ఆంగ్లో-మైసూరు యుద్ధాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్లో మైసూరు యుద్ధాలు అన్నవి 18వ శతాబ్ది ఆఖరు మూడు దశాబ్దాల పాటు మైసూరు రాజ్యానికి, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ (ప్రధానంగా మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాతినిధ్యం వహించింది), మరాఠా సమాఖ్యహైదరాబాద్ నిజాంల కూటమికీ నడుమ జరిగిన యుద్ధాలు. హైదర్ అలీ, అతని వారసుడు టిప్పు సుల్తాన్ నలు దిక్కులా - బ్రిటీష్ వారు దక్షిణం, తూర్పు, పశ్చిమ దిక్కులుగా మూడు వైపుల నుంచి, మరాఠాలు, నిజాం ఉత్తర దిక్కు నుంచి చేసిన దాడిని ఎదుర్కొంటూ యుద్ధాలు చేశారు.[1] నాలుగవ యుద్ధం హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వంశ పాలనను అంతమొందిస్తూ, మైసూర్ సామ్రాజ్యాన్ని అప్పటికే భారతదేశంలో ప్రధాన భాగంపై నియంత్రణ సాధించిన బ్రిటీష్ వారికి ప్రయోజనం చేకూర్చేట్టు విభజించేలా నిర్ణయాత్మకంగా ముగిసింది. 1799లో ఆఖరి ఆంగ్లో-మైసూరు యుద్ధంలో టిప్పుసుల్తాన్ చనిపోయాడు.

1762లో హైదర్ అలీ చిత్రపటం, అయితే "భారతదేశంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తన సైన్యానికి నాయకత్వం వహించి పోరాడిన మరాఠాల సర్వసైన్యాధ్యక్షుడు" అని తప్పుగా రాసివుంది. (ఫ్రెంచ్ పెయింటింగ్)

మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం

[మార్చు]

మొదటి ఆంగ్లో-మైసూరు యుద్ధం (1767-69)లో హైదర్ అలీ దాదాపు మద్రాసును ముట్టడించగలిగి, కంపెనీకి వ్యతిరేకంగా కొంతమేరకు విజయాన్ని సాధించగలిగాడు. హైదరాబాద్ నిజాంను బ్రిటీష్ వారు హైదర్ పై దాడిచేసేలా ఒప్పించగలిగారు. కానీ నిజాం బ్రిటీష్ వారి పక్షాన్ని మార్చివేసి హైదర్ అలీకి చివరి నిమిషంలో మద్దతు ఇచ్చాడు. కానీ అది తాత్కాలికమే, 1768 ఫిబ్రవరిలో నిజాం బ్రిటీష్ వారితో కొత్త ఒప్పందంపై సంతకం చేశాడు. పశ్చిమాన దాడిచేస్తున్న కంపెనీ బొంబాయి సేనలు, వాయువ్యం నుంచి దాడిచేస్తున్న మద్రాసు సేనలతో హైదర్ ఒకేమారు పోరాడాడు. హైదర్ మద్రాసు దిక్కుగా చేసిన దాడి ఫలితంగా మద్రాసు ప్రభుత్వం శాంతి కోరుతూ, మద్రాసు ఒప్పందంపై సంతకం చేశారు.

రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం

[మార్చు]

రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం (1780–84)లో యుద్ధ పక్షాల మధ్య అదృష్టం అటూ ఇటూ ఊగుతూండగా, రక్తసిక్తమైన పోరాటాలు జరిగాయి. 1780 సెప్టెంబరు నెలలో పొల్లిలూర్ యుద్ధంలో టిప్పు బైలీని, 1782 ఫిబ్రవరిలో కుంభకోణం వద్ద మద్రాసు సర్వసైన్యాధ్యక్షుడు బ్రైత్ వైట్ ని ఓడించాడు. వీరిద్దరినీ యుద్ధఖైదీలుగా శ్రీరంగపట్నం తీసుకువచ్చారు. ఈ యుద్ధంలో బ్రిటీష్ సైన్యాధ్యక్షుడు సర్ ఐర్ కూటె హైదర్ అలీని పోర్టో నోవో, ఆర్ని యుద్ధాల్లో ఓడించాడు. తన తండ్రి హైదర్ అలీ మరణానంతరం, టిప్పు యుద్ధాన్ని కొనసాగించాడు. చివరికి యుద్ధం 1784 మార్చి 11న యుద్ధానికి పూర్వం ఉన్న యధాస్థితిని కొనసాగిస్తూ కుదిరిన మంగళూరు ఒప్పందంతో ముగిసింది. ఇదే భారత చరిత్రలో చివరిగా ఒక భారతీయ పాలకుడు బ్రిటీష్ వారితో సమాన స్థాయిలో కుదుర్చుకున్న బ్రిటీష్-భారతీయుల ఒప్పందం. 1787 ఏప్రిల్లో జరిగిన గజేంద్రగఢ్ ఒప్పందం మరాఠాలతో సంఘర్షణను ముగించింది.

మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం

[మార్చు]

మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం (1790–92)లో ఫ్రెంచి వారి మిత్రుడు, మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్, బ్రిటీష్ పాలకులతో మైత్రి ఒప్పందంలో ఉన్న తిరువాన్కూరు రాజ్యంపై దాడిచేశాడు. బ్రిటీష్ దళాలను గవర్నర్-జనరల్ కారన్ వాలీసు స్వయంగా నేతృత్వం వహించి నడిపాడు. ఈ సందర్భంగా జరిగిన యుద్ధం మూడు సంవత్సరాల పాటు కొనసాగి, మైసూరు ఘోరంగా పరాభవం చెందడంతో ముగిసింది. 1792లో శ్రీరంగపట్నం ముట్టడి తర్వాత, టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగభాగం వరకూ బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి, దాని మిత్రరాజ్యాలకు ఒప్పగించేట్టుగా జరిగిన శ్రీరంగపట్నం ఒప్పందంతో ముగిసింది. యుద్ధానికి ముందు బ్రిటీషర్లు ఈ ప్రాంతంలో మైసూరు ప్రభావాన్ని ముగింపు పలకాలని ప్రయత్నాలు సాగిస్తూండగా, అదే సమయంలో మలబారును రక్షించుకునేందుకు టిప్పు సుల్తాన్ కొచ్చిన్ ప్రాంతంలో డచ్చి వారి నుంచి కణ్ణనూరు, ఐకాట్ కోటలు కొనుక్కోవాలని భావించాడు. ఐతే బ్రిటీషర్లతో మిత్రునిగా వ్యవహరిస్తున్న తిరువాన్కూరు రాజు ఈ కోటలని డచ్చి వారి నుంచి కొని, టిప్పు ఆగ్రహానికి కారణమయ్యాడు. 1790 ఏప్రిల్లో టిప్పు తిరువాన్కూరుపై దాడిచేయగా, కారన్ వాలీసు మైసూరు మీద భారీ సైన్యంతో దాడిచేశాడు.

నాలుగవ ఆంగ్లో-మైసూరు యుద్ధం

[మార్చు]

1799లో జరిగిన నాలుగవ ఆంగ్లో మైసూరు యుద్ధం టిప్పు సుల్తాన్ మరణానికి, మైసూరు రాజ్య ప్రాంతాలు మరింత కుంచించుకుపోవడానికి కారణమైంది. ఫ్రెంచి వారితో మైసూరు మైత్రి ఈస్టిండియా కంపెనీకి ప్రమాదకరంగా భావించిన కుంఫిణీ వారు, మైసూరును నాలుగువైపులా ముట్టడించారు. టిప్పు సైన్యం ఈ యుద్ధంలో నలుగురు శత్రు సైనికులకు ఒకడు చొప్పున ఎదుర్కోవాల్సివచ్చింది. మైసూరు 35 వేలమంది సైనికులతో ఎదుర్కోగా, 60 వేల మంది బ్రిటీష్ సైనికులు దాడిచేశారు. ఉత్తర దిక్కుగా హైదరాబాద్ నిజాం, మరాఠాలు దండెత్తారు. శ్రీరంగపట్నం ముట్టడి (1799)లో బ్రిటీష్ వారు నిర్ణయాత్మక విజయాన్ని సాధించారు. టిప్పు సుల్తాన్ నగరాన్ని రక్షించుకునే క్రమంలో మరణించాడు. మైసూరు భూభాగాల్లో చాలావరకూ ఈస్టిండియా కంపెనీ, నిజాం, మరాఠాలు స్వాధీనం చేసుకున్నారు. మైసూరు, శ్రీరంగపట్నం చుట్టూ ఉన్న కేంద్ర భాగాలకు పాలకులుగా ఒడయార్ వంశీకులను పున:స్థాపించారు. హైదర్ అలీ వాస్తవాధికారాన్ని చేపట్టి పరిపాలకుడిగా మారేంతవరకూ మైసూరు పాలకులుగా ఒడయార్లే ఉండేవారు. ఒడయార్లు 1947లో రాజ్యం భారత దేశంలో కలిసేంతవరకూ మైసూరు రాజ్యానికి పరిపాలకులుగా కొనసాగారు.

