ! మహాభారత యుద్ధము 18 రోజులు జరిగింది. ఆ యుద్ధవిశేషాలు చెప్పాలంటే చాలారోజులు పడుతుంది. అందుకని ప్రముఖులు మాత్రము చేసిన యుద్ధవిశేషాలను క్లుప్తంగా వివరిస్తాను. ఇరువైపులా మొహరించిన సైన్యము 18 అక్షౌహినులు. అందులో కౌరవ సైన్యము 11 అక్షౌహినులు. పాండవుల సైన్యంలో 7 అక్షౌహినులు. కౌరవ సైన్యాధ్యక్షుడు భీష్ముడు. అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకుని భీష్ముడిని పడగొట్టాడు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చేవరకు అంపశయ్య మీద కాలము గడిపి తరువాత శరీరము వదిలి పెట్టాడు. భీష్ముడు పడిపోయిన పిదప ద్రోణుడు సర్వసైన్యాధ్యక్షుడు అయ్యాడు. ద్రోణుడు అయిదు రోజుల వరకు సైన్యాలను నడిపించిన తరువాత ధర్మరాజు సహాయంతో దృపదుడి కుమారుడు దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపాడు. తరువాత అంగదేశాధ్యక్షుడు కర్ణుడు సర్వసైన్యాధ్యత వహించాడు. కర్ణుడు రెండు రోజులపాటు యుద్ధము కొనసాగించి తుదకు అర్జునుడి చేతిలో పరమపదించాడు. మరునాడు శల్యుడి సారథ్యములో కౌరవసేన యుద్ధముకు సమాయత్తము అయ్యింది. కాని సగము రోజులోనే ధర్మరాజు చేతిలో పరమపదించాడు. తరువాత వచ్చిన శకుని వచ్చీ రాగానే నకులుడి చేతిలో మరణించాడు. అప్పటికే సుయోధనుడి తమ్ములంతా యుద్ధములో మరణించారు. ఒంటరిగా మిగిలిన సుయోధనుడు అవమానభారంతో ఒక మడుగులో దాక్కున్నాడు. అతడి జాడ తెలుసుకుని ధర్మరాజు భీముని సహాయముతో సుయోధనుడి తొడలు విరిచి చంపాడు. సుయోధనుడి మరణంతో పాండవులకు సంపూర్ణ విజయము లభించింది. కాని అంతలో దొర్లిన అపశృతి వలన ఒకరోజు ద్రోణ పుత్రుడు అశ్వత్థామ పాండవశిబిరములో ప్రవేశించి దుష్టద్యుమ్న, శిఖండి, ఉపపాండవులతో సహా పాండవసైన్యాలను సర్వనాశనము చేసాడు. కృతవర్మ, కృపాచార్యులు ఈ యుద్ధములో అశ్వత్థామకు సహకరించారు. ఆ రోజు నేను సాత్యకి పాండవులతో ఓఘానదీ తీరానికి వెళ్ళినందు వలన మేము బ్రతికి బయటపడ్డాము. ఇలా 18 రోజుల కురుక్షేత్రయుద్ధము ముగిసింది. కౌరవ పక్షంలో కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యుడు పాండవ పక్షములో చేరిన యుయుత్సుడు తప్ప మిగిలిని వారందరూ మరణించారు. ఇదీ భారత యుద్ధకథ " అని శ్రీకృష్ణుడు భారత యుద్ధ విశేషాలను క్లుప్తంగా వసుదేవుడికి వివరించాడు.

వసుదేవుడికి అభిమన్యుడి మరణవార్త తెలుపుట

[మార్చు]

కురుక్షేత్రయుద్ధ విశేషాలు విన్న వసుదేవుడు చింతాకాంతుడయ్యాడు. అభిమన్యుడి మరణవార్త వసుదేవుని ఇంకా క్రుంగదీస్తుందని చెప్పలేదు. కాని సుభద్ర దుఃఖం ఆపుకోలేక " అన్నా ! మీ తండ్రి వసుదేవుడు. అది విని దుఃఖిస్తున్న వసుదేవుడిని అక్కడ ఉన్న యాదవులను ఓదార్చడము కృష్ణుడివంతైంది. ధృతరాష్ట్రుడితో చేరి ధర్మరాజు కౌరవులందరికి అంతిమ క్రియలు జపించినతీరు బ్రాహ్మాణులకు దానములు ఇవ్వడము వారిపేరు మీద అనేక ధర్మకార్యాలు నిర్వహించడము సవిస్తరంగా వివరిండు. అందరూ మెల్లమెల్లగా ఆ దుఃఖమునుండి బయట పడ్డారు " అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.

