ఆంధ్రభాషాసంజీవని
| సంపాదకులు | కొక్కొండ వేంకటరత్నం పంతులు |
|---|---|
| తరచుదనం | మాసపత్రిక |
| మొదటి సంచిక | 1871 |
| ఆఖరి సంచిక | 1900 |
| దేశం | భారతదేశం |
| కేంద్రస్థానం | మద్రాసు |
| భాష | తెలుగు |
ఆంధ్రభాషాసంజీవని, 1871 లో కొక్కొండ వెంకటరత్నం పంతులు మద్రాసులో ప్రారంభించిన మాసపత్రిక.[1] తెలుగులో వచ్చిన తొలితరం తెలుగు పత్రికల్లో ఇది ఒకటి. 'ఆంధ్ర' అనే పదంతో మొదలయ్యే పేరును పత్రికలకు పెట్టడం ఈ పత్రిక తోటే మొదలైంది.[2] ఇది 1883 దాకా కొనసాగి తొమ్మిది సంవత్సరాల పాటు ఆగిపోయి 1892 లో మళ్ళీ మొదలయ్యి 1900 దాకా కొనసాగింది.[3] తొలిసంచిక విడుదలతోనే పండితుల ప్రశంసలు అందుకుంది. కందుకూరి వీరేశలింగం పంతులు సంపాదకుని లేఖ ద్వారా తన ప్రశంసలు అందజేశాడు. ఆయన రాసిన శుద్దాంధ్రభారతం లోని సభాపర్వం, వడ్డాది సుబ్బారాయుడు సృతిగీతం ఈ పత్రికలో ధారావాహికగా ప్రచురించారు. పత్రికల్లో సంపాదకీయం రాసే పద్ధతిని ప్రవేశపెట్టింది ఈ పత్రికే.[3]
పత్రిక విశేషాలు
[మార్చు]సంఘసంస్కరణలపై ఆంధ్రభాషాసంజీవని వ్యతిరేకంగా ఉండేది. స్త్రీ విద్య, బాల్యవివాహనిషేధం, వితంతువివాహం మొదలైన విషయాలపై వివేకవర్ధనికీ, పురుషార్థప్రదాయినికీ వాదోపవాదాలు జరిగేవి.[4]
ఈ పత్రిక ప్రాచుర్యానికి కారణాలు
- ప్రజలు మాట్లాడే భాష పేరునే పత్రిక పేరులో చేర్చడం, గ్రాంథిక భాష వాడటం
- అనేక ఆంగ్లపదాలకు శ్రమకోర్చి తెలుగు పదాలను కనిపెట్టి వాడటం. వీటిలో చాలా పదాలను వీరేశ లింగం పంతులు తన రచనల్లో వాడాడు.
- సాహిత్య సంబంధ వ్యాసాలే కాక రాజకీయ, సాంఘిక అంశాలను ప్రాధాన్యత నివ్వడం
ఆంధ్రభాషాసంజీవని ఆనాటి ఇతర పత్రికల గురించిన పరిచయం, సమీక్ష వంటివి ప్రచురించేది. తద్వారా ఆనాటి పలు పత్రికల గురించిన సమాచారం తెలిసింది.[5]
పోతం జానకమ్మ అనే మహిళ, భర్త రాఘవయ్యతో కలిసి ఇంగ్లాండు యాత్ర చేసి తిరిగివచ్చాక తన యాత్రానుభవాలను ఒక లేఖలో రాయగా ఆంధ్రభాషాసంజీవని 1874 ఏప్రిల్ 15 న దాన్ని ప్రచురించింది.[6]
వివాదాలూ విమర్శలూ
[మార్చు]వీరేశలింగం పంతులు, అముద్రితగ్రంథచింతామణి సంపాదకుడైన పూండ్ల రామకృష్ణయ్య లతో తనకున్న వైరాన్ని పురస్కరించుకుని చేసే విమర్శలకు కొక్కొండ వెంకటరత్నం ఆంధ్రభాషాసంజీవనిని వేదికగా చేసుకున్నాడు.
