ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం
సంకేతాక్షరంAPLA
స్థాపన1914 ఏప్రిల్ 10
వ్యవస్థాపకులుఅయ్యంకి వెంకట రమణయ్య,
సూరి వెంకట నరసింహ శాస్త్రి
ప్రధాన
కార్యాలయాలు
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఉత్పాదనsగ్రంధాలయ సర్వస్వము
మాసపత్రిక, పుస్తకాలు,
సేవలు
సేవలుగ్రంథాలయ సంబంధిత
కార్యక్రమాలు, సేవలు
సభ్యులుజీవితకాల, వార్షిక, సంస్థాగత,
వ్యక్తిగత సభ్యులు
అధికారిక భాషతెలుగు
అధ్యక్షుడుకె.సి. కల్కురా
కార్యదర్శిరావి శారద
తొలి పేరు: ఆంధ్రదేశ గ్రంధ భాండాగార సంఘం

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్ర స్థాయి గ్రంథాలయ సంఘం. దీన్ని 1914 ఏప్రిల్ 10 న విజయవాడలో స్థాపించారు. [1] ప్రజలలో అక్షరాస్యత, జ్ఞానం, అవగాహనలను వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఈ సంఘం ఉద్భవించింది. గ్రంథాలయోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ఈ సంఘం మొదట నుండి పనిచేస్తోంది.[2]

సంఘ ఆవిర్భావం[మార్చు]

రామమోహన పబ్లిక్ లైబ్రరీ వారు 1914 ఏప్రిల్ 10 న విజయవాడలో (పూర్వం: బెజవాడ), "ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ లైబ్రరీ ఆర్గనైజర్స్"ను నిర్వహించారు. అదే రోజున నిర్వహించిన ఆంధ్ర గ్రంథాలయ సమావేశ (ఆంధ్ర లైబ్రరీ కాంగ్రెస్) ఫలితంగా ఆంధ్ర గ్రంథాలయోద్యమం, ఆంధ్రప్రదేశ్ గ్రంథ భాండాగార సంఘం (అసోసియేషన్ ఆఫ్ లైబ్రరీస్ ఆఫ్ ఆంధ్ర ఏరియా) ఉనికిలోకి వచ్చాయి. అయ్యంకి వెంకటరమణయ్య, సూరి వెంకట నరసింహ శాస్త్రి ఈ సంఘాన్ని ప్రారంభించారు. ఈ మహాసభలోనే, సంఘపు మొదటి అధ్యక్షుడిగా దీవాన్ బహదూర్ మోచర్ల రామచంద్రరావు పంతులు, మొదటి కార్యదర్శులుగా, అయ్యంకి వెంకటరమణయ్య, నాళం కృష్ణారావు ఎన్నికయ్యారు. [3] చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు దీనికి అధ్యక్షత వహించారు. ఆ సందర్భంగా ఆయన వెలువరించిన సందేశ గీతాన్ని అయ్యంకి వెంకటరమణయ్య 'గ్రంథాలయ వేదం'గా అభివర్ణించారు.

గ్రంథాలయ వేదం[మార్చు]

వాయువెల్లవారికి ఎట్లు స్వాధీనమై యున్నదో
జ్ఞానమును నట్లు స్వాధీనమై యుండవలెను

ఉదక మెల్ల వారికి నెట్లు సేవ్యమై యున్నదో
జ్ఞానమును నట్లు సేవ్యమై యుండవలెను

సూర్య చంద్ర మండలముల తేజస్సు ఎల్ల వారికి నెట్లు సౌఖ్యప్రదముగ నున్నదో
జ్ఞానమును నట్లు సౌఖ్యప్రదముగ నుండవలెను

-చిలకమర్తి లక్ష్మి నరసింహం

ఇందులో కేవలం గ్రంధభాండాగారాలే కాకుండా మిగిలిన ఇతర రంగాల నుండి సభ్యులు ఏర్పడటముతో తదుపరి ఇది ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం హైదరాబాదు గ్రంధాలయ సంఘాన్ని విలీనం చేసుకొని ఇది ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘంగా ఏర్పడింది.[4]

సంఘ లక్ష్యం[మార్చు]

పూర్తి అక్ష్యరాస్యత సాధించడం కొరకు కృషి చేయడం, రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలోను గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం, ప్రజలకు ఉచితంగా సమాచారం అందించడం, ప్రజలలో చదివే అలవాటును పెంపొందించడం, గ్రంథాలయాలను ఆధునీకరించుడం మొదలైనవి ఈ సంఘ లక్ష్యాలు. [5]