ఆశ్వమేధయాగము

[మార్చు]

జనమేజయుడు " వైశంపాయన మహర్షీ ! వ్యాసుడు ధర్మరాజును అశ్వమేధయాగమును చేయమని ఆదేశించాడు కదా ! ధర్మరాజు ఆయాగమును ఎలా నిర్వహించాడు " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయ మహారాజా ! వ్యాసుడు తన మీద ఉన్న వాత్సల్యముతో అశ్వమేధయాగము చేయమని ఆదేశించిన తరువాత ధర్మరాజు తన తమ్ములను పిలిచి " భీమార్జున నకులసహదేవులారా ! వ్యాసుడి ఆదేశము విన్నారు కదా ! యాగనిర్వహణకు కావలసిన ధనము మన వద్దలేదు. కనుక వ్యాసుడు చెప్పినట్లు బ్రాహ్మాణులు దాచిన ధనము తీసుకురావలసిన అవశ్యకత ఉంది. హిమాలయములలో ఉన్న ఆ నిధిని తీసుకురావడానికి కావలసిన మార్గము గురించి, చేయవలసిన ఏర్పాటు గురించి మీరు నాకు మీ అభిప్రాయములు చెప్పండి " అని అడిగాడు. జవాబుగా భీముడు " అన్నయ్యా ! ధర్మనందనా ! మనము ఆ పరమేశ్వరుడిని నియమ నిష్టలతో పూజించి ఆయన కరుణ పొంది ప్రమధగణములను పూజించి, భూతబలులు సమర్పించి ఆ నిధిని తీసుకు వస్తాము. కనుక ధనముగురించిన చింతతో పనిలేదు. ఆ కార్యము సాధించడానికి సముచిత సైన్యము కావాలి " అని భీముడు చెప్పాడు. భీముని మాటలకు అర్జునుడు, నకులసహదేవులు తమ అంగీకారము తెలిపారు. తమ్ముల మాటలకు ధర్మరాజు సంతోషించాడు. అందరూ కలిసి హిమాలయములకు పోవడానికి నిశ్చయించుకున్నారు. తరువాత పెదనాన ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు. ధర్మరాజు ధృతరాష్ట్రుడికి చెప్పగానే ధృతరాష్ట్రుడు తన కుమారులు లేనందుకు విలపించాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుడి పాదములు పట్టుకుని గాంధారి వింటూ ఉండగా వ్యాసమహర్షికి తనకు జరిగిన సంభాషణ వ్యాసుడు తనను అశ్వమేధయాగము చేయమని చిప్పిన విషయము చెప్పి యాగము చేయడానికి ధృతరాష్ట్రుడి అనుమతి పొందాడు. తరువాత తన తల్లి కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆమెకు యాగము గురించి చెప్పాడు. ఆ మాటలు విని కుంతీదేవి సంతోషంతో యాగముకు అనుమతి ఇచ్చింది. కుంతీదేవి అనుమతి తీసుకున్న ధర్మరాజు ఆస్థానమండపానికి వెళ్ళి యుయుత్సుడికి హస్థినాపుర బాధ్యత అప్పగించి అతడికి తోడుగా విదురుడిని నియమించాడు. సైన్యాధిపతులను పిలిచి ప్రయాణసన్నాహములు చెయ్యమని ఆదేశించాడు. తరువాత సమస్తదేవతలకు, పితరులకు పూజలు చేసాడు. అగ్నికార్యము నిర్వహించాడు. ధౌమ్యుడికి నమస్కరించి తరువాత రథము మీద కూర్చున్నాడు. మార్గమధ్యములో బ్రాహ్మణుల వద్ద పుణ్యస్త్రీల వద్ద ఆశీర్వాదములు స్వీకరిస్తూ తన పూరోహితుడు ముందుగా నడువగా హిమాలయములకు పయనమయ్యాడు. ధర్మరాజు వెంట భీమార్జున నకులసహదేవులు రథముల మీద అనుసరించారు. మార్గమధ్యములో సామంతరాజులు కూడా వారితో కలిసారు. అందరూ కలిసి ఒక సమతలప్రదేశంలో విడిది చేసారు.

