ఆంధ్రభూమి (మాసపత్రిక)
ఆంధ్రభూమి సచిత్రమాసపత్రిక 1933 మే నెలలో ప్రారంభమయ్యింది. ఆండ్ర శేషగిరిరావు సంపాదకుడిగా, ప్రకాశకుడిగా ఈ పత్రిక మద్రాసు నుండి వెలువడింది. స్వీయ ఆంధ్రభూమి ముద్రణాలయంలో ముద్రణ పొందింది. ఈ పత్రిక విడిప్రతి వెల నాలుగణాలు కాగా వార్షిక చందా మూడు రూపాయలు.
ఆశయాలు
[మార్చు]ఈ పత్రిక తన ఆశయములను ఈ క్రింది విధంగా ప్రకటించింది.
“ | సమగ్రమైన ఆంధ్రజాతీయోద్యమమును పెంపొందించుటయు;ఆంధ్రకళ, ఆంధ్ర సారస్వతము వీని విశేషాభ్యుదయమునకు పాటుపడుటయు 'ఆంధ్రభూమి' ప్రధాన సంకల్పము. సర్వతోముఖమగు ఆధునిక విజ్ఞానమును, అర్వాచీననాగరికతను ప్రస్తరించు వ్యాసములు ఇందు ప్రముఖస్థానము నలంకరించును. ఆంధ్రుల ఆర్థికసాంఘికాద్యాభివృద్ధులను పెంపొందించు ప్రబోధకవ్యాసములకును, ఆంధ్రక్షేమమునకైన సర్వవిషయములకును ఈ పత్రికయందు ప్రతిమాసము కొన్ని పుటలు ప్రత్యేకించబడును.
భీమావ్యాపారమును గురించిన వ్యాసములు ఈ నూతనాంధ్రమాస పత్రికయందొక విశేషాంశము. భారతరమణుల ఔన్నత్యమునకైన ఉద్యమాభివృద్దికి సముచిత సరణిని కృషిసల్పి మహిళల జీవితసమస్యలకు సంబంధించిన విషయములకు ప్రత్యేక వివరణమిచ్చుట ఈ పత్రికయొక్క ఆశయములలో నొకటి. వలసపోయిన ఆంధ్రుల స్థితిగతులను గూర్చి రాష్ట్రమునందలి ఆంధ్రులకు వివరించుట యందును, భాషాప్రచారములకు మూలభూతములైన గ్రంథాలయ సంబంధమగు విషయములను క్రోడీకరించుట యందును, దేశాభ్యుదయమునకైన జమీందారుల విశేష కృషిని కీర్తించుట యందు 'ఆంధ్రభూమి' శ్రద్ధదానయై యుండును. |
” |