మార్గదర్శకులు[మార్చు]

సంఘ అధ్యక్షులు[మార్చు]

ఈ క్రింది వారు అంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు.[4]

 1. మోచర్ల రామచంద్రరావు (1914-4-10 నుండి 1919-11-15)
 2. కాశీనాధుని నాగేశ్వరరావు (1919-11-16 నుండి 1923-5-2)
 3. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య (1923-5-3 నుండి ------- )
 4. బుర్రా శేషగిరిరావు (1931-6-30 నుండి 1933-8-9)
 5. భూపతిరాజు సీతారామరాజు (1933-8-10 నుండి 1934-1-19)
 6. వేమవరపు రామదాసు పంతులు (1934-1-20 నుండి 1934-12-24)
 7. దాసు త్రివిక్రమరావు (1934-12-25 నుండి 1936-3-14)
 8. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు (1936-3-15 నుండి 1960-2-29)
 9. కోదాటి నారాయణరావు (1960-3-19 నుండి 1979-10-6; 1981-8-30 నుండి 1984-2-11; 1988--8-13 నుండి 2002-11-19)
 10. పాతూరి నాగభూషణం (1979-10-7 నుండి1981-8-29)
 11. నాగినేని వెంకయ్య (1984-2-12 నుండి 1988-6-4)
 12. సి.హెచ్.వి.పి. మూర్తిరాజు (2003-2-23 నుండి 2011-4-10)
 13. కె.చంద్రశేఖర్ కల్కూర (2011-4-11 నుండి ----------- )

సంఘ కార్యదర్శులు[మార్చు]

ఈ క్రింది వారు సంఘ కార్యదర్శులుగా వ్యవహరించారు [4]

 1. అయ్యంకి వెంకటరమణయ్య (1914-4-10 నుండి 1938-7-23)
 2. పాతూరి నాగభూషణం (1938-7-24 నుండి 1979-10-6)
 3. సూర్యదేవర రాజ్యలక్ష్మీ దేవి (1979-10-7 నుండి 1981-8-29)
 4. గద్దె రామమూర్తి (1981-8-30 నుండి 1988-8-12)
 5. వెల్లంకి చంద్రపాల్ (1988-8-13 నుండి 1994-12-25)
 6. రావి శారద (1994-12-26 నుండి ----------- )

గ్రంథాలయోద్యమంలో తొలి ముద్రలు[మార్చు]

గ్రంథాలయోద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం అనేక విషయాల్లో తొలి అడుగు వేసి, యావద్దేశానికి మార్గ దర్శకత్వం వహించింది. ఆ తొలి అంగల్లో కొన్ని:

 1. భారతదేశంలోనే మొట్ట మొదటి గ్రంథాలయ సంఘం. 1914 లో స్థాపించబడింది.
 2. 1915 లో మొదటగా 'ఆంధ్ర గ్రంథాలయాల సూచికను' సంకలనం చేసి ప్రచురించింది.
 3. గ్రంథాలయోద్యమాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళే ఉద్దేశంతో స్థానిక గ్రంథాలయ పత్రిక - "గ్రంథాలయ సర్వస్వం"ను తెలుగులో సంఘం 1915 లో ప్రారంభించింది. ఈ ప్రాంతీయ భాషా పత్రిక భారతదేశంలోనే మొట్టమొదటి స్థానిక గ్రంథాలయ పత్రిక. ఇది ఈనాటికీ ప్రతి నెలా వెలువడుతోంది.
 4. అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘం ఏర్పాటు
 5. రాష్ట్రంలోని గ్రంథాలయాలలో నాణ్యమైన సేవలను వినియోగదారులకు అందించడానికి, దేశములోనే మొదటగా గ్రంథాలయ శిక్షణ తరగతులను సంఘం నిర్వహించడం ప్రారంభించింది. ఇప్పుడు కూడా సంఘం ఆ శిక్షణా తరగతులను కొనసాగిస్తున్నది.
 6. భారతదేశంలోనే మొదటి ఆంగ్ల గ్రంథాలయ పత్రికను ప్రచురించింది.
 7. ప్రజలలో గ్రంథాలయోద్యమం గురించిన అవగాహన పెంపొందించుటకు సంఘం తీర్థయాత్రలను నిర్వహించింది
 8. ప్రజలలో అవగాహన, జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ప్రపంచంలోనే మొట్టమొదటగా బోటు గ్రంథాలయాల సేవలను ప్రవేశపెట్టింది.
 9. బెంగాల్ గ్రంథాలయ సంఘం, మద్రాస్ గ్రంథాలయ సంఘం వంటివెన్నో ఏర్పాటు చెయ్యడంలో కీలకపాత్ర పోషించింది.
 10. గ్రంథాలయాలకు నాణ్యమైన పుస్తకాలు సరఫరా చేయడం కొరకు సంఘం 1944లో పుస్తక దుకాణాన్ని మొదలుపెట్టింది.
 11. 1946 లో ఆంధ్ర గ్రంథాలయ ధర్మసంస్థ (ట్రస్ట్) ఏర్పాటు భారతదేశంలో గ్రంథాలయ ఉద్యమ చరిత్రలో మరొక మైలురాయి. కొమ్మా సీతారామయ్య దాతృత్వ ఫలితముగా గ్రంథాలయ సంఘానికి మొదటగా ఒక భవనం ఏర్పడింది. అదే "సర్వోత్తమభవన్". దీనికి అప్పటి సంఘ అధ్యక్షుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గౌరవార్ధం వారి పేరు పెట్టారు. దీనిని 1949 లో ప్రారంభించారు. [3]