పాండవుల శివార్చన

[మార్చు]

ఆ సమయంలో అక్కడకు వ్యాసుడు వచ్చాడు. ధర్మరాజు వ్యాసుడికి స్వాగతము పలికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించి ఉచితాసనమిచ్చి కూర్చుండబెట్టాడు. తరువాత జరుగవలసిన కార్యక్రమము గురించి వ్యాసుడిని అడిగాడు. వ్యాసుడు " ధర్మనందనా ! ఈ రోజు రాత్రికి మీరందరూ ధర్భాసనము మీద పడుకోండి. రేపు ఉదయమే లేచి శివుని అర్చించండి " అని చెప్పాడు. మరునాడు ఉదయము పాండవులందరూ వేకువఝామునే నిద్ర లేచి స్నానాధికాలు కానిచ్చారు. తరువాత ధర్భాసనము మీద శివుని ప్రతిష్ఠించి ధూప దీప నైవేద్యములతో పూజించారు. పాయసమును సమర్పించారు. తరువాత ప్రథమగణములను ఆవాహన చేసి పూజించారు. కుబేరుడు, మణిభద్రుడు మొదలైన యక్షులను భక్తితో ఆవాహన చేసి పూజించారు. తరువాత పురోహితుడు ధౌమ్యుడు ముందు నడువగా ధర్మరాజు తన తమ్ములతో నిధి ఉన్న చోటుకు వెళ్ళాడు. నిధిని ఆవహించి ఉన్న భూతములను ఎర్రని పూలతో, మాంసముతో కూడిన అన్నముతో,పేలాలతో అర్చించారు.

పాండవులు నిధిని తీసుకుని మరల్చుట

[మార్చు]

భూతములను తృప్తిపరచిన తరువాత ఆ ప్రదేశములో తవ్వమని ఆదేశించాడు. కొంతలోతు త్రవ్వగానే ఆ నిధి బయటపడింది. ధర్మరాజు వ్యాసుడి పాదములకు నమస్కరించాడు. వ్యాసుడు ధర్మరాజును ఆశీర్వదించాడు. తరువాత ధర్మరాజు నిధికి బలులు సమర్పించి పూజలు చేసాడు. తరువాత నిధిని అనేక బండ్ల మీద ఎక్కించారు. బంగారు బిందెలు, చెంబులు, గృహోపకరణ వస్తువులు, రోళ్ళు, రోకళ్ళు ఉన్నాయి. ఇంకా బంగారు దిమ్మలు, కణికలు ఉన్నాయి. ధర్మరాజు వాటిని మూటలు కట్టించి సంచులతో ఎత్తించి బండ్ల మీద ఎత్తించాడు. వేలకొద్దీ వాహనములలో అక్కడక్కడా మజిలీలు చేస్తూ ప్రయాణము సాగించాడు.

పరీక్షిత్తు జననం

[మార్చు]

శ్రీకృష్ణుడు ద్వారకలో ధర్మరాజు చేయబోవు యాగము గురించి ధర్మరాజు యాదవ ప్రముఖులకు తెలిపిన ఆహ్వానము గురించి తెలిపాడు. తరువాత ధర్మరాజు హిమాచలముకు పోవుట నిధినితరలించుట విని సంతోషించాడు. శ్రీకృష్ణుడు,కృతవర్మ, బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలగు యాదవ ప్రముఖులతోకలసి హస్థినాపురముకు వచ్చాడు. వారిరాక విని ధృతరాష్ట్రుడు, గాంధారి సంతోషించి యుయుత్సుడిని, విదురుడిని వారిని తీసుకురావడానికి పంపాడు. యుయుత్సుడు, విదురుడు శ్రీకృష్ణుడిని, బలరాముడిని మిగిలిన యాదవ ప్రముఖులను స్వాగతము పలికి అంతఃపురానికి తీసుకువచ్చారు. అత్తగారైన కుంతీదేవిని కలుసుకున్నారు. సుభద్ర తన అత్తగారైన కుంతీదేవి వద్దకు పోయి ఆమె ఆశీర్వాదము తీసుకుంది. యుయుత్సుడు, విదురుడు శ్రీకృష్ణ, బలరామ యాదవ ప్రముఖులకు తగిన విడిది ఏర్పాట్లు చేసారు. ఆ సమయంలో నిండు గర్భిణి అయిన అభిమన్యుడి ధర్మపత్ని ఉత్తర గర్భాన తమరి జనకుడు పరీక్షిత్తు జన్మించాడు అని దాసీలు ప్రసూతిగృహము నుండి వచ్చి చెప్పగానే అందరూ ఆనందోత్సాహాలలో తేలియాడారు. అంతలోనే గర్భములోనే బిడ్డ చనిపోయాడు అని తెలుసుకుని అందరూ దుఃఖసాగరంలో మునిగి పోయారు.

