Jump to content

ఆంధ్రభారతి (పత్రిక)

వికీపీడియా నుండి
ఆంధ్రభారతి
సంపాదకులులేరు
తరచుదనంమాస పత్రిక
మొదటి సంచిక1909
ఆఖరి సంచిక1915
దేశంభారతదేశం
కేంద్రస్థానంమచిలీపట్నం
భాషతెలుగు

20 వ శతాబ్ది తొలినాళ్ళలో వెలువడి, ఆగిపోయిన తెలుగు పత్రిక, ఆంధ్రభారతి. అన్ని వర్గాలకు చెందిన, అన్ని వాదాలకు చెందిన రచయితల రచనలతో వెలువడిన తొలి సాహిత్య పత్రిక ఇది. ఇది 1909- 1915 మధ్య, మచిలీపట్నం, ముట్నూరు, బెజవాడల నుంచి వెలువడింది. దీన్ని స్థాపించినవారిలో అయ్యంకి వెంకటరమణయ్య ఒకరు.[1] దీన్ని కృష్ణాపత్రిక ప్రెస్సులో ముద్రించేవారు.[2] దీనికి పోషకులు, రచయితలే గాని సంపాదకులు లేరు. రచయితల్లో చాలామంది సుప్రసిద్ధులు. వాళ్ళ పేర్లని ఈ పత్రిక ప్రతి సంచిక ప్రారంభంలో ప్రచురించేది. తెలుగులో మొట్టమొదటి కథగా పరిగణించబడే దిద్దుబాటు ఆంధ్రభారతి లోనే ప్రచురితమైంది. 1915 లో అగిపోయిన పత్రిక మళ్ళీ 1926 లో మొదలై 1928 లో ఆగిపోయింది.

చరిత్ర

[మార్చు]

సి.నారాయణరెడ్డి తన ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు పుస్తకంలో, "ఆంధ్రభారతి 1909 లో (శాలి.శ. 1831 చైత్రము) సంచికలో రాయప్రోలువారు వ్రాసిన 'కళాకవిత్వములు' అను వ్యాసము, గురజాడవారి 'మీపేరేమిటి?' అను కథానిక ప్రచురింపబడినవి. ఇరువురి రచన లొకేసంచికలో ప్రథమ పర్యాయము వచ్చుట విశేషము" అని రాయడంతో ఆంధ్రభారతి పత్రిక మొదలైనది 1909 లో అని తెలుస్తోంది.[3]

రచనలు

[మార్చు]

తెలుగులో మొట్టమొదటి కథగా పరిగణించబడే దిద్దుబాటు 1910 లో ఆంధ్రభారతిలో ప్రచురితమైంది. దాన్ని గురజాడ అప్పారావు రచించాడు. 1912 అక్టోబరులో రాయప్రోలు సుబ్బారావు రాసిన కోయిల, కనకము మొదలైన కవితలు ఈ పత్రికలో ప్రచురితమయ్యాయి.[4]

1915 లో ఆగిపోయిన పత్రిక మళ్ళీ 1926 లో మొదలై, 1928 వరకూ నడిచి ఆపై ఆగిపోయింది. 1928 జూన్ సంచికలో అల్లూరి సీతారామరాజు గురించి శ్రీ రామరాజు ప్రశంస పేరుతో రెండు వ్యాసాలను ప్రచురించింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య, మద్దూరి అన్నపూర్ణయ్యలు రాసిన ఈ వ్యాసాలలో రాజును స్వాతంత్ర్య యోధుడిగా కీర్తిస్తూ అల్లూరిని చంపడంపై ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసారు.[5]

తమాషాలు శీర్షికన జోకులు ప్రచురించేవారు.[6]

1928 ఫిబ్రవరి సంచికలో శ్లిష్టాక్షరపదబంధము పేరుతో గళ్ళ నుడికట్టును ప్రచురించారు. దీన్ని శ్రీశ్రీ కూర్చాడు.[6] దీనికి సమాధానాలను ఏప్రిల్ సంచికలో ప్రచురించారు.[7] అయితే, తెలుగులో తొలి క్రాస్‌వర్డ్ పజిల్‌ను 1937 లో ఆంధ్రభారతిలో ప్రచురించినట్లు ఈనాడు పత్రిక రాసింది.[8] 1928 లోనే శ్లిష్టాక్షరపదబంధము ను ప్రచురించారు కాబట్టి, తెలుగులో ఇదే తొలి క్రాస్‌వర్డ్ పజిల్ అని చెప్పవచ్చు.