తూర్పు భారతదేశంలోనూ, గంగా మైదానంలోనూ బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యాన్ని స్థిరపరిచిన ప్లాసీ (1757), బక్సర్ (1764) యుద్ధాల తర్వాత దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ ఆధిపత్యాన్ని ఏర్పరిచి దక్షిణాసియాలో బ్రిటీష్ అధికారాన్ని స్థిరపరిచడంలో ఆంగ్లో-మైసూరు యుద్ధాలు (1766-1799) కీలకమైనవి. వీటి తర్వాత డెక్కన్ పీఠభూమిపై బ్రిటీష్ విస్తరణకు ఆంగ్లో-మరాఠా యుద్ధాలు (1775-1818) ఆంగ్లో-సిక్ఖు యుద్ధాలు (1845-1849) దక్షిణాసియా మీద బ్రిటీష్ ఆధిపత్యాన్ని పరిపూర్తి చేశాయి (ఐతే ఆఫ్ఘాన్లు, బర్మీస్ జాతుల్లో కొందరి ప్రతిఘటన 1880ల వరకూ సాగింది).

రాకెట్లు

[మార్చు]

టిప్పు సుల్తాన్ పొల్లిలూర్ యుద్ధంలో వాడిన మైసూరియన్ రాకెట్లు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ అంతకుముందు వాడిన మరే ఇతర యుద్ధ రాకెట్ల కన్నా చాలా ఆధునికమైనవి. ప్రొపెల్లెంట్ ను పట్టుకునేందుకు ఇనుప గొట్టాల వాడకం అందుకు కారణం. మైసూరు సైన్యం అధిక పీడనాన్ని ఉపయోగించి మిస్సైల్స్ సుదూరానికి చేరేలా (దాదాపు 2 కిలోమీటర్ల దూరం) ప్రయోగించారు. నాలుగవ ఆంగ్లో-మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ చనిపోయాకా, కోటను పట్టుకని మైసూరియన్ ఇనుప రాకెట్లు పట్టుకున్నాకా ఈ సాంకేతికత స్ఫూర్తితో కాంగ్రేవ్ రాకెట్ల నిర్మాణం చేశారు. నెపోలియనిక్ యుద్ధాల్లో ఆంగ్లేయులు ఉపయోగించారు.[2]

మూలాలు

[మార్చు]
  1. Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. pp. 172–181. ISBN 9788131300343.
  2. Roddam Narasimha (1985). Rockets in Mysore and Britain, 1750–1850 A.D. Archived 3 మార్చి 2012 at the Wayback Machine National Aeronautical Laboratory and Indian Institute of Science.

చదవదగిన గ్రంథాలు

[మార్చు]
  • Brittlebank, Kate. Tipu Sultan's Search for Legitimacy: Islam and Kingship in a Hindu Domain (Delhi: Oxford University Press, 1997)
  • Cooper, Randolf GS. "Culture, Combat, and Colonialism in Eighteenth-and Nineteenth-Century India." International History Review (2005) 27#3 pp: 534-549.
  • Jaim, HM Iftekhar, and Jasmine Jaim. "The Decisive Nature of the Indian War Rocket in the Anglo-Mysore Wars of the Eighteenth Century." Arms & Armour (2011) 8#2 pp: 131-138.
  • Kaliamurthy, G. Second Anglo-Mysore War (1780-84) (Mittal Publications, 1987)
  • Roy, Kaushik. War, culture and society in early modern South Asia, 1740-1849 (Taylor & Francis, 2011)

ప్రాచుర్య సంస్కృతిలో

[మార్చు]
  • Regan S. Gidwani, The Sword of Tipu Sultan (2014), a novel linked to TV series