కుంతీ అభుమన్యుడి కుమారుడిని బ్రతికించమని వేడుకొనుట

[మార్చు]

పరీక్షిత్తు జననంలో జరిగిన అపసృతి గురించి విన్న శ్రీకృష్ణుడు, సాత్యకిని వెంట పెట్టుకుని కుంతీదేవి వద్దకు వెళ్ళాడు. అప్పుడు కుంతీ శ్రీకృష్ణుడితో " కృష్ణా ! నాకు నీవు తప్ప వేరెవరు లేరు నీవే శరణు. నీ మేనల్లుడు అభిమన్యుడికి కలిగిన కుమారుడు చనిపోయాడు. క్రూరాత్ముడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మహిమ వలన మాడి మసి అయ్యాడు. కృష్ణా ! బ్రతికించకలిగిన శక్తి నీక్లే ఉంది.ఆనాడు నీవిచ్చిన మాట చేసిన ప్రతిజ్ఞ గుర్తుచేసుకో. " ఉత్తర గర్భమును రక్షిస్తాను. గర్భములో శిశువును బ్రతికిస్తాను " అని నీవు ప్రతిజ్ఞ చేసావు. కృష్ణా ! నా ప్రాణములు, ద్రౌపది, సుభద్రల ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. బిడ్డ బ్రతికితే మేము బ్రతుకుతాము. లేకున్న మేము ప్రాణాలు విడిచి పెడతాము. ఈ బిడ్డ చనిపోయిన పాండవ వంశపితరులకు పిండప్రధానము చెయ్యడానికి, తిలోదకాలు ఇవ్వడానికి కూడా ఎవ్వరూ మిగలరు. కనుక ఈ బిడ్డను బ్రతికించి మత్స్యరాజకుమారి శోకమును పోగొట్టు . కృష్ణా ! పాండవ వంశాన్ని రక్షించిన నీవే పాడవ వంశాంకురాన్ని కాపాడి వారి వంశాన్ని నిలబెట్టు " అని వేడుకుంటూనే శోకభారంతో నేలకు ఒరిగింది.

సుభద్ర తన మనుమడిని బ్రతికించమని వేడుకొనుట

[మార్చు]

అక్కడే ఉన్న సుభద్ర " అన్నా ! ఆ అశ్వత్థామ భీముడిని చంపడానికి బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించాడు. కాని ఆ అస్త్ర ప్రభావానికి నేను నా భర్త అర్జునుడు ఫలితము అనుభవిస్తున్నాము. వంశాంకురాన్ని పోగొట్టుకున్నాము. నీ మరిది అర్జునుడు ఇప్పటికీ అభిమన్యుడి మరణానికి తలచితలచి శోకిస్తున్నాడు. ఇప్పుడు మనుమడు కూడా చనిపోయాడని తెలిస్తే పరిస్థితి ఎమౌతుందో అని భయంగా ఉంది. ఇక ధర్మరాజు, భీముడు, నకులసహదేవులు ఈ శోకాన్ని ఎలా తట్టుకుంటారో ? అన్నయ్యా ! అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించినప్పుడు నీవు దానిని నిర్వీర్యము చేస్తానని మాటిచ్చావు. మేము కూడా ఊరట చెందాము. నీ ప్రయత్నము ఫలించినట్లు లేదు. మా అందు దయ ఉంచి పాండవవంశాంకురాన్ని రక్షించి పాండవకులమును రక్షింఛు. అన్నయ్యా నీవు ఉండగా పాండవులకు భంగపాటులేదు. నీ ఎదురుగానే అశ్వత్థామ పాండవకుల వంశోద్ధారకుడిని నాశనం చేసాడు. భక్తవత్సలా ! ఈ చరాజరజగత్తులో చనిపోయిన బ్రతికించే శక్తి నీకే ఉంది అని నాకు తెలుసు అలాంటి నీవు నీ మేనత్త కొడుకు, ప్రియసఖుడు, ఆప్తుడు, బావ అయిన అర్జునుడి మనుమడు అకాల మరణాన్ని చూస్తూ ఊరుకుంటావా అన్నయ్యా ! దుఃఖభారంతో మేము నీ శక్తి తెలియక ప్రవర్తించినందుకు మమ్ము క్షమించి ఈ బిడ్డను బ్రతికించు " అని దీనంగా వేడుకుంది.