సంఘ కార్యక్రమాలు[మార్చు]

గ్రంథాలయ వృత్తి, వయోజన విద్య, వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలను ప్రచురించింది. ప్రాంతీయ భాషలో గ్రంథాలయ పత్రిక "గ్రంథాలయ సర్వస్వం"ను ప్రచురించడం, విద్యాబోధన, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం, వివిధ గ్రంథాలయాల సజావుగా పనిచేయడానికి తగిన సమాచారాన్ని అందించడం వంటి ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

దస్త్రం:Sgapla.jpg
సర్వోత్తమ గ్రంధాలయం
 • గ్రంథాలయ విజ్ఞాన శాస్త్రంలో శిక్షణ: 1920 వ దశకంలోనే, అయ్యంకి వెంకట రమణయ్య, గ్రంథాలయ విజ్ఞాన శాస్త్రంలో శిక్షణా తరగతులను నిర్వహించడం ప్రారంభించాడు. తరువాత వావిలాల గోపాల కృష్ణయ్య, కళాప్రపూర్ణ పాతూరి నాగభూషణం, కలిదిండి నరసింహరాజు వంటి ప్రముఖ వ్యక్తులు శిక్షణా తరగతులను కొనసాగించారు. పాతూరి నాగభూషణం చొరవతో ఈ శిక్షణను, ఓ క్రమమైన పాఠ్య ప్రణాళికతో నిర్వహిస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందింది. విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను అందచేస్తున్నారు. ఈ గ్రంథాలయ పాఠశాలకు "పాతూరి నాగభూషణం స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్" అని పేరు పెట్టారు. ఈ సంఘం గ్రంథాలయ యాంత్రీకరణ, కంప్యూటర్ సహాయంతో కార్యక్రమాల నిర్వహణ అనుభవంతో ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాలలో అర్ధ-వార్షిక సర్టిఫికేట్ (CLISc) అధ్యయనాలు ప్రతి సంవత్సరం జూన్, డిసెంబరు నెలలలో రెండుసార్లు నిర్వహిస్తోంది. 5 నెలల శిక్షణ అనంతరం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్ అందిస్తుంది.[6]
 • ఇతర గ్రంథాలయాలకు సహకారం: గ్రంథాలయాలను కొత్తగా స్థాపించునప్పుడు, వారికి నిబంధనలు, ఉప-చట్టాలు రూపొందించడము, నమోదు చేయు విధానాలు, నిర్వహించాల్సిన పద్దు పుస్తకాల (రిజిస్టర్లు) గురించి అవగాహన కల్పించడం మొదలగు విషయాలలో తమ సహకారాన్ని అందింస్తోంది
దస్త్రం:Apjcl.jpg
అబ్దుల్ కలాం పిల్లల గ్రంధాలయం
 • సర్వోత్తమ గ్రంథాలయం: సంఘం తన ప్రాంగణంలో సర్వోత్తమ గ్రంథాలయాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడ అన్ని విషయాలపై పుస్తకాలు ఉన్నాయి. ఈ గ్రంధాలయం సెలవు లేకుండా 365 రోజులూ ఉ.8.00 గం నుంచి రా.8.00 గం వరకూ పనిచేస్తుంది. సెలవుదినాలలో మాత్రము ఉ 9.00 గం. నుంచి సా.5.00 గం. వరకూ సేవలనందిస్తుంది.