పత్రిక పాట్లు

[మార్చు]

"మాపాట్లు" పేరుతో 1928 ఏప్రిల్ సంచికలో ప్రచురించిన సంపాదకీయంలో ఇలా రాసారు:

"పత్రికా జీవనము ముఖ్యముగ నాంధ్రదేశములో దుర్భరము. విదేశములలో వేనకు వేలు పత్రిక లున్నవి, ఒక్కొక్క పత్రికకు లక్షలు లక్షలు చందాదారు లున్నారు. కాని మన దేశమునకట్టి యదృష్టము లేదు, కారణ మేమి? మన దేశములో చాలభాగము వ్యవసాయకులు, వారు పల్లెలలో నివసించు నుందురు. విద్యా సౌకర్యములు సున్న, చదువుకున్న వారు యే కొలదిమందియో యున్న యెడల నుద్యోగముల కొరకు పట్టణములకు పోవుచున్నారు. ఉద్యోగములలో నున్న వారికి సరిగా భార్యాబిడ్డల ముఖములనైనా చూచి యానందించుటకు సావకాశము చిక్కదు. ఈ పరిసితులలో బత్రికలు దీనదశ యందున్నవనిన వింతలేదు. ఇది యిటుండ ముద్రణాశాసనము, మాననష్టవు దావాలు, క్షమాపణలు స్వాతంత్య్య విహీనత, నిత్యము మన పత్రికల నెదుర్కొను చున్నవి. స్వేచ్భాజీవనము లేని దేశములో పత్రికలు సజీనములై మెట్లుండగలవు? వీటిని వారములు చేసి జీవించు విడ్యార్థికి బోల్చవచ్చును. ఏరోజున యెవరింట్లో భోజనమో నారి యిష్టాయిష్టముల ననుసరించి వర్తించుచు, వారు పెట్టినది తని సంతృప్తి చెందవలసిన స్ధితి వారములు చేసి జీవించు విద్యార్థిది"[9] - 1928 ఏప్రిల్ సంచిక సంపాదకీయంలో రాసిన ఈ వాక్యాలు ఆనాటి పత్రికల ఆర్థిక దుస్థితికీ, ప్రభుత్వ నిర్బంధానికీ అద్దం పడుతాయి.

ప్రశంస

[మార్చు]

సి.నారాయణరెడ్డి తన ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు పుస్తకంలో సుజనరంజని గురించి ఇలా రాసాడు: "1909 నుండి ఆంధ సాహిత్య రంగస్థలమున 'ఆంధ్రభారతి' జేగీయమానముగా నిలచినది. ఈ పతిక చెన్నాప్రగడ భానుమూర్తి, రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు మున్నగు ప్రముఖ కవుల కవితలను పచురించినది."[10]

మూలాలు

[మార్చు]
  1. ఎం., సుధ (1984). "పత్రికలు". In కె.కె., రంగనాథాచార్యులు (ed.). నూరేళ్ల తెలుగునాడు. హైదరాబాదు: ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 114.{{cite book}}: CS1 maint: date and year (link)
  2. Dr. J Chennaiah (1998). తెలుగు దినపత్రికలు భాషాసాహిత్య స్వరూపం. p. 79.
  3. సి., నారాయణరెడ్డి (1999). "నవ్యకవిత్వ మహోదయము". ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 182.
  4. వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంసృతిక మండలి. p. 33.
  5. ఆంధ్రభారతి. మచిలీపట్నం: ఆంధ్రభారతి. 1928. pp. 57, 58.
  6. 6.0 6.1 రామారావు(సం.) (1927). ఆంధ్ర భారతి, సంపుటము 1,సంచిక 5-, 1926. p. 6.
  7. రామారావు(సం.) (1928). ఆంధ్ర భారతి, సంపుటము 3,సంచిక 1-7, 1928.
  8. "పజిల్స్‌తో ప్రయోజనాలెన్నో." EENADU. Archived from the original on 2023-03-28. Retrieved 2025-11-17.
  9. ఆంధ్రభారతి. Vol. 3 (1 ed.). మచిలీపట్నం. 1928. p. 1.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  10. సి., నారాయణరెడ్డి (1999). "నవ్యకవిత్వ మహోదయము". ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 155.