శ్రీకృష్ణుడు పరీక్షిత్తుని బ్రతికించుట

[మార్చు]

కుంతీ సుభద్రలు శోకించుట చూసిన శ్రీకృష్ణుడి మనసు ద్రవించింది. అందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణుడు " ఎవరూ విచారించకండి. ఈ బిడ్డను నేను బ్రతికిస్తాను " అని పెద్దగా అన్నాడు. ఆ మాటలకు అందరూ ఊరట చెందారు. కుంతీ, సుభద్రల, ద్రౌపదీదేవి వెంటరాగా కృష్ణుడు ప్రసూతిగృహానికి వెళ్ళాడు. తెల్లటిపూలు, ఆవాలు, లాజలు, పూర్ణకుంభంతో పుణ్యజలాలు తెప్పించి అగ్నిహోత్రము జ్వలింపచేసాడు. పదునైన ఆయుధములను, లేజివుళ్ళను పేర్చారు. అందరికంటే ముందు ద్రౌపది " అమ్మా ! ఉత్తరా ! నిన్ను చూడడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. లేచి కళ్ళు తెరచి చూడమ్మా ! " అన్నది. ఉత్తర కళ్ళు తెరచి భారంగా కూర్చుని కృష్ణుడికి నమస్కారము చేసి " దేవాదిదేవా ! నీవు నీ భక్తుల ఆర్తి బాపుతావని ప్రతీతి. ఈ మృతశిశువును బ్రతికించి ఈ వంశాన్ని రక్షించు. నీ దయ నా మీద చూపించు. ఈ మృతశిశువును పునరుజ్జీవితుడిని చెయ్యి. నేను భర్తను పోగొట్టుకున్నాను. తుదకు నా బిడ్డను కూడా పోగొట్టుకున్నాను. ఇక నేను ఎలా బ్రకగలను. భక్తవత్సలా ! నీ మేనల్లుడి కుమారుడిని చంపకలిగిన సామర్ధ్యము అశ్వత్థామకు ఉందా ! కృష్ణా ! నా భర్త అభిమన్యుడు చనిపోయినప్పుడే నేను సహగమనము చేయవలసి ఉంది. కాని ఈ బిడ్డకోసము బ్రతికాను. ఇప్పుడు నేను చనిపోయి స్వర్గముకు పోయినప్పుడు నా భర్త అభిమన్యుడు తన కుమారుడిని గురించి అడిగితే ఏమని చెప్పను. పరంధామా ! నా కుమారుడిలా చనిపోతాడని అనుకుంటే ఆరోజే సహగమనము చేసేదానిని. నాకు కుమారుడు కలగగానే శ్రీకృష్ణుడికి చూసి పోవాలని అనుకున్నానే. ఆ క్రూరాత్ముడు అశ్వత్థామ నా కుమారుడిని చంపి నా ఆశలను వమ్ము చేసాడు " అంటూ బిడ్డను ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉంది. ఉత్తర ఆ మృతశిశువును చూసి " కన్నా ! లేవరా నీ తాత శ్రీకృష్ణుల వారువచ్చారు. లేచి నమస్కారము చెయ్యి. పెద్దలు వచ్చినప్పుడు అలా పడుకుని ఉండడము తగునా ! " అంటూ మరణించిన కుమారుడిని తలచుకుని విలపించిన ఉత్తర సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె శోకమును చూసిన వారంతా కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. శ్రీకృష్ణుడు " అమ్మా ఉత్తరా ! విలపించకు నీ కుమారుడిని నేను బ్రతికిస్తాను " అని