  ఈ గ్రంథాలయానికి రాలేని ప్రజల కోసం సంచార గ్రంథాలయ సేవలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి "పాతూరి సంచార గ్రంథాలయం (మొబైల్ లైబ్రరీ)" అని పేరు పెట్టారు. ఇది సెప్టెంబరు 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం రోజున ప్రారంభించారు. ఇది విజయవాడ లోని 6 ప్రాంతాలలో నడుస్తోంది.
 • సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివంగత అయ్యంకి వెంకట రమణయ్య పేరిట, సర్వోత్తమ గ్రంథాలయంలో "అయ్యంకి రీడింగ్ రూమ్" అనే ఒక ఎయిర్ కండిషన్డ్ రీడింగ్ గదిని ప్రారంభించింది. మొత్తం 365 రోజులు ఉదయం 8 నుండి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంచుతారు.
 • పుస్తకాల ఉచిత పంపిణీ పథకం: ప్రజలలో చదివే అలవాటును పెంపొందించడానికి, పుస్తకాల విలువను పెంచడానికీ ఈ సంఘం 2015 ఏప్రిల్ 23 న విజయవాడలో పుస్తకాల ఉచిత పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ఈ సంఘం వివిధ రచయితలు, ప్రచురణకర్తలు, వ్యక్తుల నుండి పుస్తకాలను విరాళంగా సేకరించి ఆసక్తి కలవారికీ, అవసరమైన వారికీ పుస్తకాలను ప్రతి సంవత్సరం వారి పుస్తక ప్రదర్శన ద్వారా పంపిణీ చేస్తోంది. ఈ ప్రయోజనం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, జిల్లా ప్రధాన కార్యాలయాలలో పుస్తకాల హుండీలు / సేకరణ పెట్టెలు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఉచితంగా పంపిణీ చేసే పుస్తకాల సంఖ్య పెరగడమే కాకుండా ఈ కార్యకలాపాలు రాష్ట్రంలోని అనేక ఇతర ప్రదేశాలకు కూడా విస్తరించాయి. 2015 లో మొదలుపెట్టి ఈ సంఘం, 2019 నాటికి లక్షన్నర పుస్తకాలను పంపిణీ చేసింది.
 • అబ్దుల్ కలాం పిల్లల గ్రంథాలయం: భారత మాజీ అధ్యక్షుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త దివంగత ఎపిజే అబ్దుల్ కలాం 85వ జన్మదిన సందర్భంగా సర్వోత్తమ గ్రంథాలయం 2016 అక్టోబరు 15 న ప్రత్యేక పిల్లల గ్రంథాలయాన్ని (అబ్దుల్ కలాం చిల్డ్రన్స్ లైబ్రరీ) ప్రారంభించింది. ఇక్కడ పిల్లల పుస్తకాలను సేకరించుటమే కాకుండా, వారిలో సృజనాత్మకతను పెంపొందించడానికి పిల్లలకు సంబంధించిన కార్యకలాపాలను ఆదివారం రోజున నిర్వహిస్తోంది. [7]
 • సమావేశాలు, సదస్సులు: ఈ సంఘం 1914 సంవత్సరం నుండి ప్రముఖ పండితుల నాయకత్వంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల సహకారంతో సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తోంది. నలభైకి పైగా సమావేశాలు / సెమినార్లు నిర్వహించింది.[8]

సంఘ కార్యవర్గం[మార్చు]

2020 సంవత్సరం నాటికి కిందివారు సంఘ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు.

 • అధ్యక్షులు - కె.చంద్ర శేఖర కల్కురా
 • ఉపాధ్యక్షులు - కె. బుచ్చిరాజు; వి. కేశవ రావు
 • కార్యదర్శి - రావి శారద [7]