వేంకటరత్నం, వీరేశలింగం మధ్యన వితంతు వివాహం, ఆడవారి చదువులు, సాంఘిక సంస్కరణల విషయంలో బేధాభిప్రాయాలు ఏర్పడ్డపుడు ఇద్దరూ తమ తమ పత్రికల్లో వ్యాసాలు ప్రచురించి, వాద ప్రతివాదాలు జరిపారు. వీరేశలింగం స్థాపించిన వివేకవర్ధని పత్రికనూ, అందులోని భావాలనూ వెటకారం చేయడానికి ఆంధ్రభాషాసంజీవని పత్రికకు అనుబంధంగా హాస్యవర్థని అనే ప్రత్యేక విభాగాన్ని మొదలుపెట్టాడు. అంతేకాకుండా, ఆయన వివేకవర్ధని పేరును తిరగేసి చదువుతూ, నిర్ధవకవేవి అని చదువుతూ దానికి అర్థం 'వితంతువు బోడిగుండు' అని చెప్పేవాడు. దానికి ప్రతిగా వీరేశలింగం కూడా వివేకవర్ధనికి ఒక హాస్య అనుబంధాన్ని చేర్చి దానికి హాస్యసంజీవని అని పేరు పెట్టాడు. కొక్కొండ వెంకటరత్నం కొన్ని హాస్యసంభాషణలు సృష్టించి అందులో వీరిగాడనే పాత్ర ప్రవేశపెట్టాడు. అది తనను ఉద్దేశించేనని గ్రహించిన వీరేశలింగం పంతులు కూడా ఒక నత్తి పాత్రను సృష్టించి దానికి కొండ వెంకడు అని పేరు పెట్టి, ఆ పాత్ర తన పేరు చెప్పేందుకు కొ.కొ.క్కొ.క్కొండ వెంకడు అనిపించేవాడు.[7]
కొక్కొండ వెంకటరత్నం "ప్రసన్న రాఘవ నాటకం" సంస్కృత నాటకాన్ని "ఆంధ్రప్రసన్న రాఘవ నాటకము" అనే పేరుతో అనువదించాడు. ఇది వైజయంతి పత్రికలో మొదట వెలువడింది. తర్వాత గ్రంథరూపంలో వచ్చింది. ఈ గ్రంథాన్ని వేదం వెంకటరాయశాస్త్రి ““ఆంధ్రప్రసన్న రాఘవ విమర్శ గ్రంథము' అని సమీక్షించి ప్రకటించారు. ఇందులో కొక్కొండ చేసిన 2568 తప్పులను ఎత్తిచూపెట్టారు. ఆ విమర్శను మెచ్చుకొంటూ అముద్రితగ్రంథచింతామణి 1899 ఫిబ్రవరిలో సుదీర్ణమైన వ్యాసాన్ని ప్రచురించింది. దానిపై తీవ్రమైన దూషణభూషణలు వచ్చాయి. కొక్కొండ రాసిన బిలేశ్వరీయం అనే గ్రంథంపై కూడా ఇరు పత్రికల లోను పలు విమర్శలు, ప్రతివిమర్శలు వచ్చాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ జి., సోమశేఖర్ (30 December 1993). "The Role Telugu Press In The Indian Freedom Movement" (PDF). p. 47. Retrieved 27 December 2017.
- ↑ డా. వి, సిమ్మన్న (2014-09-07). దర్శిని - పరిశోధన వ్యాససంపుటి. విశాఖపట్నం: దళిత సాహిత్య పీఠం. p. 17.
- ↑ 3.0 3.1 జి,వి., పూర్ణచందు (2018). "తొలి తెలుగు పత్రికలు". తెలుగు కోసం. విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి. p. 342.
- ↑ డా.వి., వైదేహి (2013). మహాకవి దాసు శ్రీరాములు గారి కృతులు ఒక సమీక్ష. హైదరాబాదు: మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి. p. 346.
{{cite book}}: CS1 maint: date and year (link) - ↑ నిడుదవోలు, వేంకటరావు (1929). "ప్రాచీనాంధ్ర వార్తాపత్రికలు (1849 - 1875)". భారతి. మద్రాసు: కాశీనాథుని నాగేశ్వరరావు. p. 124.
- ↑ 6.0 6.1 ఆరుద్ర (2012). సమగ్ర ఆంధ్ర సాహిత్యం (in Telugu). హైదరాబాదు: తెలుగు అకాడమీ. pp. 323–328.
{{cite book}}: CS1 maint: unrecognized language (link) - ↑ హాస్యలహరి. హైదరాబాదు: యువభారతి. 2002. p. 14.