అన్నాడు. వెంటనే పాదప్రక్షాళన చేసాడు, ఆచమనము చేసి శుచి అయ్యి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామాస్త్రమును నిర్వీర్యము చేసాడు. మృతశిశువును శయ్యమీద ఉంచమని చెప్పాడు. శ్రీకృష్ణుడు అ శిశువును చూసి " ఈ శిశువును బ్రతికించి ఉత్తర, సుభద్ర, పాడవులకు ఆనందం కలిగిస్తాను " అని పలికాడు. తరువాత శ్రీకృష్ణుడు " నేను శత్రువులతో సైతము ఎన్నడూ అబద్ధము ఆడని వాడను అయితే, యుద్ధభూమిలో ఎన్నడూ వెనుకంజ వేయని వాడిని అయితే ఈ శిశువు పునరుజ్జీవితుడు ఔతాడు. బ్రాహ్మణుల ఎడల నా మనస్సు భక్తిప్రపత్తులు కలవాడిని అయితే ఎల్లప్పుడూ ధర్మము తప్పని వాడిని అయితే ఉత్తర కుమారుడు పునరుజ్జీవితుడు అగుగాక. అర్జుని ఎడల ఏనాడూ బేధభావము లేని వాడిని అయితే ఈ బాలుడు జీవించుగాక. ధర్మసంస్థాపన నిమిత్తము నేను కంసాదులను సంహరించింది నిక్కమైతే కంసాదులను నేను సంహరించింది జనులకు ఆమోదయోగ్యమైతే ఈ శిశువు జీవించు కాక . నేను సదాబ్రహ్మచర్యమును అవలంబించి, సత్యము పలుకుతూ, ధర్మము తప్పని వాడిని అయితే ఈ బాలుడు బ్రతుకుగాక " అని శ్రీకృష్ణుడు గాఢంగా పలికాడు. ఆ మాటలకు బాలుడిలో చలనము కలిగింది. మెల్లిగా కాళ్ళు చేతులు కదిలాయి. నెమ్మదిగా కళ్ళుతెరిచాడు. అది చూసిన కుంతీదేవి, సుభద్ర, ద్రౌపది మొదలగు వారు అమితానందము పొందారు. వారికళ్ళలో ఆనంద బాష్పాలు కురిసాయి. వారు పులకాకితులు అయ్యారు. అక్కడ ఉన్నవారు అంతా కేరింతలు కొట్టారు. ఆకాశము నుండి దివ్యవాణి శ్రీకృష్ణుడిని స్తుతించింది. జనమేజయా ! అప్పుడు మీ తండ్రిగారు ఉన్న ఆ పురిటిగది మీ తండ్రి గారి తేజస్సుతో ప్రకాశించింది. అప్పటి వరకు చలనము లేకుండా పడి ఉన్న శిశువులో చలనము కలగడము చూసిన ఉత్తర ఆనందము పట్టలేక బిడ్డను పొదివి పట్టుకుని శయ్యదిగి పరుగున వచ్చి శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడిపోయింది. శ్రీకృష్ణుడు ఆమెను ఆదరంతో లేవనెత్తాడు. యాదవులు అందరూ ఆ బిడ్డకు అనేక అలంకారాలు బహుమతులుగా సమర్పించారు. శ్రీకృష్ణుడు అందరూ వింటూ ఉండగా " పాండవవంశము అంతరించింది అనుకున్న తరుణంలో జన్మించిన ఈ బాలుడికి పరీక్షిత్తు అని నామకరణము చేస్తున్నాను " అని ప్రకటించాడు. ఆ విధంగా నీ తండ్రికి పరీక్షిత్తు అనే నామము సార్థకము అయింది. జనమేజయ మహారాజా మీ వంశము అలా శ్రీకృష్ణుడి కృప వలన వర్ధిల్లింది " అని వైశంపాయనుడు చెప్పాడు.