సంఘ స్వర్ణోత్సవాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ స్వర్ణోత్సవాలు విజయవాడ సర్వోత్తమ భవనంలో 1964 మే 26, 27 తేదీలలో రెండు రోజులు జరిపారు. మొదటి రోజు రామమోహన గ్రంథాలయంలో సరస్వతీ పూజతో కార్యక్రమాన్ని ఆరంభించారు. అయ్యంకి వెంకటరమణయ్య జ్యోతిని వెలిగించి, కమిటీ కార్యదర్శి చెన్నుపాటి శేషగిరిరావుకు అందించగా, పుర ప్రముఖులు వెంటరాగా వూరేగింపుతో జ్యోతిని సర్వోత్తమ భవనం చేర్చి సంఘ కార్యదర్శి పాతూరి నాగభూషణంకి అందించారు. తరువాత కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ అధ్యక్షతన కవితా గోష్ఠి జరిగింది. గోష్ఠిలో పాతూరి నాగభూషణంతో పాటు, అనేక మంది కవులు పాల్గొన్నారు. ఆనాటి సాయంత్రం ప్రారంభోత్సవ మహాసభ ఆచార్య రాయప్రోలు సుబ్బారావు అధ్యక్ష్యత వహించారు. అప్పటి రాష్ట్ర న్యాయశాఖామంత్రి పి.వి.నరసింహారావు స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంఘ వ్యవస్థాపకులు అయ్యంకి వెంకటరమణయ్య, కొమ్మా సీతారామయ్యలను సన్మానించారు. రెండవరోజు వ్యాసపఠన కార్యక్రమాలను సంఘాధ్యక్షులు కోదాటి నారాయణరావు, గోపరాజు రామచంద్రరావుల అధ్యక్షతన ఏర్పాటు చేసారు. తదుపరి గ్రంథాలయ కార్యకర్తల సమావేశం, బహిరంగ సభ జరిగింది. బహిరంగ సభకు ఆంధ్రప్రభ సంపాదకులు నీలంరాజు వెంకటశేషయ్య అధ్యక్ష్యత వహించగా, ఆంధ్రజ్యోతి సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు సభను ప్రారంభించారు. ఈ స్వర్ణోత్సవాల ప్రచురణలు - గ్రంథాలయ ప్రగతి 1,3 భాగాలను రాష్ట్ర పరిశ్రమలశాఖా మంత్రి ఎం.ఎస్.లక్ష్మినరసయ్య ఆవిష్కరించాడు. [4]

సంఘ వజ్రోత్సవాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం 1981 మార్చి 20 - 22 తేదీలలో ఓరుగల్లులో నిర్వహించిన 34వ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసభా ప్రాంగణంలో సంఘ వజ్రోత్సవాలు జరిగాయి. రాష్ట్రం నలుమూలలనుండి 1000 మందికి పైగా అభిమానులు, గ్రంథాలయ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మహాసభలో భారత ప్రభుత్వ విదేశాంగశాఖామాత్యులు పి.వి.నరసింహారావు ప్రారంభోపన్యాసము కావించారు. రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖామాత్యులు టి.హయగ్రీవాచారి, లఘుపరిశ్రమల శాఖామాత్యులు మజ్జి తులసిదాస్, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ఆస్థానకవి కాళోజీ నారాయణరావు పాల్గొన్నారు. సాహితీవేత్త మరువూరు కోదండరామిరెడ్డి ఈ కార్యక్ర్రమానికి అధ్యక్షత వహించారు.[4]

సంఘం ప్లాటినం జూబిలీ ఉత్సవాలు[మార్చు]

సంఘం ప్లాటినం జూబిలీ ఉత్సవ సభ 1989 ఏప్రిల్ 10 న విజయవాడ సర్వోత్తమ భవనంలో జరిగింది. సంఘాధ్యక్ష్యులు కోదాటి నారాయణరావు అధ్యక్షత వహించగా, రాష్ట్ర పౌర గ్రంథాలయాల సంచాలకులు ఎం.వి.వెంకటరెడ్డి సంఘపత్రిక గ్రంథాలయ సర్వస్వం 50వ సంపుటాన్ని (స్వర్ణోత్సవ సంచిక) ఆవిష్కరించారు. గ్రంథాలయోద్యమ నాయకులు వావిలాల గోపాలకృష్ణయ్య, విజయవాడ మేయర్ జంధ్యాల శంకర్, పార్లమెంట్ సభ్యులు వడ్డే శోభనాదీశ్వరరావు వేదికను అలంకరించి ప్రసంగాలు చేశారు.[4]

మూలాలు[మార్చు]

 1. Kent, Allen (August 1968), Encyclopedia of Library and Information Science, CRC, p. 416, ISBN 0-8247-2001-6
 2. http://www.apla.co.in/about-us
 3. 3.0 3.1 Kumar, P.S.G. Pioneering work of Andhra Desa Library Association.Grandhalaya Sarvaswam, 37 (8 & 9)[permanent dead link], 1977.P.164-166. Retrieved 24 March 2020
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 శారద,రావి, నూరేళ్ళ ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం. గ్రంధాలయ సర్వస్వం. 74/8. నవంబర్ 2013. 1-10.
 5. http://www.apla.co.in/mission-vission/
 6. నరసింహ శర్మ, సన్నిధానం. సరస్వతీ పూజారి: పాతూరి నాగభూషణం జీవిత చరిత్ర. విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘం, 2014.
 7. 7.0 7.1 http://www.apla.co.in/
 8. http://www.apla.co.in/library-conferences/

ఇతర లింకులు[మార్చు]