పాండవులకు శ్రీకృష్ణాదులు స్వాగతం చెప్పుట

[మార్చు]

పరీక్షిత్తు జన్మించిన తరువాత ఒక మాసము తరువాత ధర్మరాజు ససైన్యముగా భీమార్జున నకుల సహదేవులతో వేలాది వాహనములకు ఎక్కించిన బంగారురాశులతో హస్థినాపురము చేరుకున్నారు. వారికి స్వాగత సన్నాహాలు చేయమని శ్రీకృష్ణుడు యుయుత్సుడు, విదురుని నియోగించాడు. హస్థినాపుర వీధులను శోభాయమానముగా అలంకరించారు. తోరణాలు కట్టారు, అరటి స్థంభాలు కట్టారు, కస్తూరితో కళ్ళాపి చల్లారు. ముత్యాల ముగ్గులు పెట్టారు. పూర్ణకుంభముతో పాండవులకు స్వాగతము పలికారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవులు, యుయుత్సుడు, విదురుడు పాండవులకు ఎదురేగి స్వాగతము చెప్పారు. పాండవులు సువర్ణరాశులతో సహా హస్థినాపురప్రవేశము చేసారు. ధర్మరాజు తన తమ్ములతో ముందుగా ధృతరాష్ట్ర, గాంధారులను దర్శించారు. తరువాత కుంతీదేవిని దర్శించుకుని తరువాత సభామండపము చేరారు. పాండవులు సభామండపము చేరి కొలువుతీరగానే పరీక్షిత్తు జననవిశేషాలను విన్నారు. ఉత్తర ప్రసవించిన మృతశిశువును శ్రీకృష్ణుడు పునరుజ్జీవితుడిని చేసి అతడికి పరీక్షిత్తు అని నామకరణము చేసిన విషయము విని పాండవులు ఆనందాశ్చర్యాలకు లోను అయ్యారు. తమ వంశమును నిలబెట్టిన శ్రీకృష్ణుడిని వారు వేనోళ్ళ కొనియాడారు.

అశ్వమేధయాగారంభం

[మార్చు]
దస్త్రం:Krishna Advising on the Horse Sacrifice.jpg.
ధర్మరాజుకు అశ్వమేధ యాగము చేయమని సలహా ఇస్తున్న శ్రీకృష్ణుడు

తరువాత కొన్ని రోజులకు పాండవుల వద్దకు వ్యాసుడువచ్చాడు. పాండవులు అతడికి ఎదురేగి సత్కరించారు. ధర్మరాజు " వ్యాసుడిని చూసి " మునీంద్రా ! తమరి దయవలన అశ్వమేధయాగముకు కావలసిన ధనము సమకూరింది. తమరు అనుమతిస్తే యాగమును ఆరంభిస్తాను " అని అడిగాడు. వ్యాసుడు " ధర్మనందనా ! నీకు శుభము అగుగాక. అశ్వమేధయాగము నిర్విజ్ఞముగా నెరవేరుగాక " అని ఆశీర్వదించాడు. ధర్మరాజు " శ్రీకృష్ణా ! ఆపద్భాంధవా ! నీ కృపాకటాక్షములతో భారత యుద్ధములో విజయము సాధించాము. ఈ అశ్వమేధయాగము కూడా నీ చేతుల మీదుగా జరిపించి మమ్ము కృతార్ధులను చెయ్యి. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీనీవె. నీవు ఆజ్ఞాపించు మేము నీ అజ్ఞానువర్తులమై అశ్వమేధయాగమును నెరెవేరుస్తాము " అని శ్రీకృష్ణుడిని ధర్మరాజు ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! వ్యాసుడు ఆజ్ఞాపించాడు. మనము యజ్ఞము నిర్వహిస్తాము. ఈ యాగముతో నీ పరితాపము పటాపంచలు ఔతుంది. అన్ని ఫలముల కంటే అశ్వమేధయాగ ఫలము మేలైనది అని నేను నీకు ముందే చెప్పాను. నేను నిన్ను అశ్వమేధయాగము చెయ్యమని చెప్పాను అందుకని ఇక నా అనుజ్ఞ నీకు అవసరము లేదు. యజ్ఞకర్తవైన నీవు ,మమ్ము ఆజ్ఞాపించు. మేము నీ ఆజ్ఞానువర్తులమై యాగమును నిర్వహిస్తాము " అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు వ్యాసుడితో " మహానుభావా ! యాగదీక్షకు తగిన ముహూర్తము మీరే నిర్ణయించి తగిన సంస్కారమును ఆచరించండి " అని ప్రార్థించాడు. వ్యాసుడు " ధర్మనందనా ! ఈ యాగమును నేను, యజ్ఞవల్క్యుడు, పైలుడు ముగ్గురమూ కలిసి నిర్వహిస్తాము. రాబోవు చైత్ర మాసములో పౌర్ణమి నాడు దివ్యమైన ముహూర్తము. యజ్ఞాశ్వము కొరకు అశ్వ నిపుణులను నియమించు. యాగములో వెదోక్తముగా విడువబడిన అశ్వము ఈ భూమండలము అంతటా తిరుగుతూ ని యశస్సును భూమండలము అంతా వ్యాపింపచేస్తుంది. యాగముకు కావలసిన సంభారములు సిద్ధము చేయించు " అని ఆదేశించాడు వ్యాసుడు. ధర్మరాజు అశ్వశాస్త్రము తెలిసిన వారిని పిలిపించి సకల శుభలక్షణములు కలిగిన అశ్వమును ఎంపిక చేసి తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు. యజ్ఞముకు కావలసిన పనిముట్లను బంగారముతో చేయించమని ఆజ్ఞలు జారీచేసారు. త్వరలోనే ఉత్తమాశ్వము యజ్ఞానికి కావలసిన పనిముట్లు తయారయ్యాయి. ధర్మరాజు వ్యాసుడి వద్దకు వెళ్ళి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అని తెలియచేసాడు. వ్యాసుడు అశ్వమును చూసి తృప్తి చెందాడు. ధర్మరాజు " మహర్షీ ! ఈ అశ్వమును వెదోక్తముగా అర్చించి వదలిన తరువాత దీని వెంట దీని రక్షణార్ధము వెళ్ళవలసిన వీరుడెవరో మీరు నిర్ణయించండి. వ్యాసుడు " ధర్మనందనా ! వేరెవరు దివ్యాస్త్రకోవిదుడు, బుద్ధిమంతుడు, పరాక్రమశాలి, శౌర్యవంతుడు అయిన అర్జునుడే అందుకు సమర్ధుడు. నీవు యాగదీక్షలో ఉంటావు. భీముడు, నకులుడు రాజ్యరక్షణ భారము వహిస్తారు. సహదేవుడు అంతఃపుర రక్షణభారము వహిస్తాడు " అని వ్యాసుడు చెప్పాడు. ధర్మరాజు " అర్జునా ! వ్యాసుడి మాటలు విన్నావు కదా ! ఈ యాగశ్వమును రక్షించ వలసిన బాధ్యత నీదే. ఈ పని వేరెవరికి సాధ్యము కాదు. కనుక యాగాశ్వము రక్షణబాధ్యత వహిస్తూ అశ్వము సంచరించు ప్రాంతాలలో ఉన్న రాజులకు ఇది యాగదీక్షలో ఉన్న యాగాశ్వము అని చెప్పి దీనిని నిరాటంకంగా అన్ని ప్రాంతంలో తిరిగేలా చూడు. ఈ యాగాశ్వమును పట్టుకున్న రాజులను చంపక వారిని యాగముకు ఆహ్వానించు " అని ధర్మరాజు అర్జునుడితో చెప్పాడు. వ్యాసుడు ఆదేశించిన విధముగా రాజ్య రక్షణకై భీముని, నకులుని నియోగించి అంతఃపుర రక్షణకు సహదేవుడిని నియమించాడు. మిగిలిన పనులకు ఆయారంగాలలో నిష్ణాతులను నియమించాడు. ధృతరాష్ట్ర, గాంధారిల అనుమతి తీసుకున్నాడు. తల్లి కుంతీదేవి అనుమతి తీసుకుని ద్రౌపదితో చేరి యాగము చేయడానికి ఉద్యుక్తుడు అయ్యాడు " అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడని సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.

బయటి లింకులు

[మార్చు]